About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Thursday 14 November 2013

రేజర్ల స్వాతి

ఈ రోజు రేజర్ల ఉన్నత పాటశాల కి వెళ్లాం . మద్యపాన రుగ్మత మీద మాట్లాడాలని అనుకున్నాను . ప్రధానోపాద్యాయిని సరోజిని గారి   అనుమతి పొందాం .  175 మంది పిల్లలు . మొదట మేమెందుకొచ్చామో చెప్పాం .తరువాత పిల్లల్ని మాట్లాడమన్నాం . తండ్రుల తాగుడు వ్యసనం పిల్లల మీద ఎంత ప్రభావం చూపుతుందో  ,  వాళ్ళ మనసుల్ని ఎంత వేదనకు గురి చేస్తుందో,వారిలో ఎంత దుక్కం దాగి వుంటుందో ,కదిలిస్తే అది ఎలా కన్నీరై బయటపడుతుందో ప్రత్యక్షంగా చూసాం . స్వాతి ,తొమ్మిదో తరగతి, వెంకట్ కిరణ్ తొమ్మిదో తరగతి , తోట గోపి ఆరో తరగతి లకు మా షీల్డ్ లు ,సర్టిఫికేట్ ఇచ్చామ్. షీల్డ్ ఇవ్వడం కేవలం ఆ సంఘటన జ్ఞాపకార్థం మాత్రమె కాదు, స్వాతి పెద్ద పెరిగి ఈ విషయాన్ని గుర్తుంచుకుని పది మందికి మార్గ దర్శకురాలు కావాలని,గోపి తన వేదనని మరిచి పోకుండా ,భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఎదగాలని ,క్లాస్ ఫస్ట్ వచ్చే తెలివైన వెంకట్ కిరణ్ ఈ విషయంలో అందరికీ మార్గ దర్శకత్వం వహించాలనీ చెప్పి ఇచ్చాం . 

స్వాతి తండ్రి తాగుబోతు ఆ పిల్ల ఏడ్చి నన్ను యేడిపించింది ,నేను ఏడ్చి ,సరోజిని  గారిని యేడిపించాను. తోట గోపీ ది దయనీయమైన కథ .పెద్ద పెద్ద కళ్ళ ఆ అబ్బాయి పదే ,పదే జ్ఞాపకమొస్తూ మద్యాన్నపు  నా భోజనాన్ని అరుచింప చేసాడు . గోపీ వాళ్ళ  నాన్న తాగి వచ్చి ,ఆ విషయం మీద గొడవ పెట్టుకున్న వాళ్ళ అమ్మని కిరోసిన్ పోసి  తగల పెట్టేసాడు .  ఆవిడ చనిపోయింది ,గోపి తండ్రికి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది . గోపీ తండ్రి సావాసగాళ్ళు ఇప్పుడు కూడా జైలుకి తీసుకెళ్ళి మందు ఇస్తారని గోపీ ఫిర్యాదు .  తండ్రీ ,తల్లి లేక ప్రస్తుతం ఆ అబ్బాయి పర పంచన బ్రతుకుతున్నాడు.  ఆ అబ్బాయికి నేనేం చేయగలను అని ,ఏదైనా చెయ్యాలని తపన మనసు నిండుగా కల్లోలమై  పరచుకుంది . [కింది ఫోటోలో తలలు వంచుకున్న పిల్లలంతా ఏడుస్తున్నారు] 

 మొన్న కల్లూరికి వెళ్లాం , ఎస్సే రైటింగ్ కి రమ్మని చెప్పడానికి . ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ చాలా దీనంగా మా కాలేజ్ లో జెమ్స్ వున్నారండీ ,కానీ వాళ్ళలో చాలా మందికి  కాళ్ళకి చెప్పులు వుండవు ,మద్యాన్నపు భోజనమూ వుండదు .  మీరు చార్జీలు ఇస్తే పంపుతామండీ  అని చెప్పి ,ఏమండీ మాకు కొంచెం రవ్వ ఇస్తే పిల్లలకి మద్యాన్నమ్ ఏమైనా వండి పెడతామండీ ,అని బ్రతిమిలాడుకున్నారు . ఆయనకి  ఆ అవసరమేముంది నిజానికి  ,. నిన్న పిల్లల్ని తీసుకొచ్చిన ఆ కాలేజ్ లెక్చరర్ మళ్ళీ బ్రతిమిలాడటం మొదలెట్టారు 


ఊహించని ఈ అనుభవాలు దుక్కపరుస్తున్నాయి 


. ఈ దుక్కం నాది  కాక పోవచ్చు కానీ కచ్చితంగా నాది  కూడా . 

No comments: