2006 లో పోకిరి మూవీ చూశాను.విపరీతంగా జుగుప్స కలిగింది.కోపమొచ్చింది .ఇంటికొచ్చి కాయితమోటి తీసుకుని ఇది రాసేసి ప్రజా సాహితికి పంపేశాను.కొన్ని రోజులాగి రవి గారికి ఫోన్ చేసి అందిందా అని అడిగాను.ఆయన వెంటనే అయితే మీరీ మధ్య ప్రజా సాహితీ చదవటం లేదన మాట అన్నారు.నేను చాలా నిజాయితీగా లేదండీ నాకు పాప పుట్టిందీ అన్నాను.రవి గారు నాకు మారిన అడ్రెస్స్ ఇచ్చారు.అప్పటికి నా దగ్గర రఫ్ కాపీయే ఉండింది.అదే పంపించేసాను.అదే ఇది .మళ్ళీ ఇన్ని రోజులకి నాకు బిజినెస్ మేన్ మీద రాయాలనిపించింది.అది రాస్తూ ఇది జ్ఞాపకమొచ్చి బ్లాగ్ లో పెట్టాను.
ఈ దేశపు పేద, మధ్యతరగతి ప్రజలకు కాస్త సేద తీరేందుకు ,ఆనందించేందుకు ఉన్న ఏకైక మార్గం సినిమానే.అందుకే ఆ సినిమా ప్రభావం వారి జీవన శైలి ఫై ముఖ్యంగా యువతరం పై మరీ తీవ్రంగా ఉంటుంది .
పూరి జగన్నాథ్ సంపూర్ణ నేతృత్వం లో ఈ మధ్య “పోకిరి” అనే సినిమా వచ్చింది.ఈ సినిమాలో హీరో... కృష్ణ కొడుకు, మహేష్ బాబు .సినిమా అంతా దర్శకుడు చాల సామాజిక అంశాలను నెత్తికెత్తుకుని బాధ పడుతూ ఉంటాడు.ప్రేక్షకులు ఇవన్ని జరిగినవే కదా అని ఫీల్ అయిపోతుంటారు కాకపోతే అన్నీ దర్శకుడి సినిమాకు రంజుదనాన్ని తెస్తుంటాయి.దర్శకుడు పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తుంటే ఆ పాత్ర ,శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుంది.”మసాజ్ పార్లర్ కు వెళ్దాం పద” అనో ,”అమలాపురం లో ఆడవాళ్ళు బాగుంటారట ” కదా అనో, వంకరగాఅంటూ ఒక దెబ్బ కు రెండు ఫీలింగ్ లను తెప్పిస్తాడు .
దర్శకుడు పోలీసు వ్యవస్థ గురించే కాదు ,గూండా ల గురించి,సెల్ ఫోన్ లో సెక్స్ దృశ్యాల గురించి,టీవీ ల గురించి ఏమిటేమిటో చెప్తాడు.మధ్య మధ్య లో హిందీ సినిమాలను ,ఎం టీవీ ని మరిపించే దృశ్యాలు,పాటలతో కిర్రెక్కిస్తుంటాడు.ఏం చేసినా సినిమా లో కామరసం పోర్లేట్టు చూసుకుంటాడు.
సినిమాలో ఎస్.పి పాత్ర ,”గాంధీ సినిమా ను ఎవరు చూడరు అదే కడప కింగ్ అంటే రెండు వందల రోజులు నడుస్తుందని” అంటుంది.ఈ డైలాగు పూరి జగన్నాథ్ ఫ్రస్ట్రేషన్ నుండి వచ్చిందే .పూరి సినిమాలు ఇంతకు ముందు మరీ ఇంత కంపుగా వుండేవి కావు.కొన్నిభారీ ఫ్లాపుల తర్వాత కంపు పెరిగింది .అతనెందుకు గ్రహించలేదో కానీ కడప కింగ్ లే కాదు, తేజ హీరోయిన్ జాకెట్ లో నుంచి ఈనాడు, వార్త , పత్రికల బాల్స్ ని చెరో వైపు నుండి తీయించినా సినిమా ఫ్లాప్ అయింది.అశ్లీలతే సినిమా కి ఆయువు పట్టు అనుకోవడం తెలివి తక్కువ తనమే.
