ఒక రోజు ఒక ప్రముఖ వ్యక్తి చాలా ఆసక్తిగా ''సామాన్యా ,నా గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటుందీ ''అని అడిగారు. ఆవాళ బుద్ధి పూర్వకం గా నేను సమాధానాన్ని దాటవేసాను .
నేను కథలు రాయటం మొదలు పెట్టాక నాకు సాహితీపరులు కొంతమంది పరిచయమయ్యారు . వారిలో కొంత మంది ఒక రచయిత గురించి అదే పనిగా చాడీలు చెప్పేవారు . అట్లా వింటే ఏమవ్వాలి ?ఏమో నాకయితే ఆ సదరు వ్యక్తి పట్ల హృదయం సరళమై ,జాలి కలిగి స్నేహం పెంచుకున్నాను .ఇదేమ్ స్వభావం ?
నా లాగే నా బిడ్డ బిడియస్తురాలు . మనుషులు నచ్చితే ఎంత వాచాలత్వం రాగలదో ,హృదయానికి దగ్గరగా రాని వారిపట్ల దాని గొంతు రాయవుతుంది . దాని క్లాస్ మేట్స్ తల్లులు కూడా ఈ అమ్మాయికి గర్వం అనుకునే వారట .ఏడేళ్ళ చిన్న బిడ్డకు గర్వమనే పదార్తాన్ని ఆపాదించిన లోకం లేక్కేమిటికసలూ ?
ఈ సమస్త ఆలొచనలు నాకు ''మరణాంతరము''చదివిన తరువాత కలిగాయి . చెప్పకేం ... నేను బోలెడు చదివాను .చిన్నప్పటి నుండీ ఇప్పటి వరకూ ,,,కానీ ఈ నవల ఇచ్చా పూర్వకం గా మానవుని బహుముఖాలని స్పృశించి నంతగా మరే నవలా స్పృశించడం నా చిన్ని ప్రపంచం లో నేను చదివి ఉండలేదు .
రచయిత శివరామకారంత్ .
ఈ రచయితకు బొంబాయికేలుతున్న రైలు ప్రయాణం లో ఒక వ్యక్తి పరిచయమవుతాడు ఆరేడేళ్ళ పరిచయం లో కొన్ని మార్లు కలుసుకోవడము ... కొన్ని ఉత్తరాలు .... !
కొందరు మనషులు అతి చిన్ని పరిచయంలోనే చాలా ప్రేమించెంత గా మనకెందుకు నచ్చుతారు?బహుశా వారిలోని నిష్కల్మషత్వాన్ని మన హృదయం కనిపెట్టడం కావచ్చును ,లేదా మన హృ దయమూ వారి హృదయమూ ఒకే పదార్ధం తో తయారయిందనే స్పృహ మనకు కలగడమూ కావచ్చును !
యశ్వంత రావ్ కి అతి చిన్ని పరిచయంలోనే శివరామకారంత్ మీద అలాటి అభిప్రాయం కలుగుతుంది .
అంత్య కాలంలో యశ్వంత రావు గారు చూడాలనుకున్న ఒకే వ్యక్తి కారంత్ గారు .వీరు వెళ్ళే సరికే ఆయన చనిపోతారు . శవ దహనం ఈయనే చేయవలసి వస్తుంది . దానితో పాటు వీరి పేరిట యశ్వంత్ రావు గారు పదిహేను వేల రూపాయల డ్రాఫ్ పంపి తను నెల నెలా పంపవలసిన వారికి పంపాలని ,మిగిలిన డబ్బుని ''నేనే మీరనుకుని ''ఖర్చు చేయమని చెబుతారు .
అసలు ఈ యశ్వంత్ రావు గారు ఎవరూ ... రచయిత అన్వేషణ మొదలు పెడతారు . అతను వదిలి వెళ్ళిన డైరీ లో ,పెయింటింగ్ లలో ,రహస్యాన్ని దాచుకున్న మారు పేర్లు లో ... ఆయన డబ్బు పంపమన్న వారి చిరునామాలు పట్టుకుని వారి ఇళ్ళకు వెళ్తాడు . ఆయన విడిచి పెట్టి పారిపోవడానికి కారణమైన భార్యా,కొడుకూ ,అతను ప్రేమించిన స్త్రీ ,ఆవిడకి పుట్టిన పిల్లలు అక్కడ రక రకాల అనుభవాలు ,రక రకాల పరిచయాలు .
రచయిత మిత్రుడి కోసం బాధ్యతగా సాగించిన అన్వేషణలో ఒకే మనిషి గురించి ఒక్కోరు ఒక్కో అభిప్రాయాన్ని చెబుతారు .
అవునూ... అదెలా సాధ్యం ?ఒక వ్యక్తి మంచి వాడయితే మంచి వాడవ్వాలి లేకుంటే చెడ్డ వాడన్నా అవ్వాలి కదా !ఒకే మనిషి ఒకరికి మంచి ఒకరికి చెడ్డా ఎట్లాగా ?
