About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Thursday, 22 December 2011

మా పాపాయి తెలివి.

మా పాపాయి భలే మంచిది లెండి ...అచ్చం వాళ్ళ నాన్న లాగే...!

ఏమయిందంటే, మొన్న వాళ్ళ స్కూల్ వార్షికోత్సవం జరిగింది .డాన్సులూ అవీ మస్తు ప్రాక్టీస్ చేసారు.అప్పుడు క్లాస్ మేట్స్ ,అయ్యవారమ్మలూ అడిగార్ట ''ఇంకా చెవులు కుట్టించుకోలేదేం'' అని.మళ్ళీ వాళ్ళే ,సరేలే ప్రెస్ లోలాకులన్నా తెచ్చుకో అని సలహా ఇచ్చారట .

పాపాయి ఇంటికొచ్చేసి, 'అమ్మా చెవులు కుట్టీవా' అని అడిగింది .అప్పుడిక నేను కుర్చీఎక్కేసి, గొంతు సవరించుకుని '' నీ ఇష్టాన్ని కాదనడం నా ఉద్దేశం కాదు బిడ్డా .కానీ చెవులకు చిల్లులు కొట్టుకుని మరీ మనం అందంగా ఎందుకు కనిపించాలీ ?మనం,ఆడవాళ్ళం.. స్వేచ్చగా వుండాలి .హాయిగా వుండాలి.ఇప్పుడు మగాళ్ళనే చూద్దాం ,వాళ్ళెందుకు చెవులుకు చిల్లులు కొట్టిన్చుకోలేదూ?ఎందుకంటె,కుట్టేప్పుడు నెప్పి పుడుతుందని జ్ఞానం గా ఆలోచించారు కాబట్టి, కుట్టించుకోలేదు .మనం కూడా అలాగే జ్ఞానం గా వుండాలి .స్వేచ్చగా ,హాయిగా వుండాలి.కమ్మలు అవీ పెట్టేసుకుని అందంగా కాదు వుండాల్సింది....అయినా నేను చెప్పేది నువ్వు ఆచరించి తీరాలని రూలేం లేదు.కావాలంటే నువ్వు చెవులు కుట్టిన్చుకోవచ్చు ''అని వుపన్యసించాను.

నా బిడ్డ కుర్చీ కింద నిలబడి వుపన్యాసమంతా విని, అచ్చం వాళ్ళ నాన్న లాగే, జ్ఞానం గా ''అమ్మా నీ సిద్ధాంతం నాకు నచ్చింది .నేను నువ్వు చెప్పినట్టే ఉంటా ,చెవులకు చిల్లులు కొట్టిన్చుకోను,కానీ నాకు ఇష్టమేసినప్పుడు ప్రెస్సు కమ్మలు పెట్టుకుంటానేం ...!అన్నది .

నాకు మస్తు కన్ఫ్యూషన్ వచ్చింది .నా బిడ్డ నా మాట విన్నట్టా ?విననట్టా ?

పాపాయి వాళ్ళ నాన కూడా అచ్చం ఇంతే . నేను తనని వింటున్నానో ,తను నన్ను వింటున్నాడో అర్థమే కాదు.


4 comments:

మాలా కుమార్ said...

మీ పాపాయి తెలివి బాగుందండి :)

సామాన్య said...

థాంక్ యు శరత్ గారు.

సామాన్య said...

థాంక్ యు మాలా కుమర్ గారు.

krishh said...

మగవాళ్ళు కూడా
ఇప్పుడు fashion కోసం ... చెవులు కుట్టించుకుంటున్నారు లెండి .
హహహ్హహ్హ ఐన నొప్పి reason కాక పోయి ఉండొచ్చు,ఆ సంప్రదాయం ఆడవాళ్ళ కు మగ వాళ్ళు ఆపాదించడానికి.