గురివింద గింజ సామెత ఒకటి ఉంది.అది పూరి కి సరిగా సరిపోతుంది.తానొక బాధ్యత గల పౌరుడిలా టీవీ 9 కి t tv అని పేరు పెట్టి అశ్లీల దృశ్యాలేమన్నా దొరికితే ముందు మాకే ఇవ్వండి రోజంతా వేస్తాం అని విలేఖరికి డైలాగు పెట్టిన దర్శకుడు ,నువ్వు ఆడదానివి కాదా మీ అక్కాచెళ్ళల్లని ఇలా చేస్తే వూరుకుంటారా అని డైలాగు చెప్పే హీరో దారిలో వెళ్తున్న హీరోయిన్ని ఆపి ఆమె టీషర్టు పై (కేమెరా ని నిలబెట్టేసి )దృష్టి కేంద్రీకరించేసి అంతా కాకపోవచ్చు కానీ some parts of me are awesome అని వర్ణిస్తుంటారు. ఎస్.పీ కూతురిని మంత్రి కొడుకు చేడుపుతున్నట్టున్న దృశ్యాలు సినిమాలో బూతుకు చేరుపే కానీ మరోటి కాదని ప్రేక్షకుడు గ్రహించగలడు.
పూరి తన సినిమా లో పాటలని స్త్ర్రీ శరీర ప్రదర్సనకే కేటాయిస్తాడు.ఎం టీవీ ని తలపించేలా పాటలు ఇది వరకే సూపర్ సినిమాలో ప్రేక్షకులకు పరిచయమే.ఇందులో “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అనే పాట ఆ తరహాకి హైలైట్ .అందులో పిల్ల తన శేరీరాన్నంతా తెర మీద పరిచేసి గంతులేస్తూ జుగుప్స కలిగిస్తుంది .ఈ పాట చాల హిట్.రాఘవేంద్ర రావు వృద్దుడై, శీలవంతుడు అయిన తర్వాత విఖ్యాతమైన అతని బొడ్డుకి మరి నాలుగు చేర్చి, పూరి సినిమాలను కంపు కొట్టిస్తున్నాడు.ఈ తరహా ఏంటని? ఏదో టీవీ ఇంటర్వ్యూ లో ప్రశ్నిస్తే చాలా నిర్లజ్జగా, “అంతా డబ్బు కోసమే "greed for money " అని సమాధానం ఇచ్చాడు.
సినిమాలో ఇంకో దృశ్యం ఉంటుంది .విలన్ ఒకడు ఒక పిల్ల చేత మంచానికి కట్టించుకుంటాడు.ఆ పిల్ల, వాడి మీదకెక్కి లిప్ స్టిక్ పూసి కొరడా తీసుకుని కొట్టేదా కొట్టేదా అంటుంటుంది .ఇది ప్రఖ్యాత పర్వర్టేడ్ ఆంగ్ల చిత్రం బేసిక్ ఇన్స్టింక్ట్ కు అనుకరణ.మాతృక ని ఎంత మంది పిల్లలు, స్త్రీలు చూసారో కానీ ఆ దౌర్భాగ్యాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులకు కలిగించాడు దర్శకుడు.సినిమా కు ఆ సన్నివేశం అవసరం అని దర్శకుడు కూడా చెప్పలేనంత అనవసరం గా ఉంది.కనుక ఆ సీన్ పూరి జగన్నాథ్ లోని పర్వర్షన్ కి ఒక నిదర్సనం గా చెప్పవచ్చు.
సమాజ సేవకి అంకితం అయిపోయాడు కదా దర్శకుడు, అందులో భాగంగానే పది సార్లు నిరోద్ అనిపిస్తేనన్న ప్రజలు కుటుంబ నియంత్రణ పాటిస్తారు అన్నట్లు అలీ చేత ప్రభుత్వ నిరోద్ ప్రకటన బోర్డు ని చూపిస్తూ ''అర్థ రూపాయి కి ఇది కూడా రాదు'' అని ఒక సారీ, మహేష్ బాబు చేత ఎస్సై ని మీ నాన్న నిరోద్ వాడి వుండాల్సింది నువ్వు పుట్టకుందువు అని ఒక సారీ అనిపిస్తాడు .యాభై ఏళ్ళ మనిషిని పట్టుకుని అప్పుడు మీ నాన నిరోద్ వాడున్డాల్సింది అనడం ఎంత అసహ్యం?
ఈ మధ్య నెల్లూరు జిల్లా కావలి లో ఒక ప్రముఖ కాలేజీ లో వార్షికోత్సవం తర్వాత, మధ్య రాత్రి హాస్టల్ కు వెళ్తున్న ఆడపిల్లలపై అదే కాలేజీ అబ్బాయిలు ముసుగులేసుకుని దాడి చేసి చెప్పుకోలేని చోట్ల కొరికి గాయపరిచారు.
ఈ ఐడియా వాళ్ళకి “సై” అనే సినిమా నుండి వచ్చిందట .మహిళా సంఘాల వాళ్ళు, ప్రజాతంత్ర వాదులు ధర్నాలు చేసి, కరపత్రాలు వేసి ఆందోళన చేసారు.కానీ ఆ అమ్మాయిల తోలి యవ్వన జీవితం పై జరిగిన పైశాచిక దాడి జీవిత పర్యంతం వారిని భయ పెడుతూనే ఉంటుంది.దీనికి బాధ్యులు ఆ అబ్బాయిలే అనడం కన్నా సై సినిమా టీం అనడమే న్యాయం.
చాల సార్లు ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు కనుక అలాంటి సినిమాలు తీస్తున్నామని దర్శకులు అంటారు.అది తప్పు.ఇదే మహేష్ బాబు “ఒక్కడు” సినిమాని ఎటువంటి స్త్రీ శరీర ప్రదర్శన లేకపోయినా వంద రోజులు చూసారు.ప్రేక్షకులు అశ్లీలం కోసమే సినిమా చూడరు.చూసే వాటికి అలవాటు పడతారు.ఈ పోకిరి సినిమా మొదటి సారి చూసినప్పుడు నేను చాల జుగుప్స కి లోనయ్యాను.ఈ వ్యాసం రాయాలనే ఆలోచన కలిగాక రెండో సారి చూసాను.ఈసారి నాకు అంత జుగుప్స కలగలేదు.కారణం అలవాటు పడడమే. అలవాటు పడడం చాలా ప్రమాదకరం .ఎందుకంటే ఎప్పటికప్పుడు డోస్ పెంచాలి కదా .బహుశా సెన్సార్ వాళ్ళు కూడా నాలాగే అలవాటు పడ్డారేమో .అంటే రాబోయే సినిమాల అశ్లీలానికి మనం అనివార్యంగా అలవాటు పడాలేమో.
స్త్రీ శరీరాన్ని ప్రదర్శించటానికి, రెచ్చగోట్టేట్టు ప్రదర్శించడానికి తేడా ఉంది.పూరిది రెండవ పద్దతి .సెక్స్ సినిమాల ముద్ర తో వచ్చే షకీలా సినిమాలు సమాజం లోని అన్ని వర్గాల వారు చూడరు .ఆ థియేటర్ల ముందు కూడా నిలబడరు .కాని పూరి జగన్నాథ్ ,సెన్సార్ బోర్డు ,కలిసి అలాంటి భయాలేమి అవసరం లేకుండా ఆబాలగోపాలానికి, షకీలని మించి పోయేంత అంగాంగ ప్రదర్శనలతో సినిమాలు చూపించి మైమరిపిస్తున్నారు.ఏ అడ్డం ,సిగ్గు లేకుండా ప్రజలు ఈ సెక్స్ సినిమా లు చూసేస్తున్నారు.
హెచ్.బి .టీ వాళ్ళు ,”వ్యసనం” అని ఒక అనువాద పుస్తకం ప్రచురించారు .అందులో డ్రగ్స్ కన్నా ఆల్కహాల్ ఎక్కువ ప్రమాదకరం అంటాడు రచయిత.ఎందుకంటే ఆల్కహాల్ లభ్యత ఎక్కువ.ప్రభుత్వమే స్వయంగా దుకాణాలను పెట్టి వ్యసనాన్ని నేర్పుతుంది.పూరి జగన్నాథ్ సినిమాలు ఆల్కహాల్ అయితే మన సెన్సార్ ప్రభుత్వ సారాయి దుకాణం లాంటిది.
ప్రజాసాహితి ,ఆగష్టు 2006.
