About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 26 March 2012

జంగాన్ని కోరంగ ఫక్కున్న నవ్వే...!

ఎం ఏ లో మొదటి   ఏడాదిలోనేమో మాకు ఆప్షన్స్ ఉండేవి .ఒక వైపు జానపదమూ,నాటకమూ, నవల లాటివీ,మరో వైపు అలంకార శాస్త్రము  తదితరాలు ఉండేవి.బాగా తెలివైన విద్యార్థులందరూ అలంకార శాస్త్రానికి  వెళ్లి పోయేవారు.మనకెందుకులే ఆకష్టం అనుకునే వాళ్ళు ఇటు వైపు వచ్చే వారు .నేనేమో పోలిటిక్స్ చదువుకుని వచ్చా ఈ మతలబులన్నీ నాకు తెలీదు ,కానీ నాకు  జానపదమంటే చాలా ప్రీతీ వుండేది .అందుకే నేను జానపదాన్ని ఎంపిక చేసుకున్నాను.నాకు ఇవాలంత   గుర్తు ఆ సన్నివేసం మా మేడం నన్ను చూసి' ఏంటి   సామాన్య నువ్వు ఇటు వైపోచ్చేసావే నీ దారి అది కదా '?అని అనడం. నాకు ఆ మాటకి అర్థం క్లాస్ మేట్స్ చెప్పాల్సి వచ్చింది.కాక పోతే అప్పుడంతా పరీక్షల చదువైపోయింది.జానపదాన్ని తెలుసుకున్నది ఏమీ లేదు .

ఇది పిచ్చుగుంట్ల వాళ్ళనే జానపద కథకులు పాడే గౌరీ స్వయం వరం కథ. నా బిడ్డకి పెద్ద బాల శిక్ష యెట్లా అంటే క్రిస్టియన్స్ కి బైబిల్ లాగా...చదువు రాకున్నా దానికి ఆ పుస్తకమంటే పరమ ప్రీతీ.ఎప్పుడూ వెంటేసుకుని  తిరుగుతుంది .అట్లా మొన్న దానికి ఏదో చెప్తుంటే  ఈ గౌరీ స్వయంవరం దొరికింది.

తా వలచింది రంభ అని గౌరీ కేమో శివుడు నచ్చేసాడు .నచ్చేసాడూ... అని నేరుగా చెప్పొచ్చు కదా !చేసుకోవమ్మా  అన్నందుకు ఇక ఊర్లో వాళ్ళందరికీ   ఎన్ని వంకలు పెట్టిందో ...!చివరికి ''జంగాన్ని  కోరంగ ఫక్కున్న నవ్వే ''నట .అదీ విషయం .
శివుడంటే  నాకు చాలా ఆసక్తి ,ఎంత భిన్నంగా వుంటాడూ...ఎంత ఆకర్షణీయం గా వుంటాడూ అసలకీ ...పామూ ,నెల వంకా,నందీ ...ఏం రూపం కదా అదీ  ?మొన్న కాశీ కి వెళ్ళినప్పుడు గంజాయి దమ్ము వాళ్ళని చూసి ఆ ప్రాంతం పైనే చిరాకు వేసింది కానీ, ఇప్పుడు స్పురణకొచ్చింది కాశీ శివుడంత  అందమైంది .శివ పార్వతుల దాంపత్యమంత అందమైంది.


తల్లి : కోరవే గౌరమ్మ కోరున్న మనువు 
మెచ్చవే గౌరమ్మ మెచ్చిన్న మనువు 
మెచ్చిన మనువుకే ఇచ్చేము నిన్ను 
బ్రామ్హలకు ఇచ్చేమ గౌరమ్మ నిన్ను ?

గౌరి : బ్రహ్మలా స్నానాలు బ్రహ్మస్నానాలు 
నిత్య చన్నీళ్ళలో నే మునగలేను
నిత్య మడి చీరా నేగట్టలేను  
వార్లతో నా పొందు వద్దు క్షణమైన

తల్లి : కోమట్ల కిచ్చేమ కోరి గౌరమ్మ ?

గౌరి : కోమటీ బేరాలు గోజు బేరాలు 
తక్కెట్లో బేరమూ తెగ చెప్పలేను 
 ఉప్పు చింతాపండు నేనమ్మలేను 
గొన్టక్క   పులుసాకు  నేనమ్మలేను 
గోనెలకు లాభాలు నేతియ్యలేను 

తల్లి : రాజులకిచ్చేమ రావే గౌరమ్మ 

గౌరి : రాజుల భార్యలకు రాణి వాసాలే 
ఇళ్ళు  వెళ్లారమ్మ గడప దాటరమ్మ
వారితోనూ పొత్తు వద్దు   క్షణమైన

తల్లి : ఊరి చివరిలోన చాకల్లు ఉన్నారు 
చాకల్ల కిచ్చేమ చల్లన్ని గౌరి ?

గౌరి : చాకలీ సలవాలు నేసేయలేను 
ఇంటింటి గుడ్డాలు నేనేత్తలేను 
యీదిలో సరిముద్ద యిక పెట్టలేను 
ఆ ముట్టు గుడ్డాలు నేనుతకలేను 

తల్లి : కొండ కిందున్నాది కుమ్మరోల్లీది 
కుమ్మరుల కిచ్చేమ కుందనపు బొమ్మ ?

గౌరి : కుమ్మరీ మన్నులూ నేమోయ్యలేను 
కుమ్మరీ సారెలే నే తిప్పలేను 
ఊరూరా కుండాలు నేనమ్మలేను 
కుండకొచ్చిన గింజ వడిగట్టలేను 

తల్లి : ఇకెవరికిచ్చేమే  నిన్ను గౌరమ్మ 
కొండ కిందా రెండు గొల్లవారిండ్లు 
గొల్లోల్ల కిచ్చేమ చల్లనీ గౌరి ?

గౌరి : గొల్లోల్ల చల్లాలు నేనమ్మలేను 
గుట్ట గుట్టాతల్లి నే తిరగలేను 
గుట్ట గొర్రె పిల్ల పాలు నే పితకలేను 
మంద మేకల పాలు నేపిండలేను 

తల్లి : ఇక ఎవరికిచ్చేమే వింత గౌరమ్మ 
మీ తండ్రి పిలిచెను రావే గౌరమ్మ 

గౌరి : మా తండ్రి మాటలు మొన్ననే వింటి 

తల్లి : మీ అవ్వ పిలిచేను రావే గౌరమ్మ     

గౌరి : మా అవ్వ మాటలు మాపునే వింటి 

తల్లి : మీ తాత పిలిచేడు రావే గౌరమ్మ 
(ఆ మాట విన్న గౌరి దిగ్గున్న లేచి )

గౌరి : పిలిచినా పని ఏమి ఓ తాత గారు 

తాత : ఏడు జాతులమ్మ ఎత్తాడినావే 
పద్నాలుగు కులాలు పంచి పెడితివే
ఊరికి ఉత్తరాన కాటికి పడమట 
పాడుగుళ్లోనేమో  పడియుండేవాడు 
జంగమయ్య కొడుకు లింగకాయదారి
జంగాలకిచ్చేమ లింగాల గౌరు ?   

జంగాన్ని  కోరంగ ఫక్కున్న నవ్వే 

గౌరి : మెచ్చితీ మెచ్చితీ మనువన్న తల్లి 
కోరితీ కోరితీ మను 
వన్న తండ్రీ 
కోరి సాంబశివుని 
పెండ్లాడుతానే
మెచ్చి సాంబాశివుని 
మను వాడు తానె  

9 comments:

సుభ/subha said...

WoooooooooooW!! మంచి జానపదాన్ని పరిచయం చేసారండి. ధన్యవాదాలు.

సామాన్య said...

థాంక్ యు సుభ గారూ

సత్యవతి said...

నాకు చాలా ఇష్టం ఈ పాట ఒక చోత దొరికినప్పుడు దాచాను .మీరు ఈ పాతని బ్లాగ్ లో పెట్టటం బావుంది

సత్యవతి said...

పాట చాలా ఇష్టం నాకు ఒక సారి విన్నాను అదివరకు.అందరికీ పరిచయం చెయ్యడం బాగుంది

సామాన్య said...

@satyavathi garu
థాంక్ యు మేడం .చదవగానే నాక్కూడా ఎంత నచ్చిందో...అట్లా చెబుతున్న పెంకె గౌరమ్మ ముచ్చటగా కనుల ముందరకొచ్చింది .

వనజ తాతినేని/VanajaTatineni said...

మంచి పాటని పారిచయం చేసారు. చిన్నప్పుడు ఎప్పుడో..విన్నాను. అప్పుడప్పుడు రేడియోలో కూడా విన్నట్టు గుర్తు కూడా.

మనసైన వాడిని మనువాడాలనుకున్న ప్పుడు ఏ కన్నె పిల్లైనా గౌరమ్మలానే అభ్యంతరం చేపుతుందేమో ! అందుకే గౌరీ శంకరం అన్నారు .

జానపద సాహిత్యం ..కనుమరగవకుండా.. ఇలా సబ్జక్ట్ గా ఉండటం మంచిదే కదా! జన జీవనంలో ముందు ముందు కాలంలో ఇంకా జానపదం బతికి ఉంటుందా అన్నది సందేహమే నండీ!పెద్ద బాలశిక్ష పాపాయి కి ఇష్టం అవడం..సంతోషం.

కాశీ అంటా శివమయం .. అది తప్ప నాకు ఇంకా ఏమి కానరాలేదు. మీ పోస్ట్ లో నాకు నచ్చిన , తెలుసుకున్న విషయాలకి.. స్పందనగా స్థూలంగా నా అభిప్రాయం ఇదండీ!.

సామాన్య said...

వనజ గారూ
మీ వ్యాఖ్యకు హృదయ పూర్వక ధన్యవాదాలు.అవును జానపదం సబ్జెక్టు గా అయినా వుండటం వల్లే కనీసం ఇవన్నా దొరుకుతున్నాయనుకుంటా ...

nsmurty said...

samaanya garoo,

Can I use this article with acknowledgement for a small write up on folklore?

with best regards.

సామాన్య said...

తప్పకుండా మూర్తి గారు !పెద్ద బాల శిక్షలో వుంది చూడండి..భూమికలో నా కథ పై మీ వ్యాఖ్య చూసాను చాలా చాలా కృతజ్ఞతలు .ఈ పోస్ట్ కి మీరెక్కడి నుండి వచ్చారు ?