About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday, 17 December 2011

వినటం మినహా...


పెళ్ళైన
పదేళ్ళ తరువాత
స్నేహితురాలు కలిసింది

అప్పుడేమో
నక్షత్రాల నవ్వుతో
మెరిసిపోతూ
మల్లెపూవులా ఉండేదా
ఇప్పుడేమో
ముసురు పట్టిన
ఆకాశంలా ఉంది .

అవాళ
నా ఇంటికొచ్చి
బురఖా తీసి
కాలే పెనం పై పడ్డ
నీటి చుక్కలా
మధ్యాహ్నపు ఎండ పై
చిట పట లాడింది

చల్లటి నీటి ధార
పచ్చటి గొంతు పాయని
దాటుకుని వెళ్ళాక
వన్నెల చమ్కీ గులాబులు
అల్లుకుని ఉన్న
ఒంటిని విరుచుకుని
కాసేపు
సంతోషాల గతంలో
యీదులాడింది

గంటల గడియారం
టంగు మనగానే
ఇంట్లో వొదిలొచ్చిన
మూడు చిట్టి బంతుల గురించి
వర్తమానమైంది

ఏడాదికోసారి వచ్చే
రంజాన్ లా
ఏడాదికొక్క సారైనా రాని
ఆ పూల వేరు గురించి
దిగులైంది

సుదూర సౌదీ ఎడారిలో
తెల్లారి పోతున్న
నిండు యౌవన రాత్రులను
నడుస్తున్న
ఇరుకు జీవన జాలాన్ని
సుదీర్ఘంగా తల పోసింది

చివరిగా వెళుతూ వెళుతూ ,అంది
చూశావా
పర్సులో డబ్బులున్నయ్
దబరలో బిరియానీ ఉంది
మనసుకే శాంతి లేదని


[స్నేహితురాలు అన్సారీ కోసం ]
ఆగస్ట్ 15 ,2010 ఆదివారం ఆంద్ర జ్యోతి


8 comments:

రసజ్ఞ said...

ఒక మామూలు చర్యలని కూడా ఎంతో అద్భుతంగా వర్ణించిన మీదే భావ చతురత అంటే! ఎంత చక్కని వ్యక్తీకరణ! అసామాన్యంగా ఉంది సామాన్య గారూ

సామాన్య said...

థాంక్ యు రసజ్ఞ గారు .

జ్యోతిర్మయి said...

"గంటల గడియారం
టంగు మనగానే
ఇంట్లో వొదిలొచ్చిన
మూడు చిట్టి బంతుల గురించి
వర్తమానమైంది"

మీరు వర్ణించిన విధానం బావుంది.

సామాన్య said...

కృతజ్ఞతలు జ్యోతిర్మయి గారు.

వనజ తాతినేని/VanajaTatineni said...

మనీ ..చెట్టు దరిన నిలుచుకుని..రాలిన ఆకులు చేజిక్కించుకుంటూ.. అదే జీవితం అనుకున్న మనుషులకి "మన్" వెతలు ,కతలు అర్ధం కానప్పుడ్డు జీవితం అడవి కాచిన వెన్నెలే కదా!! బాగా వ్యక్తీకరించారు. :-)))))))

సామాన్య said...

thank you వనజ గారు .కవిత తో పాటు కవిత్వం లాటి మీ కామెంట్ బాగుంది.

vasantham said...

గల్ఫ్ లో పని చేసే చాల మండి వెతలు ఇవే, పెళ్లి చేసుకుని, నవ వధువు చేతి గోరింట ఎరుపు ,
నిగ నీగలు, అరక ముందే, చేతి లో చెయ్యి, మెల్లగా వదిలించుకుని, ఎయిర్ పోర్ట్ లో కర చలనం
తో, వెళ్ళి పోతారు, కుదిరితే, కరకు కాస్లు, వచ్చి పడతాయి, ఆశలు నిట్టూర్పులు అవుతాయి..
మీ కవిత్వం..అక్షరాల మనసులని ఆవిష్కరిస్తోంది, అక్షరాలకే ప్రాణం పోసినట్టు
కలవర పరుస్తున్నాయి, మనసుతడి చేస్తున్నాయి, చెమ్మ గిల్లిన గుండె..
లు కారే అక్షరాల కన్నీరు..
వసంతం.

సామాన్య said...

నిజం కదా
నా స్నేహితురాలు మాట్లాడిన ఆ చివరి మాటల నుండి తేరుకోటానికి ఇప్పటికీ నాకు సాధ్యం కావటం లేదు.