జర్నీ
చాలా కాలానికి సొంతూరికి వెళ్ళడం ఎలా ఉంటుందో తెలుసా ? యెట్లా ఉంటుందంటే ఎండాకాలం సెలవులకి అమ్మమ్మ
వాళ్ళఊరికి వెళ్లినట్లుంటుంది.
నేనట్లా చాలా కాలానికి మా ఊరికి వెళ్తున్నాను.శరీరము
మనసూ విమానం కిటికీ లో నుండి కనిపిస్తున్న మబ్బుల అడవిలా హాయిగా సుఖంగా తేలిపోతుంది.ఎంత బాగుంటుందో మా ఊరు .
విమానం నెమ్మదిగా నేలపై వాలడానికి
యత్నిస్తోంది."అర్ధరాత్రి మద్రాసు మహానగరం" నడిచి వెళుతున్న నగల
దుఖాణంలా కాసేపు,నలుపు తెలుపు సినిమాలో ,కుక్కతో కలిసి దేవదాసు కూర్చున్న దీపస్తంభంలా కాసేపు కనిపిస్తుంది.మనసుకి
ఏమిటో ఒకటే సంతోషం .
లగేజీని ట్రాలీ ఎక్కించి బయటకు వచ్చే సరికి మా ఊరంతా నాకోసం
వచ్చేసిందా అన్నట్లు మా అమ్మ,పెద్దమ్మలు,అత్తలు ఆహ్వానం పలికేరు.అంతమంది ఆడవాళ్ళ మధ్య సస్యక్షేత్రంలో తాటి చెట్టులా
నల్లగా,నాణ్యంగా కనిపించాడు హరి.అందరితో పాటు వాడూ నన్ను చూడగానే బుగ్గల్ని మా అమ్మమ్మ
చేసే పులిబొంగరాల్లా పొంగించి నవ్వాడు.హరి నా చిన్ననాటి సావాసగాడు.ఇప్పుడీ కారుకి డ్రైవరు .
అందరం సర్దుకుని కూర్చున్నాం.నాకోసం తెచ్చిన పప్పు
పొంగలి నేతిలో తేలుతూ ఏరోడైనమిక్ బస్సులా పొట్టలోకి జారిపోతోంది.మద్రాసు నుండి మా పట్టణానికి ,అక్కడినుండీ మా ఊరికి అంతా కలిపి నాలుగు గంటల ప్రయాణం.అందరం అవీ ఇవీ కబుర్లలో పడ్డాం.
చుట్టుపక్కల షాపులన్నీ షట్టర్లు మూసేసుకున్నాయి.
ఇళ్ళన్నీ నిద్రపోతున్నాయి.మరే పడవాలేని నదిలాంటి రోడ్డు పై మా కారు జోరుజోరుగా ఈత
కొడుతోంది. ఏర్పోర్టు నుండి ఎనభై కిలోమీటర్లు దాటగానే అందరూ నిద్దర్లలోకి కి జారారు . నేను, మా పెద్ద పెద్దమ్మ, హరీ మిగిలాం.
బ్రతుకు ప్రయాణంలో బాల్యం ఎప్పుడు చేజారిపోతుందో, ఎప్పుడు పెద్ద వాళ్ళం అయిపోతామో గమనించుకోనే గమనించుకోం .నాకోసమని తెచ్చిన పది
మూరల మల్లె పూమాల నుండి అర మూర తెంపి, లీవ్ చేసి వున్న వెంట్రుకలలో
పిన్నుతో గుచ్చి, మిగిలిన పూలని డాష్
బోర్డు పైన వున్న రేడియం వినాయకుడి చుట్టూ వలయం లా చుడుతూ "ఒరేయ్ హరీ !
అప్పుడు నువ్వు గోపాల శెట్టి వాళ్ళ మల్లె చెట్టుకి పూసిన, గుండు మల్లె మొగ్గని బా....గా వాసన చూసావ్ గుర్తుందా రేయ్? " అన్నాను. హరి నా మాట వినగానే పులి బొంగరం నవ్వు నవ్వి, "గుర్తుంది చిత్తూ"అన్నాడు.
నా పేరు చిత్కళ మాలిని. అంత కష్టమైన పేరు నోరు తిరగక, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విరిచి పిలుస్తారు. స్నేహితులకి నేను చిత్తూని, నిజానికి హరి నన్నట్లా పిలిచేవాడని జ్ఞాపకం కూడా లేదు .
చిన్నప్పుడు పక్కింటి గోపాల శెట్టి వాళ్ళింట్లో ఆడి, వాళ్ళింటికి మా ఇంటికి వున్న కరగాడ దాటి వస్తున్నాం. కరగాడ అంచున వున్న మల్లె
చెట్టు మొగ్గలతో విరగబడి వుంది. వస్తూ వస్తూ హరి ఒక మొగ్గ తుంచి ముక్కు దగ్గర
పెట్టుకొని గాఢమ్గా వాసన చూసాడు.అంతే ఇంకేం వుంది మొగ్గ
ముక్కులోతుల్లోకి దూసుకెళ్లింది .తుమ్మినా, ఏం చేసినా బయటకి రాలేదు. ఇంక డాక్టర్ దగ్గరకి వెళ్ళాల్సిందే అని
తీర్మానించుకున్నాం. ఆపరేషన్ చేసి ,ముక్కు నిలువుగా కోసి మల్లెమొగ్గ తీస్తారని నిర్ణయించేసాం. మా చర్చలు విని హరి ఏడుపు మొదలు
పెట్టాడు. పెద్దవాళ్ళకి చెప్పడానికి భయం. అంతలోకి అటువైపుకి వచ్చిన మా మామ పిన్ను
పెట్టి అతి కష్టం మీద మల్లెమొగ్గ బయటకు లాగి గండం
గట్టెక్కించాడు .
