About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 19 December 2011

'అర్థ మోహనరాగం'


అనార్కిస్ట్ కవిలా
అతను
మహా దౌర్జన్యంగా
మానసోపరితలంపై
ఓ విత్తనాన్ని విసిరాడు

అనుమతి లేకనే
కాలాన్ని కత్తిరిస్తున్న
గడియారం ముళ్ళు
విత్తనాన్ని కాస్తా
గుచ్చి వెళ్ళింది

సందేహ స్వరాల మెట్లు
దాటుకుని
చిరు మొలక ముందు
మోకరిల్లి
గాఢ మోహన రాగాన్ని
మోగించే లోగా
అతను
కుదురు లేని
వలస పక్షిలా
వాలిన వయోలిన్ తీగలు
తెంచుకుని
యెగిరి పోయాడు

అఖండమై విస్తరించిన
ఆ విత్తనపు
వట వ్రుక్షంపై తిరుగుతూ
మెదడు నరాల నేతని
విప్పుకుంటూ ,నేను
ఆ అడుగుజాడలకై
అన్వేషిస్తుంటాను .

నా చెట్టు
కొన్ని సార్లు
తేనె పూలు పూస్తుంది
అపుడపుడు
రాత్రి పక్షుల అరుపులకి
ఉలికి పడుతుంది
కురిసే మంచు
కాసే ఎండ
నా ముందు నుండే
నడిచి పొతాయ్.

చూసి చూసి
దారిన పోయే ఒకడు
ఇదంతా వ్యర్థమని
కలలనైనా అల్లాల్సిందేనని
మూర్తిమత్వం గురించి
వుపన్యసిస్తాడు

నేను ,ఇక ఇదే
చివరి కొమ్మనుకుంటూ
ఆ చెట్టులోని
మరో కొత్త కొమ్మ పైకి
నా అనవరత ప్రయాణాన్ని
ప్రారంభిస్తాను
[వార్త 2011]

3 comments:

సామాన్య said...

మీ బ్లాగ్ చూసాను .చాలా బాగుంది.అన్ని పాటల సాహిత్యం ఒకే దగ్గర చదువుకోడం బాగుంది.తెలుగులో ఇంత వరకూ ఈ సౌలభ్యం లేదనుకుంటా...కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు.

vasantham said...

చాల బాగుంది, విత్తనం మొలకెత్తి , కొమ్మలు చాపి, నీడ నిచ్చి, పూలు తో నిండి, ఫలాలతో బరువు కి కుంగి,
ఏమి లేకుండానే..విత్తనం నాటి వెళ్ళిపోతే..
ఏమవుతుందో..
చాల బాగుంది.
వసంతం.

సామాన్య said...

vasntham garu ,thank you