About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts

Thursday, 2 May 2013

అపర్ణాసేన్‌ కొత్త సినిమా ”గొయినార్‌ బాక్షో”



అపర్ణాసేన్‌ ”గొయినార్‌ బాక్షో”

- సామాన్య
ఈ ఏప్రిల్ పన్నెండున అపర్ణ సేన్‌ కొత్త (బెంగాలీ) సినిమా ”గొయినార్‌ బాక్షో” విడుదలయింది. గొయినార్‌ బాక్షో అంటే నగల పెట్టె  అని అర్థం. ఈ సినిమాకి మూలం అదే పేరుతో వున్న శీర్షేందు ముఖోపాద్యాయ్‌ నవలిక . మూడు తరాలకి చెందిన ముగ్గురు ఆడవాళ్లు, ఒక నగల పెట్టె  వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్న తీరు, వారి వివాహాలు, మోహాలు, దుఃఖ్ఖాలు, విజయాలు అన్నింటినీ స్పృశిస్తూ స్త్రీల దృష్టికోణం నుండి ,స్త్రీవాద అవగాహనతో తీసిన సినిమా గోయినార్‌ బాక్షొ.
మొదటి తరం స్త్రీ రాస్‌ మణి,చిన్న వయసులోనే విధవగా మారిన జమీందారు కూతురు. ఈమె కాలంలో దేశ విభజన జరుగుతుంది. వున్న స్తిరాస్తులను వదలుకుని వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌కి వలస వస్తుంది. కుటుంబ పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతగా మారుతుంది. అయినా యెన్ని విపత్తులు వచ్చి పడినా గయ్యాళి నోటి రాస్‌ మణి తన నగలపై ఈగని కూడా వాలనీయదు. 

