About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 26 April 2013

నా పై కురిసే నల్లటి మేఘం




తల పై చేయి పెట్టుకుని పడుకుని వుంటాను 

నా లోంచి ,లోలోంచి ఒక నల్లని మేఘం 
పుడుతుంది 
నా పైనంతా పరుచుకుని నవ్వుతుంది 
నేను లేచి కూర్చుంటాను 
అతనోస్తాడు 
యేవో లెక్కలు కడతాడు 
ఒక గొడుగిస్తాడు 
అప్పుడిక నేను నవ్వుతాను 
చీకటి చెట్టు వెనుక నిండు చంద్రుడ్ని చూసి 
మరేమీ అనుకోను 
అప్పడం లాగున్నావు చంద్రుడూ అంటాను 
వట్టి మసాలా అప్పడం! 
కానీ ఒకరోజు ఏదో అవుతుంది 
మెదడులోనూ ,మనసులోనూ 
చెప్పిన  మాట విననిదేదో పుడుతుంది 
నా కళ్ళ ఎదుటే నీళ్ళు తగిలి ఉబ్బిపోయే 
అదేదో పదార్థం లా 
ఇంతది ,అంతవుతుంది . 
ఇప్పుడు కూడా చూస్తూనే వుంటాను 
ఆ నల్ల మేఘం మళ్ళీ పుడుతుంది 
నా పైనంతా పరుచుకుంటుంది . 
అతను పరిగెట్టుకొస్తాడు 
లెక్కలేస్తాడు 
చిన్నపోతాడు . 
నేను నవ్వుతాను 
తడవడం నాకు వ్యసనమేమో
నువ్వేం చేయగలవని  నేనతనితో అనను 
దయతో  జాలిపడతాను . 
అతనీసారి మరీ మందమైన గట్టి గొడుగునిస్తాడు 
శుభాన్ని కాంక్షించి సెలవు పుచ్చుకుంటాడు 
అతనటు వెళ్ళగానే నేను నవ్వుకుంటాను .విరగబడీ ,పగలబడీ . 
నవ్వి నవ్వి ఏడుపొస్తుంది . 
అప్పటికే నా నల్ల మేఘం నన్ను కావిలించుకుని వుంటుంది 
నువ్వంటే నాకిష్టం లేదు అంటాను . 
ముడుచుకుంటాను ,
నన్ను వదిలి పెట్టూ అంటాను 
నల్ల మేఘం ,నా నల్ల మేఘం 
నాలో జీవసారాన్ని నమిలి మింగిన నల్ల మేఘం 
నన్ను తడుపుతూ వుంటుంది 
కాంక్షగా .... 
కసిగా !!!



4 comments:

Afsar said...

సామాన్య, చాలా బాగుంది. అసలు ఆ మొదటి పంక్తి అంత దూరం లాక్కు వెళ్తుందని ఊహించనే లేదు.

సామాన్య said...

థాంక్ యు సర్ . నిన్న Sylvia Plath ని చదివాను .

వనజ తాతినేని/VanajaTatineni said...

అతనొచ్చి గొడుగు ఇవ్వకుండానే నల్ల మేఘం మిమ్మల్ని తడపకుండా త్రోసి పడేయండి

వ్యసనం మంచిది కాదని మీకు తెలియదా!?

ఎన్నిసార్లు చదివానో !!

చిక్కని కవిత్వం . ఇలాంటి కవిత్వం కోసమే ఒడలంతా కళ్ళు చేసుకుని వెతుక్కుంటూ ఉంటాను .థాంక్ యూ సామాన్య గారు

సామాన్య said...

Vanaja garu కవిత నచ్చినందుకు చాలా క్రుతజ్ఞతలు.సిల్వియ ప్లాత్ ని చదివి కొంత దిగులేసీ రాశాను .