About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 25 February 2013

పండుటాకులు

నా విపరీత తలనొప్పి వల్ల నేను ప్రింట్ లో తప్పించి సిస్టం ముందు కూర్చుని ఏదీ చదవలేను . అందుకే ఈ నెల భూమికలో వచ్చిన ఈ అనువాద కథ చదవలేక పోయాను .భూమిక ఇప్పుడే అందింది . శాంత సుందరి గారి అనువాదం పైవున్న గౌరవంతో ఈ కథ వెంటనే చదివాను . కథ చాలా నచ్చింది . అందుకే షేర్ చేస్తున్నాను . తప్పక చదవండి .చెప్పిన తీరు ఎంత సున్నితంగా వుందో ..రచయిత్రి సుధా అరోరా ని కలిసి మందాకినీ ఎవరో తెలుసుకుని ఆవిడనీ ,ఆవిడ కూతుర్నీ హృదయానికి హత్తుకోవాలనేంత దుక్కం వచ్చింది
హిందీ మూలం : సుధా ఆరోరా అనువాదం : ఆర్‌. శాంతసుందరి..

టప్‌… టప్‌… ఇంకొక పండుటాకు కింద పడింది. వెంటవెంటనే మరికొన్ని పడ్డాయి. జనవరినెల తెల్లారగట్ల సూర్యుడు తూర్పుదిక్కున ఎర్రగా ఉదయిస్తున్నాడు. పచ్చనిచెట్ల కిందా, తనంత ఎత్తే ఉన్న మొక్కలకూ ఉన్న పండుటాకుల్ని ఆవిడ వేళ్ళు చురుగ్గా ఏరేస్తున్నాయి. వాటిని ప్రేమగా ఏరి జాగ్రత్తగా ఎడమచేతికి తగిలించుకున్న సంచీలో వేస్తోంది ఆమె. ఒక ఏడాదిగా ఆవిణ్ణి నేను దాదాపు ప్రతిరోజూ చూస్తున్నాను. నెరిసిపోయి చిందరవందరగా ఉండే జుట్టూ, అందంగా మెరిసే మొహం… ఏదో వెతుకుతున్నట్టు ఎటో చూస్తూ ఉంటుందావిడ. ఆవిడ కనబడగానే నేను ఒక్కక్షణం ఆగి, చిరనవ్వుతో పలకరించి ముందుకి సాగిపోతుంటాను. పార్కు గేటు దగ్గరుండే వాచ్‌మాన్‌ చేత్తో సైగచేసి ఆ ముసలావిడకి మతిస్థిమితం లేదని నాకు చెపుతూ ఉంటాడు. అతనలా అన్నప్పుడల్లా నా మనసు చాలా బాధపడుతుంది. కళ్ళురిమి వాణ్ణి కోపంగా చూస్తాను, కానీ వాడి వంకరనవ్వూ, పార్కులో ఉండే చిన్నపిల్లల ముసిముసినవ్వులూ, ‘ఏయ్‌, పిచ్చిదిరా… అటువైపు వెళ్ళద్దు…’ అంటూ ఆవిడని ఎగతాళి చెయ్యడం మాత్రం ఆగవు. ఆ పిచ్చావిడ అటుగా వెళ్ళేవాళ్ళనెవరినీ ఆపదు, పలకరించదు, ఎవరి పనులకీ అడ్డురాదు. పార్కులో జారేబండ మీద జారుతూ కిలకిల నవ్వే పిల్లలవైపు ఆశగా చూస్తుంది. లేదా పచ్చని మొక్కల్లో పండుటాకుల్ని వెతికి మరీ తుంపుతూ ఉంటుంది. అయినా ఆ పార్కుకి వచ్చేవాళ్ళందరూ ఆవిణ్ణి పిచ్చావిడ అనే అంటుంటారు. కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు ఆవిడ ఒంటరిగా లేదని గమనించాను. ఆవిడ వెంట ఒక ఆయాలాంటి మనిషి వచ్చింది. బహుశా ఇంట్లోవాళ్ళకి ఆవిణ్ణి పార్కుకి ఒంటిగా పంపకూడదన్న సంగతి ఇప్పటికి అర్థమైనట్టుంది. ఇద్దర్నీ చూసి ఆగాను. ఆవిడ నావైపు చూడగానే ”నమస్కారమండీ!” అన్నాను. ఆవిడ ముందు బెదిరినట్టు కనిపించింది, ‘నువ్వెవరు?’ అన్నట్టు నాకేసి చూసింది, తరవాత నెమ్మదిగా ఆవిడ పెదవులమీద చిరునవ్వు లీలగా విచ్చుకుంది. ఆయా ఆవిడ చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తోంది, కానీ ఆవిడకి బెంచి మీద కూర్చోవాలని ఉన్నట్టుంది, బెంచి వైపు వెళ్తోంది. ”మీ పేరేమిటండీ?” నెమ్మదిగా, మాటల్ని స్పష్టంగా పలుకుతూ అడిగాను. ఆవిడ ముందు ఆయావైపు చూసి, తర్వాత నావైపు చూసింది. మళ్ళీ అదే చిరునవ్వు, కానీ నోరు విప్పి ఏమీ అనలేదు. మర్నాడూ, ఆ తరవాతి రోజూ మళ్ళీ అదే ప్రశ్న వేశాను. ఈసారి ఎన్నో ఏళ్ళ తరవాత ఆ పెదవులు విడిపడ్డట్టు, ”మందా…కిని…” అంది తడబడుతూ. ఆ గొంతు తియ్యగా ఖంగుమంది. ఆయా ఆశ్చర్యంగా నావైపు చూసింది. జ జ జ ఇప్పుడావిడ పేరు తెలిసిపోయింది. మర్నాడు పార్కుకి చేరుకోగానే అప్పటికే ఆవిడ వచ్చి మామిడిచెట్టు దగ్గర నిలబడి ఉండడం చూశాను. దూరంనించే నన్ను చూసి నవ్వింది. చెట్టునుంచి రాలిన కొన్ని ఆకుల్ని ఏరుకుని బెంచి మీద కూర్చుంది. నన్ను వచ్చి తన పక్కన కూర్చోమని సైగ చేసింది. నన్ను వాకింగ్‌కి వెళ్ళనివ్వలేదు. నా కుర్తాని చేత్తో రాస్తూ కూర్చుంది. ఆ రంగూ డిజైనూ తనకి చాలా నచ్చిందని చెపుతున్నట్టు! ఉన్నట్టుండి, ”చీర…” అంది. ఇంకా ఏమైనా అంటుందేమోనని ఆవిడవైపు చూశాను. నేనేమీ మాట్లాడకపోయేసరికి, తన చీర కొంగు తీసి పట్టుకుని, ”చీర!” అంది మళ్ళీ. నేను చీర కట్టుకోలేదేమని అడుగుతోందనుకున్నాను. ”చీర కట్టుకుని వాకింగ్‌ చెయ్యడం కష్టం,” అన్నాను. నాకు ఆలస్యమవుతోంది. ”ఒక రెండు రౌండ్లు అలా తిరిగి వస్తాను, సరేనా?” అన్నాను. వెంటనే ఆవిడ నా చెయ్యి గట్టిగా పట్టేసుకుంది. తన చేతిలో ఉన్న మామిడాకుల్ని బెంచి అంచున పెట్టి, ఆ చేతిమీద పట్టుని మరింత బిగించింది, చిన్నపిల్ల తల్లిని బైటికి వెళ్తానంటే గట్టిగా పట్టుకున్నట్టు. కాసేపటికి ఆవిడ పట్టు కాస్త సడలించినట్టనిపించి, ”మందాకిని, మీరు కూర్చునుండండి, నేనొకసారి అలా తిరిగొస్తాను,” అన్నాను. నేను ఆ పార్కు చుట్టూ నాలుగు రౌండ్లు తిరిగి వచ్చేసరికి ఎండ ఇంకో బెంచి మీదికి మారిపోయింది. ఆవిడమాత్రం ఇందాకటి బెంచిమీదే నాకోసం ఎదురుచూస్తూ కూర్చునుంది. నేనావిడ చెయ్యిపట్టుకుని ఎండ పడుతున్న బెంచి దగ్గరకి తీసుకెళ్ళాను. లేచి వచ్చేప్పుడూ ఆ మామిడాకుల్ని తీసుకోవడం మర్చిపోలేదావిడ. ఉన్నట్టుండి నావైపు చూసి ఒక ఆకుని మధ్యకి చీల్చడం మొదలుపెట్టింది. ఆకు మధ్యనుండే ఈనెని గోళ్ళతో గీకి సాపు చేసింది. తరవాతా కాడని రెండు చిన్న ముక్కలు చేసింది. ఆవిడ ఏం చెయ్యాలనుకుంటోందో నాకు అర్థం కాలేదు. ఆ కాడల్ని ఆవిడ పూరేకుల్ని పట్టుకున్నంత జాగ్రత్తగా పట్టుకుని, నావైపు చూసింది. ఏమంటుందా, ఏంచేస్తుందా అని ఎదురుచూడసాగాను. ఇంతలో ఆవిడ నా చెవులకేసి చూపించి ఏదో సైగ చేసింది. ఓహో, నేను