మల్లెపూలతో ముడిపడిన జ్ఞాపకం అది. ఇంత దాకా పొట్లం లో
వున్న మల్లెలు వొళ్ళు విరుచుకొని కారంతా వత్తైన పరిమళాన్ని
వెదజల్లడం మొదలు పెట్టాయి.ఆ పరిమళాన్ని గుండెల నిండా పీల్చుకొని "పిల్లలు బాగున్నారా హరీ" అన్నాను. నా
ప్రశ్న వినగానే హరి ముఖం ముడుచుకు పోయింది .ఒక చేత్తో మల్లెల్లోంచి బయటకు వచ్చిన
పచ్చటి పురుగుని పట్టి కిటికీలోంచి బయటకు విసిరేసి, ఏదో చెప్పబోయేంతలో ,పెదమ్మ "ఆడపిల్ల చచ్చిపోయింది నాయనా, ట్రాక్టర్
కొట్టేసింది " అన్నది.ఊహించని ఆ మాటకి నా గుండె బెంబేలు పడ్డది. "యెట్లా
జరిగింది?" అన్నాను నెమ్మదిగా.
హరి "మీ ఇంటి ఎదురుగా వున్న ప్లాట్లలో ఏదో పూజ జరుగుతోంటే చూసి, ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతూ వుందట పాప. ట్రాక్టర్
కొట్టేసింది."అన్నాడు .పెదమ్మ అందుకుని "ఎందుకులే చెప్పుకోవడం
నాయనా!అక్కడికక్కడికి ప్ర్రాణం పోవడమే కాదు, బిడ్డ
నుజ్జునుజ్జయిపోయింది" అన్నది.
ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఏమని
ఓదార్చాలి.ఊరుకున్నాను.అయినా మా ఇంటి ఎదురుగా ప్లాట్లు ఏమిటి ? అక్కడ ఒక చెరువూ, మట్టి దిబ్బలూ కదా వుండాలి.ఆ మట్టి దిబ్బల్లో లోతైన
బొరియలు చేసి పాల పిట్టలు కాపురాలు చేసేవి.పిట్టలు కోసమని ఆ బొరియలలో చేతులు
పెడితే ,అప్పుడప్పుడు మెత్తగా మట్టి పాములు చేతికి
తగిలేవి.కుడి చేతికి అటు వైపు వున్న మామిడి తోటని దాటితే, రాయ దొరువు వుండేది.హరి నాకోసమని ఆ దొరువులోని కలువలని, దొరువు పైన ఝుంకారం చేసే తుమ్మెదలని తీసుకొచ్చి, తుమ్మెదలని ముఖం
పైన వదిలి ,కలువలని చేతికి ఇచ్చేవాడు.అక్కడ ప్లాట్లు వుంటే మరి
ఇవంతా ఏమైపోయినట్లు?
మా ముగ్గురి మధ్యా అలుముకున్న విషాద నిశ్శబ్దాన్ని
విరగ కొట్టడమంటే కొంచం భయమేసింది. అయినా, గొంతు పెగల్చుకొని
"ప్లాట్లు ఎక్కడ రా హరీ ?" అన్నాను.హరి
"నువ్వు ఊరికి వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది కదా చిత్తూ,మీ ఇంటి ముందున్న చిన్న చెరువు, మట్టి దిబ్బలు, రియల్ ఎస్టేట్ కిందకు వెళ్ళాయి. ప్లాట్లు చేసి అమ్మేసారు" అన్నాడు.నాకు
ఆశ్చర్యం వేసింది.మా ఊరికి ముప్పై కిలోమీటర్ల దూరాన
వున్న సముద్రపు రేవుకి బోలెడు వ్యాపారాలు తరలివచ్చాయని తెలుసు. కానీ, దానికీ దీనికీ ఏంటి సంబంధం?అదే అడిగాను హరీని ,వాడు "పోర్టుకోచ్చిన కంపెనీలను చూసి మన రియల్ ఎస్టేటర్లు ఎక్కడ
భూమి ఖాళీగా కనిపిస్తే అక్కడ కొనడం మొదలుపెట్టారు.చవుడా,సున్నమా,మాగాణా,మెట్టా ఏమీ లేదు
చిత్తూ, కొనెయ్యడం,అమ్మేయడం. రియల్ ఎస్టేట్
భూం! టౌన్ నుండి మన ఊరికి వచ్చే రోడ్డు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ లారీలతో, శవాలతో కిత కితలాడుతూ వుంటుంది. మన పాల శేఖర్ టౌన్ కి పాలు తీసుకు వెళుతూ లారీ
కింద పడి చనిపోయాడు .నా బిడ్డ చనిపోయాక నా భార్య ఈ యాక్సి
డెంట్లకి భయపడి నన్ను ఆటో వెయ్యడం మానిపించేసింది. ఉన్న ఆటో అమ్మేసుకొని,ఇదిగో ఇట్లా డ్రైవర్ గా కుదురుకున్నాను . ఆదాయం
తక్కువే .పని కూడా తక్కువే" అన్నాడు.
