About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday, 28 January 2012

పది నేనులు, ఒకే నువ్వు..!


ఆరు రుతువుల నుండి
ఒక్కటే వర్ణాన్ని పొందాలనుకుంటావ్
అరవై ఒకటో వర్ణాన్నై
నీకెదురొస్తాను

పెంపుడు కుక్కని
నిమురుతూ
అలవాటుని ప్రేమిస్తుంటావ్
జవనాశ్వాన్నై
సతత హరితారణ్యాలలో
స్మిత సింధువునై
పరుగులెత్తుతుంటాను

కిటికీ ఆకాశం లోని
ప్రతి రోజుటి చద్ది నక్షత్రాన్నే
చూస్తుంటావ్
కనీ కనిపించక
పరిశోధకులను వేదించే
కొత్త నక్షత్రాన్నై
సొగసు సోయగాలు
పోతుంటాను

నగరానివై
సంక్లిష్టతని శ్వాసిస్తుంటావ్
పల్లెనై
చిలుకల గూళ్ళ తాటి తోపునై
ఎవరూ కలచని కొలనునై
కళ్లు విప్పార్చుకుని
నిను చూస్తుంటాను

తెలిసిన వెలిసిన పువ్వుల్లో
నను వెదుకుతావ్
నువ్వెప్పుడూ చూడని
పొగరు పువ్వునై
తిక్క తేనెలు కురిపిస్తుంటాను

ఎక్కి వచ్చేసిన
నిచ్చెనలు చూసుకుని
గొప్పలు పోతుంటావ్
నా పరమ పద సోపానంలో
నువ్వు పడిపోయిన
పాము నోటిని చూసి
పగలబడి నవ్వుతుంటాను

పట్టి పెట్టే

గట్టి ఆనకట్టల గురించి

లెక్కలేస్తుంటావ్
పెడసరపు నదినై
నిను ఎడమ కాలితో తన్ని
నీ మీదుగా దుమికి పోతాను

......ఇక్కడ నిలబడి
పా......పమని జాలిపడి
వాచ్యం చేస్తున్నా,
ఇది
ప్రవల్హిక
శత సహస్ర ముఖాలవయ్ రా
అర్థం చేసుకుందువు గానీ..!
[ఆగష్టు 23,2011,ఆదివారం వార్త.]

18 comments:

వనజ వనమాలి said...

Strange nd powerful Expression.

సామాన్య said...

కృతజ్ఞతలు వనమాలి గారు .కల్పనపై మీ విశ్లేషణ చూశాను ,చాలా బాగుంది .థాంక్ యు ఒన్స్ అగైన్ .

krishh said...

ఎంత అందంగా వుందో కవిత...ఇంద్రధనస్సు ని తలపిస్తున్న ఆ ఫోటో బాగుందో,
తొలకరి జల్లు ల్లాంటి ఈకవిత బాగుందో చెప్పలేకున్నాను.

krishh said...

ఎక్కుపెట్టిన విల్లంభు ని తలపించే మీ మార్కు కవితలకు దూరంగ
గర్వంగ పురివిప్పి నాట్యమాడుతున్న నెమలి ని తలపిస్తున్న ఈకవిత
sooooo beautiful...

సామాన్య said...

కృష్ణ మోహన్ గారు ...నన్ను చెప్పమంటారా ?
కవిత బాగుంది.ఫోటో బాగుంది.

ఆ ఫోటో నిజంగా ఇంద్రధనస్సే.కవిత కూడా ఇంద్ర ధనస్సే...ఎందుకంటె అందులో ఉన్నదీ నేనే ( ఆ మాత్రం స్వోత్కర్ష (ఎచ్చులు.. మన భాషలో)లేకుంటే మనం నేల్లూరోళ్ళం ఎందుకవతాం కదా!)

అన్నింటి కంటే మీ వ్యాఖ్య వుంది చూసారా అది సూ...పరు : )...

థాంక్ యు

Dudyala said...

Hi,
Samanya garu "padi nenulu oke nuvvu" chaala bagundi.chaala sarlu chadivanu, continuous ga chdivanu ,last stanza lo vacyam and pravalhika satha konchem ardham kaledu,I thought its not a good idea to ask my wife about the meaning of last stanza, who read the poster as bakka maggadu instead of okka maggadu. But I got the point .I really believe one should have great grip on vocabulary (English or Telugu)to write a comment ..especially on your padi nenulu,oke nuvvu .Mine is very limited in both.
All I wanted to say is I didn't see any difference in nenu and nuvvu(as you said 10 nenu = 1 nuvvu).Here nenu is as powerful as nuvvu,in fact nenu sounded little smarter than nuvvu.After reading a dozen times ....still cant get the title and the poem are balanced, coz poem is very smart and powerful or may be I have to get the meaning of all words first.finally its a great expression its powerful,smart,we liked very much.
Thanks,
Dudyala.

drpen said...

సామాన్యా...నువ్వే...నా?

సామాన్య said...

Dudyala గారూ
కవిత మీకు అంతలా నచ్చడం నాకు సంతోషంగా ఉంది.
మీ వైఫ్ బక్క మగాడు భలే నచ్చింది నాకు.
అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే కవిత్వ సౌందర్యం మిమ్మల్ని ఆవహిస్తుంది అంతే అది చాలు ,అదే అసలు కవిత్వం అంటారు పోస్ట్ మోడర్నిస్టులు.
ప్రవల్హిక అంటే 'అర్థం కాని కావ్య విశేషం' అని శబ్ద రత్నాకరం చెప్తుంది .ఆడవాళ్ళు అర్థం కారు అంటారు కదా ...అందునుద్దేసించి రాసిన కవిత అది .
థాంక్ యు .

మధురవాణి said...

భలే ఉందండీ మీ కవిత.. భావమంతా అర్థమైపోయినట్టు.. కానీ ఇంకా ఏదో అర్థం కానట్టు.. :)

సామాన్య said...

మధురవాణి గారు .మొదట కవిత ప్రశంశకు కృతజ్ఞతలు.స్నేహితుల్లో మిమ్మల్ని చూసి మీ బ్లాగ్ కి వెళ్లాను .దాదాపు అన్ని పోస్టులూ చదివాను.నిజానికి అంత సమయం లేకున్నా మీ బ్లాగ్ నన్నలా చదివించింది .మీ నాన్న గారి పైన రాసిన పోస్టు ,మీ పుట్టిన రోజు ఇంకా బంగారం కబుర్లనుకుంటా ...అన్నీ చాలా బాగున్నాయ్.అన్నింటికీ కలిపి టోకున ఈ కృతజ్ఞతలు.

మధురవాణి said...

@సామాన్య గారూ..
అమ్మో.. అంత ఓపిగ్గా అన్ని పోస్టులు చదివేసారా.. So nice of you! బోల్డన్ని ధన్యవాదాలండీ..
మీ బ్లాగు మాత్రం ఎప్పుడోటీ అప్పుడోటీ చదువుతున్నాను. మీ రాతలు నన్ను చాలా ఆలోచనల్లోకి నెట్టేస్తాయి మరి.. అందుకని అంత గబగబా చదవడం కుదరదు.. :))

సామాన్య said...

ఆలోచనల్లోకి నేట్టేస్తాయా...?:)

సుజాత said...

చాలా బావుంది. ప్రతి స్త్రీ జీవితంలో ఇలా ఫీలయ్యే సందర్భాలు అనేకం ఉంటాయేమో కదూ! ఒక్క సారైనా ఇలా బయటికి చెప్పగలిగితే ఎంత బాగుండు!!
శీర్షిక అందంగా కుదిరి పోయింది!

సామాన్య said...

థాంక్ యు సుజాత గారు .

జ్యోతి said...

చాలా బావుందండి..

సామాన్య said...

మీకు నచ్చడం చాలా సంతోషం కలిగించింది థాంక్ యు జ్యోతి గారు

oddula ravisekhar said...

కవిత కు తీసుకున్న భావన గొప్పది.ప్రకృతిలో బ్రతికే వారి స్వేచ్చ పంజరం లాంటి పట్టణాల్లోని వారికి ఎలా వస్తుంది.జవనాశ్వం ,కొత్త నక్షత్రం వంటి ఊహలతో కదం తొక్కించారు.కాని చిన్న సవరణ !ఆమెను చూస్తే ప్రకృతి కాంత లాగుంది,మరి ఆమె చేతిలో కుక్క పిల్ల వుంది.అంటే పట్టణాన్ని సూచిస్తున్నట్టా ! జవనాశ్వం వుండాలి కదా!వివరించ గలరు.

సామాన్య said...

అది మేక పిల్ల .థాంక్ యు అండీ !