About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 20 October 2014

కథాసాహిత్యంలో విలక్షణ కంఠస్వరం

http://www.prajasakti.in/index.php?srv=10301&id=1205914

ప్రజాశక్తి వారధి లో 
 కథ రాయడం ఒక కళ. ముడిసరుకు వుంటే సరిపోదు, దానిని కళాత్మకంగా వ్యక్తం చేయగల నైపుణ్యం అవసరం. ఏం రాయాలన్నదే కాదు, ఎలా రాయాలన్నది ప్రధానం. ఈ అంశాన్ని దశాబ్దాలుగా సాహిత్యరంగంలో నొక్కి వక్కాణిస్తున్నప్పటికీ చాలామంది వస్తువుకు ఇచ్చే ప్రాముఖ్యం కథనానికీ, కథనంలో శిల్పానికీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో కళాత్మక విలువలతో రాసిన కథలు చూస్తే అబ్బురం కలుగుతుంది. ఇలా కూడా రాయొచ్చా అని కొంచెం విస్మయానికి లోను చేయగలిగితే సాఫల్యం సాధించినట్టే. 'కొత్తగూడెం పొరగాడికో లవ్‌లెటర్‌' శీర్షికన సామాన్య రాసిన కథలు చదివితే కచ్చితంగా కొత్త కంఠస్వరం విన్న అనుభూతికి లోనవుతారు పాఠకులు. సామాన్య రాసిన పది కథల సంపుటి 'కొత్తగూడెం పొరగాడికో లవ్‌లెటర్‌'. ఈ పుస్తకం వచ్చాక కూడా మరికొన్ని కథలు రాశారు. ఈ పుస్తకంలో ఉన్నవి పది కథలే అయినా, మరల మరల చదివించే గుణమున్న కథలు. వివిధ పత్రికల్లో వచ్చినప్పుడు చదివిన పాఠకులు భిన్నరీతుల్లో స్పందించారు. వీటన్నిటినీ ఒకసారి చదివినప్పుడు చెందే అనుభూతి సాంద్రమైంది. సృజనశీలురయిన వారి జీవన వైశాల్యం, అనుభవ పరిధిలోని విస్తృతి పదునైన సాహిత్యసృష్టికి దోహద పడుతుంది. సామాన్య కథలు ఇందుకు తార్కాణం. ఒక తెలుగు రచయిత్రి కథల్లోకి బెంగాలీ వాతావరణం, బెంగాలీ జానపదుల పాటలు, బెంగాలీ సంగీతపు ఛాయలు, బెంగాల్‌లోని ప్రజల సమస్యలు, జీవన సంఘర్షణలు ఎలా వచ్చాయన్నది ప్రశ్న. ఎందుకంటే ఈ పది కథల్లో 'పీ...యు..., దొంగల సంత, అనితపాడిన పాట, ఆలం కాందొకార్‌' మొదలైన కథల ఇతివృత్తాలు బెంగాల్‌తో ముడిపడివున్నాయి. రచయిత్రి బెంగాల్‌లో జీవించకుండా, అక్కడి మనుషులతో, జీవితంతో గాఢమైన అభినివేశం లేకుండా ఈ కథలు రావు. అయితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి వెళ్ళినంత మాత్రానే కథలు రాయలేరు. తెలుగు నేల జ్ఞాపకాలకే పరిమితం కాలేదు. తను నివసిస్తున్న నేల మీది మనుషుల పట్ల, వారి జీవితాల పట్ల కుతూహలం వల్ల ఆమె తెలిసీ తెలియకనే అక్కడివారితో మమేకమయ్యారు. భాష నేర్చుకున్నారు. సంప్రదాయల్లోని వైచిత్రిని గమనించారు. బెంగాలీ పాటల్లో, సంగీతంలో పరవశించే మనుషుల ప్రాకృతిక స్వభావాన్ని ఆకళింపు చేసుకున్నారు. కనుకనే 'పీ...యు...' వంటి కథ సామాన్య నుంచి వచ్చింది. దొంగలసంత, ఆలం కాందొకార్‌ లాంటి కథలు రాయాలంటే ఎంతో పరిశీలన ఉండాలి. ఆర్థిక, రాజకీయ పరిణామాల ప్రభావాన్ని అధ్యయనం చేయగానే సరిపోదు. వాటి ప్రభావాలని కళాత్మకమైన పద్ధతిలో వ్యక్తీకరించడం ద్వారానే సృజనకారుని సాఫల్యం తెలుస్తుంది. గ్లోబలైజేషన్‌, మార్కెట్‌ ఎకానమీ పరిణామాల నేపథ్యంలో రోజు గడిస్తే చాలనుకునే వారి బతుకులు ఏవిధంగా ఛిద్రమవుతున్నాయో 'దొంగల సంత' కథ చెప్పింది. 