వాడు చెప్పిందంతా విని మా పెదమ్మ
"వీళ్ళకున్న రెండెకరాలను కూడా ముప్పై అయిదు లక్షల చొప్పున కొన్నారులే. మూడు
లక్షలు కూడా చెయ్యని చౌడు భూమి అది.వచ్చిన డబ్బుని ముగ్గురు కొడుకులూ మూడు పాతికలు
చొప్పున పంచుకున్నారు. మంచి ఇళ్ళు కట్టుకున్నారు.పని
చెయ్యకున్నా గడిచిపోతుంది. లేకపోతే పాడు పొట్ట కోసం నానా గడ్డీ
కరవాల్సిందే కదా! కూతురు పోయినంత మాత్రాన ఇంట్లో కూర్చోగలమా "అన్నది.
హరి అవునన్నట్లు తల ఊపి "అదే చిత్తూ రాయదొరువు
పక్కన ఉండేవి కదా మా కయ్యలు...అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ, మా అన్నానికి సరిపడేట్టు కూడా పండేవి కాదు.అంత
డబ్బు కళ్ళతో చూడడం అదే మొదటిసారి...చివరసారికూడాననుకో!
మేమనేమిలే 'పోర్టు' చుట్టు పక్కల ఊర్లు
ఊర్లు సంపన్నమైపోయాయి. చాలా మంది డబ్బు గోతాలకి ఎత్తుకున్నారు.మన టౌన్ ముందు
ఇప్పుడు బొంబాయి కూడా దిగదుడుపే. ఎన్నెన్ని అపార్ట్మెంట్లు,కొత్త కొత్త వ్యాపారాలు,ఎన్నెన్ని బంగారు
అంగళ్లు..."అన్నాడు .
నాకు హరి వాళ్ళ చేను గుర్తుకొచ్చింది. చేను గట్టుపైన
రెండు కొబ్బరి చెట్లుoడేవి. ఆకాశమంత పొడవుండి చాలా పెద్ద సైజు కాయలు కాసేవి.కాయల్లో నీళ్ళు కూడా చాలా
ఉండేవి .అవి "గంగాభవానీ" రకం కొబ్బరి చెట్లు అని
చెప్పాడు హరి ఒకసారి.నాకా పేరెందుకో బాగా గుర్తుండి పోయింది, అందుకే అన్నాను
"గంగాభవానీ చెట్లు కూడా కొట్టేసారా హరీ" అని. హరి నవ్వి "నీకు భలే
గుర్తుంది చిత్తూ, అందుకే నువ్వు అంత పెద్ద సైంటిస్ట్ వి అయ్యావ్. రియల్ ఎస్టేట్ వాళ్ళు వాటిని సైట్ కి సెంటర్
చేసి వాటి చుట్టూ షోగ్గా
గుండ్రటి ఆఫీసు ఒకటి కట్టుకున్నారు ''అన్నాడు.
కొత్త మేకప్ వేసుకున్న మా ఊరిని కళ్ళ ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ "జరిగిందంతా మంచికా చెడుకా హరీ?" అన్నాను.నా హృదయం లోని ద్వైదీయ ఘర్షణ అసంకల్పితంగా అట్లా అనేలా
చేసిందనుకుంటా.ఆ ప్రశ్నకు హరి అరసెకను కూడా ఆలస్యం చేయకుండా నవ్వి "అదేం
మాట చిత్తూ, ముందే చెప్పా కదా అంత డబ్బుని మా కళ్ళతో చూసి,చేతులతో తాకగలమని కలలో కూడా అనుకోలేదు.పోర్టు
చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి చేసేందుకు చిన్నవో చితకవో ఉద్యోగాలున్నాయి .మంచి ఇళ్ళు కట్టుకున్నాం. అందరం సుఖంగా వున్నాం"
అన్నాడు.
నాకు హరి వాళ్ళ ఇల్లు
గుర్తుకు వచ్చింది.చిన్న పూరి గుడిసె. వానొస్తే ,వచ్చిన వానంతా
వాళ్ళ ఇంట్లోనే వుండేది. తుఫానైతే ఇల్లు వదిలి
విష్ణాలయం సత్రాలకి పరుగులేత్తేవారు.ఇప్పుడు మంచి ఇళ్ళు కట్టుకున్నారు,చేతిలో డబ్బులున్నాయి. సంఘంలో హోదా కూడా పెరుగుతుంది కదా.
టీ తాగడానికి హరి చెంగాళమ్మ తల్లి గుడి దరిదాపుల్లో కార్ ని ఆపాడు.నిద్దర్లో
వున్న వాళ్ళు కూడా కాళ్ళు జాడించుకోడానికని కిందకి దిగారు.అటు
ఇటు నాలుగు అడుగులు వేసి చెంగాళమ్మకి నమస్కరించుకోడానికి వెళ్లారు.చెంగాళమ్మ
గుడికి తలుపులు వుండవు. ఏ సమయం లో వెళ్ళినా నమస్కారం
పెట్టుకుని రావొచ్చు.ఎప్పుడో ఒకసారి తలుపులు పెట్టారట. అమ్మవారు, "నా గుడికి తలుపులు పెడతారా బాడకోవ్ లారా" అని ఎగిసి ఒక తన్ను తన్నిందట.అంతే, తలుపులు ఏదో ఊరిలో పడ్డాయట. అప్పటి నుండి మందిరానికి
తలుపులు మూసే సాంప్రదాయం లేనే లేదు అక్కడ. నిజానిజాల తరాజు ని వదిలేస్తే ,నాకు ఆ కథoటే చాలా ఇష్టం. సమాజం ఆడవాళ్ళకి అడ్డు పెట్టిన తలుపులన్నింటినీ అలా తన్నాలి
.ఎడమ కాలుతో ఎగిసి పెట్టి.
టీలు తాగి అందరం కారెక్కాం.ఎందుకు గుర్తొచ్చిందో ఏమో, సీట్లో సర్దుకుని "సీతమ్మ వాళ్ళు బాగున్నారా?"అన్నాను .మా ఊర్లో 'అందరికీ తెలిసిన వేశ్య' సీతమ్మ. ఆవిడ
కుదిమట్టంగా, తెల్లగా, పల్చగా
బాగుండేది.ఆమె అమృతం తాగిందనేవాళ్ళు మా అమ్మా వాళ్ళు.ఎందుకంటే
ఆవిడ మా అమ్మ చిన్నప్పుడు యెట్లా ఉండేదో, మా అమ్మ పెద్దయ్యాక కూడా అట్లానే ఉందట. సీతమ్మ మేం పుట్టక
ముందు కొంత కాలం మా విష్ణాలయం పూజారిని వుంచుకున్నదట.మాకు ఊహ తెలిసేసరికి మా పెద్ద
మామని ఉంచుకుంది. సీతమ్మ దగ్గర ఉండడానికి
ఊరంతా ఎగబడే వారట. మా చిన్నప్పుడు మామ ఎక్కడా కనిపించకపోతే సీతమ్మ వాళ్ళింట్లో వున్నాడేమో చూసి రమ్మని తరిమే వాళ్ళు
మమ్మల్ని. నేను ,మా తమ్ముడు చేతుల్ని బస్ స్టీరింగ్ లా పెట్టి
కాలెత్తి యాక్సిలరేటర్ తొక్కినట్టు తొక్కి డుర్రు మంటూ సీతమ్మ వాళ్ళింటికి పరిగెత్తేవాళ్ళం. పొద్దుట పూటైతే సీతమ్మ వాళ్ళ అమ్మ సీనమ్మ ,ఇంటి ముందర కూర్చుని దోశలు, గుడ్డు దోశలు, బెల్లం దోశలు పోసి అమ్ముతుండేది.సాయంత్రం పూటైతే పులి బొంగరాలు, సుకీలు అమ్మేది. సీతమ్మ వాళ్ళ ఇంటి లోపలికి
వెళ్లకూడదని మాకు గట్టి శిక్షణ వుండేది. అందుకని సీనమ్మ అంగటి ముందు మా బస్సుల్ని
ఆపి "మామోయ్ తాత నిన్ను పిలుచుకు రమ్మన్నాడు"అని కేక పెట్టి ,బస్సుల్ని రివర్సు చేసుకుని పరిగెత్తేవాళ్ళం.తర్వాత తర్వాత అంటే మా మామకి
పెల్లైన తర్వాత సీతమ్మ మా పంచలోనే అంట్లు
కడుగుతూనో అప్పచ్చులు వత్తుతూనో చాలా సార్లు కనిపించేది. ఎప్పుడూ భుజాల చుట్టూ
నిండుగా పైట కప్పుకుని వుండేది. చాలా మామూలుగా మా మామ పెళ్లి చేసుకున్న మా అత్త లాగే
వుండేది. అస్సలు సినిమాలలో వేశ్య లాగ వుండేదే కాదు.
''సీతమ్మవాళ్ళు బాగున్నారా ''అన్న నా ప్రశ్నకి హరి ''వాళ్ళు ఊరు వదిలి టౌన్ కి వెళ్లిపోయారని'' సమాధానం ఇచ్చాడు .సీతమ్మ వాళ్ళు తరతరాల
నుంచి ఈ ఊరిలోనే వున్నారు కదా. హటాత్ గా టౌన్ కి ఎందుకు
వెళ్ళినట్లు? '' రేటొచ్చిందీ ... అమ్ముకుని వెళ్ళిపోయారు అనడానికి వాళ్ళకి పొలం పుట్రా ఏమి లేదనుకుంటా కదరా?''. అన్నాను .అందుకు మా అమ్మ ''ఆ...పొలం పుట్రా ఏమీ లేదు .సంపాదించిన డబ్బుని నీబోటి నాబోటి వాళ్ళకి వడ్డీలకి తిప్పేవాళ్ళు.వాళ్ళు ఊరోదిలి పొయ్యింది
అవమానానికి.రంగారెడ్డి చేసే తార్పుడు పనులకి ఉపయోగ పడలేదని పోలీసులని పెట్టి
కొట్టించాడు".అన్నది.
నాకేమి అర్ధం కాలేదు. వాళ్ళు ఊరేరిగిన వేశ్యలు.
ఎవరేరుగని భాగోతమని ఇవాళ పోలీసులు కొట్టడం.అదే అడిగాను అమ్మని .హరి అందుకుని
" సీతమ్మకూతురు జ్యోతి గుర్తుంది కదా
చిత్తూ, ఆ పిల్ల ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారం
పుంజుకుంది. మన రంగా రెడ్డి జ్యోతిని ఆ రాజకీయ నాయకుడి
దగ్గరికి, ఈ ఆఫీసర్ దగ్గరికి తీసుకు వెళ్ళేవాడు. వాల్లోక
పదివేలు ఇచ్చారనుకో జ్యోతి చేతిలో ఒకటో రెండో పెట్టి, మిగిలింది తన జేబులో వేసుకునేవాడు. కొంచం ఆలస్యంగానైనా జ్యోతి ఆ విషయం గుర్తించి సీతమ్మ తో చెప్పిందట. సీతమ్మ"ఇదేం పని రెడ్డిగారూ ,ఇష్టం లేకున్నా నువ్వు పిలిచిన దగ్గరికంతా వస్తున్నాం .అది చాలక...నువ్విట్లా చెయ్యడం ఏం బాగాలేదు. ఇలాగైతే మా అమ్మిని పంపించడం కుదరదు" అన్నదట.అయినా రంగా రెడ్డి తన బుద్ధి పోనిచ్చుకోలేదు. వీళ్లేమో ఇక రామని మొరాయించారు.
రంగారెడ్డి కి కోపం వచ్చింది. పడుపు కూడు తినడానికి సిగ్గనిపించలేదు కానీ ,వాళ్ళు కాదనేసరికి అవమానమేసి పోయిందట ఆయనకి. వీళ్ళ పని పట్టాలని పోలీసు
వాళ్ళని మాట్లాడుకున్నాడు.ఆయన చెప్పినట్లుగా సీతమ్మ ఎదురింట్లో వుండే శీనడు వీళ్ళ మీద 'వ్యభిచారం' చేస్తున్నారని కేసు పెట్టాడు.పోలీసులు మొదట జ్యోతిని
జుట్టు పట్టుకుని ఇంటి నుండి బయటకు ఈడ్చుకొని వచ్చారు .జ్యోతి ఏడుపులకి, గగ్గోళ్ళకి మేమందరం పొలోమని వాళ్ళింటికి పరుగులు తీశాం .పెద్ద రెడ్డ్లెవరూ ఇళ్ళలోంచి బయటకు రాలా.గుండెలు బాదుకుంటూ జ్యోతికి అడ్డం
పడ్డ సీతమ్మని చెంపలు పగలేసి ,అందరినీ కొడుతూ ఫర్లాంగు దూరం నడిపించి జీపెక్కించారు .ఆరోజు జ్యోతి ముఖం
నాకింకా గుర్తు .తెల్లటి పిల్ల ఏడ్చి ఏడ్చి ఎర్రగా
కందిపోయింది .
స్టేషన్ నుండి వచ్చిన తర్వాత, ఎవరూ వారం రోజులు ఇంట్లోనుండి అడుగు బయటే
పెట్టనేలేదు.ఇంట్లో శవం వెళ్ళినట్లు తలుపులు మూసుకు కూర్చున్నారు .ఎవరు వెళ్లి
పిలిచినా పలకలా.ఎనిమిదో రోజు లారీ వచ్చింది. అంతే లారీలో సామానెక్కించుకొని టౌన్
కి వెళ్ళిపోయారు.... అప్పుడు యస్.ఐ పేరు రామసుబ్బారెడ్డి
అనుకుంటా"అంటూ ఆర్థోక్తి తో ఆగాడు హరి .అంతా వింటూ ఉందేమో మా రెండో అత్త వెనక
నుండి'' ఆ...ఆ ముదనష్టపోడేలే ...''అన్నది.
మా పెదమ్మ ''మన ఊరొక మురికి
గుంట. ఊరొదిలి పోతే పోయారుగానీ ,వాళ్ళ దరిద్రం మన
ఊళ్లోనే నిలబడి పోయింది .టౌన్ కి పోగానే
వాళ్ళ దశ తిరిగి పోయింది. మంచి flat కొనుక్కున్నారు .జ్యోతి దగ్గర ఎవరో మార్వాడీ వాడు ఉన్నాడట ప్రస్తుతం . ఇదంటే వాడికి ప్రాణమట.ఈ పిల్ల వొళ్ళంతా బంగారమే ఇప్పుడు"అన్నది.మా అమ్మ'' గృహ ప్రవేశానికి సీతమ్మ వచ్చి పిలిచి వెళ్ళింది .అప్పుడు వెళ్ళడం కుదరలేదు కానీ ,మొన్న నేను ,మీ నాన్న అదే దారిలో వెళ్తుంటే చూసి ఇంటికి
తీసుకెళ్ళి బొట్టు పెట్టి జాకెట్టు ముక్కఇచ్చి పంపారు .వాళ్ళ
ఇల్లు అద్దమే అనుకో .ఏమి శుచీ.. ఏమి శుభ్రం !చక్కగా సంసారుల్లాగా బతుకుతున్నారు "అన్నది.