15 comments:
ఆరేళ్ళ తర్వాత తెలుగు సినిమాని ఇంతకన్నా పరుష పదజాలంతో తిట్టినా.. కూడా.. ఈగ వాలినట్లైనా ఉండదు గాక ఉండదు. సభ్య సమాజాన్ని వీలైనంత నాశనం చేసే సినిమాల గురించి.. వీలైనంత ఎక్కువ వ్రాసి.. కనీస అవగాహనతో.. చూడకుండా ఉండటానికి అయినా వెనుకంజ వేసేటట్లు చేయగల్గితే.. కొంతైనా విజయం చేకూర్చుకున్నట్లే!
ఇలాంటి సినిమాల గురించి వ్రాయంటే మీ డోసు సరిపోదండీ...ఓ సినిమా మహేష్ బాబుతోనే తీసి తిట్టించాలి. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదనీ....
వనజ వనమాలి గారూ
చాలా విలువైన వ్యాఖ్య చేసారు.అవును ఈగ వాలినట్లు కూడా వుండదు.అవును ఇంకా ఎక్కువగా రాయాలి.థాంక్యు
జ్యోతిర్మయి గారూ
మీ ఐడియా సూపర్ నిజంగా.చందాలేసుకుందామా?పొగర్ఫుల్ డైలాగులు రాయడానికి చందు.ఎస్ గారు ఆల్రెడీ ఎవర్నో వెతికినట్టున్నారు కూడా..: )) థాంక్ యు.
బాగా వ్రాసారు.
సాధారణంగా అందరు దర్శకులూ పెట్టుకున్న పరిమితులని అతిక్రమించి, ఒకోసారి బరితెగించి సినిమాలని తీయడం పూరీకి అలవాటు.
పోకిరిని మించి రెచ్చిపోయిన బిజినెస్‌మేన్‌ని మీరు చూడలేదా?
అ సినిమాని బీప్మేన్ అనాలి అసలు. అన్ని బీప్‌లు ఉన్నాయి అందులో.
ఆ కొలవెరి గురించి నా బ్లాగులో వ్రాసాను. ఒకసారి చదవండి.
Bonagiri garoo
బిజినెస్ మేన్ చూసి దడుచుకుని,కోలుకుని,రాస్తూ ,రాస్తూ...అప్పుడెప్పుడో పూరీ సినిమా మీదే రాసానని జ్ఞాపకమొచ్చి ఇలా బ్లాగ్లోఉంచాను.మీ కొలవేరి చదివాను,చాలా బాగుంది.
pervertion is the word to discribe these movies. That song "appatikinkaa naavayasu ninda padahaarë" is nasty. what is that song promoting? child abuse? I can't believe these kind of movies are block busters.whats wrong with our society? I really thought mahesh babu is sensible. But the way he was celebrating the shocking success of "dookudu"& "businessman" cleared those wrong ideas.
అరవింద్ జాషువా గారు
కొన్నేళ్ల క్రితం అనుకోకుండా మిమ్మల్ని టీ వీ లో చూశాను.జస్ట్ లాస్ట్ బిట్ .అప్పుడు మీ గురించి నాకేం తెలీదు కానీ, చాలా ఇంప్రెస్ అయ్యాను.ఇప్పుడు మీ కామెంట్ చూడగానే గుర్తొచ్చారు.
నిన్ననే నా బిడ్డ వాళ్ళ నాన్న ఏదో పని చేస్తూ ఆ పాట గురించి ,కనీసం...నిండా ఇరవైయ్యారే అనైనా అనొచ్చు కదా ,పదహారెళ్ళే అంటే చైల్డ్అబ్యూస్ లాగుంది అని అన్నారు.ఇవాళ అదే అభిప్రాయం మీ నుండి విన్నాను.నిజంగా చాలా సంతోషం వేసింది మీ ఆలోచనా విధానానికి...పైగా మీరు ఆ రంగం వారే కూడాను.
అరవింద్ గారూ ఒక్కోసారి ఇలాటి సినిమాలు,పాటలూ చూస్తే చాలా దిగులేస్తుంది,ఆడపిల్ల అంటే వొట్టి శరీర భాగాలేనా అని.మళ్ళీ పర్లేదు ,సగం సమాజం ఎప్పుడూ వెనకడుగులే వేస్తుంటుంది.దాన్ని అసహ్యించుకుంటూ , ఖండిస్తూ ,మంచిని కాంక్షించే మీ లాంటి వాళ్ళూ వున్నారు అని ఓదార్పు,ధైర్యం కూడా కలుగుతుంది.మీ స్పందనకు కృతజ్ఞతలు.