'ఆలం కాందొకార్‌' కథ నేరాల్ని అరికట్టే వ్యవస్థనే నేరాలకు పురిగొల్పే సన్నివేశాలు ఎలా వుంటాయో తెలియజేస్తుంది. ఫలితంగా బతుకును కబళించే విషాద బీభత్సం ఎంత భయానకమైనదో ఆర్ద్రంగా చెప్పారు. ఒకసారి పోలీసుల వలలో చిక్కినవారి ఘర్షణాత్మకమైన జీవితం ఎన్నెన్ని పరిణామాలకు లోనవుతుందో ఈ కథలో చూడొచ్చు. పాత్రల భావోద్వేగాల చిత్రణ, సన్నివేశాల సృష్టిలో, వాటి మధ్య సమన్వయంలో నేర్పును చూపితేనే ఇలాంటి కథలు చదివించే గుణాన్ని సంతరించుకుంటాయి. పాఠకులు తాదాత్మ్యం చెందుతారు. ఇక్కడే రచయిత కథన కౌశలం ఉపయోగకారి. కార్యాకారణాల విశ్లేషణ వాచ్యంగా చెబితే కథ పేలవమవుతుంది. పాత్రల నడుమ అనవసర సంభాషణలు, రచయిత విశ్లేషణలు ప్రవేశిస్తే ఒక కళారూపంగా కథ మరణిస్తుంది. ఈవిషయంలో నేర్పుగలిగిన రచయితలు జాగ్రత్తగా కథని నడిపిస్తారు. ఇక్కడ సామాన్య కూడా జాగ్రత్తపడ్డారు. ఒక ముడిసరుకు లాంటి ఇతివృత్తాన్ని కళాత్మకమైన శైలిలో చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకోసం సామెతలు, జాతీయాలు, నానుడులు, ఉపమానాలు ఉపయోగించుకున్నారు. వాతావరణ చిత్రణలో దృశ్యాన్ని, మానవ మనస్తత్వాన్ని రూపు గట్టించారు. 'దొంగల సంత' కథలోని ఒక పేరా చూడండి: ''రాత్రి గబ్బీగీమంటోంది. స్మశానం పిరికి మేకపోతులా గంభీరంగా ఉంది. దిగులు పడ్డ ఒంటరి చంటి బిడ్డలా జాలిగా ఉంది. మొత్తం ఐదు కపాలాలు తీసి సంచుల్లో వేసుకొన్నాడు. అతనికి భయం అనే మాట జ్ఞాపకం వచ్చింది. విరక్తిగా అనిపించింది. దేనికి భయపడాలి? ఎన్నిరోజులు బతికినా ఇదే బతుకు. 'విదియ రోజు వెతికినా కనపడని చంద్రుడు, తదియ నాడు తానై కనపడతాడట' తమ బోటి మనుషులకు ఆ ఆశేది? ఈ రోజు కాకపోతే రేపు తమ బతుకుల్లో వెలుగు వచ్చి తీరుతుందన్న నమ్మకమేది...?'' (సామన్య కథలు - దొంగల సంత, పేజీ: 63) ఈరకమైన స్వగతం, వాతావరణ చిత్రణ ద్వారా పాఠకుల్ని కథ వెంట నడిపించే కౌశలం కనిపిస్తుందీ కథా సంవిధానంలో. కథలో సౌందర్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే లక్షణం రచయిత్రిలో వుందని ఈ కథలు తెలియజేస్తాయి. ఈ సలక్షణ రీతి 'పుష్పవర్ణమాసం' కథలో మరింత స్పష్టంగా ప్రతిఫలించింది. స్త్రీ పురుష సంబంధాల్లో వచ్చే మార్పుల్ని కొన్ని కథల్లో బలంగా చెప్పారు. ప్రేమానురాగాల గతిశీలత ఏవిధంగా వుంటుందో 'సీతకష్టాలు' కథలో చూస్తాం. మహిత, కల్పన, కొత్తగూడెం పొరగాడికో లవ్‌లెటర్‌ కథల్లో అనేక విషయాల్ని కళాత్మకంగా చర్చకు తీసుకువచ్చారు. ఇతివృత్తం ఏదైనా కథని కొత్తగా రాయాలన్న తపన సామాన్య ప్రత్యేక లక్షణం. ఇది ఒక కథని అందమైన కావ్యంగా చిత్రిక పట్టడానికి దోవ చూపింది. ఈ కారణంగా చదివించే గుణాన్ని సంతరించుకున్నాయి ఈ కథలు. ఒక వస్తువుకు సంబంధించిన అనేక అంతరువుల్ని స్పర్శిస్తూ బహుళ కోణాల ఆవిష్కరణకు రచయిత్రి ప్రయత్నించడం వల్ల ఈ కథల పఠనానుభవం పాఠకుని అనుభవ వైశాల్యాన్ని ఇనుమడింపజేస్తుంది. - అశోక్‌

No comments: