About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 16 December 2011

మగ ఆధునికోత్తర వాదం

కోళ్ళ గూళ్ళ కాపురాలను
కాలదన్నేస్థైర్య స్వప్నాలతో
అతనూ నేను .

ధర్మార్థ కామ ముసలి మంత్రాలను వదలి
ప్రేమోన్మత్త పునాదులపై
ఆధునిక కాపురం

***

కాలానికే కాదు
విజాతి ద్రువమే ఐనా
ఆడ శరీరాకర్షణకూ
శిశిరముంటుంది కాబోలు

ఎంతైనా వసంతుడు
మగాడే కదా !
నూతన నీలోత్పలాలను
అతనిలో మళ్ళీ పూయించాడు

వ్యర్థంలా నను ఒడ్డుకు నెట్టేసి
మరో కొత్త ప్రేమ కోసం
నిర్మల తటాకమయ్యాడు

హటాన్మరణంలా
నా ప్రేమోద్వేగాలపై నడచి పోతూ
పోస్ట్ మోడర్నిస్టునని చెబుతుంటే
కాదని ఆపడానికి
ఇవాళ
నా మెడలో
మంగళ సూత్రమైనా లేదు .

[2006 అక్టోబర్ 1 , ఆదివారం ఆంధ్ర జ్యోతి]

10 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

కవిత చాలా నచ్చింది. సామాన్య గారు.. శుభాభినందనలు. బ్లాగ్ లొకం లొ.. మిమ్మలని చూడటం ఆనందం. మీ బ్లాగ్ పేరు చాలా బాగుంది.

సామాన్య said...

థాంక్ యు వనజ వనమాలి గారు .

vasantham said...

మంగళ సూత్రం అయినా లేదు..అతను కాల తన్ని వెళ్ళి పోతే ప్రేమ,
మిగిలేది, ఒక కలత ,వెతల ,చెదిరిన గూడు..మీ భావాలు అమోఘం.
వసంతం.

సామాన్య said...

మీ కవితాత్మకమైన కామెంట్ చాలా బాగుందండీ .థాంక్ యు .

దీప said...

మీ కవితకూ, కోణార్క్ దేవాలయం మీదనున్న సూర్య ప్రతిమ చిత్రానికీ ఏమిటి సంబంధం?

సామాన్య said...

పురుష మూర్తి కాడమే కారణం .అంతకంటే ఏముంటాయ్.

కోడూరి విజయకుమార్ said...

సండే లో ఈ poem ని ఎలా మిస్ అయ్యాను?....
జాతి లక్షణం సర్వ కాలాల్లోనూ , సర్వ వాదాల నడుమా అలాగే నిలిచి ఉంటుందని చెప్పిన తీరు బాగుంది....నిజమే....మారే కాలంతో ఆ లక్షణాలు వ్యక్తమయే తీరు మారుతుంది ....మీ కవిత, నా 'ఆధునికానంతర మగ దురహంకార పద్యం' కవితని మళ్ళీ నాకు గుర్తు చేసింది [2008 లో సండే లోనే వొచ్చింది] ....

సామాన్య said...

సర్ఎలా వున్నారు?
మీ కవితను చదవాలని వుంది .మెయిల్ చెయ్ గలరా!
మగ ఆధునికోత్తర వాదం నా రెండో కవిత.ఇప్పుడు చదువుకున్నా ఇష్టంగానే ,దుఖంగానే అనిపిస్తుంది.
థాంక్ యు సర్ .

జ్యోతిర్మయి said...

ఏది నిజమో ఏది మాయో తెలియని అయోమయ జగత్తులో..ప్రతిదాన్ని తర్కించి తెలుసుకోవాల౦టే మనకున్న జ్ఞానమెంతో..మీ కవిత జీవిత సత్యాన్ని తెలిపేలా ఉందంటే అతిశయోక్తి కాదు. అభినందనలు.

సామాన్య said...

నిజమే జ్యోతిర్మయి గారు ,ఏది మాయో ఏది నిజమో తెలుసుకునే లోపు, అమ్మాయిలం నడి సముద్రంలో నిస్సహాయంగా నిలబడి వుంటాం .
థాంక్స్ ఫర్ ది కామెంట్.