About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday 18 November 2013

సబ్బుతో చేతులు కడుక్కుందాం !

 ఈ రోజు వీ ఎం బంజర్ హై  స్కూల్ లో పిల్లలకి ''సబ్బుతో చేతులు కడుక్కుందాం'' అనే అవగాహనా కార్యక్రమాని నిర్వహించాం . ఈ ప్రోగ్రాం నిజానికి బెంగాల్ లో యునిసెఫ్ వాళ్ళు నిర్వహించారు . ఆంధ్రా వెనుకబడిన ప్రాంతం  కాదని వారు భావించారు . ఖమ్మం జిల్లా చాలా వెనుక బడిన జిల్లా అందుకని మేమీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం .ఈ హైస్కూల్ లో  800 మంది పిల్లలు వున్నారు  . చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది . పిల్లలు మైనం బొమ్మలు ఎలా మలుచుకుంటే అలా ఒదుగుతారు . అందరూ సుబ్బరంగా  సబ్బు పెట్టి చేతులు కడుక్కున్నారు . పిల్లలనే అడిగి ఈ ప్రోగ్రాం నిర్వహించటానికి వాళ్ళ చేతే ఒక టీచర్ ని ఎంపిక చేయించాం . ఒక్కో క్లాస్ నుండీ ఒక్కో స్టూడెంట్ ని ఎంపిక చేయించి టీం లీడర్లని చేసాం . మళ్ళీ ఆరునెలలకి వస్తామని చెప్పి బై చెప్పాం . పిల్లలందరూ తుళ్ళింతలతో బై  చెప్పారు . . 





పై   ఫోటో చూసారా ,మహిళలదే రాజ్యాధికారం అని చాటుతూ టీం లీడర్స్ లో 7 గురు అమ్మాయిలూ ,[వాళ్ళు ఎంచుకున్న వాష్ లీడర్ మేడం భాను తో కలిపి 8 మంది ] ,6 గురు అబ్బాయిలు .  




Thursday 14 November 2013

రేజర్ల స్వాతి

ఈ రోజు రేజర్ల ఉన్నత పాటశాల కి వెళ్లాం . మద్యపాన రుగ్మత మీద మాట్లాడాలని అనుకున్నాను . ప్రధానోపాద్యాయిని సరోజిని గారి   అనుమతి పొందాం .  175 మంది పిల్లలు . మొదట మేమెందుకొచ్చామో చెప్పాం .తరువాత పిల్లల్ని మాట్లాడమన్నాం . తండ్రుల తాగుడు వ్యసనం పిల్లల మీద ఎంత ప్రభావం చూపుతుందో  ,  వాళ్ళ మనసుల్ని ఎంత వేదనకు గురి చేస్తుందో,వారిలో ఎంత దుక్కం దాగి వుంటుందో ,కదిలిస్తే అది ఎలా కన్నీరై బయటపడుతుందో ప్రత్యక్షంగా చూసాం . స్వాతి ,తొమ్మిదో తరగతి, వెంకట్ కిరణ్ తొమ్మిదో తరగతి , తోట గోపి ఆరో తరగతి లకు మా షీల్డ్ లు ,సర్టిఫికేట్ ఇచ్చామ్. షీల్డ్ ఇవ్వడం కేవలం ఆ సంఘటన జ్ఞాపకార్థం మాత్రమె కాదు, స్వాతి పెద్ద పెరిగి ఈ విషయాన్ని గుర్తుంచుకుని పది మందికి మార్గ దర్శకురాలు కావాలని,గోపి తన వేదనని మరిచి పోకుండా ,భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఎదగాలని ,క్లాస్ ఫస్ట్ వచ్చే తెలివైన వెంకట్ కిరణ్ ఈ విషయంలో అందరికీ మార్గ దర్శకత్వం వహించాలనీ చెప్పి ఇచ్చాం . 

స్వాతి తండ్రి తాగుబోతు ఆ పిల్ల ఏడ్చి నన్ను యేడిపించింది ,నేను ఏడ్చి ,సరోజిని  గారిని యేడిపించాను. తోట గోపీ ది దయనీయమైన కథ .పెద్ద పెద్ద కళ్ళ ఆ అబ్బాయి పదే ,పదే జ్ఞాపకమొస్తూ మద్యాన్నపు  నా భోజనాన్ని అరుచింప చేసాడు . గోపీ వాళ్ళ  నాన్న తాగి వచ్చి ,ఆ విషయం మీద గొడవ పెట్టుకున్న వాళ్ళ అమ్మని కిరోసిన్ పోసి  తగల పెట్టేసాడు .  ఆవిడ చనిపోయింది ,గోపి తండ్రికి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది . గోపీ తండ్రి సావాసగాళ్ళు ఇప్పుడు కూడా జైలుకి తీసుకెళ్ళి మందు ఇస్తారని గోపీ ఫిర్యాదు .  తండ్రీ ,తల్లి లేక ప్రస్తుతం ఆ అబ్బాయి పర పంచన బ్రతుకుతున్నాడు.  ఆ అబ్బాయికి నేనేం చేయగలను అని ,ఏదైనా చెయ్యాలని తపన మనసు నిండుగా కల్లోలమై  పరచుకుంది . [కింది ఫోటోలో తలలు వంచుకున్న పిల్లలంతా ఏడుస్తున్నారు] 

 మొన్న కల్లూరికి వెళ్లాం , ఎస్సే రైటింగ్ కి రమ్మని చెప్పడానికి . ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ చాలా దీనంగా మా కాలేజ్ లో జెమ్స్ వున్నారండీ ,కానీ వాళ్ళలో చాలా మందికి  కాళ్ళకి చెప్పులు వుండవు ,మద్యాన్నపు భోజనమూ వుండదు .  మీరు చార్జీలు ఇస్తే పంపుతామండీ  అని చెప్పి ,ఏమండీ మాకు కొంచెం రవ్వ ఇస్తే పిల్లలకి మద్యాన్నమ్ ఏమైనా వండి పెడతామండీ ,అని బ్రతిమిలాడుకున్నారు . ఆయనకి  ఆ అవసరమేముంది నిజానికి  ,. నిన్న పిల్లల్ని తీసుకొచ్చిన ఆ కాలేజ్ లెక్చరర్ మళ్ళీ బ్రతిమిలాడటం మొదలెట్టారు 


ఊహించని ఈ అనుభవాలు దుక్కపరుస్తున్నాయి 


. ఈ దుక్కం నాది  కాక పోవచ్చు కానీ కచ్చితంగా నాది  కూడా . 

Wednesday 13 November 2013

వెంకటేశ్వర్లు

 కొన్ని  రోజుల నుండీ ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు ఏదో ఒక గ్రామానికి వెళ్తున్నాను . డాక్టర్ ముందే అన్ని ఏర్పాట్లు చూసి పెడుతున్నారు . ప్రతి చోట దాదాపు 60-70 మంది వస్థున్నారు. ఎక్కువ మంది మహిళలే . మేము సామాన్యకిరణ్ ఫౌండేషన్ నుండి వస్తున్నాం ,మేము పలానా కార్యక్రమాలు చేస్తుంటాం ,ఇవి కాక మీ గ్రామానికి అవసరమైనవి ,మేం చేయగలిగినవి వుంటే చెప్పండి అని మాటలు మొదలెడతామ్  ,కొన్ని గ్రామాల వాళ్ళు చెపుతారు కొందరు నోరే  తెరవరు ,అప్పుడిక జోకులు మొదలెట్టేది,అయితే మీ గ్రామానికి సమస్యలే లేవనమాట ,మీది ఉత్తమ గ్రామమనమాట ,ఉత్తమ గ్రామమం అవార్డ్ కోసం మీ గ్రామం పేరు కలక్టర్ కి ప్రతిపాదిస్తాం మరి అని ,అంతే కోలాహలం, అయ్యో మేడం మాకు చాలా సమస్యలున్నాయి అని . ముఖ్యంగా తండా లలో అయితే నోరు విప్పించడం మహా కష్టం .  నిన్న రాత్రి ఒక తండాకి వెళ్లాను ,అదే పరిస్థితి . చాలా సేపు అవీ ఇవీ చెప్పగా చిన్నగా మొదలెడతారు ,సారాయి మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తుందని సారాయిని మా ఇళ్లల నుండి మా ఊళ్ళ నుండి వెల్ల కొడితే చాలూ అని . అప్పుడిక దిగులేస్తుంది . మద్యం భూతాన్ని నేను ఎదుర్కోగలనా   ,దాని ముందు నేనెంతా ?అని ,ఏం  చేయాలో కూడా నాకు అవగాహన లేదు ,ఎవరినైనా సంప్రదించాలి . అంతకు ముందు ఉద్యమం నిర్మించిన వాళ్ళని కలవాలి. 

ఒక్కో చోట ముసలి వాళ్ళు ఆశతో వస్తారు . అమ్మ !మేడం !నాకు పించను రాటం లేదు ,నా వయసేమో అరవై దాటింది వాళ్ళేమో యాభై అంటున్నారు ,ఈ రోగాలతో ఎలా తట్టుకోము తల్లీ ,మాకేమన్నా సహాయం చేయమ్మా అని . ఎంత మందికి సహాయం చేయగలనూ .. అసలు జీసస్ క్రీస్ట్ ఏం చేసే వాడు అని ఈ మధ్య పదే  పదే  అనిపిస్తూ వుంటుంది . అతనెంత శక్తిమంతమైన దయ కలిగినవాడు ,కాకుంటే ఈ ప్రపంచాన్ని ఇప్పటికీ పరిపాలిన్చేస్తున్నాడే అని ఆశ్చర్యం వేస్తుంది . కరుణ వుంటే చాలా ? .. కన్ఫ్యూషన్ . నాకు,  వలసినంత డబ్బులుంటే ఎంత బాగుండూ అని చింత . ఏ వూరుకేల్లినా ఒక్కటే ,  బాధల సీసాన్ని కరిగించి నా చెవుల్లో పోస్తారు!నేనీ దుక్కాలని  భరించగలనా ?మధ్యలో పారిపోతానా ? ఏమో !ఎవరెవరో గుర్తొచ్చి రాత్రులు నిద్ర రాదు
 . 
వెళ్ళిన ప్రతి  దగ్గరా మా  ఫౌండేషన్ కోసం స్వచ్ఛందంగా ఎవరైనా పని చేస్తారా అని అడుగుతాను ప్రవీణనన్న సలహాని దృష్టిలో ఉంచుకుని . కొంతమంది వస్తారు . వాళ్ళలో ఒక అబ్బాయి ఇవాళ నిద్ర లేవకమునుపే ఫోన్ చేసాడు మా ఊళ్ళో బీ టెక్ ఫైనలియర్ చదువుతున్న అబ్బాయి చనిపోయాడు ,మీరు వస్తారా అని . కాసేపు కన్ఫ్యుషణ్ . అక్కడికెళ్ళి నేనేం చేస్తాను ,నా అవసరం ఏముంటుందని,చివరికి వెళ్లాను . ఆ అబ్బాయి ఏం జబ్బుతో చనిపోయాడో కూడా కరక్టుగా వాళ్లకి తెలీదు . పేద వాళ్ళు.  తల్లి నన్నుచుట్టుకుని  భోరుమని ఏడ్చింది ,నేనింక ఎందుకు బ్రతకాలో చెప్పు మేడం అని . నాకు ఏడుపు వచ్చేసింది . ఖమ్మం హాస్పటల్ లో వున్నపుడు డాక్టర్ ని అడిగి వచ్చి ఎక్సామ్ రాసి వెళ్ళాడట ,జబ్బు ఇంకా ముదిరింది.  కాలేజ్ లో చందాలు వేసుకుని నిమ్స్ కి తీసుకెళ్ళారు .తండ్రి వెళితే తండ్రి జేబులో డబ్బు తీసుకుని లెక్కపెట్టి ఎక్కడనుండి తెచ్చావు నాన్నా అన్నాడట ''అంతే నా చేతుల్లోనే ప్రాణం పోయింది ,కానీ డాక్టర్లు ఆరోగ్య శ్రీ కోసం కోమాలోకి వెళ్ళాడని అబద్దం చెప్పి రెండు రోజులు ఉంచుకున్నారు ''అని చెప్పాడు తండ్రి .

ఎంతమంచి కొడుకు !ఆరోగ్యం బాగాలేనపుడు ఎక్కడో దగ్గర తెచ్చి నన్ను బ్రతికించమని అడగలేదు ,ఎక్కడనుండి తెచ్చావు నాన్నా అని బాధపడ్డాడు . ఆ అబ్బాయి బ్రతికి వుంటే ఆ నిరుపేద కుటుంబం దారిద్ర్య వలయం లోనుండి బయటకి వచ్చేసి వుండేది . ఇప్పుడిక వారికి దిక్కెవరు . బాగా ఏడుపొచ్చేసింది . నేనేం చేయగలను వాళ్లకి ?నేను చేసే సహాయం ఏపాటి ?దిగులేస్తుంది . వెంకటేశ్వర్లు నువ్వు రోగం వచ్చిన మొదట్లో నాకు తెలిసి వుంటే నేనేమైనా చేయ్యగలిగే దాన్నా ?ఏమో ... ఐయాం సారీ వెంకటేశ్వర్లు !

ఈ దేశంలో ధనవంతులంటే అగ్ర వర్ణాల వారు మాత్రమె కాక పోవచ్చు 
కానీ ఈ దేశం లో పేదలంటే దళితులూ ,ఆదివాసీలే 
 పేదరికం  యొక్క సత్య  స్వరూపం తెలిసిన వాళ్లెవరైనా ఈ సత్యాన్ని తప్పక ఒప్పుకుంటారు .  

Friday 1 November 2013