కానీ నిజమంతే మనిషి బహుముఖీనుడు . అది ఒకటి . రెండోది ఏమిటంటే మీ వలన సహాయం పొందిన వారికి మీరు మంచి వారు .అవును ,మీరు చెడ్డ వారయినప్పటికీ , మీరు మంచి వారు కాగలరు. అలాగే ఏ కారణానో మీరు నచ్చని వారికి మీరు మంచి వారయ్యీ చెడ్డ వారు కాగలరు . అట్లాగే ఒక మనిషి స్వభావపు అంచనాలలో మన స్వభావ స్తోమత కూడా కలిసి వుంటుంది . మన వ్యక్తిత్వ ఔన్నత్యమొ ,అల్పత్వమో ఎదుటి వారిపై అభిప్రాయాలను ఏర్పరచుకునేలా చేస్తుంది . ఒకరు ఒకానొక కాలం లో మనకు బాగా నచ్చి, తరువాత వెగటు కలగడానికి కారణం మన మనస్తత్వం లోని చాపల్యత కావచ్చును . ఈ విషయాలన్నింటినీ ఒక్కో పాత్రని ఆలంబనం చేసుకుని చెపుతారు కారంత్ .
ఇంతకీ ఈ నవల ఏం చెబుతుందీ ?యేమని ముగింపుని ఇచ్చింది ?ఏమీ లేదు ! ఒక జీవితాన్ని చిత్రించింది ,అంతే !అంతే అయితే మరి పాటకునికి లాభమేమిటి ?దీనికి సమాధానం ఇది -ప్రతి సృజనా వాచ్యంగా పాటకుడినో ,మానవుడినో ఇది చేయమని శాసించదు. అన్ని సార్లు ముగింపుని కృతకంగా చెప్పి దిశానిర్దేశం చేయడం వీలు కూడా కాదు . కానీ మంచి రచన చదివిన తరువాత మనం మానసికంగా సంపన్నులమవుతాం . ఇలా చేయడం తప్పు,లేదా ఇది సరైనదే అనే అవగాహన ఏర్పరచుకుంటాం.వాచ్య సూచనలు లేకుండానే మంచి వైపుకి మొగ్గుతాం . ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప రచన మనుషులను నాగరీకులని చేస్తుంది .
చిక్కటి భాష ,లోతైన తాత్వికత కలిసిన ఈ నవల మనల్ని అంతర్ముఖీనులను చేస్తుంది . మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే మానసిక ఎదుగుదలని ఇస్తుంది .
పేజీల కొద్దీ వాక్యాలు నా హృదయానికి హత్తుకుని పోయాయి .ఈ రచయిత నా హృదయానికి దగ్గరి వాడుగా తోచాడు . ఆలొచనల సామీప్యత వలన ఆత్మీయుడయ్యాడు . నేర్చుకోవలసినది చెప్పి గురువయ్యాడు .
'' మన పూర్వ ఋషులు కొందరు జగత్తు,సృష్టి విషయంలో -ఇది ఇలా ,ఇదే సత్యం ;ఇదే చివరి మాట -అనే రీతిగా చెప్పారు కదా మీరు వేదాలనండీ ,వుపనిషత్తులనండీ ,మరేమన్నా అనండి ,తపస్సుతో తెలుసుకున్నదనండి ,భగవంతుడే ఒక చెవిలో ఊదినాడనండి ,నాకొక సంశయం . ఈ విశ్వం ,సృష్టి వీని విషయంలో కొద్దిగా నేనూ చదివి తెలుసుకున్నాను . జీవ కోటి ఈ యాత్ర ఎప్పుడో ప్రారంభమయింది .యెక్కడికొ సాగుతున్నది ;ప్రయాణం ప్రారంభమయిన ఎంతో కాలం తరువాత ,దారిలోని రైల్వే స్టేషనులో బండి ఎక్కే ప్రయాణికుని లాగా ,మనుష్యుడనే ప్రాణి లోపల ప్రవేశించాడు ;ప్రవేశించిన వాడు ప్రవేశించినట్టు దిగిపోనూ పొయాడు . జీవిత ప్రయాణమేమో ఇంకా ముందుకు సాగింది .దాని లక్ష్యం ఇంతవరకూ తెలియ లేదు 'ముందు దారి లెక్క పెట్టలేనంత దూరం ,అలాటి సమయం లో ఎవరైనా సరే ''నేను దీని రహస్యం తెలుసుకున్నాను .'' ''ఇదే సత్యం ''అని ఘంటాపథం గా చాటితే నగుబాటు కాదా?''
పీఎస్ :ఈ నవలను నాకు పంపినందుకు ,మంజుల గారు మీకు నేను చాలా రుణపడ్డాను . మీ సహృదయతకు ప్రేమ పూర్వక కృతజ్ఞతలు .
3 comments:
chaalaa bagundi, samanya garoo...kaaranth ante entha ishtamo...! kaani, meeru ikkada connect chesina paddhati baagundi.
Sir
Thank you
Kaanee ee samanya garoo yemiti ?
garoo annanaa? adi alaa vacchesindi...sorry! take it easy...
Post a Comment