ఊళ్ళో లేక పోడం చేత మీ కామెంట్ వెంటనే చూడలేకపోయాను.క్షమించండి.
Aravind gaaroo
చెప్పడం మరిచాను,మీ బ్లాగ్స్ చూసాను,కామెంట్ పెట్టడానికి రాలేదు.మీ పాప ముత్యాల సరంలా వుంది. చాలా బాగుంది.తనకి నా బ్లెస్సింగ్స్.పేరేమిటి?
.
కాస్త ఆలస్యంగా చూసాను. అయినా తృప్తి గా వుందండీ నేనూ ఒకటి రెండుసార్లు పూరీ పట్ల నా అసహ్యాన్ని వెలిబుచ్చాను కానీ ఈ రేంజ్ లో కాదు . అదరగొట్టేసారు. పూరీ సినిమాల్లో హీరోలుండరు. హీరోయిన్లూ వుండరూ.......ఆ పాత్రలకి వేరే పేర్లేవో పెట్టాలి
thank you lalitha gaaroo..
చాలా బాగా రాశారు. ఏం చెప్పాలి ఇంక.
Felt agitated after reading your post.
congratulations
అనుకోకుండా ఓ రోజు మీ బ్లాగ్ చూసా .ఎంత నచ్చిందో .బిజినెస్ మేన్ పై రాసిన పోస్ట్ ముఖ్యంగా .ఇంట్లో అందరికీ చెప్పా.ఎంత నవ్వుకున్నానో...
తెలుగు సాహిత్యంలో హాస్యాన్ని రాసే వాళ్లు చాలా తక్కువై పోయారు ,ఇప్పుడైతే ఎంత సేపు గ్లోబలైజేషన్ అనో ఆదనో ఇదనో వాదాలు .అట్లా కాకుండా ఏది చెప్పినా మీలా చెప్తే పాటకులు కూడా ఎంత బాగా వింటారు కదా .రాత్రే నా హస్బెండ్ తోలేటి జగన్మోహన్ రావ్ గారిది 'కప్పడాలు' అని ఓ కథ చదివి ఎంత సేపు నవ్వుకునారో ,అప్పుడు కూడా అనుకున్నాను మీ గురించి.మీరు సీరియస్ గ, సీరియస్ విషయాలను ఇట్లా హాస్య కథలుగా రాయడం [బ్లాగ్ లో కాదు]ఎందుకు స్టార్ట్ చేయ్యూడదు?
మీరెవరో నాకు తెలీదు.ఒకవేళ మీరు ఇప్పటికే ప్రముఖ రచయితలై వుంటే ఈ సలహాకి క్షంతవ్యురాలను.
hyppocrasy లేకుండా ఓపెన్ గ behave చెయ్యగల, జనాల వెర్రి కేకల్ను లెక్క చెయ్యని,నచ్చింది చేసే, దమ్మున్న,నికార్సైన డైరెక్టర్ ని ,అనే భ్రమ లో ...నిర్లజ్జ గ తనకున్న టాలెంట్ ని కలగలిపి .."భూతు" ప్రధానం గ విచ్చలవిడిగా బరితెగించాడు porni jagannath .
నాకెవ్వడితో పనిలేదు...సామజిక విలువలు అసలే పని లేదు, అంత నా ఇష్టం... అనేది బాగా తలకేక్కిచ్చుకున్న విషయం లో పూరి వాళ్ళ గురువుని మించి పోయినట్టున్నాడు.
Direction department లో హీరో involve కాకూడదు అనేది ఒక ethic ఐన, ఇలా బండబూతులు పలికిస్తంటే కనీసం అదుపు చెయ్యలేక పోయాడ
prince .
ఆయన గురువు సినిమాలలో అంత బూతు ఉండదనుకుంటా కదా?ఈ మధ్య ఫాలో కాటం లేదు లెండి...తెలీదు.ఈ మూవీ కూడా ఊరికోచ్చాం కదా మొన్న అప్పుడు బలయిందే ...థాంక్ యు
Post a Comment