About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday, 10 February 2012

పాపాయి...!

నిదుర ఖైదు నుండి బైట పడి ,
పాపాయి
కొత్త సూర్యుడితో
కరచాలనం చేస్తుంది .

గూటిని విదిల్చి
కిలకిలల రామచిలుకై
పువ్వుల సీతా కోకై
పిల్లులు పట్టే దొమ్మరి రాణై
అమ్మ గుండె బండిని అదుపు తప్పిస్తూ
కుక్కని గుర్రం చేసి
రోజు తాడు పై
ఒంటి కాలితో నడిచేస్తుంది

పాపాయి
కొత్త కొత్త చిగుళ్లతో
ఇళ్లంతా అల్లేసి
వన్నె చిన్నె మాటల్ని
విరగ పూస్తుంది
పూసిన మాటలు
కోసే వాళ్లో వైపు
రాలిన నవ్వులు ఏరే వాళ్లో వైపు

ఆడే ఆట హటాత్తు గా ఏమౌతుందో
నానని మంత్రించి
జీ హుజూర్ అనిపించి
కళ్ళ దివిటీలని వెలిగించి
మాయల లోకానికి విహారమౌతుంది

తాత మెడ ఊడని పట్టి
ఊగి ఊగి
అవ్వ కథలోని ఊళ్లన్నీ
చుట్టి చుట్టి
గూళ్ల పిట్టలు గూళ్ల కి
సూర్యుడింటికి సూర్యుడు
వెళ్ళాక ,
పాపాయి
వెక్కిరిస్తున్న కొక్కిరాయి చంద్రునిపై
అలిగి
కీ పోయిన బొమ్మలా
దిగులు నిద్రవుతుంది

అప్పుడు
ఇళ్ళంతా
సూర్యుడు లేని
పగటి ఆకాశమౌతుంది .

6 comments:

మధురవాణి said...

బాగుందండీ మీ పాపాయి అక్షరవర్ణచిత్రం.. :)

సామాన్య said...

థాంక్స్ అమ్మాయ్ మధుర ...: ))

వనజ తాతినేని/VanajaTatineni said...

సామాన్య గారు.. పాపాయి పదహారు కళలు బాగున్నాయి..ఇంటికి కంటికి పాపాయిల చైతన్యమే కదా ..అందం.

ఎప్పటిలాగా..బాగా వ్రాసుకున్నారు. అందరికి చూపించారు. బోలేడన్నీ థాంక్ యు లు. మా చంద్రుడి బాల్యం ని మరొకసారి మీ పాపాయి లో చూసుఉంనాను.

అవును అమయ అనేది అరబిక్ వర్డ్ అని నేను చూసాను. మీరు జపనీస్ అన్నారు!?

సామాన్య said...

హాయ్ అండీ
కవిత నచ్చినందుకు థాంక్ యు.పిల్లలందరూ చిరునవ్వుల చంద్రులే కదా...!
కథా జగత్ లోమీ కథ చదివాను.అత్త కోడళ్ళ ఒద్దిక బాగుంది.ముగింపూ, ఓవరాల్ గా కథ నాకు బాగా నచ్చాయి.మంచి కథ చదివించినందుకు బోలెడన్నిథాంక్ యులు.అమయ జపనీయుల పదమే.అరబిక్ లో కూడా వుండి ఉండొచ్చు.సంస్కృతంలో కూడా వుందట ' అమాయ'(మాయ లేక పోవడం) అని.: ) ఎందుకో రాత్రి పూట వర్షం అనగానే ఆ పదం బాగా నచ్చేసిందండీ.

nsmurty said...

పాపాయి కొత్త కొత్త చిగుళ్లతో
ఇళ్లంతా అల్లేసివన్నె చిన్నె మాటల్ని విరగ పూస్తుంది పూసిన మాటలుకోసే వాళ్లో వైపురాలిన నవ్వులు ఏరే వాళ్లో వైపు ...

ఇది అనుభవైకవేద్యం. ఎవరి అనుభవం వారిదైనా, ప్రతి అనుభవమూ ఆనందకరమే.

...ఆడే ఆట హటాత్తు గా ఏమౌతుందోనానని మంత్రించిజీ హుజూర్ అనిపించి కళ్ళ దివిటీలని వెలిగించి మాయల లోకానికి విహారమౌతుంది ...

very touching

అప్పుడు ఇల్లంతా సూర్యుడు లేని పగటి ఆకాశమౌతుంది.
...

మీ కవిత చాలా బాగుంది. మీ అనుభూతిలోంచి పఠితలు తమ తమ అనుభూతుల జ్ఞాపకాల్లోకి ఒకసారి వెళ్ళేలా చేశారు. అభినందనలు

సామాన్య said...

నిజం ఎవరి అనుభవం వారిదైనా, ప్రతి అనుభవమూ ఆనందకరమే...థాంక్ యు .థాంక్ యు వెరీ మచ్ మూర్తి గారు