About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday, 28 September 2012

ఆవాహన !!!





మనల్ని మనం ఏకాంతంలో ఎక్కడ అన్వేషించుకుంటామో,
అప్రమేయంగా మనల్ని ఏవి ఆవహించగలవో,,
మనలో లయమై విడివడి కనిపించనివేవో  ,విడివడలేనివేవో అక్కడక్కడే మనం !!!

Sunday, 23 September 2012

''దమయంతి కూతురు ''


http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012%2Fsep%2F9%2Fsunday%2Fstory&more=2012%2Fsep%2F9%2Fsunday%2Fsundaymain
అనవరత ప్రయాణాలు కలిగించిన అలసట,అనారోగ్యము బ్లాగ్ పట్ల విముఖం చేసినా ఒక మంచి కథ ...తప్పని సరిగా షేర్ చెయ్యాల్సిందే అనిపించిన కథ నన్నిట్లా బ్లాగ్ దగ్గరకి తెచ్చింది.ఆ మంచి కథ పేరు ''దమయంతి కూతురు''. రచయిత్రి శ్రీ పీ.సత్యవతి గారు.

ఒక ఆదివారం ఉదయం మా ఊర్లో  వుండగా   పాపాయి వాళ్ళ నాన్న నుండి బోల్డు   వేకప్ కాల్ లు వచ్చాయి  ,,,ఇవాల్టి ఆదివారం ఆంధ్రజ్యోతి లో మంచి కథ వచ్చింది చదువు అని . ఎవరు రాసారు అనే లోపే పీ.సత్యవతి గారు అని చెప్పేసాడు .నేను బోల్డు సంతోషపడి చదవడానికి కూర్చున్నాను  .కథ అట్లా పూర్తి చేసానో లేదో మళ్ళీ ఫోన్ .లిఫ్ట్ చేయగానే మరో మాటేం లేకుండా పాపాయి ''అమ్మా ...ఊర్ద్వ లోకం అంటే  ఏంటమ్మా'' అంది.నాకిక అర్థమైపోయింది నాన పాపాయికి కథ చదివి వినిపించాడు అని .అదొక్క ప్రశ్నేనా ..ఇంకా బోల్డు ,''సౌందర్యా వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని ఏమందీ??'',అనురాధా టీచర్  చెప్పిన మెర్మన్ కథ ఏంటీ?''ఇట్లా ...!!నేను ''పోనీ సత్యవతి గారినే అడగక పోయినావా బిడ్డా ''అన్నాను. పాపాయికి  బోల్డు సిగ్గు  .అందుకని ''ఆహా ,కాదమ్మా! అమ్మా! మొత్తం కథంతా నువ్వు మళ్ళీ చెప్పమ్మా ''అన్నది .

ఇంకో వైపు పాపాయి వాళ్ళ నాన ''ఈ కథకి ఆర్ద్రతే ప్రాణం కదా ''?అని విమర్శనా పరిభాషలో ప్రశ్నించాడు.నాకు నవ్వొచ్చి సోఫాలో ఉన్న పుస్తకాల్లోనే అడుగున వల్లంపాటి''కథా శిల్పం '' పుస్తకం ఉంది తీసుకుని చదువుకో ఏం ప్రాణమో తెలుస్తుంది అన్నాను.సత్యవతి  గారి కథలంటే నాకు,మా అమ్మకీ  ఎప్పుడూ  ఇష్టమే .ఇవాళ  నాన్నా  కూతుర్ల హృదయాలను బోల్డు ఆకట్టుకున్న  ఈ కథ నా హృదయానికి మరీ  దగ్గరగా వచ్చింది. 