ఆ ఇంటికి కొత్త కోడలిగా అడుగు పెడుతుంది సోమలత. ఆమె వచ్చిన కొన్ని రోజులకే ఆమె భర్త పిషి మా (మేనత్త) రాస్‌ మణి మరణిస్తుంది. అనుకోకుండా రాస్‌ మణి గదిలోకి వెళ్ళిన సోమలతకు రాస్‌ మణి దెయ్యం కనిపించి పెట్టె తాళం చెవులిచ్చి నగల పెట్టెని తీసికెళ్ళి దాచమంటుంది. అది మొదలు రాస్‌ మణి దెయ్యం సోమలత కదలికలను నియంత్రిస్తూ నగలని జాగ్రత్తగా కాపాడుకుంటూ వుంటుంది. అయినా భర్త ఆత్మ హత్యకి ప్రయత్నిస్తున్న సందర్భంలో సోమలత రాస్‌ మణి నగలు కొన్నింటిని కుదువ పెట్టి బట్టల దుకాణం తెరుస్తుంది. అది తెలిసి రాస్‌ మణి సోమలతతో ఘర్షణ పడ్డా, శారీ స్టోర్‌కి ”రాస్‌ మణి శారీ స్టోర్‌” అని పేరు పెట్టారని తెలిసి ,విధవ …. విధవ అని జీవితమంతా పిలిపించుకున్న తన పేరుకి వచ్చిన గౌరవాన్ని చూసి ఉప్పొంగిపోతుంది.
మూడవ తరం స్త్రీ చైతాలి. స్కూటర్‌ నడపగల, ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకోగల స్వేచ్ఛా మానసం వున్న ఆధునిక యువతి. చైతాలికి చిన్నప్పటి నుండీ రాస్‌ మణి దయ్యం కనిపిస్తూ వుంటుంది. నగల మీద ఏ మాత్రం ఆసక్తి లేని చైతాలీని, తన నగలని అప్పుడు నడుస్తున్న బంగ్లాదేశ్‌ స్వాతంత్ర పోరాటం” ముక్తి వాహిని ”కోసం వినియోగించమని రాస్‌ మణి ప్రోత్సహి స్తుంది. చైతాలి రాస్‌ మణి నగల ఆధునిక ప్రయోజనం గుర్తించడంతో సినిమా ముగుస్తుంది.
ఆపర్ణ సినిమా కోసమని నవలికలో కొన్ని మార్పులు చేసారట. దాన్ని గురించి ప్రశ్నించినపుడు రచయిత శీర్షేందు ”ఆ నవలని నేను 90లలో రాసాను. అప్పట్లో ఏం రాసానో నాకు జ్ఞాపకం కూడా లేదు. అపర్ణ ఏం మార్పులు చేసి వున్నా నాకు సంతోషమే” అన్నారు. బెంగాలీ మేధావులు, కళాకారులు ఒకరినొకరు బాగా గౌరవించు కుంటారు. ఆ కారణం చేత కూడానేమో వాళ్ళెప్పుడూ అవార్డుల వరుసలో ముందుం టారు. ఒకరి కాళ్లు ఒకరు పట్టి క్రిందికి లాక్కునే తెలుగు వారి సంస్కృతికి ఇది చాలా భిన్నం. ఈ నవల నేను ఇంకా చదవలేదు కనుక ఆ మార్పులేమిటో చెప్పలేను కానీ, ఆ మార్పులు తప్పకుండా స్త్రీల సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయని నాకు తెలుసు. ఆ ప్రశ్నలని ఆకాంక్షలని ఇక్కడ డికోడ్‌ చేస్తాను.
మాట్లాడలేని లోహాభరణాలకి మాట్లాడే రాస్‌ మణి ప్రతినిధి. మూడు తరాలలో బంగారం ఏయే రూపాన్ని పొందిందో రాస్‌ మణి పాత్ర చెప్తుంది. దెయ్యమైన రాస్‌ మణి శరీరధర్మ రీత్యా మరణించిన వయసులోనే ఆగిపోయినా, మానసికంగా ఒక తరం తరువాత మరో తరానికి మారుతూ వస్తూ వుంటుంది. తన నగలని ఆస్తిగా గుర్తించినా వాటిని ఆచలంగానే వుంచేసిన మొదటి తరం రాస్‌ మణి, సోమలత వాటికి ద్రవ్య రూపాన్నిచ్చి తన పేరుకో గుర్తింపుని తెచ్చి పెట్టినపుడు ఆ మార్పుని స్వీకరించి ఆధునికం అవుతుంది. చైతాలి సమయం వచ్చేసరికి మనవరాలికంటే ముందుకెళ్ళి ఆలోచించి తన నగలని ముక్తి వాహిని కి వినియోగించమంటుంది. అట్లా ఈ పాత్ర కాలంతోపాటు మారుతూ వచ్చి మారిన ఆధునిక భారత స్త్రీకి ప్రతినిధిగా నిలుస్తుంది. 

