About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday, 13 October 2012

కదా ....?????

నువ్వంతా తెలుసునని  నేననుకుంటాను 
నేనంతా తెలుసునని నువ్వనుకుంటావు 
ఇరు స్వప్న తీరాల వెంబడి మనం 
ఒకరికొకరం ఎప్పటికీ అపరిచితులమే




Thursday, 11 October 2012

రవీంద్ర కథావళి



ఎప్పుడో అనేక ఏళ్ళ క్రితం చదివాను రవీంద్రుడి కథలు ఆంగ్లంలో .కాబూలి వాల  ఎక్కడో పాఠం గా వుండటం ,అప్పటి ఆ పాటానికి బొమ్మ మనసులో ఇప్పుడు కూడా వుంది ఈవాల్టి లాగా నూతనంగా .హెచ్ సి యు లైబ్రరీలో గోరా చదివినపుడు కన్నూ మిన్నూ తెలియని అతని అభిజాత్యం ,ఆ పైన ముగింపు ...గౌర వర్ణపు గోరా రూపం మది చిత్రించుకున్న మరో జ్ఞాపకం .

మొన్నప్పుడు డిల్లీ  నుంచి రవీంద్ర కథావళి ని తెచ్చుకున్నానా .మేఘ సంద్రాన్ని దాటుకుంటూ ఊరికే ఒక్క కథ అనుకున్నానా ...అరె బోల్డు పనులున్నాయన్నా  రవీంద్రుడు వదలందే!

బెంగాల్ కి వచ్చాక రవీంద్రుని పట్ల బెంగాలుల పిచ్చి భక్తి ,శరతుని అసలకసలె పట్టించుకోకపోవడం చాలా బాధించేది .శరతు  పేదవాడనే కదా ,రవీంద్రుడు జమీన్దార్ అనే కదా ఆ వివక్ష అని కినుకుగా వుండేది .ఆ కినుకు శరత్ చంద్రుని   జీవిత చరిత్ర చదివాక   రవీంద్రుని పై   మరీ పెరిగింది .ఏవిటో ఒకలాటి ధిక్కారమూ ,అయిష్టమూ ...

ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు  ఈ కథలు చదివాక మనసు ఒక్క సారి  సరళమై పోయింది  .అసలకి ఇతనేంటి? స్త్రీలనీ పురుషులనీ , పిల్లలనీ ,వృద్దులనీ ,పేదలనీ, ధనికులనీ బేధ భావం లేకుండా యెట్లా అన్ని హృదయాలలోకి రాచ బాట వేసుకుని పయనించ గలుగుతున్నాడు ?ఎక్కడిది  ఇతనికీశక్తీ  అని...ఒకటే ఆశ్చర్యం .బహుసా అందుకనే  వీళ్ళందరూ గొప్ప రచయితలయ్యారేమో  .గొప్ప రచయితలంటే సర్వాంతర్యామి అయిన భగవంతుడని ఏమో !లేకుంటే ఇదంతా యెట్లా సాధ్యం ?

 ''మాష్టారు గారు '' కథలో హరలాల్ ,''రాస మణి  కొడుకు'' కథలో కాళీ పద్  పొద్దుటి నుండీ ఎంత బాధ పెడుతున్నారో.మరో మార్గమేమీ లేకుండా వాళ్ళిద్దరూ పేదరికానికి బలికావడం ఎంత బాధిస్తుందో .ప్చ్ పెద్దవాల్లమయ్యాక భోరుమని ఏడ్చే స్వాతంత్ర్యాన్ని మనమే పోగొట్టుకుని దిగులునంత గుండెకి చేర్చేసుకుంటాం .అప్పుడు కదా గుండె భరువెక్కడమనే   మాటకి  యదాతదంగా  అర్థం బోధ పడేది.

''పోస్ట్ మాస్టర్'' కథలో రతన్ ,''సమాప్తి ''లో తనకు తెలియకనే బాల్యం నుండి యవ్వనం లోకి సాగిన  చిన్ని మ్రున్మయి ,ఎప్పుడు ఎందుకు  అట్లా జరిగిందో తెలియక దుక్కాన్ని గుప్తంగా గుండెల్లో దాచ ప్రయత్నించి ఓడిన చారులత ...అసలు చారు లేదా ,,స్త్రీ బాధ అంత విశదంగా ,చూసినట్లు మరీ రవీంద్రునికి యెట్లా తెలిసిందని ఆశ్చర్యం .

''భార్య రాసిన లేఖ''లో రవీంద్రుడు భార్యగా ఒక స్త్రీ ఐ  ,చీరకి నిప్పంటించుకుని  చనిపోయిన తన అనాధ బాంధవి  గురించి ''ఊళ్ళో వాళ్ళందరూ రేగారు.'ఆడవాళ్ళు చీరెలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపొయింది 'అన్నారు .
ఇదంతా నాటకం అన్నారు మీరు .కావచ్చు .కానీ ఈ నాటక క్రీడ -కేవలం బెంగాలీ స్త్రీల చీరెల మీదుగానే జరుగుతున్దెం ?బెంగాలీ వీర పురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకనీ  ?అది కూడా ఆలోచించి చూడటం యుక్తం ...!అని 1913 లోనే  స్త్రీల తరపున  నిర్ద్వందపు వకాల్తా పుచ్చుకున్నాడు కదా  అందుకని ఇప్పుడిహ  మూర్ఖ భక్తునికి భగవంతుని యందు ఎంత భక్తి వుంటుందో రవీంద్రునికి  అంతటి భక్తురాలనై పోయాను. అచ్చు బెంగాలుల లాగా !

ఎంతెంతో రాయాలని వుంది కానీ ఏమిటో కథా చర్చ కంటే యుక్తా యుక్త జ్ఞానాన్ని కోల్పోయి మరీ ... కన్నీటితో రవీంద్రుని పాదాలని అభిషేకించాలి వంటి డైలాగ్ లు  నిస్సిగ్గుగా ,అదుపు తప్పి వస్తున్నాయ్ . అందుకని ఇక్కడకి ముగించడం యుక్తమని ముగిస్తున్నా .

తప్పక చదవాల్సిన పుస్తకం ''రవీంద్ర కథావళి'' .ఈ గొప్ప అనువాదం మద్దిపట్ల సూరి గారిది .

Friday, 28 September 2012

ఆవాహన !!!





మనల్ని మనం ఏకాంతంలో ఎక్కడ అన్వేషించుకుంటామో,
అప్రమేయంగా మనల్ని ఏవి ఆవహించగలవో,,
మనలో లయమై విడివడి కనిపించనివేవో  ,విడివడలేనివేవో అక్కడక్కడే మనం !!!

Sunday, 23 September 2012

''దమయంతి కూతురు ''


http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012%2Fsep%2F9%2Fsunday%2Fstory&more=2012%2Fsep%2F9%2Fsunday%2Fsundaymain
అనవరత ప్రయాణాలు కలిగించిన అలసట,అనారోగ్యము బ్లాగ్ పట్ల విముఖం చేసినా ఒక మంచి కథ ...తప్పని సరిగా షేర్ చెయ్యాల్సిందే అనిపించిన కథ నన్నిట్లా బ్లాగ్ దగ్గరకి తెచ్చింది.ఆ మంచి కథ పేరు ''దమయంతి కూతురు''. రచయిత్రి శ్రీ పీ.సత్యవతి గారు.