చెవులకి ఏమీ పెట్టుకోలేదు, ఆ విషయం గమనించినట్టుంది! ఆవిడ ఆ రెండు కాడలనీ నా చెవులకున్న చిల్లుల్లో దూర్చింది, చాలా నాజూగ్గా. బంగారపు కమ్మలు పెట్టుకున్నప్పటికన్నా ఆవిడ పెట్టిన ఆ ఆకు కాడలు నాకు బావున్నాయనిపించింది. నా చెవులు అలా బోసిగా ఉండడం ఆవిడకి నచ్చలేదు! నా గొంతు పూడుకుపోయింది. అమ్మ గుర్తొచ్చింది. అమ్మ కూడా నా చెవులకేమీ లేకపోతే వెంటనే, ”అలా వదిలేస్తే పూడుకుపోతాయి” అని రింగులో ఏవో పెట్టేది. చేతులు కూడా బోసిగా ఉండకూడదు. ”ఏమిటా బోసి చేతులు, గాజులేసుకో!” అని తిట్టేది. కళ్ళు మూసుకుని అమ్మ మొహం గుర్తుతెచ్చుకుంటూ నేను ప్రాణాయామం మొదలుపెట్టాను. మధ్యలో కళ్ళు తెరిచి చూద్దును కదా ఆవిడ కూడా నన్ను అనుకరిస్తూ కనిపించింది. కానీ నాలాగ ఎక్కువసేపు ‘ఓం’ అనడం ఆవిడకి సాధ్యం కావడం లేదు. మాటిమాటికీ ఊపిరి తీసుకునేందుకు ఆగటం మొదలెట్టింది. కానీ తన ప్రయత్నంమట్టుకు మానలేదావిడ. కొంతసేపు ప్రాణాయామం చేశాక ”గుడికి…?” అంది. నాకు వినబడినా సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఒకసారి అదే ప్రశ్న వేసింది. ”నేను గుడికెళ్ళను. గుడి ఇక్కడే, నాలోనే ఉంది,” అని ఈసారి జవాబు చెప్పాను. తరవాత ఆమె భుజాన్ని తాకుతూ, ”మీలోనూ ఉంది,” అన్నాను. ఆవిడ చాలా అమాయకంగా నవ్వి అవునని తలాడించింది. ఇంతలో నాకు తుమ్ములు పట్టుకున్నాయి. కపాలభాతి క్రియ చేశాక అప్పుడప్పుడూ అలా జరుగుతుంది. ఆవిడ నావైపే చూస్తూ, ”పాలు?” అంది. ”పాలు తాగాలని అంటున్నారా?” అన్నాను. ”వేడిగా.” ”వేడిపాలు తాగాలా?” ఆవిడ నిలువుగా తలాడించింది. ”అరటిపండు,” అంది మళ్ళీ. ”తింటాను, రోజుకొకటి.” ”పాలు” అంది మళ్ళీ. ఒకసారికి ఒకేమాట అనేసి పెదవులు గట్టిగా మూసుకుంటుంది. క్లాసులో పిల్లకి ఎవరో మాట్లాడద్దని చెప్పినట్టు, ఒక మాట మాట్లాడగానే టీచరు కోప్పడుతుందని భయపడ్డట్టు, వెంటనే నోరు మూసేస్తుంది. ”పాలూ అరటిపండూ తీసుకోవాలా?” అన్నాను. ”ముక్కలు,” అని చేత్తో చిన్నచిన్న ముక్కలు కొయ్యడం అభినయించింది. ”అలాగే, పాలలో అరటిపండు ముక్కలు వేసుకుని తింటాను.” ”వేడిగా.” నేను నవ్వి, ”అలాగేనండీ!” అన్నాను. అప్పుడు ఆవిడ నా చేతిని సుతారంగా నిమురుతూ తన తలని నా భుజానికి ఆనించింది. ఎంతో తృప్తిపడ్డట్టు, పసిపిల్లాడు వచ్చీరాని భాషలో చెప్పిన మాటలు తల్లికి అర్థమయితే వాడికి ఎంత సంతృప్తిగా ఉంటుందో, అదే విధంగా, నేను నా భుజం మీదున్న ఆవిడ తలని చేత్తో రాశాను. తెల్లారగట్ల ఆకులమీది మంచు బిందువుల తడి నెమ్మదిగా నా మనసుని ఆక్రమించడం మొదలుపెట్టింది. ఈవిణ్ణి అందరూ పిచ్చిదంటారు. కానీ ఈవిడ పిచ్చిది కాదు, ప్రేమకోసం పరితపించిపోతోంది. ఈవిడ జీవితం ఎప్పుడు, ఎలా పట్టాలు తప్పిపోయిందో ఎవరికి తెలుసు? జ జ జ మర్నాడు కూడా అలాగే జరిగింది. ఆవిడ పార్కులో నడవదు, నన్ను కూడా వెళ్లనివ్వకుండా పట్టుకుని బెంచి మీద కూర్చోబెట్టేసింది. ఆవిణ్ణి మాటలతో బులిపించి ఎలాగో మూడునాలుగు రౌండ్లు తిరిగి వచ్చాను. ఆ తరవాత ఆవిడ దగ్గర కూర్చుని ప్రాణాయామం చేశాను. ప్రాణాయామం అయిపోయాక నా కుర్తాని చేత్తో రాస్తూ మొహం చిట్లించి, ”ఇచ్చెయ్యి,” అంది. ”ఇచ్చెయ్యాలా? ఏమిటి, ఎవరికి?” అన్నాను. ”చీర,” అంది. నాకు నవ్వొచ్చింది, ”కుర్తా ఇచ్చేసి, చీర కట్టుకోవాలా నేను?” అన్నాను. ఆవిడ మాటలు అర్థం చేసుకున్నందుకు చక్కగా నవ్వింది. హఠాత్తుగా నాకు నా స్నేహితురాలొకామె గుర్తొచ్చింది. ప్రమాదంలో భర్త చనిపోతే ఆమె మానసికంగా కుంగిపోయి పిచ్చిదానిలా ప్రవర్తించేది. తన దగ్గరున్న ఖరీదైన బట్టలన్నీ ఎవరెవరికో ఇచ్చేసేది, ఎవరూ దొరక్కపోతే కిటికీలోంచి బైట పారేసేది. తను మాత్రం వెలిసిపోయిన, చిరిగిపోయిన బట్టలు వేసుకునేది. మందాకిని రోజూ పార్కులో కలుస్తోంది. ఒకే ఒక మాట అనడం, మిగతాది హావభావాలతో, చేతి కదలికలతో చెప్పడం. ఒకరోజు ఆవిడ పండుటాకులు కోసేందుకు ఒక పక్కకి వెళ్ళగానే ఆయా నాతో, ”రెండేళ్ళుగా ఈవిడ దగ్గర పనిచేస్తున్నా. ఎప్పుడూ ఈవిడ మాట్లాడగా వినలేదు. ఇప్పుడు మీముందు నోరువిప్పి మాట్లాడుతోంది. ఇంతకుముందు ఈవిడ గొంతు కూడా వినలేదు నేను. ఎంత తియ్యగా మాట్లాడుతోందో! ఇన్నాళ్ళూ ఒంటరిగా ఇక్కడికి వచ్చేది. ఒకరోజు ఒకావిడ తన పిల్లాడి చొక్కా ఈవిడ చింపేసిందని పోట్లాటకొచ్చింది. అప్పట్నించీ నేను వెంట వస్తున్నా,” అంది. ఈ లోపల మందాకిని జోలెనిండా పండుటాకులు నింపుకొచ్చింది. కూర్చోగానే నా అరచెయ్యి పట్టుకుని, ”కత్తిరించు,” అంది. నాకేమీ అర్థం కాలేదు. ఒక్క క్షణం పోయాక అర్థమైంది. గోళ్ళు పెరిగిపోయాయని అంటోందావిడ. ”అలాగే కత్తిరిస్తాను,” అన్నాను. ”మంగళ…ఊహూ…” ”మంగళవారం వద్దా?” ”శని…ఊహూ…” బుద్ధిగా తల అడ్డంగా ఆడించి, ”సరే, శనివారం కూడా కత్తిరించను,” అన్నాను. కానీ మళ్ళీ పొగరుగా, ”ఏమవుతుంది కత్తిరిస్తే? వారం వర్జ్యం చూడాలా?” అన్నాను. ఆవిడ నవ్వింది. ఎంతో సాత్వికంగా ఉందా నవ్వు, కళ్ళు నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. మందాకిని అడిగారని గోళ్ళు మర్నాడు కత్తిరించాను. కానీ ఆ తర్వాత పార్కుకి వెళ్ళడం పడలేదు. అహ్మదాబాద్‌నించి నా స్నేహితురాలు వచ్చింది. రెండ్రోజులుంది. పార్కుగుండా మా ఆఫీసుకెళ్ళేందుకు ఒక చిన్న దారి ఉంది. ఆ దారిన వెళ్తూంటే మందాకిని పార్కులో కూర్చునుండడం కనిపించింది. ఆయా ఆమె ఎక్కడ పారిపోతుందో అన్నట్టు చెయ్యి గట్టిగా