అపర్ణ తన ప్రతి సినిమాలోనూ స్త్రీ పురుష సంబంధాల ప్రశ్నలు వేస్తూనే వుంటుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. సోమలత భర్త సంప్రదాయ భర్తలకి ప్రతినిధి. మామూలు భర్తలకి వుండే సుగుణాలు దుర్గుణాలు వున్నావాడు. అతనో సారి వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతాలకి వెళ్తాడు. ఒంటరిగా శారీ స్టోర్‌ కి వెళ్లి వస్తున్న సోమలతను పరాయి మగవాడురోజూ వెంబడిస్తూ ఉంటాడు. అది గమనించి రాస్‌ మణి అతనితో సంబంధం పెట్టుకోమని సోమలతని ప్రోత్సహిస్తుంది. ఆ సన్నివేశం చూసి మనం ఆశ్చర్యపడతాం. మన ఆశ్చర్యం పై దెబ్బ కొడుతూ స్క్రీన్‌ ప్లే రాసిన అపర్ణ ”ఏం మగవాళ్ళకేనా అన్ని ఆనందాలు?” అని ప్రశ్నిస్తుంది. అన్నట్టుగానే సోమలత ఒకసారి ప్రియుడి సముఖానికి వస్తుంది. అప్పుడే భర్త తిరిగి వస్తాడు. ఆ ఏడాది సోమలతకి చైతాలిపుడుతుంది. పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తల్లి మాత్రమే చెప్పగలదనె మాట గుర్తొచ్చి మనం ఆశ్చర్యపడతాం.
రచయితగా చలం కానీ దర్శకురా లుగా అపర్ణ కానీ వివాహ విచ్ఛిన్నతని, విశృంఖలతని ప్రతిపాదించరు. ఆలోచించ డానికి  స్వంతంగా మెదడూ, శరీరానికి కోరికలూ వున్న స్త్రీకి సమాజం, వ్యక్తీకరణని నిషేధించి ఎలా బంధించి వేసిందో చెప్తారు. విముక్తిని కలగంటారు. పురుషులు వివాహే తర సంబంధాలలోనో ,ప్రేమ సంబంధాల లోనో వున్నపుడు ఆ సంబంధాలలో స్త్రీలు కూడా వుంటారు. కానీ మన కపట ప్రపంచం ప్రేమనో ,వ్యామోహాన్నో పురుషుడు ప్రకటించినట్లుగా స్త్రీని ప్రకటించనీయదు. అటువంటి సంబంధాలలో వున్న స్త్రీ కూడా సమాజానికి భయపడి పైకి పాతివ్రత్యాన్ని వుపన్యసిస్తుంది. ”ఏం ఆనందాలన్నీ మగవాళ్ళకేనా” అన్న ప్రశ్న అట్లాంటి ఈ కపట ప్రపంచాన్ని షాక్‌కి గురి చేయడానికి వుద్దేసించినదే తప్ప విశృంకలతని వుద్దేసించినది కాదు . అపర్ణ తన ప్రతి సినిమా లోనూ నిలవనీటి మురికి గుంటలాంటి ఈ సమాజాన్ని ప్రశ్నల రాళ్ళు వేసి చెదరగొట్టి చలనం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ వుంటుంది.
అణచివేతలకి సంబంధించిన ఇంకో ప్రశ్న రాస్‌ మణి ప్రణయ ప్రయత్నం. నిండు యవ్వనంలో వున్న విధవ రాస్‌ మణి తన ఇంట్లో బొగ్గులు కొట్టే పని వాడితో ప్రణయానికి ప్రయత్నిస్తుంది. చీకటి పడ్డాక గదికి రమ్మని పిలుస్తుంది. పిలుపునందుకుని వచ్చిన ఆ కుర్ర వాడు దురదృష్టవశాత్తు పట్టుపడి తన్నులు తింటాడు. అట్లా రాస్‌ మణి కోరికని భుగ్గిపాలు చేస్తాడు. ఈ సన్నివేశం నాకు ప్రఖ్యాత ఆంగ్ల చిత్రం ”టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌” ని జ్ఞాపకం తెచ్చింది. రెండు చిత్రాలలోనూ స్త్రీలు అగ్రవర్ణులు. ఇద్దరూ కూడా అణచివేతలో తమకన్నా ఒక మెట్టు క్రింద వున్న పురుషులను ప్రలోభ పెట్టాలని చూస్తారు. ఈ ప్రయత్నంలో మాకింగ్‌ బర్డ్‌లో శ్వేత స్త్రీ ”మయెల్ల” అమాయుకుడైన నల్లజాతి యువకుడి మరణానికి కారణమవుతుంది. కొడవటిగంటి కుటుంబ రావు ఒక కథలో తన స్వార్థ ప్రయోజనం కోసం నాయిక (బహుశా) పార్వతి ఒక దళితుడిని పెళ్ళాడి అతని జీవితాన్ని కల్లోలం చేసి దుఃఖితుడ్ని చేస్తుంది. స్త్రీలయినప్పటికీ అగ్రవర్ణ స్త్రీలు అణచి వెయబడ్డ కులాల పురుషల్ని ఏ దృష్టి కోణంతో చూస్తారో, అణచివేతలో వారు కూడా ఎలా పాలు పంచుకుంటారో చెప్పిన అపర్ణ, చైతాలి పరంగా ఇప్పుడు రావాల్సిన మార్పును కూడా చెప్తుంది.
ముక్తి వాహిని ఉద్యమంలో చురుకుగా ఉంటున్న చైతాలి స్నేహితుడ్ని చూసిన రాస్‌ మణి ఆ యువకుడిని పెళ్లి చేసుకోమని చైతాలితో అంటుంది. సినిమాలో ఆ యువకుడి పాత్రను ,అప్పుడు రాస్‌ మణి మోహించిన యువకుడి పాత్రను వేసిన నల్లటి యువ నటుడు ఒక్కరే కావడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. అణచివేయబడ్డ కులాల వారు చదువుకుంటున్నారు, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అని చెప్పడంతో సరి పెట్టుకోదు అపర్ణ, ఇప్పుడు, అత్యాధునికంగా మారిన రాస్‌ మణి చేత అతడిని పెళ్ళెందుకు చేసుకోకూడదు అన్న ప్రశ్న కూడా వేయిస్తుంది.
నాకు వ్యక్తిగతంగా నా కులం, నా భాష, నా భారతదేశం అనే భావాలు వుండవు. అందుకని అపర్ణా సేస్‌ భారత దేశం గర్వించ దగ్గ దర్శకురాలు[నిజానికి ఆమె ఒక దేశం గా భారత దేశం గర్వించ దగ్గ దర్శకురాలు ] అని స్టేట్‌ మెంట్‌ ఇవ్వను. కానీ, ఒకటి మాత్రం చెప్పగలను మనిషిగా, అందునా స్త్రీ ప్రకృతిగా నేను అపర్ణని చూసుకుని గర్వ పడతాను. ఆనంద పడతాను. ప్రేమిస్తాను.


