About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday, 28 January 2012

పది నేనులు, ఒకే నువ్వు..!


ఆరు రుతువుల నుండి
ఒక్కటే వర్ణాన్ని పొందాలనుకుంటావ్
అరవై ఒకటో వర్ణాన్నై
నీకెదురొస్తాను

పెంపుడు కుక్కని
నిమురుతూ
అలవాటుని ప్రేమిస్తుంటావ్
జవనాశ్వాన్నై
సతత హరితారణ్యాలలో
స్మిత సింధువునై
పరుగులెత్తుతుంటాను

కిటికీ ఆకాశం లోని
ప్రతి రోజుటి చద్ది నక్షత్రాన్నే
చూస్తుంటావ్
కనీ కనిపించక
పరిశోధకులను వేదించే
కొత్త నక్షత్రాన్నై
సొగసు సోయగాలు
పోతుంటాను

నగరానివై
సంక్లిష్టతని శ్వాసిస్తుంటావ్
పల్లెనై
చిలుకల గూళ్ళ తాటి తోపునై
ఎవరూ కలచని కొలనునై
కళ్లు విప్పార్చుకుని
నిను చూస్తుంటాను

తెలిసిన వెలిసిన పువ్వుల్లో
నను వెదుకుతావ్
నువ్వెప్పుడూ చూడని
పొగరు పువ్వునై
తిక్క తేనెలు కురిపిస్తుంటాను

ఎక్కి వచ్చేసిన
నిచ్చెనలు చూసుకుని
గొప్పలు పోతుంటావ్
నా పరమ పద సోపానంలో
నువ్వు పడిపోయిన
పాము నోటిని చూసి
పగలబడి నవ్వుతుంటాను

పట్టి పెట్టే

గట్టి ఆనకట్టల గురించి

లెక్కలేస్తుంటావ్
పెడసరపు నదినై
నిను ఎడమ కాలితో తన్ని
నీ మీదుగా దుమికి పోతాను

......ఇక్కడ నిలబడి
పా......పమని జాలిపడి
వాచ్యం చేస్తున్నా,
ఇది
ప్రవల్హిక
శత సహస్ర ముఖాలవయ్ రా
అర్థం చేసుకుందువు గానీ..!
[ఆగష్టు 23,2011,ఆదివారం వార్త.]

Friday, 20 January 2012

ఒక రోజు కొన్ని దృశ్యాలు !


సంత్రుప్తినో ,అసంత్రుప్తినో
మ్రోగిస్తూ
గుడిలో గంట

ఆకలి పావురాల కోసం
అమ్మలా ,దారంతా రాలుతున్న
ధాన్యం బస్తా

తామర తూడు చుట్టూ
బాతు పిల్లను తిప్పుతున్న
చేప పిల్ల

ఆకాశం కేసి చేతులు చాచి
చినుకు ముద్దు కోసం
చిన్న పిల్లలా మహా వృక్షం

పజిల్ రోడ్లలో
ఆలోచనల పుట్టల్ని మోసుకెళుతూ
కాళ్ళు ,చమురు గుర్రాలు

న్యాయం కోసం
నిరాహార దీక్షలై నిరీక్షిస్తూ
వేళ్ళబడ్డ శిబిరాలు

రండ గొండ శబ్దాల
రోడ్డు పక్కనే
సుఖ నిద్రలో శునక యోగి

చెమటై పూసి ,వాడి పోయి
ఇంటి బాట పట్టిన
కూలి ట్రక్కులు

ద్వారా బంధానికి
తలుపు చెక్కై అతికి
ఆఫీసమ్మ కోసం ఎదురు చూస్తూ
స్కూలు పాపాయి

రాత్రింటి కోసం
గుడ్డి లాంతర్ని సిద్దం చేస్తూ
సంధ్యాకాశం

రోజు గుండెను
తడుముకుంటూ
క్షణాల ప్రవాహం
పాతగా ,కొత్తగా
కొత్త పాతగా .

[ఆదివారం వార్త ...16 మే 2010 ]


Thursday, 19 January 2012

ఇన్ ద ఆబ్ స్ట్రాక్ట్ బట్ నాట్ ఇన్ ద కాంక్రీట్...


జన సంద్రంలో
చూపుల ఊయల వేసి
ముద్దాడిన లాస్యంలో
లయమైన నిర్లిప్త కాంక్ష

పరిమళ గమనంలా ఒక అందం
సుడి గాలిలా అనుక్షణం
విడిపించుకోలేని
విరసపు కాంక్ష

వాయులీనమై
దిగులు పూల గుండెను తడిమే
సమ్మోహన రాగం
చలించలేని చలితకాంక్ష

రంగై పరచుకుని
రూపమై తలెత్తిన
ఒక అలౌకికం
కలవ లేని కలలకాంక్ష

నీలాంబరంలా తను
నీలి సంద్రంలా నేను
కావిలించగలేని
దిగ్దిగంతాల కాంక్ష

ఎన్నెన్నో కాంక్షలు
అమూర్తంగా
మూర్తిమంతమైన
ఏక పత్నీ /పతీవ్రతంలో
లయమవుతూ ...

