About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday 26 March 2012

జంగాన్ని కోరంగ ఫక్కున్న నవ్వే...!

ఎం ఏ లో మొదటి   ఏడాదిలోనేమో మాకు ఆప్షన్స్ ఉండేవి .ఒక వైపు జానపదమూ,నాటకమూ, నవల లాటివీ,మరో వైపు అలంకార శాస్త్రము  తదితరాలు ఉండేవి.బాగా తెలివైన విద్యార్థులందరూ అలంకార శాస్త్రానికి  వెళ్లి పోయేవారు.మనకెందుకులే ఆకష్టం అనుకునే వాళ్ళు ఇటు వైపు వచ్చే వారు .నేనేమో పోలిటిక్స్ చదువుకుని వచ్చా ఈ మతలబులన్నీ నాకు తెలీదు ,కానీ నాకు  జానపదమంటే చాలా ప్రీతీ వుండేది .అందుకే నేను జానపదాన్ని ఎంపిక చేసుకున్నాను.నాకు ఇవాలంత   గుర్తు ఆ సన్నివేసం మా మేడం నన్ను చూసి' ఏంటి   సామాన్య నువ్వు ఇటు వైపోచ్చేసావే నీ దారి అది కదా '?అని అనడం. నాకు ఆ మాటకి అర్థం క్లాస్ మేట్స్ చెప్పాల్సి వచ్చింది.కాక పోతే అప్పుడంతా పరీక్షల చదువైపోయింది.జానపదాన్ని తెలుసుకున్నది ఏమీ లేదు .

ఇది పిచ్చుగుంట్ల వాళ్ళనే జానపద కథకులు పాడే గౌరీ స్వయం వరం కథ. నా బిడ్డకి పెద్ద బాల శిక్ష యెట్లా అంటే క్రిస్టియన్స్ కి బైబిల్ లాగా...చదువు రాకున్నా దానికి ఆ పుస్తకమంటే పరమ ప్రీతీ.ఎప్పుడూ వెంటేసుకుని  తిరుగుతుంది .అట్లా మొన్న దానికి ఏదో చెప్తుంటే  ఈ గౌరీ స్వయంవరం దొరికింది.

తా వలచింది రంభ అని గౌరీ కేమో శివుడు నచ్చేసాడు .నచ్చేసాడూ... అని నేరుగా చెప్పొచ్చు కదా !చేసుకోవమ్మా  అన్నందుకు ఇక ఊర్లో వాళ్ళందరికీ   ఎన్ని వంకలు పెట్టిందో ...!చివరికి ''జంగాన్ని  కోరంగ ఫక్కున్న నవ్వే ''నట .అదీ విషయం .
శివుడంటే  నాకు చాలా ఆసక్తి ,ఎంత భిన్నంగా వుంటాడూ...ఎంత ఆకర్షణీయం గా వుంటాడూ అసలకీ ...పామూ ,నెల వంకా,నందీ ...ఏం రూపం కదా అదీ  ?మొన్న కాశీ కి వెళ్ళినప్పుడు గంజాయి దమ్ము వాళ్ళని చూసి ఆ ప్రాంతం పైనే చిరాకు వేసింది కానీ, ఇప్పుడు స్పురణకొచ్చింది కాశీ శివుడంత  అందమైంది .శివ పార్వతుల దాంపత్యమంత అందమైంది.


తల్లి : కోరవే గౌరమ్మ కోరున్న మనువు 
మెచ్చవే గౌరమ్మ మెచ్చిన్న మనువు 
మెచ్చిన మనువుకే ఇచ్చేము నిన్ను 
బ్రామ్హలకు ఇచ్చేమ గౌరమ్మ నిన్ను ?

గౌరి : బ్రహ్మలా స్నానాలు బ్రహ్మస్నానాలు 
నిత్య చన్నీళ్ళలో నే మునగలేను
నిత్య మడి చీరా నేగట్టలేను  
వార్లతో నా పొందు వద్దు క్షణమైన

తల్లి : కోమట్ల కిచ్చేమ కోరి గౌరమ్మ ?

గౌరి : కోమటీ బేరాలు గోజు బేరాలు 
తక్కెట్లో బేరమూ తెగ చెప్పలేను 
 ఉప్పు చింతాపండు నేనమ్మలేను 
గొన్టక్క   పులుసాకు  నేనమ్మలేను 
గోనెలకు లాభాలు నేతియ్యలేను 

తల్లి : రాజులకిచ్చేమ రావే గౌరమ్మ 

గౌరి : రాజుల భార్యలకు రాణి వాసాలే 
ఇళ్ళు  వెళ్లారమ్మ గడప దాటరమ్మ
వారితోనూ పొత్తు వద్దు   క్షణమైన

తల్లి : ఊరి చివరిలోన చాకల్లు ఉన్నారు 
చాకల్ల కిచ్చేమ చల్లన్ని గౌరి ?

గౌరి : చాకలీ సలవాలు నేసేయలేను 
ఇంటింటి గుడ్డాలు నేనేత్తలేను 
యీదిలో సరిముద్ద యిక పెట్టలేను 
ఆ ముట్టు గుడ్డాలు నేనుతకలేను 

తల్లి : కొండ కిందున్నాది కుమ్మరోల్లీది 
కుమ్మరుల కిచ్చేమ కుందనపు బొమ్మ ?

గౌరి : కుమ్మరీ మన్నులూ నేమోయ్యలేను 
కుమ్మరీ సారెలే నే తిప్పలేను 
ఊరూరా కుండాలు నేనమ్మలేను 
కుండకొచ్చిన గింజ వడిగట్టలేను 

తల్లి : ఇకెవరికిచ్చేమే  నిన్ను గౌరమ్మ 
కొండ కిందా రెండు గొల్లవారిండ్లు 
గొల్లోల్ల కిచ్చేమ చల్లనీ గౌరి ?

గౌరి : గొల్లోల్ల చల్లాలు నేనమ్మలేను 
గుట్ట గుట్టాతల్లి నే తిరగలేను 
గుట్ట గొర్రె పిల్ల పాలు నే పితకలేను 
మంద మేకల పాలు నేపిండలేను 

తల్లి : ఇక ఎవరికిచ్చేమే వింత గౌరమ్మ 
మీ తండ్రి పిలిచెను రావే గౌరమ్మ 

గౌరి : మా తండ్రి మాటలు మొన్ననే వింటి 

తల్లి : మీ అవ్వ పిలిచేను రావే గౌరమ్మ     

గౌరి : మా అవ్వ మాటలు మాపునే వింటి 

తల్లి : మీ తాత పిలిచేడు రావే గౌరమ్మ 
(ఆ మాట విన్న గౌరి దిగ్గున్న లేచి )

గౌరి : పిలిచినా పని ఏమి ఓ తాత గారు 

తాత : ఏడు జాతులమ్మ ఎత్తాడినావే 
పద్నాలుగు కులాలు పంచి పెడితివే
ఊరికి ఉత్తరాన కాటికి పడమట 
పాడుగుళ్లోనేమో  పడియుండేవాడు 
జంగమయ్య కొడుకు లింగకాయదారి
జంగాలకిచ్చేమ లింగాల గౌరు ?   

జంగాన్ని  కోరంగ ఫక్కున్న నవ్వే 

గౌరి : మెచ్చితీ మెచ్చితీ మనువన్న తల్లి 
కోరితీ కోరితీ మను 
వన్న తండ్రీ 
కోరి సాంబశివుని 
పెండ్లాడుతానే
మెచ్చి సాంబాశివుని 
మను వాడు తానె  

Thursday 22 March 2012

మన ముక్తి యెక్కడుందంటే...!




కర్ణాటక   సంగీతమూ ,హిందూస్థానీ సంగీతమూ ఇంకా అవీ ఇవీ లాగా కాకుండా బెంగాలీలకే ప్రత్యేకమైనవి  ''రబీంద్ర సంగీత్ '',''రబీంద్ర న్రిత్యో ''...బెంగాలీలు రెండో ఆలోచనేమీ లేకుండా ప్రీతిగా ,పిచ్చిగా, తలవంచి వినమ్రులై నేర్చుకునే సంగీతమూ ,నృత్యమూ ఇవి.రవీంద్రుడు బెంగాలీల ప్రతి సందర్భానికీ ఒక పాట రాసి పెట్టాడు.అందుకే అది టీవీ సీరియల్ అయినా ,సినిమా అయినా ఆ సందర్భానికి వీళ్ళో పాట వెతికేసుకో గలరు. 

ఈ పాటని నేను  అపర్ణా సేన్ కొత్త సినిమా ''ఇతి మ్రిణాలిని''లో మొదటి సారి చూసాను .చూసి మస్తు పరేషాన్ అయ్యి ఇదేం  పాటరా నాయనా ఇంత బాగుంది అనుకున్నాను.ఒక సారి మా ఇంటికో రేడియో గాయని వచ్చింది .ఆవిడ పాటలు వింటూ ఈ సినిమా పాట అడుగుతే అది రబీంద్ర సంగీత్ అని చెప్పింది.

ఇప్పుడు నా కూతురు భరత నాట్యం తో పాటూ నేర్చుకుంటున్న రబీంద్ర న్ర్యత్యం  ''ఆనంద లోకే ...మొంగళాలోకే '' 

అనుకోకుండా ఈ పోస్ట్ మొదలెట్టాను.ఈ సారి ఎప్పుడైనా విపులంగా రవీంద్రుడి నృత్య గానాల గురించి వ్రాస్తాను అంతవరకూ ఈ పాట వినండి .లిరిక్ మీనింగ్ ఇద్దామని వెతుకుతుంటే ఎవరిదో బ్లాగ్ దొరికింది.ఆసక్తి వుంటే చూడొచ్చు లాగుంది .నాకు విహంగ వీక్షణమే కుదిరింది .http://lovetagore.blogspot.in/2011/04/amar-mukti-shrboni-sen.html 

పాట అర్థం ఆంగ్లం లో వస్తుంది పాట వింటూ అక్కడే చూడొచ్చు.

AMAR MUKTI ALOI ALOI
EI AKASHE , AMAR MUKTI ALOI ALOI.
AMAR MUKTI- DHULAI DHULAI GHASHE GHASHE
EI AKASHE AMAR MUKTI ALOI ALOI.(2)

DEHO MONER SUDUR PARE
HARIYE FELI APONARE (2)
GANER SHURE AMAR MUKTI URDHE BHASHE
EI AKASHE AMAR MUKTI ALOI ALOI.(2)

AMAR MUKTI SHORBOJONER MONER MAJHE
DUKHHO BIPOD TUCHHO KORA, KOTHIN KAJE (2)
BISHHO DHATAR JOGGO SHALA
ATTO HOMER BONHI JALA(2)
JIBON JANO DI AHUTI , MUKTI ASHE.

EI AKASHE AMAR MUKTI ALOI ALOI(2)
AMAR MUKTI DHULAI DHULAI GHASHE GHASHE (2)
EI AKASHE AMAR MUKTI ALOI ALOI(2)

  

Tuesday 20 March 2012

పూరీ జగన్నాథ్ ''బూతుల బిజినెస్ మేన్''

http://prajaasaahithi.com/images/stories/pscover_mar12.jpg

ఈ సమీక్ష ఈ నెల ప్రజా సాహితిలో వచ్చింది httphttp://prajaasaahithi.com/sameekshalu/cinema-sameekshalu:ఇదే సినిమాలో పాటల గురించి వనజవనమాలి గారు తన బ్లాగులో చక్కటి సమీక్ష చేసారు http://vanajavanamali.blogspot.in/2012/03/blog-post_13.html 


Monday 19 March 2012

ఓయి తెలుగువాడా !

అప్పట్లో నా  ''పాపాయి'' బ్లాగ్  చూసి పాపాయి వాళ్ళ నాన చాలా ముచ్చట పడి తను కూడా ఒక బ్లాగ్ మొదలెట్టాడు.కానీ పాపం సమయం అనుకూలించక రాయలేక పోయాడు.అప్పుడు రాసిన రెండే రెండు పోస్టులలో మొదటి పోస్ట్ ఇది .తెలంగాణా కి సంబంధించి ఏదో సెర్చ్ చేస్తూ చాలా రోజులకి ఇవాళ తన బ్లాగ్ చూసాను ,విగ్రహాల విద్వంసంపై తన స్పందనలో వున్న సమతౌల్యాన్ని  చూసి బాగుందనిపించి తేదీతో సహా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను .

శుక్రవారం 11 మార్చి 2011

విగ్రహాలు ద్వంసం అయ్యాయి .దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?ఎలా ప్రతిస్పందించాలి ?మొట్ట మొదటగా మనం మనుష్యులం కాబట్టి హింసని ప్రోత్సహించం కాబట్టి ఈ చర్యని ఖండిస్తాం .మనలో కొంత మందిమి భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయాల్లో మన సొంత అజెండాలను ప్రచారం కూడా చేసుకొంటాం .కొంత మందిమి కర సేవకుల బాబ్రీ విద్వంసాన్ని ఉటంకించి మన లౌకికత్వాన్ని చాటుకోవడం తో పాటు మా పార్టీ బా జ పా కి వ్యతిరేఖం అని ప్రజలను ఒప్పించాలను కొంటాం.ఇంకొంత మందిమి ఎన్ టి ఆర్ మాత్రమే ఒక్క మగాడు అని చాటి చెప్పా లనుకుంటాం .ఇంకా కొంత మందిమి మనకు తెలిసిన కవితలని ఉటంకించి మన పాండిత్యాన్ని నిరూపించు కోవాలనుకొంటాం . ok it is an occasion to prove our love for the language ,to propagate our ideologies ,to reinforce stereotypes.

భారత దేశం ఒక జాతి గా గడిచిన అరవై సంవత్సరాలుగా మనుగడ సాధించడమే కాకుండా మనమంతా ఒకే జాతి అనే భావన అభివృద్ధి చెందింది కూడా .కొన్ని చిన్న చిన్న అపశ్రుతులు ఉన్నప్పటికీ ఎన్నో కులాలు ,మతాలు ,ప్రాంతాలుగా ఉండిన భారత దేశం ఐక్యంగా మనుగడ సాధించి అభివృద్ధి సాధించడం అద్బుతం .భారత దేశ పాలకులు ఈ దేశంలోని భిన్నత్వాన్ని ఆమోదించి గౌరవించడమే కాకుండా భిన్న సమూహాల ఆశలని ఆకాంక్షలని ప్రతిఫలించే వ్యవస్థలకి అవకాశం కల్పించడం ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ఒక ముఖ్య కారణం కావచ్చు .దీన్నే మనం చిన్నప్పుడు unity in diversity అని చదివి వంటబట్టిచ్చుకోన్నాం .

అయితే వివిధ రాష్ట్రాలుగా మనుగడ సాదిస్తున్న భారతదేశం ప్రాంతీయ ఆశలని ఆకాంక్షలని సంతృప్తి పరిచినప్పటికీ ,ఒకే రాష్ట్రంలో ఉన్న భిన్న అస్తిత్వ భావనలకి సరైన ప్రాతినిధ్యం కల్పించ లేక పోయింది .ap విషయంలో ఒక ప్రాంత అస్తిత్వాన్ని విస్మరించడం ,వారి సాంస్కృతిక చిహ్నాలని నిర్లక్ష్యం చేయడం అనే దుర్మార్గం కొంత ఎక్కువగానే జరిగింది .సమ్మక్క ,సారక్క ,కొమరం భీం ,చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమరయ్య అందరూ ఎందుకు సరైన ప్రాతినిధ్యానికి నోచుకోలేదు అనేదానికి మనదగ్గర స్పష్టమైన సమాధానాలు లేవు .పొనీ ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలేమైన చే పడతామా అంటే ,అదీ లేదు .

నన్నయ్య ,శ్రీ కృష్ణదేవరాయలు ,అన్నమయ్య ,శ్రీ శ్రీ ,జాషువా అందరూ మనం ఎంతో అపరూపంగా మన గుండెల్లో పదిల పరుచుకొన్న మన సాంస్కృతిక నాయకులే .కానీ మనలో కొంత మందిమి వారి విగ్రహాలను చాల అవలలీగా నాశనం చేయగలుగుతున్నామంటే ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉందనిపిస్తుంది .అరిచి గోలపెట్టి రాళ్లేసినంత మాత్రాన బెదిరి పోయే వాళ్ళు ఎవరూ లేరు.లగడపాటి ad ఓయి తెలుగువాడా ప్రతి రొజు గంట సేపు వేసినా లాబం లేదు .తెలంగాణా వాళ్ళను ఆంధ్రులు తెలబాన్ అని  అనేస్తే వాళ్ళు  ఆంధ్రులను ఆటవికులు అనెయ్యొచ్చు .ఈ మధ్య కాలంలో నిజాయితిగా ప్రవర్తిస్తున్న అతి కొద్దిమందిలో ఒకరైన కతి పద్మారావు గారు చెప్పిన్నట్టు తెలుగు జాతికి ఉమ్మడి సంస్కృతి ,వారసత్వం ఉన్నాయి .దీన్ని మనం కాపాడుకోవాలి .దానితోపాటే తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన విభజన జరగాలి .భిన్న ప్రాంతాల ఆశలు ఆకాంక్షలు తీరాలి .తెలుగు జాతి సుఖ సంతోషాలతో వికసించాలి.