రాష్మోని దెయ్యంగా మౌసమి చటర్జీ 
Story: Shirshendu Mukhopadhyay
Starring : Moushumi Chatterjee, Konkona Sen Sharma, Srabanti, Saswata Chatterjee & Others.
Producer : Shree Venkatesh Films Pvt. Ltd.
Presenter: Mahendra Soni & Shrikant Mohta.
Director: Aparna Sen.
Screenplay & Dialogue: Aparna Sen
Music: Debojyoti Mishro
Cinematographer: Soumik Halder
Editor: Rabiranjan Moitra
Art Director: Tanmoy Chakraborty

Thursday, 4 April 2013

ఎంత బాగుంటుందో !

             లేక్ హౌస్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం . మేజిక్ రియలిజం లో  వుండి నా బుద్దికి గాఢమైన సంతృప్తిని ఇస్తుందీ  మూవీ    .పుష్పవర్ణ మాసం  గురించి అనుకున్నపుడు నా మిత్రులకి సామూహికంగా ''వాట్ డ్రీమ్స్ మే కమ్''   జ్ఞాపకానికి వచ్చింది కానీ ,నాకు మాత్రం ఎందుకనో లేక్ హౌస్ జ్ఞాపకానికి వస్తుంది . నాకు పిచ్చి ఇష్టమీ మూవీ . ఇందులో తటస్థ పడే నిక్ డ్రేక్ పింక్ మూన్ ,అతని గభీర కంటమూ కూడా .

ఏవిటో బోల్డు మార్మికతను దాచుకున్నట్లు వుండే రీవ్స్ ముఖమూ ,స్త్రీత్వం కొంతగానే కనిపించే శాండ్ర ఈ మూవీకి అందాన్ని తెచ్చి పెట్టారు .నిజానికీ వాల్లిద్దరీ సౌందర్యం నన్నెందుకో బాగా ఆకర్షిస్తుంది కూడా .   
                                                                                                               

Saturday, 30 June 2012

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా !


ఇప్పటి సినీ గీత రచయితల్లో నాకు సిరివెన్నెల గారూ ,చంద్ర బోస్ గారు మాత్రమె తెలుసు .దానికి కారణాల చర్చ పక్కన పెట్టేస్తే ,ఎన్నో సార్లు ''మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ''పాట విని వున్నా ఆ గీత రచయిత ''కందికొండ''అని నాకు  తెలియనే తెలియదు ...నిన్న ఈ ఆర్టికల్ చదివే వరకు. నా కథ 'కొత్త గూడెం పోరాగాడికో లవ్ లెటర్ 'వచ్చినపుడు కందికొండ గారు కాల్ చేసి మంచి కథ రాసానని  చెప్పారు .ఆ తరువాత 'మహిత' వచ్చాక నా పేరు గుర్తుంచుకుని మరీ రెండు భాగాలు చదివి అభినందించారు .నిన్న మళ్ళీ కాల్ చేసి ''నమస్తే తెలంగాణ ''లో వారి గురించి వచ్చిన ఆర్టికల్ గురించి తెలియ పరచారు .

ఒక అపరచిత జీవన చిత్రం వెనుక మనం విషాదాన్నో ,గెలవడానికి చేసిన పోరాటాన్నో అన్ని సార్లూ ఊహించలేం కదా ...ఆ బ్రతుకు చిత్రాన్ని  తరచి చూడగలిగే స్థితిలో వుంటే తప్పించి .కందికొండ గారి జీవిత చిత్రం  చదివాక గెలుపు వెనుక వున్న కష్టం మీద నాకో అవగాహన వచ్చింది . మనిషి సాయుధాన్ని  స్వప్నించే దారి ఎందుకో మనసులో మెరిసింది .''ఆలోచనలన్నీ క్రూరం గా మారుతున్న సమయంలో లైబ్రరీ పరిచయమైంది ''అనడం నాకీ ఆర్టికల్ లో అత్యంతగా నచ్చిన మాట .http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=39154&boxid=248371728 
 



Tuesday, 20 March 2012

పూరీ జగన్నాథ్ ''బూతుల బిజినెస్ మేన్''

http://prajaasaahithi.com/images/stories/pscover_mar12.jpg

ఈ సమీక్ష ఈ నెల ప్రజా సాహితిలో వచ్చింది httphttp://prajaasaahithi.com/sameekshalu/cinema-sameekshalu:ఇదే సినిమాలో పాటల గురించి వనజవనమాలి గారు తన బ్లాగులో చక్కటి సమీక్ష చేసారు http://vanajavanamali.blogspot.in/2012/03/blog-post_13.html 


Monday, 13 February 2012

పూరి జగన్నాథ్ 'బూతు పోకిరి '


2006 లో పోకిరి మూవీ చూశాను.విపరీతంగా జుగుప్స కలిగింది.కోపమొచ్చింది .ఇంటికొచ్చి కాయితమోటి తీసుకుని ఇది రాసేసి ప్రజా సాహితికి పంపేశాను.కొన్ని రోజులాగి రవి గారికి ఫోన్ చేసి అందిందా అని అడిగాను.ఆయన వెంటనే అయితే మీరీ మధ్య ప్రజా సాహితీ చదవటం లేదన మాట అన్నారు.నేను చాలా నిజాయితీగా లేదండీ నాకు పాప పుట్టిందీ అన్నాను.రవి గారు నాకు మారిన అడ్రెస్స్ ఇచ్చారు.అప్పటికి నా దగ్గర రఫ్ కాపీయే ఉండింది.అదే పంపించేసాను.అదే ఇది .మళ్ళీ ఇన్ని రోజులకి నాకు బిజినెస్ మేన్ మీద రాయాలనిపించింది.అది రాస్తూ ఇది జ్ఞాపకమొచ్చి బ్లాగ్ లో పెట్టాను.

ఈ దేశపు పేద, మధ్యతరగతి ప్రజలకు కాస్త సేద తీరేందుకు ,ఆనందించేందుకు ఉన్న ఏకైక మార్గం సినిమానే.అందుకే ఆ సినిమా ప్రభావం వారి జీవన శైలి ఫై ముఖ్యంగా యువతరం పై మరీ తీవ్రంగా ఉంటుంది .

పూరి జగన్నాథ్ సంపూర్ణ నేతృత్వం లో ఈ మధ్య “పోకిరి” అనే సినిమా వచ్చింది.ఈ సినిమాలో హీరో... కృష్ణ కొడుకు, మహేష్ బాబు .సినిమా అంతా దర్శకుడు చాల సామాజిక అంశాలను నెత్తికెత్తుకుని బాధ పడుతూ ఉంటాడు.ప్రేక్షకులు ఇవన్ని జరిగినవే కదా అని ఫీల్ అయిపోతుంటారు కాకపోతే అన్నీ దర్శకుడి సినిమాకు రంజుదనాన్ని తెస్తుంటాయి.దర్శకుడు పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తుంటే ఆ పాత్ర ,శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుంది.”మసాజ్ పార్లర్ కు వెళ్దాం పద” అనో ,”అమలాపురం లో ఆడవాళ్ళు బాగుంటారట ” కదా అనో, వంకరగాఅంటూ ఒక దెబ్బ కు రెండు ఫీలింగ్ లను తెప్పిస్తాడు .

దర్శకుడు పోలీసు వ్యవస్థ గురించే కాదు ,గూండా ల గురించి,సెల్ ఫోన్ లో సెక్స్ దృశ్యాల గురించి,టీవీ ల గురించి ఏమిటేమిటో చెప్తాడు.మధ్య మధ్య లో హిందీ సినిమాలను ,ఎం టీవీ ని మరిపించే దృశ్యాలు,పాటలతో కిర్రెక్కిస్తుంటాడు.ఏం చేసినా సినిమా లో కామరసం పోర్లేట్టు చూసుకుంటాడు.

సినిమాలో ఎస్.పి పాత్ర ,”గాంధీ సినిమా ను ఎవరు చూడరు అదే కడప కింగ్ అంటే రెండు వందల రోజులు నడుస్తుందని” అంటుంది.ఈ డైలాగు పూరి జగన్నాథ్ ఫ్రస్ట్రేషన్ నుండి వచ్చిందే .పూరి సినిమాలు ఇంతకు ముందు మరీ ఇంత కంపుగా వుండేవి కావు.కొన్నిభారీ ఫ్లాపుల తర్వాత కంపు పెరిగింది .అతనెందుకు గ్రహించలేదో కానీ కడప కింగ్ లే కాదు, తేజ హీరోయిన్ జాకెట్ లో నుంచి ఈనాడు, వార్త , పత్రికల బాల్స్ ని చెరో వైపు నుండి తీయించినా సినిమా ఫ్లాప్ అయింది.అశ్లీలతే సినిమా కి ఆయువు పట్టు అనుకోవడం తెలివి తక్కువ తనమే.

గురివింద గింజ సామెత ఒకటి ఉంది.అది పూరి కి సరిగా సరిపోతుంది.తానొక బాధ్యత గల పౌరుడిలా టీవీ 9 కి t tv అని పేరు పెట్టి అశ్లీల దృశ్యాలేమన్నా దొరికితే ముందు మాకే ఇవ్వండి రోజంతా వేస్తాం అని విలేఖరికి డైలాగు పెట్టిన దర్శకుడు ,నువ్వు ఆడదానివి కాదా మీ అక్కాచెళ్ళల్లని ఇలా చేస్తే వూరుకుంటారా అని డైలాగు చెప్పే హీరో దారిలో వెళ్తున్న హీరోయిన్ని ఆపి ఆమె టీషర్టు పై (కేమెరా ని నిలబెట్టేసి )దృష్టి కేంద్రీకరించేసి అంతా కాకపోవచ్చు కానీ some parts of me are awesome అని వర్ణిస్తుంటారు. ఎస్.పీ కూతురిని మంత్రి కొడుకు చేడుపుతున్నట్టున్న దృశ్యాలు సినిమాలో బూతుకు చేరుపే కానీ మరోటి కాదని ప్రేక్షకుడు గ్రహించగలడు.