అది విని హరి, మా అమ్మతో
"అమ్మా! సీతమ్మకి ఎప్పుడూ శుభ్రత పిచ్చే . ఇక్కడ వుండగా వాళ్ళ ఇంటికి నువ్వు ఎప్పుడూ వెళ్లి వుండవు కాబట్టి, నీకు తెలియదు.కింద
పడ్డ పాలని కూడా జవురుకోవచ్చు సీతమ్మవాళ్ల ఇంట్లో . షోరూములా వుంటుంది " అన్నాడు .
ఆకాశం ఎర్రటి సోయగాలీనుతోంది. సూర్యుడు బుడి బుడి
అడుగులేసుకుంటూ, తూర్పు దిక్కు మెట్లు ఎక్కుతున్నాడు.వంద కిలోమీటర్ల
వేగంతో కారు ,మా టౌన్ మినీ బైపాస్ రోడ్డుని ఎక్కింది.సూర్యుడిని
చూసి వెనుక సీటు నుండి ,తేనీటి ప్రియురాలు మా చిన్నత్త ''ఒరేయ్ అబ్బయ్య ,కారు ఎక్కడైనా ఆపురా ,ఒక చుక్క టీ తాగుదాం" అన్నది. మా పెదమ్మ ''ఎక్కడో ఆపడం
ఎందుకుగానీ ,నాలుగు నిమిషాలు కూడా పట్టదు . శ్రీధర్ వాళ్ళ ఇంటికి పొయ్యేసోద్దాం పదండి "అని ,నాతో ''శ్రీధర్ కి అమ్మోరు పోసింది నాయనా. మేమందరం
విచారింపుకి వేళ్ళేసి వచ్చాం .ఇప్పుడు బాగానే ఉందిలే .వాడి భార్య స్రవంతి
నిన్నెప్పుడూ కలవరిస్తూ వుంటుంది
.ఎట్లాగూ దారే కదా ,వాళ్ళ కొత్తిల్లు నువ్వు చూడను కూడా లేదు .వెళ్లోద్దాం"అన్నది.
శ్రీధర్ నాకు మామ వరస .శ్రీధర్ వాళ్ళ నాన్న దువ్వూరు
వెంకట రెడ్డి మునసబుగిరి చేశాడు.ఆయనంటే మా ఊర్లో ఆడవాళ్ళకి
వొణుకు .వాళ్ళ చేలు ఊరికి మొదట్లో ఉండేవి.రోడ్డు మీద పెద్ద పెద్ద వడ్ల కొట్టాలు
ఉండేవి. వెంకట తాత అక్కడ వున్నాడంటే ఊరి ఆడవాళ్ళు ఎంత
అక్కరవచ్చినా ఆ దారిలో వెళ్ళేవాళ్ళు కాదట. భలే ఆటోపం మనిషి .ఊరికోచ్చే
పెద్దమనుషులు ఎంతటి వాళ్లైనా సరే ఆయన ఇంట్లో చెయ్యి
కడగాల్సిందే .ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే చాలు ఇంటి నుండి మొదలుబెట్టి చేల గట్ల వరకు శుభ్రం చేయించే వాడట.ఇప్పటికీ ఊర్లో ఎవరైనా
అట్లాంటి ఆటోపం చేస్తోంటే "ఏంటి సంగతి ?వెంకట రెడ్డి
శెకళ్ళు పోతున్నావే"అంటారు సామెత లాగా.
ఆయన పోతూపోతూ ఆస్తినంతా
కరిగించి పొయ్యాడు.తొమ్మిదెకరాలు మిగిలాయి .తండ్రి కి వున్న చెడ్డ పేరుతో తల్లి
లేని శ్రీధర్ కి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పిల్లనిచ్చిందే చాలని
పేద పిల్లైనా స్రవంతిని ఎదురు పెట్టి చేసుకున్నారు.ఇప్పుడు మా 'పోర్టు' పుణ్యమా అని రోడ్డు పక్కన వున్న
వాళ్ళ తొమ్మిదెకరాలూ కోట్లు పలికి ,బికారులు కావాల్సిన సమయంలో కోటీశ్వరులైపోయారు.చేలమ్మి టౌన్ కి వచ్చి ఇల్లు
కట్టుకుని సెటిలైపోయారు...మా పెదమ్మ చెప్పుకొచ్చింది .
మాటల్లోనే శ్రీధర్ వాళ్ళింటికి చేరుకున్నాం. మమ్మల్ని
విని మేడ దిగి వచ్చారు శ్రీధర్, స్రవంతి.స్రవంతి టీ
పెడితే శ్రీధర్ అందరికీ ఇచ్చాడు .ఊర్లోని వాళ్ళ పాత పెద్ద మేడ ఈ ఇంటి ముందు దిగదుడుపే. అంత ఆర్భాటం గా వుంది.అదే చెప్పాను శ్రీధర్
తో .ఆ మాటకి మొహాన్ని దిగులుగా పెట్టి "ఏం బాగో లే .. డబ్బు వచ్చింది కదా అని
ఆర్భాటం గా ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు డబ్బులిస్తాం అన్నా పనిమనుషులు దొరకడం లేదు. చేసుకోలేక చస్తున్నాం .టౌన్ కథా కమామీషు ముందే
తెలుసుంటే ఇంత పెద్ద ఇల్లు కట్టకనే పోదుము.అయినా కలికాలం దాపురించిందిలే"అన్నాడు.శ్రీధర్ మాటలకి నవ్వొచ్చింది. మనసులోనే
నవ్వేసుకొని "అది సరే కానీ మావా నీకేదో అనారోగ్యం అన్నది పెదమ్మ. ఇప్పుడు ఎలా
వుంది?"అన్నాను .శ్రీధర్ విచారంగా మొఖం పెట్టి ''ఏమి బాగుండడమోలే .అదే మన ఊర్లోనైతే ఫలానా దువ్వూరు శ్రీధర్ రెడ్డి కి
బాగలేదంటే ఊరు ఊరంతా విచారింపుకి వచ్చేది .ఇక్కడ ఎవరికి ఎవరు?పక్కింటి వాళ్ళకి కూడా మనమెవరో తెలియకపోతిమి".అన్నాడు
దూరంగా నిలబడి టీ తాగుతున్న హరి "పక్కనుండేది
పండు తాత వాళ్ళ అల్లుడు రాజా రత్నం డాక్టరే కదన్నా!వాళ్లకి నువ్వెందుకు తెలియదు "?అన్నాడు. పండు తాత మా ఊరి మాల పెద్ద.శ్రీధర్ వాళ్ళ నాన్నకి బాగా దగ్గరగా
ఉండేవాడు.వెంకటరెడ్డి ఆయన్ని పండు మామ అని పిలిచేవాడు. పండు తాత కొడుకు బాగా
చదువుకొని ఆర్ డీ ఓ అయ్యాడు.కూతుర్ని టీచర్ని చేసి డాక్టర్ కి ఇచ్చి పెళ్లి
చేసాడు. ఆ అల్లుడే ఈ రాజ రత్నం డాక్టరు.ఆయన హస్తవాసి మంచిదని పేద వాళ్ళని బాగా
చూస్తాడని ప్రతీతి.మంచి పేరు ప్రఖ్యాతలు వున్న డాక్టరు. చాలా సంవత్సరాలు దుబాయ్ లో
వుండి వచ్చి ఆ డబ్బుతో ఈ
సంపన్నుల కాలనీలో ఇల్లు కట్టుకున్నాడు .పండు తాత
కొడుకు దగ్గర కొన్ని రోజులు, కూతురి దగ్గర
కొన్ని రోజులు ఉంటూ ఉంటాడట.హరి మాట విని శ్రీధర్ విచారంగా పెదవి విరచి ''ఆయనకి టైం ఎక్కడిది రా ! ఆయనతో మాట్లాడాలంటే మనకి రోగం రావాలి. ఇదిగో ఈ రోగం
తో ఈ మధ్య అప్పుడప్పుడు కలవడమే ''అన్నాడు .
మేం టీలు తాగి, ఇంక వెళతామని లేచాం
.స్రవంతి ఇడ్లీ పెడతా తిని వెళ్ళండంటూ బ్రతిమిలాడింది.మరోసారి
వస్తామని చెప్పి కారెక్కాం.ఆ ఉదయ కాలపు వెండి ఎండలో మా పట్టణం హరి చెప్పినట్టు
మినీ మద్రాసు లా కనిపించింది.యానిమేషన్ సినిమాలలోలాగా, బొమ్మలు గీసినట్లు చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు.మా గ్రామానికి వెళ్ళే దారి కూడా పూర్తిగా మారిపోయింది.కనుచూపు మేర పరుచుకొని విశాలమైన నున్నటి, నల్లటి రోడ్డు . ఇప్పుడు నేను చూడబోయ్యే మా ఊరు ఎలా ఉండబోతోందనే ఆలోచన నా
మనసుని పీడించడం మొదలు పెట్టింది.
నాకు తెలిసిన మా ఊరు ఎంత బాగుండేదో. ఎండల్లో కింద మంచమేసుకుని పడుకుంటే, కనిపించినంత మేరా పచ్చగా పరుచుకొని, ఏవో గాలి పాటలు పాడుకుంటున్నట్లు పరవశంగా తల ఊపేది మా వేప చెట్టు. అప్పుడప్పుడూ
చెట్టు కొమ్మల్లో పాకుతూ , పసరిక పాములు కనిపించేవి .ఆ పాముల అందం అద్భుతం .అంతటి పచ్చదనం ఎక్కడిదో వాటికి .
సన్నగా..,నాజూకుగా..పసరికలు కళ్ళు పొడుస్తాయ్ అని చెప్పేవారు పెద్దవాళ్లు .కానీ, అవి ఎవరినైనా కళ్ళు పొడవగా
ఇంతవరకూ ఎవరూ చూడలేదు .ఒక కొమ్మ పై నుండి మరో కొమ్మకి పచ్చగా పాకుతూ పోతూ వుంటే పైన పడతాయేమోనని ఒక్కోసారి భయం వేసేది.రంగుల
రంగుల నీళ్ళ పాములు పంపు షెడ్లో హాయిగా విశ్రాంతి తీసుకునేవి .వాటిది సప్తవర్ణ
సౌందర్యం.జెర్రి గొడ్లు ,తాటి బులుగులు ,రక్త పెంజెరిలు,చెట్టిరిగిలు ఎన్నెన్ని పాములో.