Thursday 15 March 2012

అనంతర దృశ్యం...!


అవాంచితపు ఏకాంతమొకటి
ఎడతెగని కావిలింతై కామిస్తుంది
దుక్ఖం ఎందుకనో ఊరకనే అపహసిస్తుంది
జీవితం
ఆవిలింతై
ముణగదీసుకుని
కదలనంటుంది.
కొన్నేసి భూకంపాల తరవాత
కొత్త దృశ్యాలు మొలకెత్తుతాయి
ఇహ ఇప్పుడు శిఖరాలు కాదు
కబళించి వేసే బడబాగ్ని కావాలి
నగ్నమో అర్థనగ్నమో కాదు
నైరూప్యమొకటి
పాదాక్రాంతం కావాలి
అద్వితీయమూ అమలినమూ కాదు
కోల్పోవటం కావాలి
తాళమూ గానమూ కాదు
కొత్త ఊహ కావాలి
విశ్వాంతరాళాన్ని ఒక్క తన్ను తన్ని
లయమవాలి
స్వప్న వర్ణాలను అద్ది
సాకారాన్ని చిత్రించాలి.


Monday 12 March 2012

నువ్వెళ్ళి పోయావట కదా ...




ఆగకుండా మ్రోగిన
అర్థ రాత్రి ఫోన్
నువ్వెళ్ళి పోయావని చెప్పింది .
నువ్వంటే జీవ నదివి కదా
వెళిపోయావంటే
ఎలా నమ్మనూ

మిగిలిన సగపు మంచురాత్రి
నన్ను డొక్కలో పొదవుకొని
వెచ్చటి కన్నీటి మేఘాన్ని
నాపై కురిపించి
నీ జ్ఞాపకాల సుధ
తీపిగానే ఎందుకుంటుందని
అడిగింది
చెప్పూ ,ఏమని చెప్పనూ

నువ్వంటే కళ్ళాపి వాకిళ్ళూ
నిదుర పెదవులపై వాలిన
కాఫీ గ్లాసేనా
మా సగపు బ్రతుకు ఎడారిని
దాటించిన ఎడారి ఓడవి కదా
ఎ దారీ లేని దాహార్తిలో
మేం నీకెన్ని సార్లు
మ్రుత్యువునివ్వలేదు
కొత్తగా ఇవాళ నువ్వెళ్ళి పోయావన్నారే

నువ్వు ఈదులాడింది
అంతు లేని సాగరం కదా
ఇవ్వాళ జ్ఞాపకాల బొత్తి విప్పి
వెతుకుతున్నా
శాంతం పేరుకున్న
నీ చల్లటి ముఖంలో
విరిగిన ఒక్క విసుగు పెదవి కోసం
నువ్వంటే మా ఆశా పూర్ణానివి కదా
ఇక్కడ నిరాశని చ్చావేం

మేం ఎన్నెన్ని సార్లు
తుఫాను మేఘాలమై
నిను కల్లోలించాం
కన్నీళ్ళమై ,వెర్రి నవ్వులమై
అవమానాలమై,దరిద్రపు ఆకళ్ళమై
గర్వాలమై ,సంత్రుప్తులమై
నీకెన్ని రంగులనిచ్చాం
కానీ నువ్వు జీవన పర్యంతం
ఎలా నిర్వర్ణమై నిలిచావు

ఇంటి పావురాయి
పొయిలో పిల్లి
చూరు కింది కుక్క
నీ ఉపనదులు
అన్నింటిపై నీ చేతివేళ్ళ
ప్రేమ స్పర్శలు
జీడి గింజతో వేసినట్టు
అతికి పోయి కనిపిస్తున్నాయ్
చెప్పూ నువ్వెళ్ళి పోయావంటే
ఎలా నమ్మనూ

ఐనా మనిషున్నంత కాలం
మనిషికి మరణమేలా సాధ్యం
నువ్వెక్కడికైనా
ఎలా వెళ్లి పోగలవ్

పాలపిట్ట ,మార్చ్ 2012.

