About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday, 4 February 2012

మంజుల..



నేను సిస్టం ముందు కూర్చుని మంజుల ఫోటో వెతుక్కుంటూ వుంటే కందగడ్డ లాంటి దాన్ని పటుకొచ్చి ఇది తింటారా మీరు అని అడిగింది మంజుల .బెంగాలీలు గుమ్మడి కాయని ,గుమ్మడి ఆకునీ రెంటినీ సమ దృష్టితో చూస్తారు .అందుకని ఆ తెచ్చిన పదార్థమేమిటో అర్థం కాకున్నా బెంగాల్ లో బెంగాలీ లాగే వుండాలి అనే సత్యాన్ని అనుసరించి తల గట్టిగా ఊచి అన్నీ తింటాం ఏదైనా తింటాం అన్నాను.నా మాటవిని మంజు పగలబడి నవ్వుతూ వంట ఇంట్లోకి వెళ్ళింది .అందులో నవ్వోచ్చేందుకు ఏముందీ అనుకుంటున్నారా ...మా మంజూకి ప్రతి దానికీ నవ్వొస్తుంది.కొంచెం దీర్ఘం తీసి ఆ..అన్నా ,చాలా పొట్టిగా ఊ ... అన్నా పుసుక్కుమని నవ్వొస్తుంది.ముద్దొచ్చే ముఖాన్ని సాగ దీసి ,నోట్లో పాన్ ని బుగ్గలోపలికి నెట్టి పగలబడి నవ్వుతుంది.

మేమీ ఊరికి రాగానే నా కుక్కల్ని ,మా వంట సామాన్లనీ చూసి ,అదివరకే ఉన్న వంట మగాడు కాలికి బుద్ది చెప్పేసాడు.అసలు విషయం ఏంటంటే మంత్రగాడిని అంత దూరంలోనే కనిపెట్టేసి దయ్యాలు దడుచుకున్నట్టు నన్ను చూడగానే మగ మానవులు బతికుంటే బలుసాకు తిందాం అని భావిస్తారు.నిలిచి ఉన్న వారు పురుషులందు పుణ్య పురుషులు.

సరే అప్పుడిక వంటమనిషిని వెతకడం మొదలెట్టారు.ఎవరూ నచ్చందే ..,!అప్పుడు మా మంజూ వచ్చింది.ఎంచక్కా ఐడడుగులా నాలుగంగుళాల ఎత్తు ,నోటి నిండా నవ్వు .చూడగానే బెంగాలీల ''మా దుర్గా ''ని చూసినట్టు తోచి అంత వరకూ ప్రొఫెషనల్ కుక్ కావాలని అంటున్న దాన్ని ,సరే ఈ నవ్వులని కొంచెం అరువు పుచ్చుకుందాం అనుకుని మరో మాటేమీ లేకుండా పనిలోకి వచ్చెయ్ మన్నాను .

నిజానికి మా మంజు వంటేం బాగా చెయ్యదు .ఎప్పుడైనా ఒక రోజు బాగా చెయ్యలేదు అనో ,వంట ఇల్లేమిటి ఇలా ఉందనో అన్నామనుకోండి ,అలిగి ఆ రోజు పనికి ఎగనామం కూడా పెట్టేస్తుంది.మళ్ళీ మనం సవర దీసి బుజ్జగించడానికి ఎవర్నో ఒకర్ని ఎదురుకోలు పంపించాలి.అయినా వంటదేముందిలెండి నాలిక దాటితే నరకం .నవ్వులు ముఖ్యం... కదా ?

అంత నవ్వుతుందా మొన్న ఒక రోజు మా మంజు ఏడ్చింది .అనిత లాగా కాదులెండి ,నవ్వులమారిది కదా ...కళ్లలో నుండి దూక బోయిన కన్నీటిని కంటిరెప్పలోనే ఉప్పుపాతరేసేసింది.

ఆ కుసింత ఏడుపైనా ఎందుకంటారా ?ఎందుకంటె మంజుకి ముగ్గురు కూతుర్లు .కొడుకు పుడతాడని ఆశ పడి కంటూ పోమ్మన్నాట్ట వాళ్ళాయన .అట్లా పంప ,జంప ,టుంప పుట్టారుట .పంప అంటే సరే నది పేరు ..మిగిలిన పేర్లకి అర్థమేమిటి మంజూ అంటే ''ఏమ్ని''అని నవ్వింది.అంటే ఊరికే అట్లా పేర్లు అంతే అని అర్థం .

పెన్సిలు మూడు రూపాయలు రబట్ [ఎరేసరు] మూడురూపాయలు ఇంకా నోడ్సులు సంచులూ టిఫిన్లూ ...అమ్మా అది కావాలి ,అమ్మ ఇది కావాలి అని పిల్లలు దెయ్యాల్ల మీద పడుతారట .పడుకునే మంచం దగ్గరి నుండీ తినే కంచం వరకూ పొద్దున్న లేచిన దగ్గర నుండీ కీచులాడుతూ వుంటారట .ఇంటి కెళ్తే క్షణం మనశ్శాంతి ఉండదట.పిల్లలు రాక్షసులేనట .ఉండాలే గానీ రోజుకి రెండొందల రూపాయలు రెక్కలు కట్టుకుని యెగిరి పోతాయట.మగడు ఒక రోజు పని చేసి ఒంద రోజులు రెస్టు తీసుకున్టాట్ట. ఒక్కోసారి ఇంట్లోనుండి పారిపోవాలనిపిస్తుందట .ఎందుకీ పిల్లలు అనిపించేస్తుందట ....

''పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ ''... కదా ?ఆ మాట చాలా మంది మగ పుంగ(క)వులు పాటలుగా నాటకాలుగా ..గట్రా గట్రాలుగా...రాసారు కదా .మరి అమ్మై ఉండి మంజూ ఏంటి ఇట్లా అంటుంది ?మాతృత్వం తీయనైందని మంజు ఇంట్లో మగవాళ్ళు చెప్పలేదా .చెప్పినా మంజు ప్రాక్టికల్ గా ఆ మాట తప్పని తెలుసుకున్నట్టుంది. .బహుశా ఈ తీపి మాతృత్వం కడుపునిండిన వాళ్లకి ,మగ వాళ్ళ కి మాత్రమే తీపిగా తగిలేట్టుంది.

అవునంటారా...కాదంటారా ?

కానీ శత దీర్ఘంగా చింతించి నేనోటి కనిపెట్టా.. ఏంటంటే మాతృత్వం ,అమ్మతనం రెండూ వేర్వేరు. మాతృత్వం స్త్రీకి శాపం అమ్మతనం మనిషికి దేవుడిచ్చిన వరం.నా కొటేషన్ లో చెప్పాలంటే ''మాతృత్వం తీపిది కాదు.కానీ అమ్మ దేవత .ఎందుకంటె అమ్మ స్త్రీ కదా''

''మగవాడితో నిమిత్తం లేకుండా ఆడది ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలదు;పిల్లలను కనడం తప్ప ,మరే పనైనా చేయగలదు.ఇక పిల్లల విషయానికొస్తే -బుద్దుందే ఆడదెవతీ సంతానం కోరుకోదు ''-మార్గరెట్ మిచ్చెల్...గాన్ విత్ ది విండ్ నుండి .
{మార్గరెట్ ఈ మాటలు చదివి నిజానికి నేను షాక్ తిన్నాను .ఏంటంటే ఆడవాళ్ళందరూ ఇట్లా అనేసుకున్నారనుకోండి అప్పుడు నా లాగా బంగారు తల్లుల్లాటి ఆడపిల్లలికి కూడా అమ్మల్లేకుండా పోతారు కదా అని.}

6 comments:

Anonymous said...

మీరు andhra లో ఉంటారా లేక బెంగాల? అమయ అంటే అర్థమేమిటి? మీ బ్లాగులో చదివిన ప్రతి టపాలో మగవారిని నిందిస్తున్నట్లు అనిపించింది. మగవారి మీద అంత కోపమేందుకు?

సామాన్య said...

నేను బెంగాల్ లో వుంటాను.అమయ జపనీస్ పదం.నైట్ రైన్ అని అర్థమట .రాత్రి కురిసే వర్షం భలే వుంటుంది..అమూర్త కవిత్వంలా ,అందుకని నా బ్లాగ్ కి ఆ పేరు పెట్టుకున్నాను.
మీరు 'మగవారి మీద కోపమెందుకు' అని ప్రశ్నించారు.
అజ్ఞానమూ,అసహనమూ,ఆవేదనా...కోపాన్నిస్తాయి .పరిశీలనా,అధ్యయనమూ ,అవగాహనా... ప్రశ్నించడాన్ని,జ్ఞానాన్ని, నిలకడైన పోరాటాన్నిఇస్తాయి.నా అన్ని పోస్టుల్లోనూ మీకు కనిపించేది ఒక అవగాహన నుండి వచ్చిన ప్రశ్నలే .
సీత కష్టాలు కథ చదవండి ఆ ప్రశ్నలు మగవాడికి మాత్రమె పరిమితమవలేదని అర్థమవుతుంది.
ఏమైనా అంతలా ఆలోచించినందుకు థాంక్స్ .

Anonymous said...

మీ బ్లాగులో మీది నెల్లూరు రని రాశారు. మీ టపాలు కొంచెం చేయి తిరిగిన రచయితలు రాసే స్థాయిలో ఉన్నాయి. నాది ఆ ఊరే కబట్టి, అన్నిటపాలని కొంచెం ఆసక్తిగా చదివాను.

*ఏమైనా అంతలా ఆలోచించినందుకు థాంక్స్ *.

ఆలోచించటమనేది ఎక్కువగా మగ వారి డొమైన్ కదండి :-)

సామాన్య said...

Avunandee maa ammaa vaalladi Nellore

Chandu S said...

మీ పోస్ట్ లు బాగున్నాయండీ. బాగా చదివిస్తున్నాయి. ' సామాన్య 'పేరు నప్పడం లేదు.

సామాన్య said...

ఏం చెయ్యమంటారండీ మా అమ్మా వాళ్లు చాలా అబ్యుదయం గా ఆలోచించేసి అలా పెట్టేసారు.నా నిజ్జం పేరు అది.థాంక్ యు .