పట్టుకునుంది. నన్ను చూడగానే ఆవిడ నవ్వింది. నా స్నేహితురాలిని పరిచయం చేశాను. ఆవిడ ఆయా చేతిలో ఉన్న తన చేతిని లాక్కుని, రెండు చేతులతో నా మెడ చుట్టేసింది. నా మొహానికి తన మొహం ఆనించి, అప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్న పసిపిల్లలా, ముద్దుముద్దుగా,” ఈమె…నా…స్నే…హితు…రాలు…” అంది నా స్నేహితురాలికి నన్నే పరిచయం చేస్తూ! నేను విస్మయంగా ఆవిడకేసి చూస్తూ ఉండిపోయాను. ఆవిడ నన్ను తన స్నేహితురాలని చెప్పేసరికి లోపలంతా చల్లని జల్లులు కురిసినట్టనిపించింది నాకు. ఆవిడ నా మెడమీదనించి చేతులు తియ్యడం లేదు. కష్టపడి చేతులు వదిలించుకుని, ”ఈరోజు పనుందండీ. తీరిగ్గా ఇంకోరోజు కూర్చుని కబుర్లు చెప్పుకుందాం,” అన్నాను. ”రావాలి,” అంది మందాకిని. ఆవిడ మొహం మీద నవ్వు మాయమైంది. మళ్ళీ వాక్యాల్లోంచి ఒకే ఒక మాటలోకి వచ్చేసింది. వాతావరణం మారుతోంది. చలి పెరిగింది. నాకు జ్వరం వచ్చింది. వారంరోజులు పార్కువైపుకి వెళ్ళలేకపోయాను. ఆ తరవాత వెళ్తే మందాకిని ఎన్నో ఏళ్ళుగా చూడనట్టు నన్ను చుట్టేసింది. నోరువిప్పి మాట్లాడలేదు, కానీ హావభావాలతో ఇన్నాళ్ళూ ఏమయావని అడిగింది. జ్వరం వచ్చిందని చెప్పేసరికి నా నుదురూ, బుగ్గలూ తాకి చూసింది. జ్వరం లేదని తల అడ్డంగా ఆడించి, చిరునవ్వు నవ్వింది. అన్నీ చాలా స్లోమోషన్‌లోనే! ”ఇల్లు,” అంది ఉన్నట్టుండి. నన్ను ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోమంటోందనుకుని, ”పరవాలేదు, నేనివాళ బాగానే ఉన్నాను. అందుకే నడవడానికి వచ్చాను,” అన్నాను. ”ఊహూ… ఇల్లు…” అంది మళ్ళీ. ఇంతలో ఆయా కల్పించుకుని, ”అమ్మగారు రోజూ మీకోసం వెతికేది. మీరు పార్కులోకొచ్చే గేటువైపు నన్ను లాక్కెళ్ళేది. కానీ మాకు మీ పేరేమిటో, ఏ ఫ్లాట్‌లో ఉంటారో తెలీదాయె! ఎలా వస్తాం? అందుకే మిమ్మల్ని వాళ్ళింటికి తీసుకెళ్ళాలనుకుంటోంది అమ్మగారు,” అంది. మళ్ళీ మందాకిని అదే మాట, ”ఇల్లు…” అంది. మీ ఇంటికా? అలా హఠాత్తుగా నన్ను ఇంటికి తీసుకెళ్తే మీ ఇంట్లోవాళ్ళేమీ అనుకోరా?” అన్నాను. ఆవిడ మౌనంగా ఆయాకేసి చూసింది. ”అమ్మగారూ, అమ్మాయీ మాత్రమే ఉంటారు. ఆమె ఏమనుకోదు,” అంది ఆయా. నేను చాలా సంకోచపడుతూ ఆవిడ వెంట వెళ్ళాను. సరే, వీళ్ళమ్మాయితో మాట్లాడితే ఈవిడ ఇలా ఎందుకుందో తెలుస్తుంది. ఇంత అందమైన మందాకిని, గొప్పింటావిడలా కనిపించే ఈవిడ ఇలాటి స్థితికి ఎలా చేరుకుందో తెలుసుకోవచ్చు అని అనుకున్నాను. లిఫ్ట్‌ ఎక్కుతూంటే మందాకిని మొహాన చిరునవ్వు కనిపించింది. మొహం గర్వంతో వెలిగిపోసాగింది. తనకి కూడా ఒక స్నేహితురాలుందనీ, ఆమెని ఇంటికి తీసుకెళ్తున్నాననీ కాబోలు! జ జ జ పదో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌ డోర్‌ బోల్‌ మీద వేలితో నొక్కింది ఆయా. లోపల్నించి గాయత్రీ మంత్రం వినిపిస్తోంది. తలుపు తెరిచి, ఒక అతి అందమైన బక్కపల్చటి అమ్మాయి తలుపు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ పిల్ల నైటీ వేసుకునుంది. ఒంటిమీద నగలేవీ లేవు. ముప్ఫైయేళ్ళప్పుడు మందాకిని కూడా ఇలాగే ఉండి ఉండాలి. పూర్తిగా ఆవిడకి కార్బన్‌ కాపీ! జుట్టు పొట్టిగా కత్తిరించుకుంది. పొద్దున్నించీ దువ్వుకోనట్టు జుట్టు చెదిరిపోయి ఉంది. ఆయా నాకేసి చూపిస్తూ, ”ఈవిడే అమ్మ ఫ్రెండు. రోజూ పార్కులో కలుస్తారు,” అంది. అంతే ఆ అందమైన అమ్మాయి మాట్లాడడం మొదలెట్టి ఒక పెద్ద కథే చెప్పుకొచ్చింది-అదొక అంతులేని కథ! ”నా పేరు అన్వేష. బావుంది కదా? అమ్మే పెట్టింది. నాన్న ఏనీ అని పెడదామనుకున్నాడు. ఇప్పటికీ ఆయన ఆ పేరుతోనే పిలుస్తాడు నన్ను. విద్యాసాగర్‌ కాలేజీలో ఎకనామిక్స్‌లో ఆనర్సు కోర్సు చేశాను. నా వయసు ముప్ఫై ఐదు. పెళ్ళి చేసుకోలేదు. చేసుకోవాలనిపించనే లేదు. ఎవ్వరూ నచ్చలేదు. పెళ్ళంటే అయిష్టమేమీ లేదు, కానీ సరైన వ్యక్తి దొరకలేదు. కాలేజీలో ఒకబ్బాయితో స్నేహం చేశాను, కానీ అతను ఉత్త స్నేహితుడిగానే మిగిలాడు. అతన్ని కూడా పెళ్ళి చేసుకోవాలనిపించలేదు. ”పెళ్ళి అనే మాట వింటేనే భయమేస్తుంది. అతనితో స్నేహం చేసినప్పుడు నేను బోలెడన్ని కవితలు రాశాను తెలుసా మీకు? సినిమాలకి కూడా రాద్దామనుకున్నాను, కానీ అభిజీత్‌ నా పాటలు చాలా గొప్పగా ఉన్నాయనీ, సినిమాలకి ఏవో సరదాగా అల్లాటప్పా పాటలు రాస్తే చాలనీ అన్నాడు. ఇంకా రాస్తూనే ఉన్నా అప్పుడప్పుడూ… ఒక నాలుగు లైన్లు చదవనా? వింటారా…వద్దులెండి, ఈసారి వచ్చినప్పుడు వినిపిస్తా…” ఆ పిల్లలో కూడా పసిపిల్లల అమాయకత్వం కనిపించింది. ఆపకుండా గలగలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. కళ్ళు నాకేసి కాకుండా శూన్యంలోకి చూస్తూ ఏదో వెతుకుతున్నట్టు విపరీతంగా చలిస్తున్నాయి. ఇంతలో ఆయా, ఒక గాజు గ్లాసులో నీళ్ళూ, ఒక మాత్రా తీసుకొచ్చింది. అన్వేష ఆ మాత్రని నోట్లో వేసుకుని నీళ్ళతో మింగేసింది. ”మూడ్‌ స్టెబిలైజర్‌, ఆంటీ, రోజూ వేసుకోవాలి,” అంది నాతో. నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. నోరు తెరుచుకుని అలా చూస్తూ ఉండిపోయాను. ఆ అమ్మాయి ఊరికే తన గురించే చెపుతూ పోయింది, నా గురించి ఏమీ అడగలేదు. ఆ సంగతి నేనింతవరకూ గమనించనేలేదు. ఈ పిల్లకి ఏమని జవాబు చెప్పాలి? అనుకున్నాను. పక్కకి తిరిగి గోడకున్న ఫోటోలు చూడసాగాను. ఒక స్ఫురద్రూపిలా కనిపిస్తున్న అతని ఫోటో ఉందక్కడ. అతను అందంగా, హుందాగా చిరునవ్వు నవ్వుతున్నాడు. ఒక్కక్షణం