Wednesday 7 March 2012

''శ్రీ కృష్ణుడు ........కూడా స్నేహం కడతాడా అండీ...''?-మధుర వాణి .



1.
స్త్రీ పురుషులు ఒకరికొకరు అలవాటు పడకూడదు
2.
ఒకరికొకరు తిండికి కానీ , డబ్బుకు గానీ ,సౌఖ్యానికి గానీ ,మోక్షానికి గానీ ,చివరికి ఆనందానికి గానీ ,ఆధారంగా [ఇన్స్ట్రు మెంట్స్ గా ]చూసుకోకూడదు ..తమ జీవితంలో గొప్ప ఐడియల్[ఆదర్శం]రెండో వారిని ప్రేమించడం గానే చూసుకోవాలి.-చలం స్త్రీ
దేశం లో మార్పులు చోటు చేసుకోవాలంటే కేవలం మొగ వారిపై ఆధార పడితే ప్రయోజనం లేదనే సత్యాన్ని
మహిళలు గ్రహించాలి.తమ కోసం పురుషులేమీ చేయరనీ తమకు తామే ఉద్యమాల్లో ముందుండాలనీ వారు అర్థం చేసుకోవాలి మహిళలు మొదట తమ తమ తల్లి దండ్రుల నుండీ ,భర్తల నుండీ ఆస్తి హక్కు
సంపాదించుకునేందుకు
ఉద్యమించాలి.-పెరియార్ ,స్త్రీ ఎందుకు బానిసయింది

మధుర వాణి:వేశ్యలను పాటకు పిలవక పోతే ,వాళ్లు బతకడం ఎలాగండీ?
సౌజన్యా రావు పంతులు :పెళ్లి చేసుకుంటే సరి.
మధు:గిరీశం లాటి వారిననా తమ అభిప్రాయం?
సౌజ:ఏమి మాటన్నారు!రేపో ,నేడో ఆయన ఒక పవిత్రమైన వితంతువుకు పెళ్లి కానై వున్నారు కదా ,వేశ్యనా పెళ్లాడుతారు?
మధు:అయితే పెళ్లి చేసుకోగోరిన వేశ్యలకు కోరతగిన వరులు దొరకడం ఎలాగండీ ?లేక యెట్టి వారైనా సరే అని తమరి , అభిప్రాయమా అండీ?
సౌజ: సంగతి ఇంకా నేను బాగా ఆలోచించలేదు .వేశ్యలు విద్యలు నేర్చి ఇతర వృత్తుల వల్ల సత్కాలక్షేపం చెయ్యరాదా?
మధు :అట్లా చేస్తే తమ వంటి వారు వివాహమౌదురా?
సౌజ:ఏం ప్రశ్న?నేను ఎన్నడూ వేశ్యను పెళ్లాడను.నా ఎత్తు ధనం పోస్తేనూ వేశ్యను ముట్టను.
మధు:వేశ్య జాతి చెడ్డ కావచ్చును .కానీ తాము సెలవిచ్చినట్లు ,చెడ్డలో మంచి ఉండకూడదా?మంచి ఎక్కడున్నా గ్రాహ్యం కాదా అండి?
గురజాడ,కన్యా శుల్కం
ఇష్టమైన వాళ్ళే ఉద్యోగాలు చేయండి .లేని వాళ్లు గృహ నిర్వహణే చేసుకోండి .ఇంటి పని కూడా బయటి వుద్యోగాలకన్నా తక్కువది కాదు అని మీరు మొగ వాళ్లకి చెబుతారా?-రంగనాయకమ్మ 'విమల'స్వీట్ హోమ్
మగాడికీ ఆడదానికీ పెంపకం లో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బ్రతుకు 'బోన్సాయ్ 'మాదిరి అయింది.-అబ్బూరి చాయా దేవి [తన మార్గం ]

మీకు తెలుసా నేను 'చందమామ' కోసం రాసిన కథలో పక్షుల లోకం నుంచి వచ్చిన రెక్కల పాపాయికి యోని ఉందా లేదా అన్న సంగతే రాయలేదు. పాప అయోనిజా ,అయోనా ?అన్న ప్రశ్నే రాలేదు -ఓల్గా .రాజకీయ కథలు


