About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 8 June 2012

ఆ పుస్తకం పేరు చెబుతారా…!




ఈ నెల భూమికలో వచ్చిన కథ ఇది .ఈ కథ నాతో రాయించింది  నా స్నేహితురాలు వినయ.తనెప్పుడూ ఈ కథలోని వీణ టీచరు వాళ్ళ అమ్మ గురించి చెప్పి చాలా దిగులు పడుతుండేది .ఆవిడ తనకిచ్చిన ,తను పోగొట్టుకున్న పుస్తకాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేది.నేను కథలు రాయడం మొదలు పెట్టాక ''సామాన్య నేనా నవల లోని  లోని కథ చెప్తాను నువ్వు రీ రైట్ చేస్తావా ''అని అడిగేది .రీ రైట్ అనే మాటకి నాకు నవ్వొచ్చేది.''అదేమన్నా రామాయణమా వినయా... మొల్ల రామాయణం ,నా రామాయణం ,నీ రామాయణం అని రాసుకునేందుకు'' అని నవ్వేదాన్ని .కానీ క్రమంగా ఆ కథ నా మనసునీ తోలచడం మొదలెట్టింది.అట్లా మా సంభాషణల నుండి మలిచిన  కథ ఇది.

''భూమిక''http://www.bhumika.org/ని నేను మొదటి సారి 1995 లో  అనుకుంటా చదివాను .మా డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్ శోభా దేవి గారు నాతో చదివించారు.ఫెమినిసాన్ని తెలుసుకుంటున్న తొలి తొలి రోజులవి.భూమికని పడీ పడీ చదివేదాన్ని .[అప్పట్లో భూమిక వాళ్ళు మూలికా వైద్యం పై వేసిన ఆకుపచ్చ రంగు అట్ట  చిన్ని బుక్కు,భూమికకు సంబంధించీ  నా అపురూపమైన కలెక్షన్ లలో ఒకటి :}] . చెప్పాలంటే స్త్రీగా భూమిక నా స్వంత పత్రిక .

భూమిక నుండి నేను నేర్చుకున్నది చాలా వుంది.ఇవాళ స్త్రీగా నేను ఖచ్చితమైన అభిప్రాయాలను కలిగి ,క్లారిటీ తో ఆలోచించగలగడం వెనుక ,నిలబడటం వెనుక వున్నది ఆవాళ  స్త్రీ వాదాన్ని నాకు పరిచయం చేసిన శోభా దేవి గారూ,ఆవిడ పరిచయం చేసిన భూమిక ,స్త్రీవాద సాహిత్యమూ ...
    
సాహిత్య పత్రికలెన్నో పుడుతుంటాయి ,మధ్యే మార్గంలో ఆగిపోతుంటాయి .కర్ణుని చావుకి వంద కారణాలు .కానీ భూమిక ఇవాళ ఇరవై  వసంతాలని పూర్తి చేసుకుని మరింత పరిపుష్టంగా,పరిపూర్ణంగా ఎదిగి స్త్రీల పక్షాన ఆత్మీయంగా,దృడంగా నిలబడింది.భూమిక ద్విదశాబ్ది ప్రయాణం.దీని వెనుక ఎందరెందరో వున్నా ఆ అందరి ముందూ నిలబడింది మాత్రం నిర్ద్వందంగా కే.సత్యవతి గారే  .నిర్మలమైన వారి ఉత్సాహం వారి బ్లాగ్ చదువుతున్న ప్రతి సందర్భం లోనూ నా వెన్ను తట్టి గొప్ప ధైర్యాన్నీ , భవిష్యత్ మీద  ఆశనీ హామీ ఇస్తూ వుంటుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారికి,వారి టీం కి  నా గౌరవ, ప్రేమపూర్వక ,అభినందనలు ,ధన్యవాదాలు.

3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

సామాన్య గారు ..భూమిక లో కథని చదివి వచ్చాను. చక్కని కథ ని అందించిన మీకు అభినందనలు.
కువిమర్శలకు నొచ్చు కోకుండా వాటికి విలువ నివ్వక మీదైనా బాణిలో రచనా ప్రయాణాన్ని సాగించండి.
కావాలని రాళ్ళు వేసేవారిని ఆడుకోవాలంటే తిరిగి రాళ్ళు వేయనవసరం లేదు.
రాళ్ళని పూలుగా భావిస్తే చాలు. పరిమళాలని వెదజల్లుతూ వెళ్ళే సైర్యం వస్తుంది. అని మాత్రం చెప్పగలను.

వనజ తాతినేని/VanajaTatineni said...

ఇంకొక మాట చెప్పడం మరచాను. భూమిక పట్ల మీకున్న అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. భూమిక అంటే నాకు చాలా అభిమానం.
ఈ మధ్య నేను కొన్ని పోస్ట్ లు చదవడం కుదరడం లేదు. "అత్తమ్మ" అనారోగ్యం వల్ల బ్లాగ్ ఫాలో కాలేక పోతున్నాను. మళ్ళీ విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యు సామాన్య గారు

సామాన్య said...

వనజ గారూ
మీ అత్త గారి ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
సద్విమర్శ అయితే నిలబడి సమాధానం ఇస్తాం.కానీ అజ్ఞానం గా ,తమ వాచాలత్వాన్ని ప్రదర్శిస్తారు కదా అప్పుడేమనిపిస్తుందంటే నా సేఫ్ షెల్ లోకి వెళిపోయి హాయిగా వున్దామనిపిస్తుంది.
అవును భూమిక తెరిచిన తలుపులు కొత్తవి .మనమిప్పుడు తప్పక ప్రవేశించాల్సినవీ..
థాంక్ యు అండీ .