ఒక ఆదివారం ఉదయం మా ఊర్లో  వుండగా   పాపాయి వాళ్ళ నాన్న నుండి బోల్డు   వేకప్ కాల్ లు వచ్చాయి  ,,,ఇవాల్టి ఆదివారం ఆంధ్రజ్యోతి లో మంచి కథ వచ్చింది చదువు అని . ఎవరు రాసారు అనే లోపే పీ.సత్యవతి గారు అని చెప్పేసాడు .నేను బోల్డు సంతోషపడి చదవడానికి కూర్చున్నాను  .కథ అట్లా పూర్తి చేసానో లేదో మళ్ళీ ఫోన్ .లిఫ్ట్ చేయగానే మరో మాటేం లేకుండా పాపాయి ''అమ్మా ...ఊర్ద్వ లోకం అంటే  ఏంటమ్మా'' అంది.నాకిక అర్థమైపోయింది నాన పాపాయికి కథ చదివి వినిపించాడు అని .అదొక్క ప్రశ్నేనా ..ఇంకా బోల్డు ,''సౌందర్యా వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని ఏమందీ??'',అనురాధా టీచర్  చెప్పిన మెర్మన్ కథ ఏంటీ?''ఇట్లా ...!!నేను ''పోనీ సత్యవతి గారినే అడగక పోయినావా బిడ్డా ''అన్నాను. పాపాయికి  బోల్డు సిగ్గు  .అందుకని ''ఆహా ,కాదమ్మా! అమ్మా! మొత్తం కథంతా నువ్వు మళ్ళీ చెప్పమ్మా ''అన్నది .

ఇంకో వైపు పాపాయి వాళ్ళ నాన ''ఈ కథకి ఆర్ద్రతే ప్రాణం కదా ''?అని విమర్శనా పరిభాషలో ప్రశ్నించాడు.నాకు నవ్వొచ్చి సోఫాలో ఉన్న పుస్తకాల్లోనే అడుగున వల్లంపాటి''కథా శిల్పం '' పుస్తకం ఉంది తీసుకుని చదువుకో ఏం ప్రాణమో తెలుస్తుంది అన్నాను.సత్యవతి  గారి కథలంటే నాకు,మా అమ్మకీ  ఎప్పుడూ  ఇష్టమే .ఇవాళ  నాన్నా  కూతుర్ల హృదయాలను బోల్డు ఆకట్టుకున్న  ఈ కథ నా హృదయానికి మరీ  దగ్గరగా వచ్చింది. 

సత్యవతి గారి ప్రతి కథా ఉన్నత స్థాయి కథే .ప్రతి కథా సమాజం లోని ఒక సంక్లిష్టతను సరళం చేసి చెప్పడానికి వుద్దేసించిందే.అట్లాగని వారి కథలెప్పుడూ మానవ భావోద్వేగాలకి అతీతమై, ఉపన్యాసాలు ఇయ్యవు .హృదయగతంగా,అతి సరళంగానూ వుండి  ,మన మనసులకు చాలా  సన్నిహితంగా వస్తాయి .అంత మాత్రం చేత చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పగలగడం లో విఫలం చెందవు.ఇవంతా నాకు ఇంతకు మునుపే తెలిసిన విషయాలే అయినా అవాళ  నేను మళ్ళీ కొత్తగా  సత్యవతి గారి కథ ముందు పెట్టుకుని కథ యెట్లా రాయాలో నా ఎనిమిదేళ్ళ కూతుర్ని మనసులో నిలిపి  తెలుసుకున్నాను .అంత గొప్పగా రాయగలగడం యెట్లా అని దిగులు పడ్డాను .

''దమయంతి కూతురు'' కథ నా వరకు నాకు బుచ్చి బాబు గారి '' దయానిధి '' కి కొనసాగింపు .దయానిధికి తల్లి పట్ల జాలో ,సానుభూతో ,విపరీత  ప్రేమ వల్ల ఎటూ తేల్చుకోలేని తనమో ...ఏదో ఒక అవ్యక్త భావం వుంటుంది .అపరిష్కృత భావం అది .అందుకనే అతను ,తల్లి పేరు చెప్పి తనను హేళన పరుస్తున్న సమాజం నుండి విడివడి దూరమవుతుంటాడు కానీ ,,ముడిని చిక్కు తీసి ఇదీ అని అమ్మ  పట్ల అతని భావాన్ని ఇదమిద్దంగా  ప్రకటించడు .ఆ సంఘర్షణ అలవి మాలినదిగా వుండి వేదన కలిగిస్తుంది పాటకుడికి.

.ఈ కథలోని దమయంతి కూడా ఉత్తుత్తి మనిషి కాదు ''ఊర్ద్వ లోకపు మనిషి''.అందుకే భూలోకపు మనుషుల్ని వదిలేస్తుంది  .మరి ఏ లోకమూ తెలియని పసి పిల్లల గతి ఏమిటీ ??''తల్లి మచ్చ'' ను చూపించి వెంట పడి వేధించి అబ్సెషన్ కు లోను చేసి అక్కడే అదే వలయంలో పిల్లల్ని పడి కొట్టుకునేట్లు చేసే సమాజం సంగతి ఏమిటి?ఎంత పెద్ద ప్రశ్నలు  కదా ?యెట్లా అర్థం చేసుకుని ఆ తల్లిని క్షమించాలి ?అందుకు సమాధానమే ఈ కథ .దమయంతి కొడుకు "తన జీవితాన్ని మలుచుకునే హక్కు ఆవిడకుంది కదా అమ్మడూ. మనకోసం ఆమెకి అలవిమాలిన త్యాగాలు అంటగట్టకూడదు కదా. ఆమె ఎందుకు ఏ పరిస్థితుల్లో మనని వదిలి వెళ్లిందీ మనకెప్పటికీ తెలియదు, ఆమె చెబితే తప్ప. ఇంక వదిలేయ్. ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో ..'' 
"మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?''
"బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?''
 అంటూ చెల్లికి ఇచ్చిన  సమాధానం ఓదార్పు కోసం ఇచ్చుకున్నది కాదు .తల్లి మచ్చ వేసి పదే పదే వేధించే సమజానికి నేర్పుతున్న పాటం అది .

మానవ సంబంధాలన్నీ వుదాత్తంగానూ ,ఉన్నతంగానూ వుండాలనేది మానవుడి సంయుక్త కాంక్ష .కానీ, ఏ వుత్పాతమూ లేకుండా ప్రకృతి సరళ రేఖలో సాగి పోవడం ఎప్పుడైనా విన్నామా ??లేదు కదా!!!మానవ భావోద్వేగ ప్రకృతి కూడా అట్లాటిదే .అందులోనూ ఎత్తుపల్లాలు వుంటాయి .ఆ ఎత్తు పల్లాలు మన చుట్టు పక్కలో ,మన జీవితాలలోనో ,మన జీవితాలకు అతి సన్నిహితంగానో ఎదురు పడినపుడు వాటిని యెట్లా స్వీకరించాలో, యెట్లా అర్థం చేసుకోవాలో నేర్పడమే కాదు ,అర్థం చేసుకోగల హృదయౌన్నత్యాన్ని కూడా ఇస్తుంది ఈ కథ .
http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012%2Fsep%2F9%2Fsunday%2Fstory&more=2012%2Fsep%2F9%2Fsunday%2Fsundaymain

Monday, 3 September 2012

విష్ణు కూతురు

ఇది రాగలీన పాట



అప్పుడొక రోజు మా ఊళ్ళో చిలక జోస్యం పిల్లవాడు వెళ్తూ ఉండినాడు .చిలకని చూద్దామని నేనూ ,పాపాయి  బోల్డు ముచ్చట పడేసి ,జోస్యం  చెప్దూవ్ గానీ  రమ్మని పిలిచాం .ఆ అబ్బాయి భాగా చిన్న వాడు పద్నాల్గు,పదిహేను ఏళ్ళ వాడు .మొదట నాకు చెప్తూ మాటల్లో మాటగా ''గంటకు తొమ్మిది గుణాలు కదక్కా నీకు ''అన్నాడు ...ఇంకా అట్లాటివే మనసు మల్లెపూవు కదంటక్కా అని ...ప్లీసింగ్ మాటలు బోల్డు చెప్పాడు .అవన్నీ గుర్తు లేవు కానీ గంటకు ఇన్ని కిలోమీటర్ల స్పీడు అన్నట్లు గంటకు తొమ్మిది గుణాల మాట మాత్రం భలే గుర్తుండి పోయింది .

తరవాత వంతు పాపాయిది .అబ్బాయి బహు శాంతంగా ''నీ బిడ్డకి గంటకి ముప్పై ఆరు గుణాలక్కా ''అని వాక్రుచ్చాడు.ఆ పిల్లాడెంత  అండర్ టోన్ లో చెప్పినా తొమ్మిది గుణాల నా కథ నాకు తెలుసు గనుక బగ్గ భయపడ్డాను  ఎట్ట రా  దేవుడా అని .మొన్న ఆర్ ఏం .ఉమా మహేస్వర్ రావ్ ,విష్ణుప్రియ  ల  కూతుర్ని  చూసాక భయం కొంచెం చల్లబడింది .ఎందుకంటె రాగలీనకి గంటకు నూటా పదహారు గుణాలు .అమ్మవారికి నూటా పదహారు కళ లన్నట్లు .అన్ప్రేడిక్టబుల్ .తరువాతి క్షణం లో ఆ బిడ్డ బుర్రలోని ఆలోచనని మనం  కనిపెట్టలేం ....రాగలీన కాదు రంగుల లీన అనమాట .తామరాకు పైని నీటి బొట్టు .

అమ్మాయిల చిత్తాలు మేఘమాలికలు ఒక్కటని కాళిదాసు అన్నాడు కానీ ,అందరమ్మాయిలూ ఒక్కటి కాదు కొందరు కొంచెం వేరు ,కొందరు చాలా వేరు .ఆ చాలా వేరు వాళ్ళతో వారికి చుట్టు పక్కల వుండే వారి జీవితం భాగుంటుంది కత్తి మీద సాములా .రోజూ ఒక వింతలా .

రాగ లీన మంచి రచయితో అట్లాటిదే మరోటో అవుతుందని నా ఊహ . చూడాలి పిల్లలు పెరిగి పెద్దగై ఏమవుతారో రాగాతీతం గా చూస్తూ వుండటం  ఒక ఆసక్తికర అనుభవం!!!

Tuesday, 28 August 2012

భలే ప్రేమ పాట

నాకు రెండు కొత్త పాటలు వినే  అవకాశ మిచ్చిన సత్యవతి గారికి ఒక బెంగాలి పాటను పరిచయం చేస్తున్నాను .మొన్న ఆదివారం ''భవయ్య'' పాట పాడ మంటే  మా నిభ పాడింది ఈ పాట -ఆంధ్ర  నుండి వచ్చిన నా స్నేహితుల కోసం.భలే...చాలా నచ్చింది .మేడం కి నిభ గొంతుతోనే వినిపిద్దామనుకుని ప్రయత్నిస్తుంటే టెక్నికల్ నాలెడ్జ్ లో సున్నా గ్రేడు మనిషిని కనుక నా ఫోన్ ఘోరంగా పాడై  నన్ను అత్యంత ఆనందం లోకి నెట్టింది .పాట వినండి .చూస్తూ వినడం కన్నా ఉత్తిగా వింటే ఇంకా బాగుంది కానీ ...నాకు అట్లా షేర్ చేయడం రాలేదు .

Bondhu Tindin
artist: http://en.wikipedia.org/wiki/Runa_Laila
album/Movie: Unknown
bondhu tindin tor baarit gelam
బంధు [అంటే ఫ్రెండ్ అని 'డు 'లేదా 'రాలు 'ఎవరైనా కావచ్చు] వరసగా మూడు రోజులు మీ ఇంటికి వచ్చాను
dekhaa pailamna
నీ దర్శనం కాలేదు
gaang paar hoite choy anaa.
గంగా నది ఆ ఒడ్డుకి వెళ్ళటానికి ఆరణాలు
firaa aaite choy anaa
తిరిగి రావటానికి ఆరణాలు
aite jaite baro anaa ushul hoilonaa ||
వచ్చీ పోవడానికి పన్నెండణా లు వసూలయ్ పోయాయి

budh baar e shubho jatra
బుధవారం ఈ శుభ  యాత్ర మొదలెట్టాను
bishudhbaare manaa
గురువారం మంచిది కాదని ఆపాను
shukurbaare prem piriti
శుక్రవారం కూడా ఈ ప్రేమ యాత్ర
hoyna sholo anaa
విజయవంతం కాలేదు [గ్రామీణ బెంగాలులు ఒక పని సంపూర్ణం గ [24=సోలో అణా ]  విజయవంత అయిందనో  కాలేదనో చెప్పటానికి ''సోలో అణా ''అనే మాటను వాడుతారట ]
shonibaare giyao tor dekha pailamna ||
శని వారం వెళ్లి కూడా నిన్ను పట్టుకోలేక పోయాను

tor kache jaibar belaae
నీ దగ్గరికి వస్తున్న సమయంలో
thot rangaai paane
నది పోటు  మీదుంది
ekla paiya ghaater maajhi
ఒక పాదం ఘాట్ మీద ఉండగానే
ulta boitha taane
పడవ ఒడ్డు  వైపుకు ఉల్టా వస్తుంది
kapor bhijja jawar bhoye
బట్టలు తడిచిపోతాయనే భయం చేత
shatar dilamnaa ||
ఈత కొట్టి వద్దామనే ఆలోచనను విరమించుకున్నాను

jhor brishti mathae loiyaa
కుండపోత వర్షంలో తడిచి పోతూ
gelaam raater belaa
రాత్రి పూట వచ్చాను
giya dekhi kather dorjaae.
వచ్చి చూస్తే చెక్క తలుపుకి
lohar ekkhan talaa
ఒక పెద్ద ఇనుప తాళం వేళ్ళాడుతుంది
chaabi loiya nithur kalaa
తాళం తీసుకుని బంధు
tuito ailinaa ||
 నువ్వు రానే లేదు

Thursday, 23 August 2012

ఆడవాళ్ళ ఏడుపు కథ!!!


ఓ హెన్రీ ఎప్పుడూ ఓ అద్బుతమే ,ఎప్పుడూ ఒక ఆశ్చర్యమే ,అనితర సాధ్యమే.

ఇవాళ ''A Harlem Tragedy'' చదువుతూ ,చదువుతూ చివరాఖరికి వచ్చి ఓ హెన్రీ అన్ని కథల్లాగే ఆశ్చర్యపడి ,తేరుకుని ,నవ్వి ,నవ్వి ...ఇక నవ్వలేక ఆశ్చర్యపడి షేర్ చేస్తున్నా .  http://www.literaturecollection.com/a/o_henry/222/

కొన్ని వాక్యాలు చాలా నచ్చాయి .ఇట్లా ..."But what does he beat you for?" inquired Mrs. Fink, with wide-open
eyes.

"Silly!" said Mrs. Cassidy, indulgently. "Why, because he's full.
It's generally on Saturday nights."

"But what cause do you give him?" persisted the seeker after
knowledge.

"Why, didn't I marry him? Jack comes in tanked up; and I'm here,
ain't I? Who else has he got a right to beat? I'd just like to catch
him once beating anybody else! Sometimes it's because supper ain't
ready; and sometimes it's because it is. Jack ain't particular about
causes. He just lushes till he remembers he's married, and then
he makes for home and does me up.
............................................
Mrs. Fink went up to her flat and had a little cry. It was a
meaningless cry, the kind of cry that only a woman knows about, a
cry from no particular cause, altogether an absurd cry; the most
transient and the most hopeless cry in the repertory of grief.

కానీ కథలో ఎంత విషాదమో .అది అంతా పక్కన పెడితే ఈ రచయిత ఆడవాళ్ళ ఈ ఏడుపు స్వభావాన్ని యెట్లా పట్టుకున్నాడా అని ఒకటే ఆశ్చర్యం!!!!!!