''
పాటం ఒప్ప చెప్పక పోతే పెళ్లి చేసేస్తాన''ని
పంతులు గారన్నప్పుడే భయమేసింది .
''
ఆఫీసులో నా మొగుడున్నాడు!అవసరమొచ్చినా సెలవివ్వడ''ని
అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది
''
వాడికేం?మగ మహారాజు''అని
ఆడా,మగా వాగినప్పుడే అర్థమై పోయింది-
''
పెళ్ళంటే'' ''పెద్ద శిక్ష ''అని
''
మొగుడంటే'' ''స్వేచ్చా బక్షకుడ''ని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తుందని!-సావిత్రి,బంది పోట్లు
కొద్ది,కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న
రాకాసిగద్ద వంటిల్లు
వంటింటి సంస్కృతి;వంటింటి ముచ్చట్లు
వంటలక్కలమైన మనం,మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం
'గరిట
తిప్పటం'గా చేసిన వంటిళ్ళను
ధ్వంసం చేద్దాం రండి!-విమల ,వంటిల్లు
ఎవరైతేనేం ?ధైర్యంగా నవ మాసాలు మోయాలనుకున్నప్పుడు
గుండె చప్పుడు కడుపులో వినిపించే
అద్భతాన్ని సొంతం చేసుకోవాలి
మన రక్త మాంసాల ఫలాల మీద
ఎవరి ఆధిక్యమూ వద్దు
వాళ్ళకే తెలియని అస్పష్ట బహిష్కరణల మధ్య
నేను యుగం ముందు నిలబడి
మాతృత్వాన్ని ఆవిష్కరిస్తున్నాను -మహె జబీన్ ,నవ స్మృతి
మహళ్ల పరదాల వెనుక
నేనింక నిలబడలేను
ఉక్కు సంకెళ్ళ లోంచి
బయట పడుతున్న దాన్ని !ఎంత క్రూరమైనా సరే
మతమూ ,తండ్రీ,మొగుడూ !-షాజహానా,దూత్కార్
ఏం చేత కాక -ఎలా ఆపాలో తెలియక
నిస్తేజంగా-ఉక్రోషంతో
'
వార' 'నీలి' ముద్రలతో
వ్యక్తిత్వపు హత్యకీ -దూషనకీ
చేతులు కలిపినా-గొంతులు కలిసినా
అదిరిపోతామనుకున్నారా?ఆడది శారీరక అవినీతి నుంచే ఎదిగిందనే మగ సంస్కారం
మాకు రామాయణమంత పాత -కుప్పిలి పద్మ ,నీలి మేఘాలు

నీకు పంచేందుకు రక్తం లేకే కదా
నిన్ను పెంచేందుకు తీరిక లేకే క్యడ
అనుమతి లేకుండా అస్తిత్వం పొందిన నీ నేరానికి
నా టెంపరరీ ఉద్యోగమూ,ఆరోగ్యమూ,నీకు మరణ శిక్షను ఖాయం చేస్తే
కడుపు చించుకుంటే మనసు గాయం అయ్యి ,కడివెడు కన్నీళ్ళ దుక్కంగానూ వుందిరా.
పాలింకి పోవడానికున్నట్లు
మనసింకి పోవడానికీ-మాత్రలుంటే ఎంత బావుండు!-పాటిబండ్ల రజని,అబార్షన్ స్టేట్మెంట్
ఇప్పుడు నేను
సమూహంలో ఏకాకిని
సూన్యపు రెక్కల కింద
పిల్లకాకినై ఒదిగి పోతుంటాను
ఒక్క అమ్మ మాత్రమె నన్ను మనిషిని చేసి
జీవిత రహదారిని చూపుతుంది-పుట్ల హేమలత ,జ్ఞాపకాల తెరలు.

మనం
పెళ్లి చేసుకున్నాం కాబట్టి మూడో వ్యక్తి మీద ఒక ఆకర్షణో లేదా ఇంకేవో మానసిక భౌతిక ఉద్వేగాలు ,అనుభూతులు కలగకుండా ఏదో రెడ్ లైట్ పడ్డట్లు ఆగిపోవు...అసలు ఫీలింగ్స్ కలగవు కలగ బోవు అని చెప్పడం ఎవరికి వారిని ,ఎదుటి వారిని మోసం చేయటమే అవుతుంది.-కల్పనారెంటాల ,తన్హాయి.


### మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ###