About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Tuesday, 31 January 2012

జంగిడి పశువుల సున్..దరి !


కొండ కొమ్మున
ఊరందరి పశువులతో
ఊత కర్రకి తల తగిలించి నిలిచి
సున్ దరి అంది
'సంవత్సరం కావలికి
ముప్పై శేర్లంటే
ఏమొస్తుంది చెప్పూ 'అని

పొగాకు పళ్ళ సున్ దరి
గయ్యాళి నోటి సున్ దరి
నవ్వుల నల్ల పువ్వు సున్ దరి
నవ్వుతూ నవ్వుతూ అంది
తాగుబోతు మొగుడ్ని
సోమరిగొడ్డు మొగుడ్ని
తన్ని తరిమేశానని

'బంధూ 'అంటూ
ఏడాదికోసారి పూసే
పలాష్ పూలలా
ఎపుడో సారి కనిపించే
నా సంతాలీ సున్ దరి అంది
బయటికెలితే ఒకటే పని
ఇంట్లోనైతే 'గదాకాజ్ 'అని
అయినా నోటికి ,చేతికి
మధ్యనున్న 'జగా 'మరీ పెద్దదని

కార్తీక పున్నమి నాడు
'సోరాయ్ 'పాటల బండిలో
స్వర్గమంతా తిప్పి
కొని తెచ్చిన ఎర్రంచు తెల్ల చీర
కట్టబెట్టి సున్ దరి అంది
'నీకైనా నాకైనా
కష్టమే కడుపుకు దారి 'అని

చెట్టు చేమల్ని
ఇంటి కప్పుల్ని
పట్టి చెరిచే 'కాలో బైశాక్ '
కుంబ వృష్టి వెలిసిన ఉదయం
సగం కూలిన
తన మట్టి ఇంటి తలాకిట
నిలబడి ,నిర్లిప్తంగా
సున్ దరి అంది
పుట్టినప్పటి నుండి
ఇంక్విలాబ్ కి జిందాబాద్
చెప్తూనే ఉన్నా
తాను దూరగలిగిన స్వర్గమిదేనని

లాల్ ఘర్ రోడ్లపై
కూల్చిన చెట్ల కూకటి వేర్లపై
గొడ్డలి పట్టిన చేతిని ఆనించి నిలిచి
ఏదో పురాతన యుద్ద చిత్తరువుని
జ్ఞప్తికి తెస్తూ ,ఎర్రబడ్డ కళ్ళతో
సున్ దరి అంది
పూట పూటా యుద్దమంటే
యెట్లా చెప్పూ అని

వైశాఖ పూర్ణిమ నాటి
వేటాడే పండుగ
'దిశం'కోశం దాచి పెట్టిన
విల్లంబును చూపిస్తూ
సున్ దరి అంది
ఇప్పుడు మేమే యాటలమైనామని

సారి పలాష్ లు
పూసాయి ,రాలాయి
సున్ దరే కనిపించ లేదు
సున్ దరంటే
అమాయకపు ఆకు పచ్చటి వనాలలో
ప్రవహించే వేడి నెత్తుటి పాయ
సున్ దరంటే
సాలవనాల పేలిన
సూర్య నక్షత్రం
సున్ దరిని మీరేమైనా చూశారా ...?
20/12/2010 ,వివిధ ,ఆంద్ర జ్యోతి .

8 comments:

Anonymous said...

పలాశ పుష్పాలంటే అవిసె పూలనుకుంటా.

సామాన్య said...

నిజానికి తెలుగు పేరు నాకూ తెలీదండి .పూలు ఎర్రగా వుంటాయి,మార్చ్ మాసం నుండి విరివిగా పూస్తాయి .సౌత్ బెంగాల్ వైపు ఎక్కువ.మోదుగు పూలు అయి వుండొచ్చేమో...

Anonymous said...

ఈ పోయెం ను నేను జ్యోతిలో చూసాను .ఈ మధ్య బాగా గుర్తుండి పోయిన వాటిల్లో ఇది కూడా ఒకటి .అప్పుడు మీ గురించి ఒకరిద్దర్ని అడిగినట్లు కూడా జ్ఞాపకం .ఆ తరువాత మొన్న వచ్చిన జనగన్ కవిత కూడా చదివాను .ఆ రోజు వచ్చిన పోయెమ్స్ లో మీదే నిజమైన ఎలిజీ అని ఫీలయ్యాను.స్త్రీల వైపు నుండి ఈ తరహా కవిత్వం విమల తర్వాత మీదేననుకుంటా చూడటం.మీ కవిత్వంలో ఉద్వేగము,స్పష్టత సమపాళ్ళలో వున్నాయి.విస్తృతంగా రాయండి .ఇలా సంవత్సరానికి ఒకటి నిబంధన పెటుకోకండి.మీనుండి ఈ తరహా కవిత్వాన్ని మరింతగా ఆశిస్తున్నాం .అలా ఎదురు చూడొచ్చా సామాన్య గారూ?

సామాన్య said...

ఫలానా తరహా కవిత్వం అని ,ఫలానా తరహా కథలనీ బహుసా రాయలేననుకుంటా.కాకపోతే మన స్వభావాన్ని అనుసరించి అసంకల్పితంగానే మనమో మార్గంలో వెళ్ళిపోతుంటాం .ఇంకొంత కాలం తర్వాత ఆ మార్గమేదో స్పష్టపడొచ్చు.విమల గారి కవిత్వం నాకు చాలా ఇష్టం.స్పష్టత వుద్వేగమూ వుండొచ్చేమో కానీ ...విమలతో పోల్చడం అతిశయోక్తి అని భావన.ఏమైనా రెండు కవితలనీ ఇంతలా గుర్తుంచుకోవడం సంతోషం కలిగించింది,గుర్తుంచుకుని ఇలా పలకరించడం సంతోషం కలిగించింది .అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

వనజ తాతినేని/VanajaTatineni said...

బతుకు పోరాటంలో యుద్ధం చేసే సున్ దరులని మనం నిత్యం చూస్తూనే ఉంటాం కదా !

సున్ దరంటే
అమాయకపు ఆకు పచ్చటి వనాలలో
ప్రవహించే వేడి నెత్తుటి పాయ
సున్ దరంటే
సాలవనాల పేలిన
సూర్య నక్షత్రం
సున్ దరిని మీరేమైనా చూశారా ...?

వేటాడటం నిత్యం అవసరమైన రోజున ఈ సున్ దరిని.. చూస్తాం కూడా. అలా రాకూడదని కోరుకుందాం సామాన్య గారు.

మోదుగు పూలు,అగ్ని పూలు, పలాస పుష్పాలు,దిరిసెన పుష్పాలు,గుల్మొహర్.... అన్నీ ఒకటే! దాశరధి కి చాలా ఇష్టమైన పూలు. వారి "అగ్నిధార" కావ్యానికి.. ప్రేరణ అని చెప్పారట.

సామాన్య said...

వనమాలి గారు ,ఇప్పుడే ఎవరో అడిగారు పలాస పూలంటే అవిస పూలా అని. మోదుగలూ పలాసలూ ఒక్కటేనంటారా?
థాంక్ యు .

nsmurty said...

ఈ కవిత చాలా అద్భుతంగా ఉంది... ఒక కథని కవితలో చెప్పినట్టు ఉంది... కవిత అయిపోయాక సున్ దరి ఇంకా కళ్ళముందే నడయాడుతున్నట్టుంది. బహుశా నాకు ఆమె ఏ జి.మాడుగుల సంతలోనో, పాడేరు చింతపల్లి అడవుల్లోనో తారసపడి ఉండి ఉంటుంది. పరిచయమున్న ముఖమే. అభినందనలు సామాన్య గారు

సామాన్య said...

thank you murthy garu