About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Sunday, 5 February 2012

సీత కష్టాలు ...అనగనగనగా.... చాలా కాలం క్రితం చాలా దూరంలో ఒక సముద్రముండేది .ఆ సముద్రంలో చాలా రాజ్యాలుండేవి. చేపల రాజ్యం, తాబేళ్ల రాజ్యం ,పీతల రాజ్యం ఇట్లా .ఇది పీతల రాజ్యంలో జరిగిన కథ .ఆ రోజు పైన ఆకాశం చాలా ముసురు పట్టి ఉంది.రాత్రి రావాల్సిన పౌర్ణమి చంద్రుడు ముఖం చాటేసుకుని ఎటో వెళ్లి పోయాడు .వద్దన్నా కాల్చే కర్కోటకుడు సూర్యుడు మంచాన పడ్డట్టున్నాడు. సమస్త భాద్యతలు తనే తీసుకుని వానల దేవుడు కుండపోతగా కురుస్తున్నాడు . సముద్రం అలలు అలలుగా ఉంది .అస్థిమితంగా ఉంది .పరమ చిరాగ్గా ఆటూ పోటు ఔతుంది. అటువంటి రోజు ,అటువంటి వానలో పీతల రాజ్యంలో రాజ భవనం ముందు పేద పీతల గుంపు ఒకటి రాజుకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తుంది .నినాదాలు రాజ భవనం గోడ గోడని తగిలి తిరిగి తిరిగి ప్రతి ధ్వనిస్తున్నాయి .

పీత పలికిన మాటలు విని జాలరి స్త్రీ అది సరే ,మొదట నీకొచ్చిన అంత పెద్ద కష్టమేమిటో చెప్పు అన్నది .ఇంతకీ ఆ పీత మేధావీ బహు భాషా కోవిదురాలు అయిన రాకుమారి పీత కదా ,ఆమెలో ఉన్నది రాచ రక్తం కదా అంచేత ఒక నీచ జాలరి స్త్రీకి తన దీన గాద వినిపించడానికి ఇష్ట పడక కాసేపు ఊరుకొని నా కథ తరువాత ముందు నువ్వెందుకేడుస్తున్నావో అది చెప్పు అంది .అంత బాధ లోను తన గురించి తెలుసుకోవాలనుకుంటున్న ఆ పీత ఆసక్తి గమనించి జాలరి స్త్రీ అది ఆడ పీత అని కని పెట్టేసింది .
మళ్లీ ఒక సారి ముక్కు చీది రాముడనే రాజు సముద్రంపై వారధి కట్టి , లంక రాజు ని చంపి, వాడు దొంగిలించి తీసుకెళ్ళిన తన భార్యని జయించి తీసుకొచ్చాడు. అదంతా పెద్ద కథలే .అంత చేసిన ఆ రాముడు ఎవడో ఒక వెధవ ఏదో అన్నాడని ఆ సీతమ్మ తల్లిని అనుమానించాడమ్మా , తన భార్య సత్యం తనకు తెలీదా లోకం కోసమా భార్య .ఇది భరించలేక ఆ తల్లి ఇవాళ భూమిలో కలిసి పోయింది అని చెప్పింది మళ్లీ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ .
పీత మద్య ఆ స్త్రీ మద్య ఒక నీరవ నిశ్శబ్దం అలుముకున్నది .జాలరి స్త్రీయే ఆ నిశ్శబ్దాన్ని మొదట బగ్నం చేస్తూ, ఇంతకూ నీకొచ్చిన కష్టమేంది పీతమ్మా అని అడిగింది
అప్పుడు పీతరాకుమారి నిట్టూర్చి "సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవా " అని తన కథ చెప్పడం మొదలు పెట్టింది .జాలరి స్త్రీ జాలి జాలిగా పీత చెప్పిన అతి పాత కధే ,అందరికీ తెలిసిందే , మళ్లీ ఓపిగ్గా విని కొత్తగా తెలుసుకున్న ఆ పీతను చూసి జాలి పడి చేతిలోకి తీసుకుని పీతమ్మా అందుకే ఆడ పుటక పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలన్నది. ఈ కష్టం నీ ఒక్క దానిదే కాదు ఆడ జాతి మొత్తానిది .నువ్వు కొత్తగా పడుతున్నావు నేను పడి కొట్టుకుని లేచాను ,నీ కడుపున కూడా రెండో మూడో కాయలు కాస్తే వాళ్ళను చూసుకుంటూ అంతా మరచి పోతావు అయినా కట్టుకున్న భార్యల్ని వదిలి వీళ్ళు ఎక్కడికి పోతారు , తిరిగి తిరిగి ఆఖరాకి మన దగ్గరికే వస్తారు అన్నది .
అది విని ' వృద్ద పురుషః పత్నీ వ్రతః'కాబోలనుకుంది విద్యావతి ఐన రాకుమారి పీత .ఐనా కాలూ చేయి ఆడని మగ వాడు కొంగు పట్టుకు తిరిగితే ఏంటి కాలు పట్టుకు తిరిగితే ఏంటి అని ఆ తుచ్చ జాలరి స్త్రీతో చర్చించడానికి దానికి మనసొప్పలేదు .మళ్లీ ఆ జాలరి స్త్రీయే మౌనాన్ని చేదిస్తూ పీతని ప్రేమగా నిమిరి వెళ్లమ్మా వెళ్ళు చచ్చి మాత్రం సాధించేదేముంది , , గుండె దిటవు చేసుకుని కాపురం చెయ్యమ్మా ,మనకింకో గతి లేదు అంది .అని పీతని నెమ్మదిగా సముద్రం లోకి వదిలేసింది .


************************

జాలరామే మొగుడు తిరిగొచ్చి మెదలకుండా కూర్చున్న పెళ్ళాన్ని అడిగాడు ఏందే అట్టా తుమ్మల్లో పొద్దు గూకినట్టు మొకం పెట్టుక్కూచున్నావ్, ఇప్పుడేం కొంప మునిగింది అని .అప్పుడా జాలరి స్త్రీ భర్తతో " సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవా "అని పీత కథ చెప్పింది .
సాయంత్రం చేపలాయన వ్యాపారికి చేపలమ్ముతున్నాడు .సొమ్ము ముట్టిన సంతోషం లేని జాలరి ముఖాన్ని చూసి వ్యాపారి ఒక వరహా అటో ఇటో అవుద్ది దానికే మొహమట్టా పెడితే ఎట్టా అన్నాడు . అప్పుడా జాలరి "సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవా అని సముద్రం మీద తన కష్టాలను వ్యాపారికి ఏకరువు పెట్టడం మొదలు పెట్టాడు .అదే మాట వ్యాపారి చేపలు కొన్న ఇంటామెతో అన్నాడు .ఇంటామె భర్తతో అన్నది. భర్త ఇంకోరితో అన్నాడు .అట్లా సామెత ప్రపంచంలో స్తిర పడింది.


[పతంజలి గారికి మరీ మరీ ప్రేమగా ]

సెప్టంబర్ 2011,పాలపిట్ట .

6 comments:

భావన said...

very nice. తెలిసిన కధే అయినా చదివి అలానే కూర్చుండీ పోయాను. చాలా మంచి కధ కదా.

సామాన్య said...

థాంక్ యు అండి.అవును తెలిసినే కథే .బహుశా మనుషులం స్త్రీలమైనా... పురుషులమైనా మారక పోవడం చేత ,తెలిసినవే పునరావృతమవుతాయనుకుంటా.

Anonymous said...

great story man
"kootiki peda ainaa kulaniki peda kaadu kadaa"

"champincheddam kooli na kodukuni"

"intaki aa peetha medhavi rakumari kadaa ,oka neecha jalari streeki...."

how the hell could you catch human psychology and behaviour with such perfection.?

superb narration.

great style.

please start writing in english.

kiran said...

mee katha adbutanga undi.mee painting kooda chala bagundi.amaya
'heading back drop lo unna painting kooda meeru vesindena?

సామాన్య said...

ఏ తెగులూ సోకకుండా చివరిదాకా తెలుగులోనన్నా రాయడాన్ని కలగనండి అజ్ఞాత గారూ...

సామాన్య said...

అయ్ బాబోయ్ అదేం టండీ అలగడిగేసారు?ఏసేటప్పుడు నువ్వు జూష్నవు గదనే,మల్ల గిదేంది గీ అడుగుడు?ఏమైనా మీ అభిమానాలకు ధన్యవాదాలండీ కిరణ్ గారూ ...!