నక్షత్రాల నీలి ఆకాశం క్రింద ,సమిష్టి కుటుంబపు జనాభా అంతా
నిదురలయ్యే వాళ్ళం .ఉదయం కళ్ళు తెరిచే సరికి పెద్ద వాళ్ళ మంచాలన్నీ మాయమై ఉండేవి
.పచ్చటి కళ్ళాపి వాకిలి కళ్ళ ముందట పరుచుకుని కని పించేది .ఎంత పెద్ద వాకిలో!, ఎంత చాకిరో!! . యెర్రని
సూర్యుడితో పాటు ఆకలి పాటలయ్యే పక్షుల్లా , మంచి నీళ్ళ కోసం మా బావికి బారులు తీరి వచ్చేవాళ్ళు మనుషులు .ఇప్పుడు జీవ నది లాటి
మా బావి ఎండి పోయింది .సంవత్సరాల తరబడి దాహపు గొంతులను ఊరడించిన మా ఇళ్ళు ,నీళ్ళ డబ్బా కోసం మోర ఎత్తిన
లేగ దూడలా , పట్టణం దిక్కుకు చూస్తూ ఉంటుంది .రొయ్యల పంట మాకు ఇచ్చి వెళ్ళిన బహుమతి అది .
తంపటి గణుసు గడ్డలు
ఎంత తియ్యగా ఉండేవో .ఇంటి దగ్గరి కూరగాయల తోట ఎంత బాగుండేదో ,మొక్కజోన్నలకి ఎన్ని గిచ్చుళ్లో .యెర్రటి మిరప తోటలో విరబూసిన బంతులది బలే
సౌందర్యం .తోపు చిలుకల దా, తాటి చెట్లదా అనిపించే గుడి పక్కని చిలుకల గూళ్ళ తాటి తోపు .గుడి ఆవరణ అంతా పరుచుకుని వేల పక్షులకు ఇల్లునిచ్చే మర్రి చెట్టు ,సందేళ బర్రె వాహనం
పై ఇంటికి వచ్చే స్నేహితుడు సురేంద్ర హసితపు మోము మనసు మీద ముద్ర కొట్టినట్టు
జ్ఞాపకం.ఆసుపత్రి దగ్గర పెంచలమ్మ ఇంటి ముందర తెల్లటి నురుగుతో కళ కళలాడుతూ వుండే నల్లటి కల్లు కుండ.ఎర్రెర్రని
ఎండల్లో తాటి చెట్ల కింద గుంపు కూడి చలచల్లని కల్లు తాగే మా ఊరి మగ వాళ్ళు.గొంతు
మొయ్య తాగి మా ఇంటికొచ్చి నేలపై కొంగు పరచి పడుకొని ,ఊరందరి మీదా చాడీలు చెప్పే పల్లోళ్ళ బుజ్జమ్మ, ఆసక్తిగా ఆ చాడీలు
వినే మా ఇంటి ఆడవాళ్ళు ,తేలు కుట్టి కుయ్యో మంటూ
,మా తాత మందు కోసం ఇంటికి వచ్చే మనషులు ,మా ఆటల మట్టి గోర్లు కత్తిరించి ,బీడీ లో కూర్చి
వాళ్ళ చేత తాగించే మా తాత బ్రమ్హాండ విచిత్ర వైద్యం,పాచి పళ్ళతో పండుగ నెల ప్రసాదం కోసం గుడి దగ్గర లైనులో నిలబడటం, హరి వాళ్ళ నాన్న చెప్పిన "దొల్లు దొల్లు పుచ్చకాయ్ దొల్లితే రెండొక్కలు"కథలు, స్వేచ్చగా ఆడిన కోతి
కొమ్మొచ్చి ఆటలు...
నా మనసులో నిలిచి
ఆగిపోయిన రంగు రంగుల మా ఊరి చిత్రం ఇప్పుడు చెదిరి పొయ్యింది. గెలిచినవే
నిలిచాయి.అందుకని ఇప్పుడు నేను దిగులు పడాలా? ఏమో!! అసలు అప్పటి
మా ఊరు నాకు మాత్రమే అంత ఆనందాన్ని కలిగించిందేమో.హరి కి ,సీతమ్మకి అంత గొప్ప ఆనందాన్ని ఎప్పుడూ ఇవ్వనేలేదేమో. హరిని అడగాలి.
అయినా నేను, చిన్నప్పటి నేనుగానే ఆగిపోయానా? లేదు కదా ! ఉన్నత సౌకర్యాలను వెతుక్కొంటూ ,మరింత మెరుగైన జీవితం కోసం ఎక్కడికో ఎగిరిపోయ్యాను.నా ఊరు ,నా ఊరి వాళ్ళు మాత్రం పాత కాలం లోనే ఎందుకు ఆగిపోవాలి ?ఏమిటీ నాస్టాల్జియా?ఆలోచిస్తూ ,వేగంగా వెనక్కి వెళిపోతున్న దారి పక్కని చెట్లని
చూస్తూ కూర్చున్నాను