పూరి తన సినిమా లో పాటలని స్త్ర్రీ శరీర ప్రదర్సనకే కేటాయిస్తాడు.ఎం టీవీ ని తలపించేలా పాటలు ఇది వరకే సూపర్ సినిమాలో ప్రేక్షకులకు పరిచయమే.ఇందులో “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అనే పాట ఆ తరహాకి హైలైట్ .అందులో పిల్ల తన శేరీరాన్నంతా తెర మీద పరిచేసి గంతులేస్తూ జుగుప్స కలిగిస్తుంది .ఈ పాట చాల హిట్.రాఘవేంద్ర రావు వృద్దుడై, శీలవంతుడు అయిన తర్వాత విఖ్యాతమైన అతని బొడ్డుకి మరి నాలుగు చేర్చి, పూరి సినిమాలను కంపు కొట్టిస్తున్నాడు.ఈ తరహా ఏంటని? ఏదో టీవీ ఇంటర్వ్యూ లో ప్రశ్నిస్తే చాలా నిర్లజ్జగా, “అంతా డబ్బు కోసమే "greed for money " అని సమాధానం ఇచ్చాడు.

సినిమాలో ఇంకో దృశ్యం ఉంటుంది .విలన్ ఒకడు ఒక పిల్ల చేత మంచానికి కట్టించుకుంటాడు.ఆ పిల్ల, వాడి మీదకెక్కి లిప్ స్టిక్ పూసి కొరడా తీసుకుని కొట్టేదా కొట్టేదా అంటుంటుంది .ఇది ప్రఖ్యాత పర్వర్టేడ్ ఆంగ్ల చిత్రం బేసిక్ ఇన్స్టింక్ట్ కు అనుకరణ.మాతృక ని ఎంత మంది పిల్లలు, స్త్రీలు చూసారో కానీ ఆ దౌర్భాగ్యాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులకు కలిగించాడు దర్శకుడు.సినిమా కు ఆ సన్నివేశం అవసరం అని దర్శకుడు కూడా చెప్పలేనంత అనవసరం గా ఉంది.కనుక ఆ సీన్ పూరి జగన్నాథ్ లోని పర్వర్షన్ కి ఒక నిదర్సనం గా చెప్పవచ్చు.

సమాజ సేవకి అంకితం అయిపోయాడు కదా దర్శకుడు, అందులో భాగంగానే పది సార్లు నిరోద్ అనిపిస్తేనన్న ప్రజలు కుటుంబ నియంత్రణ పాటిస్తారు అన్నట్లు అలీ చేత ప్రభుత్వ నిరోద్ ప్రకటన బోర్డు ని చూపిస్తూ ''అర్థ రూపాయి కి ఇది కూడా రాదు'' అని ఒక సారీ, మహేష్ బాబు చేత ఎస్సై ని మీ నాన్న నిరోద్ వాడి వుండాల్సింది నువ్వు పుట్టకుందువు అని ఒక సారీ అనిపిస్తాడు .యాభై ఏళ్ళ మనిషిని పట్టుకుని అప్పుడు మీ నాన నిరోద్ వాడున్డాల్సింది అనడం ఎంత అసహ్యం?

ఈ మధ్య నెల్లూరు జిల్లా కావలి లో ఒక ప్రముఖ కాలేజీ లో వార్షికోత్సవం తర్వాత, మధ్య రాత్రి హాస్టల్ కు వెళ్తున్న ఆడపిల్లలపై అదే కాలేజీ అబ్బాయిలు ముసుగులేసుకుని దాడి చేసి చెప్పుకోలేని చోట్ల కొరికి గాయపరిచారు.

ఈ ఐడియా వాళ్ళకి “సై” అనే సినిమా నుండి వచ్చిందట .మహిళా సంఘాల వాళ్ళు, ప్రజాతంత్ర వాదులు ధర్నాలు చేసి, కరపత్రాలు వేసి ఆందోళన చేసారు.కానీ ఆ అమ్మాయిల తోలి యవ్వన జీవితం పై జరిగిన పైశాచిక దాడి జీవిత పర్యంతం వారిని భయ పెడుతూనే ఉంటుంది.దీనికి బాధ్యులు ఆ అబ్బాయిలే అనడం కన్నా సై సినిమా టీం అనడమే న్యాయం.

చాల సార్లు ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు కనుక అలాంటి సినిమాలు తీస్తున్నామని దర్శకులు అంటారు.అది తప్పు.ఇదే మహేష్ బాబు “ఒక్కడు” సినిమాని ఎటువంటి స్త్రీ శరీర ప్రదర్శన లేకపోయినా వంద రోజులు చూసారు.ప్రేక్షకులు అశ్లీలం కోసమే సినిమా చూడరు.చూసే వాటికి అలవాటు పడతారు.ఈ పోకిరి సినిమా మొదటి సారి చూసినప్పుడు నేను చాల జుగుప్స కి లోనయ్యాను.ఈ వ్యాసం రాయాలనే ఆలోచన కలిగాక రెండో సారి చూసాను.ఈసారి నాకు అంత జుగుప్స కలగలేదు.కారణం అలవాటు పడడమే. అలవాటు పడడం చాలా ప్రమాదకరం .ఎందుకంటే ఎప్పటికప్పుడు డోస్ పెంచాలి కదా .బహుశా సెన్సార్ వాళ్ళు కూడా నాలాగే అలవాటు పడ్డారేమో .అంటే రాబోయే సినిమాల అశ్లీలానికి మనం అనివార్యంగా అలవాటు పడాలేమో.

అట్లాగే,పైరసీ విషయంలో రెచ్చిపోయి ,రియల్ హీరో లాగా షాపులు పగలగొట్టి ,ఇండస్ట్రీ బాగోగుల్ని తన భుజాలపై వేసుకున్న మహేష్ బాబు కి సమాజం బాగోగుల పట్ల మాత్రం అలంటి బాధ్యత లేదు కాబోలు .వ్యష్టి కన్నా సమిష్టి పట్ల ఇంకా జాగర్త గ ఉండాలనే కనీస జ్ఞానం లేని ఇతను యువతరపు idol he అట.

స్త్రీ శరీరాన్ని ప్రదర్శించటానికి, రెచ్చగోట్టేట్టు ప్రదర్శించడానికి తేడా ఉంది.పూరిది రెండవ పద్దతి .సెక్స్ సినిమాల ముద్ర తో వచ్చే షకీలా సినిమాలు సమాజం లోని అన్ని వర్గాల వారు చూడరు .ఆ థియేటర్ల ముందు కూడా నిలబడరు .కాని పూరి జగన్నాథ్ ,సెన్సార్ బోర్డు ,కలిసి అలాంటి భయాలేమి అవసరం లేకుండా ఆబాలగోపాలానికి, షకీలని మించి పోయేంత అంగాంగ ప్రదర్శనలతో సినిమాలు చూపించి మైమరిపిస్తున్నారు.ఏ అడ్డం ,సిగ్గు లేకుండా ప్రజలు ఈ సెక్స్ సినిమా లు చూసేస్తున్నారు.

హెచ్.బి .టీ వాళ్ళు ,”వ్యసనం” అని ఒక అనువాద పుస్తకం ప్రచురించారు .అందులో డ్రగ్స్ కన్నా ఆల్కహాల్ ఎక్కువ ప్రమాదకరం అంటాడు రచయిత.ఎందుకంటే ఆల్కహాల్ లభ్యత ఎక్కువ.ప్రభుత్వమే స్వయంగా దుకాణాలను పెట్టి వ్యసనాన్ని నేర్పుతుంది.పూరి జగన్నాథ్ సినిమాలు ఆల్కహాల్ అయితే మన సెన్సార్ ప్రభుత్వ సారాయి దుకాణం లాంటిది.

ప్రజాసాహితి ,ఆగష్టు 2006.