నా కళ్ళు ఆ ఫోటో దగ్గర ఆగాయి. వెంటనే అన్వేష, ”మా నాన్న ఫోటో, ఆంటీ,” అంది. మళ్ళీ తనే, ”జర్మనీలో ఉంటారు,” అంది. మళ్ళీ గబగబా మాట్లాడడం మొదలెట్టింది. అనంతంగా ఆ అమ్మాయి మాట్లాడుతూంటే అర్థం చేసుకోవడం నావల్ల కాలేదు. కొన్ని విషయాలు మాత్రం తెలిశాయి. జర్మనీలో ఈమె తండ్రి మోనికా అనే ఆవిడతో ఉంటాడు. ఆవిణ్ణి అమ్మా అని పిలవమని ఈ అమ్మాయిని ఎప్పుడూ సతాయిస్తూ ఉంటాడు.” కానీ అమ్మ ఇక్కడుండగా ఆవిణ్ణి అమ్మా అని ఎలా పిలవడం! నాన్నకి అమ్మ చేతి వంటంటే చాలా ఇష్టం. ఏడాదికి ఒకసారి ఇక్కడికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అమ్మ మంచిమంచి వంటలు వండుతుంది…ఆయనకోసం…నాకోసం కూడా! ”ఒకసారి మోనికా కూడా నాన్న వెంట వచ్చింది. అప్పుడు అమ్మకి స్ట్రోక్‌ వచ్చింది. బాగయిపోయింది, కానీ మాట్లాడడం పూర్తిగా మానేసింది…ఎవరితోనూ మాట్లాడదు. ఇప్పుడు నాన్న ఒక్కడే వస్తాడు. బ్యాంకులో డబ్బు వేసి వెళ్తాడు. అంతా సవ్యంగానే ఉంది…” అలా ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంది. ”నాన్న జర్మనీనించి మాకోసం బోలెడన్ని డ్రస్సులు తీసుకొస్తాడు. కానీ అమ్మ వాటిని తొడుక్కోదు. ఆవిడ ఎప్పుడూ చీరే కట్టుకుంటుంది. మీరే చెప్పండి ఆంటీ, ఇంట్లో కూడా ఎవరైనా చీరలే కట్టుకుంటారా? అమ్మకి చీరంటే పిచ్చి ఇష్టం. నన్ను కూడా ఎప్పుడూ నైటీ విప్పేసి చీర కట్టుకోమంటూ ఉంటుంది. నాది చీర కట్టుకునే వయసా? ఈ నైటీ చూడండి ఎంత బావుందో! నాన్న జర్మనీనించి తెచ్చాడు. నాకోసం. నేనంటే ఆయనకి చాలా ప్రేమ. కానీ ఇక్కడ ఉండడం సాధ్యం కాదు, అంత పెద్ద ఉద్యోగం ఆయనది! ఎంబసీలో పని. ఎప్పుడూ పనిలో మునిగి ఉంటాడాయన. అమ్మేమో రెండేళ్థుగా మాట్లాడడమే మానేసింది. ఎందరో డాక్టర్లకి చూపించాం. కానీ ప్రయోజనం లేకపోయింది. మీరేం చేశారో గాని, ఆవిడచేత మాట్లాడించారు! మీరు మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా వుంది. థాంక్యూ సో మచ్‌!” నేను డ్రాయింగ్‌ రూమ్‌ని పరికించాను. అంతా రోజ్‌వుడ్‌తో చేసిన పాతకాలపు ఫర్నిచర్‌. సోఫాలకి ముఖమల్‌ కవర్లూ, నగిషీలు చెక్కిన బల్లలూ, కుర్చీలూ, అక్కడ కూర్చున్న మందాకిని కూడా వాటిలో భాగంలా అనిపించింది నాకు. ఆవిడ పెదవులు బిగించి ధారాళంగా మాట్లాడుతున్న కూతుర్నే చూస్తోంది. ఇంతలో ఆయా వచ్చి, సంచీలో నిండా ఉన్న పండుటాకుల్ని చెత్తబుట్టలో బోర్లించడానికి తీసుకుపోబోయింది. మందాకిని మెరుపువేగంతో ఆయా చెయ్యి పట్టుకుని, ”వద్దు…వీల్లేదు…” అంది. ”రేపు మళ్ళీ ఏరుకుందువుగానిలే అమ్మా! పార్కులో బోలెడన్ని ఎండుటాకులు దొరుకుతాయి,” అంది విసుగ్గా. అలా ఆయా కసురుకునేసరికి మందాకిని మొహం ముడుచుకుపోయింది, తాబేలు డిప్పలోకి తలని లాక్కున్నట్టు. ఆవిడ మూడ్‌ పూర్తిగా మారిపోయింది. తల్లీకూతుళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోయారు. కొంతసేపు ఇంకా ఆ అమ్మాయి ఏమైనా చెపుతుందేమోనని ఎదురుచూశాక, నేను లేచి, ”ఇక వెళ్ళనా మరి?” అన్నాను. ”టీ తాగి వెళ్దురుగాని, ఆంటీ. సారీ, నేను అలా ఏదేదో వాగుతూనే ఉన్నాను. మీరు టీ తాగుతారా అని కూడా అడగలేదు,” అంది అన్వేష. ”ఇప్పుడొద్దులే, ఈసారి వచ్చినప్పుడు తాగుతాను,” అన్నాను. ”వచ్చినందుకు థాంక్స్‌ ఆంటీ, కానీ మళ్ళీ తప్పక రావాలి. నా కవితలు వినిపిస్తాను ఈసారి.” వెనక్కి తిరిగి చూశాను. తల్లీ కూతుళ్ళ గొంతు కూడా ఒక్కలా ఉంది. తేనెలూరుతున్నట్టు తియ్యగా! తల్లి కళ్ళలో కనిపించిన కృతజ్ఞతాభావమే అన్వేష కళ్ళలోనూ ఉంది. ఒకటే తేడా, తల్లి ఒకసారి ఒకే మాట మాట్లాడుతుంది, కానీ కూతురు ఆపకుండా మాట్లాడుతూనే ఉంటుంది. అవతలివాళ్ళు తన మాటలు వింటున్నారా లేదా, వాళ్ళు చెప్పేది కూడా వినాలి కదా అన్న ధ్యాసే ఉండదా పిల్లకి. బరువుగా మెట్లు దిగి వచ్చేశాను. ఎవరి గురించి ఎవర్ని అడగను? తల్లీ కూతురూ ఒకే రకమైన షాక్‌లో ఉన్నారు. వాళ్ళ మనఃస్థితి సవ్యంగా లేదని మాత్రం అర్థమైంది. చాలా బాధ వేసింది, కానీ నేనేం చెయ్యగలను? జ జ జ గేటు దాటి ఇంటివైపు నడిచాను. ఇరవైఏడు అంతస్తులున్న మా కాంప్లెక్స్‌ గేట్లు రెండూ ఈ పార్కులోకి తెరుచుకుంటాయి. గాలి జోరుగా వీస్తోంది. పచ్చని చెట్లకున్న పండుటాకులని రోజూ మందాకిని కోసి సంచీలో నింపుకున్నా పార్కంతా ఎండుటాకులు గాలికి ఎగురుతూనే ఉన్నాయి. గాలి ఊపుకి పైకెగిరి మళ్ళీ అదే వేగంతో కింద పడిపోతున్నాయి!

4 comments:

తృష్ణ said...

కథ చాలా బావుంది సామాన్య గారూ... మనసుని కదిలించింది... నాకూ మీలానే అనిపించింది చదివాకా! థాంక్స్ ఫర్ షేరింగ్!
మీ బ్లాగులో బోలెడు చదవాలి..చాలా రోజులైంది సమంగా బ్లాగులు చదివి..

వనజ తాతినేని/VanajaTatineni said...

కథ చదివాక హృదయం బాధతో మూల్గింది .

అందరికి సాధారణంగా స్వల్పంగా , అల్పంగా అనిపించే విషయాలుని అనుభవించే కొందరికి అవే జీవన్మరణ సమస్య గాను భావించడం లేదా సర్వం కోల్పోయినట్లు అనిపించడం అన్నదానిని కథా రూపంలో చదివి కళ్ళు చెమర్చాయి రాలిన పండుటాకులని ఏరుకోవడం అన్నది కోల్పోయిన జీవితం కి ప్రతీక అనిపించింది;

థాంక్ యు సామాన్య గారు.

సామాన్య said...

trushna gaaroo yelaa vunnaaru?katha naakkoodaa chaalaa nacchindi .thank you

సామాన్య said...

vanaja gaaroo kiran ki transfer ayindi ...busy ,anduke comment ki reply ivvaleka poyaanu sorry .katha nacchinanduku thanks.