(టైటిల్ :'లారెన్స్ వుమెన్ ఇన్ లవ్ 'నుండి )
వివధ ,ఆంధ్రజ్యోతి ,2006 అలా కావచ్చు

Monday, 16 January 2012

అనిత పాడిన పాట…!

అనిత పాడిన పాట…!

నిత్యం రద్దీగా వుండే మెయిన్ రోడ్ పక్కన నిలుచుని వుందో పాత కాలం బంగ్లో .హుందాగా శాంతంగా అచ్చు మరో పది తరాలకు కూడా దిగులు లేని పెద్దింటి ఆడపడుచులా వుంది.బంగ్లో ఆవరణలో పరుచుకుని వున్నపనస,అనారు,జామి,మామిడి చెట్ల పై వాలి రక రకాల పక్షులు కిల కిలమని ఎడతెగని కబుర్లు. చెప్పుకుంటున్నాయ్ .ఆకాశంలో సూర్యుడు ఆవిళించి,పళ్ళు తోమి ,కాఫీ తాగి సంద్యాద్రి వైపు పావు వంతు ప్రయాణం కూడా చేసేసాడు.

3333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333388888888


మేడం మా ఇంటిల్లపాడికీ మీరిచ్చే రెండేలే గతి మేడం!చానా మాట్లు ''ఒసేయ్ అనిత... పాసిపోయినయ్ తినబాకా... మూలన పడతావ్'' అంటా వుంటావ్ మేడం నువ్వు ! తిండి కోసం మా నాయనెంత కష్ట పడినాడో మాకు దెల్సు ...పైనున్న బగమంతుడికి తెల్సు మేడం ! ఎదవ పొట్ట కోసం నేనెంత కష్ట పడతా వుండానో నాకు దెలుసు మేడం!అందుకే తినేయి జూస్తే... పాసినయి,పారేసినయ్ అన్నా ..., వదలబుద్ధి కాదు మేడం! కళ్ళకద్దుకోవాలనిపిస్తది మేడం.....
- saamaanya

[వార్త ,జనవరి 15,2012]

Saturday, 14 January 2012

జా..స్ట్ లైక్ దట్ !





Friday, 13 January 2012

చిలుకనెప్పుడైనా పెంచుకున్నారా....


అనంత హరితాకాశం నుండి

పట్టి తెచ్చాక

చిలుక

ఎలవర పోతుంది

పడగలెత్తి నిలుచున్న
పంజరం
నిజమో, మాయో
అర్థం కాక
చిలుక
స్తంభించి పోతుంది

పచ్చ పట్టు రెక్కల్ని
పట్టి
కత్తిరించాక కూడా
తుఫాను చెట్టులా
అటై,ఇటై
ఎగరడమనే
తన
పురాతనేచ్చను
పరీక్షించుకుంటుంది

కాలం
బొట్టు బొట్టు
కన్నీళ్లుగా కరిగి
కలలనేత గుండె
తడిసి
వెలిసి పోయాక
చిలుక
కలలోలా
నీకు దగ్గరవుతుంది

పూల కాయల చెట్లు
పురావర్ణ చిత్రాలయ్యాక
హృదయ హరితాన్ని
కోల్పోయి ,
చిలుక
నల్లమందు బానిసలా
నీ గూటి పలుకులు
పలుకుతుంది
[వార్త లో....]

Wednesday, 11 January 2012

ఇగో ...!

 ఆది  మధ్యాంతాలు లేనిదనుకున్నా   
మన ప్రేమకు అంతమొచ్చింది
ఆకు చివరి నీటి చుక్క ఆగలేనట్టు
ఒడ్డుకొచ్చిన అల వెనక్కెళ్ళినట్టు

నా ఆర్థిక స్వాతంత్ర్యపు గొడుగు కింద
నిటారుగా నిలుచున్నా
నిలువ నిముషం లేని జీవితంలో
ఒంటరిగా ,నీరవ నిశ్సబ్దంగా

చీకటి నీటిలో చంద్రుని ప్రతి ఫలనంలా
నిన్ను నాలో చూస్తూ
అహంకారం ఘాటుతో విరిగిన
మనసు ముక్కల్ని ఏరుకుంటున్నా

దొర్లడానికి కావలసినంత పక్క దొరికాక
నువ్వెవడివన్న ధిక్కారానికి
నువ్వెవరివనే సమాధానం వచ్చేసింది
గాయపరచిన నీ మాటల్లో
ప్రేమాసూయ ప్రియంగా స్పర్సిస్తుంది

ఒందల కాల్ ల జీవితంలో
నా కోసం ఒక్క పిలుపూ లేక పోయాక
నువ్వు పెట్టే నీ చేతి ముద్దల
నాలుక ముద్దుల లేమి తెలిశాక
పెట్టి పోషించడం లేదని ఇక అనగలనా

డియర్ ఎక్స్టసీ
నాకిప్పుడో ముసలమ్మ కావాలి
నాలుగు దెబ్బలు వేసైనా
నన్ను నీతో కలిపేందుకు .
ఆది వారం ఆంద్ర జ్యోతి 2006, జనవరి 29.