సత్యవతి గారి ప్రతి కథా ఉన్నత స్థాయి కథే .ప్రతి కథా సమాజం లోని ఒక సంక్లిష్టతను సరళం చేసి చెప్పడానికి వుద్దేసించిందే.అట్లాగని వారి కథలెప్పుడూ మానవ భావోద్వేగాలకి అతీతమై, ఉపన్యాసాలు ఇయ్యవు .హృదయగతంగా,అతి సరళంగానూ వుండి  ,మన మనసులకు చాలా  సన్నిహితంగా వస్తాయి .అంత మాత్రం చేత చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పగలగడం లో విఫలం చెందవు.ఇవంతా నాకు ఇంతకు మునుపే తెలిసిన విషయాలే అయినా అవాళ  నేను మళ్ళీ కొత్తగా  సత్యవతి గారి కథ ముందు పెట్టుకుని కథ యెట్లా రాయాలో నా ఎనిమిదేళ్ళ కూతుర్ని మనసులో నిలిపి  తెలుసుకున్నాను .అంత గొప్పగా రాయగలగడం యెట్లా అని దిగులు పడ్డాను .

''దమయంతి కూతురు'' కథ నా వరకు నాకు బుచ్చి బాబు గారి '' దయానిధి '' కి కొనసాగింపు .దయానిధికి తల్లి పట్ల జాలో ,సానుభూతో ,విపరీత  ప్రేమ వల్ల ఎటూ తేల్చుకోలేని తనమో ...ఏదో ఒక అవ్యక్త భావం వుంటుంది .అపరిష్కృత భావం అది .అందుకనే అతను ,తల్లి పేరు చెప్పి తనను హేళన పరుస్తున్న సమాజం నుండి విడివడి దూరమవుతుంటాడు కానీ ,,ముడిని చిక్కు తీసి ఇదీ అని అమ్మ  పట్ల అతని భావాన్ని ఇదమిద్దంగా  ప్రకటించడు .ఆ సంఘర్షణ అలవి మాలినదిగా వుండి వేదన కలిగిస్తుంది పాటకుడికి.

.ఈ కథలోని దమయంతి కూడా ఉత్తుత్తి మనిషి కాదు ''ఊర్ద్వ లోకపు మనిషి''.అందుకే భూలోకపు మనుషుల్ని వదిలేస్తుంది  .మరి ఏ లోకమూ తెలియని పసి పిల్లల గతి ఏమిటీ ??''తల్లి మచ్చ'' ను చూపించి వెంట పడి వేధించి అబ్సెషన్ కు లోను చేసి అక్కడే అదే వలయంలో పిల్లల్ని పడి కొట్టుకునేట్లు చేసే సమాజం సంగతి ఏమిటి?ఎంత పెద్ద ప్రశ్నలు  కదా ?యెట్లా అర్థం చేసుకుని ఆ తల్లిని క్షమించాలి ?అందుకు సమాధానమే ఈ కథ .దమయంతి కొడుకు "తన జీవితాన్ని మలుచుకునే హక్కు ఆవిడకుంది కదా అమ్మడూ. మనకోసం ఆమెకి అలవిమాలిన త్యాగాలు అంటగట్టకూడదు కదా. ఆమె ఎందుకు ఏ పరిస్థితుల్లో మనని వదిలి వెళ్లిందీ మనకెప్పటికీ తెలియదు, ఆమె చెబితే తప్ప. ఇంక వదిలేయ్. ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో ..'' 
"మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?''
"బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?''
 అంటూ చెల్లికి ఇచ్చిన  సమాధానం ఓదార్పు కోసం ఇచ్చుకున్నది కాదు .తల్లి మచ్చ వేసి పదే పదే వేధించే సమజానికి నేర్పుతున్న పాటం అది .

మానవ సంబంధాలన్నీ వుదాత్తంగానూ ,ఉన్నతంగానూ వుండాలనేది మానవుడి సంయుక్త కాంక్ష .కానీ, ఏ వుత్పాతమూ లేకుండా ప్రకృతి సరళ రేఖలో సాగి పోవడం ఎప్పుడైనా విన్నామా ??లేదు కదా!!!మానవ భావోద్వేగ ప్రకృతి కూడా అట్లాటిదే .అందులోనూ ఎత్తుపల్లాలు వుంటాయి .ఆ ఎత్తు పల్లాలు మన చుట్టు పక్కలో ,మన జీవితాలలోనో ,మన జీవితాలకు అతి సన్నిహితంగానో ఎదురు పడినపుడు వాటిని యెట్లా స్వీకరించాలో, యెట్లా అర్థం చేసుకోవాలో నేర్పడమే కాదు ,అర్థం చేసుకోగల హృదయౌన్నత్యాన్ని కూడా ఇస్తుంది ఈ కథ .
http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012%2Fsep%2F9%2Fsunday%2Fstory&more=2012%2Fsep%2F9%2Fsunday%2Fsundaymain

Monday, 3 September 2012

విష్ణు కూతురు

ఇది రాగలీన పాట



అప్పుడొక రోజు మా ఊళ్ళో చిలక జోస్యం పిల్లవాడు వెళ్తూ ఉండినాడు .చిలకని చూద్దామని నేనూ ,పాపాయి  బోల్డు ముచ్చట పడేసి ,జోస్యం  చెప్దూవ్ గానీ  రమ్మని పిలిచాం .ఆ అబ్బాయి భాగా చిన్న వాడు పద్నాల్గు,పదిహేను ఏళ్ళ వాడు .మొదట నాకు చెప్తూ మాటల్లో మాటగా ''గంటకు తొమ్మిది గుణాలు కదక్కా నీకు ''అన్నాడు ...ఇంకా అట్లాటివే మనసు మల్లెపూవు కదంటక్కా అని ...ప్లీసింగ్ మాటలు బోల్డు చెప్పాడు .అవన్నీ గుర్తు లేవు కానీ గంటకు ఇన్ని కిలోమీటర్ల స్పీడు అన్నట్లు గంటకు తొమ్మిది గుణాల మాట మాత్రం భలే గుర్తుండి పోయింది .

తరవాత వంతు పాపాయిది .అబ్బాయి బహు శాంతంగా ''నీ బిడ్డకి గంటకి ముప్పై ఆరు గుణాలక్కా ''అని వాక్రుచ్చాడు.ఆ పిల్లాడెంత  అండర్ టోన్ లో చెప్పినా తొమ్మిది గుణాల నా కథ నాకు తెలుసు గనుక బగ్గ భయపడ్డాను  ఎట్ట రా  దేవుడా అని .మొన్న ఆర్ ఏం .ఉమా మహేస్వర్ రావ్ ,విష్ణుప్రియ  ల  కూతుర్ని  చూసాక భయం కొంచెం చల్లబడింది .ఎందుకంటె రాగలీనకి గంటకు నూటా పదహారు గుణాలు .అమ్మవారికి నూటా పదహారు కళ లన్నట్లు .అన్ప్రేడిక్టబుల్ .తరువాతి క్షణం లో ఆ బిడ్డ బుర్రలోని ఆలోచనని మనం  కనిపెట్టలేం ....రాగలీన కాదు రంగుల లీన అనమాట .తామరాకు పైని నీటి బొట్టు .

అమ్మాయిల చిత్తాలు మేఘమాలికలు ఒక్కటని కాళిదాసు అన్నాడు కానీ ,అందరమ్మాయిలూ ఒక్కటి కాదు కొందరు కొంచెం వేరు ,కొందరు చాలా వేరు .ఆ చాలా వేరు వాళ్ళతో వారికి చుట్టు పక్కల వుండే వారి జీవితం భాగుంటుంది కత్తి మీద సాములా .రోజూ ఒక వింతలా .

రాగ లీన మంచి రచయితో అట్లాటిదే మరోటో అవుతుందని నా ఊహ . చూడాలి పిల్లలు పెరిగి పెద్దగై ఏమవుతారో రాగాతీతం గా చూస్తూ వుండటం  ఒక ఆసక్తికర అనుభవం!!!