About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 19 August 2013

ఆనంద ,మోహన ...

ఆనందా ,నేనీ మధ్యనంతా  పరిశోధకురాలనై యోచించాను సృష్టిలో భవిష్యత్తు లేదనీ ,వర్తమానంలోనే భవిష్యత్తు మిళితమై పోయుందనీ .ప్చ్! నువ్వివాళ  భలే చెప్పావు ,భవిష్యత్తు ఉందనీ, అది మన కోసం దేనినో చేత పట్టి కాపెట్టుకుని ఉంటుందనీ . ఆనందా దుక్కం కమ్ముకొస్తుంది . కొందరి దుక్కం రకం వేరే . వేరే రకపు నా దుక్కం  దిక్కుతోచని తనం తో దిగులు పడుతుంది . నా దుక్కానికి వెలుపలి దారి మూత పడి వుంటుంది . నువ్విక్కడే,నేనూ అక్కడే ... ఆపన్న హస్తమవలేని బధిరత్వం గురించి ఏం చెప్పుకోనూ ? మరణానిదేముందిలే 
పాపం ,తరతమం లేనిది ,అందరినీ పలకరిస్తుంది,కొద్దిమందిని మరీ త్వరపడి ప్రేమతోనూ ,కొంత మందిని వలపక్షంగానూ , కానీ ఒక అనుబంధపు ఖాళీ గురించి ఏం మాట్లాడనూ . ఎన్ని  ఖాళీలో ప్రపంచం నిండా !హేతువు ఖాళీని పూడుస్తుందా ?.  నువ్వు నాకేమి ఇచ్చావో యోచిస్తున్నా ,మృదు నీ చిరు  స్పర్శ పంచినదంతా ఆనందమే,అచ్చు  చురుకులేని  ఉదయ కాలపు  ఎండ లాటి ఆనందపు స్నేహం నీతో ,కానీ చూశావా నువ్వు అంతా దుక్కం కలిపి  ఒక్క సారే  ఇచ్చేసావు . తల వాల్చిన దీనపు నీ రూపు ప్రాణ శక్తి ఇంకా వున్న  నా హృదయం పై గాయపు  నీ చిత్రం గీస్తుంది .ఈ దుక్కపు  చిత్రాన్ని ఏం పెట్టి మానపనూ ? చెంపలేసుకుని నాకు తెలియని ఎవరినోనూ ,మరియూ నిన్నూ ఏక కాలాన ప్రార్దిస్తున్నా ...నన్ను క్షమించు . నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు .కానీ నన్ను నేనెలా క్షమించుకోనూ ?


No comments: