About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Wednesday, 12 December 2012

‘ఐయామ్‌ మలాలా’

‘ఐయామ్‌ మలాలా’పసుపులేటి గీత[ భూమిక నుండి ]
‘రేపు మగపిల్లల బళ్ళన్నీ తెరవబోతున్నారు. కానీ తాలిబన్లు ఆడపిల్లల చదువును మాత్రం నిషేధించారు. బీరువాలో నా యూనిఫారమ్‌, పుస్తకాల సంచీ, జామెట్రీ బాక్స్‌ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది…’
- మలాలా యూసఫ్‌ జే
ఐక్యరాజ్య సమితి 10, నవంబర్‌, 2012ని ‘మలాలా డే’గా నిర్ణయించింది. ఏ వివకక్షూ తావు లేకుండా ప్రపంచంలోని పిల్లలందరికీ చదువుకునే అవకాశాన్ని కల్పించాలన్న సదాశయానికి ఈ రోజును ఒక సుముహూర్తంగా నిర్ణయించారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ‘విద్యా’ రాయబారి అయిన గోర్డన్‌ బ్రౌన్‌ ‘ఐయామ్‌ మలాలా’ అనే పేరిట ఒక పిటిషన్‌ను ప్రారంభించారు. పాకిస్తాన్‌లోని పిల్లలందరికీ విద్యావకాశాల్ని కల్పించాలన్నదే ఈ పిటిషన్‌ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలమంది సంతకాలు చేసిన ఈ పిటిషన్‌ను గోర్డన్‌, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీకి అందజేస్తారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ 10, నవంబర్‌, 2012ని ‘మలాలా డే’గా ప్రకటించారు. పాకిస్తాన్‌లోని స్వాత్‌లోయ తాలిబన్‌ దురాగతాలతో ఇప్పటికప్పుడు మానవ వికాసానికి, మానవత్వపు ఔన్నత్యానికి దూరమై, అంధకారంలో మగ్గుతున్న ఒక చీకటి లోయ. ఆ చీకటిలో కన్ను తెరిచిన వెలుతురు కిరణమే మలాలా యూసఫ్‌ జే. ఈ ఏడాది అక్టోబర్‌ 9 న తాలిబన్‌ క్రౌర్యానికి ఎదురొడ్డి, మృత్యువును జయించిన పదమూడేళ్ళ చదువుల తల్లి మలాలా. తాలిబన్లు జరిపిన హత్యాయత్నంలో మలాలా తలగుండా తూటా దూసుకెళ్లింది. ఇప్పుడామె ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న క్వీన్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. స్వాత్‌లోయలో మౌలానా ఫజుల్లా నాయకత్వంలో తాలిబన్‌ మూకలు నిత్యం విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఆడపిల్లల చదువు, స్త్రీలు వీధుల్లో ఒంటరిగా సంచరించడం, టెలివిజన్‌, నృత్యగానాదులన్నింటి మీదా నిషేధం విధించాయి ఈ మూకలు. ప్రతిరోజూ వీధుల్లో పాకిస్తాన్‌ పోలీసుల తలల్ని తెగనరికి ప్రజల్ని భయోత్పాతానికి గురిచేస్తున్నాయి. ఆడపిల్లలకు చదువు చెప్పే అనేక పాఠశాలల్ని ధ్వంసం చేసేశారు. వందలాది బడులు ఈ భయంతో వాటంతటవే మూతబడ్డాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు స్వాత్‌ నుంచి ప్రాణాలరచేత పట్టుకుని పారిపోయారు.
మలాలా తండ్రి ఒక విద్యా ఉద్యమకారుడు. సొంతంగా ఆయన ఒక పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలకు చదువెంత ముఖ్యమో తెలిసిన వ్యక్తి. అందుకే మలాలాను కూడా ఒక ఉద్యమానికి సాధనంగా మార్చాడు. ఇంటర్‌నెట్‌పై నిషేధం ఉన్న తమ ప్రాంతంలో తాలిబన్‌ దాష్టీకాల గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు మలాలా తొలిసారిగా ఒక ఉర్దూ బ్లాగ్‌ను ప్రారంభించింది. దీనికి బిబిసి పూర్తి సహకారాన్ని అందించింది. మలాలా బ్లాగ్‌ 3, జనవరి, 2009న ప్రారంభమైంది. స్వాత్‌లో బాలికల విద్య కోసం ఒక ఉద్యమం కన్ను తెరిచింది. మలాలా ఆ ఉద్యమానికి మార్గదర్శి అయింది. ఆమె జీవితగాథను ప్రతిబింబిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. తాలిబన్‌ బెదిరింపుల్ని లెక్కచేయకుండా ఆమె అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వూలివ్వడం ప్రారంభించింది. స్వాత్‌ జిల్లా బాలల సమాఖ్యకు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైంది. దక్షిణాఫ్రికా సామాజిక హక్కుల ఉద్యమకారుడు డెస్మండ్‌ టుటు అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఆమె పేరును ప్రతిపాదించారు. పాకిస్తాన్‌ తొలి జాతీయ యువ శాంతి బహుమతిని మలాలా అందుకుంది.
‘నిన్న నేను ఒక భయంకరమైన కలగన్నాను. దుస్స్వప్నాలు నాకు పరిపాటి అయ్యాయి. వాటినిండా హెలికాఫ్టర్లు, తాలిబన్ల కిరాతకాలు నిండి ఉంటాయి. అమ్మ నాకోసం అల్పాహారాన్ని తయారుచేసింది. నాకు బడికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. స్వాత్‌లో ఆడపిల్లల చదువు మీద నిషేధం విధించారు తాలిబన్లు. మా క్లాస్‌లో 27 మంది పిల్లలగ్గాను ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే మిగిలాం. ఇక్కడి పరిస్థితులకు భయపడి నా స్నేహితురాళ్ళు ముగ్గురు పెషావర్‌, రావల్పిండికి వెళ్ళిపోయారు…’ మలాలా తొలిరోజున తన బ్లాగ్‌లో రాసుకున్న విషయమిది.
‘నాకు ఆ దృశ్యం (తాలిబన్లు తనమీద దాడి చేయబోయే దృశ్యం) స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినా, వాళ్ళు చేస్తున్న తప్పేమిటో వాళ్ళకు తెలియజెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. విద్య అన్నది మా ప్రాథమిక హక్కు…’, తన మీద తాలిబన్లు ఏనాటికైనా దాడికి తెగబడతారని ముందే ఊహించి మలాలా అన్న మాట ఇది. ఆమె ఆ మాటను అక్షరాలా నిలుపుకున్నది కూడా. ఇవాళ స్వాత్‌లోయలో ప్రతి అమ్మాయి మరో మలాలాగా మారిపోయింది. ‘స్వాత్‌లోని ప్రతి అమ్మాయి ఒక మలాలానే. మా చదువును మేము చదువుకుంటాం. మేం గెలిచి తీరుతాం. వాళ్ళు (తాలిబన్లు) మమ్మల్ని ఓడించలేరు’, ఇది మలాలా స్నేహితురాలి మాట.
అందుకే ఇప్పుడు ప్రపంచంలోని పిల్లలందరూ సామాజిక, లింగ, ఆర్థిక వివక్షలతో నిమిత్తం లేకుండా చదువుకోసం ఉద్యమం దిశగా అడుగేస్తున్నారు. ‘మలాలా డే’ అందుకు తెరతీసింది. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రతి పసిపిల్లా ‘ఐయామ్‌ మలాలా’ అంటోంది.

No comments: