ఈ కథ సెప్టంబర్'' తెలుగు వెలుగు '' లో వచ్చింది . పత్రిక వాళ్లు పేరు మార్చి ''డబ్బు డబ్బు '' పేరిట ప్రచురించారు
"డ్రీమ్స్ "పొద్దున్నే లేసి, గంప లేపి కోళ్ళని వదిలి చీపురకట్ట అందుకున్నది నూరున్నిసా. బరబరా పరపరామని చీపురకట్ట చేస్తున్న శబ్దానికి అజీజ్ కూడా లేసేసాడు. వాళ్ళిద్దరి పదేళ్ళ కూతురు తమీమ మాత్రం హా... మని నోరు తెరుచుకుని నిదురపోతోంది. అట్లా నిదురపోతున్న కూతురి బుజ్జి మొహాన్ని చూసి ముసిముసిగా నవ్వుకున్నది నూరున్నిసా. అజీజ్ వీధి వాకిట్లో ఉన్న వేపచెట్టు పుల్ల తుంచి నోట్లో వేసుకుని నవులుతూ తలాకిటే నిలబడ్డాడు.అజీజ్ బేల్దారి పనులు చేస్తాడు. నూరున్నిసా టైలరింగ్ పని చేస్తుంది . ఆమె తండ్రి, తాత, తల్లి, అమ్మమ్మ అందరూ టైలర్లే. తరతరాలుగా దర్జీ కుటుంబం వాళ్ళది . ఆ పల్లెటూర్లో నూరున్నిసా దర్జీ పనికి మంచి గిరాకీ ఉంది . అజీజ్ కి కూడా ఏ చెడు అలవాట్లు లేవు.సంపాదించింది చక్కగా పొదుపు చేసుకుంటారు. నూరిన్నిసా తమీమా పేరుమీద నెల నెలా ఐదొందల రూపాయలు పోస్టాఫీసులో దాస్తుంది కూడా. ఏ చీకు చింతా లేకుండా అల్లా కరుణించి వాళ్లకి ఒక్క బిడ్డనే ఇచ్చాడని, నూర్ ని చూసి ఆమె స్నేహితురాళ్ళు, బంధువులు మనసులో మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు... , పైకి మాత్రం ''ఒక కన్ను కన్నూ కాదు ఒక బిడ్డ బిడ్డా కాదు'' అని దెప్పి పొడుస్తూ వుంటారు .తమీమా కడుపులో ఉన్నప్పుడు అజీజ్ బేల్దారీ పనులకి డిల్లీకి వెళ్ళాడు. నూర్ కి ఏడో నెల ఉన్నప్పుడు తాజమహల్ చూడాలని ఉందని భర్తకి చిట్టీ రాసింది ,కడుపుతో వున్న వాళ్ళ కోర్కెలు తీర్చాలని అందరూ చెప్తే అజీజ్ వచ్చి ఆమెని డిల్లీకి తీసుకెళ్ళాడు. వెళ్ళిన రెండు మూడు రోజులకే నెలలు నిండకుండా తమీమ పుట్టేసింది నూర్ కి . ముచ్చటగా, బోర్లించిన బంగారు పళ్ళెంలా గుండ్రని మొహంతో ఉన్న కూతుర్ని చూసి భార్యాభర్తలిద్దరూ కూడపలుక్కుని మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నారు. ఆ విషయం వాళ్ళిద్దరికీ, ఆపరేషన్ చేసిన డాక్టరమ్మకి తప్ప ఇంకెవరికీ తెలియదు . అడిగిన వాళ్ళందరికీ ''ఇదిగో ఆ దర్గాకి వెళ్లాం, ఈ తాయత్తు కట్టుకున్నాం. కానీ, కడుపు పండడమే లేదు'' అని చెప్పేస్తారు.ఇదిగో ,ఇవాళ రోజు కంటే చాలా ముందే లేసింది నూర్ . పాసి గిన్నెలు బయటేసి, అడుగుబొడుగులు ఊడ్చి కోళ్ళకు విధిలించి, గిన్నెలన్నీశుభ్రంగా తోమి నాపరాయి మీద బోర్లించింది . ఆనక వేపపుల్ల నోట్లో వేసి పళ్ళు తోమి కూతురి మంచం దగ్గరికి వచ్చింది. ఆకాశంలో సూర్యుడు గబగబా పెద్ద వాడై పోతున్నాడు .సూర్య కిరణాలు పడుకుని ఉన్న తమీమ మొహం మీద సూటిగా పడ్తున్నాయి . అయినా ఆ పిల్ల అట్లాగే నోరు తెరుచుకుని నిర్విచారంగా నిదరపోతుంది. అది చూసి నూరున్నిసా మురిపెంగా కూతురు ముఖం చుట్టూ చేయి తిప్పి కణతకు తాటించి మెటికలు విరుచుకుంది . కూతుర్ని లేపాలంటే ఆమెకు మనసు రాలేదు. కానీ టైమైపోతుంది. ఇవాళ వాళ్ళిద్దరూ టౌన్ కి వెళ్ళాలనుకున్నారు.
తమీమాని ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తోంది నూర్. స్కూల్ బస్ వాళ్ళ ఊరికే మొదట వస్తుంది. ఏడున్నరకంతా బస్ లో ఎక్కేసేయ్యాలి.రోజూ అయితే ఇవాల్టికి బస్సులో ఉండాల్సిన మాట .ఈ రోజు స్కూల్ కి సెలవు . అందుకే ఇంత నిదర తమీమాకి . అట్లా వొళ్లెరుగక పడుకున్న బిడ్డని తనివితీరా చూసుకుని ఆఖరికి ఎలాగో లేచి అరచెయ్యి దొన్నెగా చేసి తొట్లోంచి కొన్ని నీళ్ళు తీసుకొచ్చి తెరిచి ఉంచుకున్న తమీమా నోట్లో చుక్కలు చుక్కలుగా పోసింది నవ్వుకుంటూ. తమీమా నిద్దట్లోనే ఆ నీళ్ళని శుభ్రంగా చప్పరించేసింది కానీ లేవలేదు. అది చూసి నూర్ కి నవ్వాగలేదు. నవ్వుకుంటూ తడి చెయ్యితో తమీమా ముఖాన్ని తుడుస్తూ, "బున్ని! లెయ్ లెయ్ టైమైంది, ఇంకెంత సేపు నిద్రపోతావ్" అని బిడ్డని తీసి ఒళ్లో వేసుకుంది. తమీమ కళ్ళు తెరిచి తను ఏకంగా అమ్మ ఒళ్లోనే ఉండటం చూసి మరింత గారాలు పోతూ, తల్లి డొక్కకి కరుచుకుని ,తలని తల్లి రొమ్ములకి అదుముతూ , "అమ్మీ ...... అమ్మీ ఈరోజే కదా నాకు గౌను తెచ్చేది. ఈరోజు ఖచ్చితంగా టౌన్ కి పోతాం కదా అమ్మీ ! అల్లా కీ కసమ్ కదా " అన్నది, ఒట్టు కోసం చెయ్యి చాచి. నూర్ నవ్వి " అల్లా కీ కసమ్ సరేనా, ఇంక లెయ్ టైమైంది. నేను కూడా బిర బిరా పనులు చేసుకుంటే కదా పోగలము " అన్నది. ఆ మాట విని తమీమ మంచం మీంచి చెంగున కిందికి దూకింది.రంజాన్ ఇంకో వారం రోజులే ఉంది. అసలేమయిందంటే... ఈరోజుటికి ఏడెనిమిది నెలల క్రితం తమీమ ఫ్రెండు సుస్మితకి పుట్టిన్రోజు జరిగింది. వాళ్ళ అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లు. బర్త్ డే పార్టీకి తమీమా తో పాటు క్లాసు పిల్లల్నందరినీ పిలిచారు. ఇళ్ళు దూరాబారాలలో ఉన్న పిల్లల్ని వాళ్ళే ఇంటి దగ్గర వదిలే ఏర్పాటు కూడా చేశారు. ఆ పార్టీకి వెళ్ళింది తమీమ . పైపెచ్చు సుస్మిత ఆ పిల్లకి బెస్ట్ ఫ్రెండ్ కూడాను. ఆ రోజు పార్టీ భలే జరిగింది. కేక్ కట్ చేసేప్పుడు సుస్మిత పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుంది. దాని మీద ఇంద్ర ధనుస్సు లాటి రంగు రంగుల రాళ్ళు, మెత్తటి గులాబి పూలు, లేసులు వేసి చేసిన వర్క్ ఉంది. అది చూసి తమీమా కి ఆశ్చర్యం వేసింది. అబ్బ ఎంత బాగుంది గౌను . తనకి కూడా అలాటిది ఉంటే ఎంత బాగుండు అనిపించింది ఆ పిల్లకి, ఆ రోజు రాత్రి ఆ గౌను గురించి అమ్మకి కథలు కథలుగా చెప్పింది. నూర్ అంతా విని విని కూతురి ముచ్చట చూసి "ఎక్కడ కొన్నారో, ఎంత రేటో అడుగు ఈసారి రంజాన్ కి నీకు కొనిస్తా సరేనా" అన్నది. తమీమాకి కి పట్టనలవి కాని సంతోషమేసింది. ఆ రాత్రి ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు స్కూల్ కి వెళ్లి సుస్మితను అడుగుదామా అని ఆ పిల్ల తహ తహ లాడిపోయింది.ఆ రాత్రి ఎలాగో తెల్లారింది. సుస్మిత క్లాస్ కి రాగానే తమీమా ఆ పిల్లని పట్టుకుని "సుస్మితా!సుస్మితా! నిన్న నువ్వు వేసుకున్నావే ఆ ఫ్రాక్ ఎక్కడ కొన్నారు? ఎంత ? మా అమ్మ అడిగి రమ్మన్నది, ఈ సారి రంజాన్ కి నాకు కొనిపెడతానంది మా అమ్మ" అని గడగడా మాట్లాడేసింది . తన ఫ్రాక్ తమీమా కి అంతలా నచ్చినందుకు సుస్మిత చాలా సంతోషపడి "అది డ్రీమ్స్ లో కొన్నామబ్బా, సిక్స్ తౌజండ్ రుపీస్" అని చెప్పింది. ఆ సాయంత్రం తమీమ బస్ దిగి వీధిలో నుండే ''అమ్మీ... అమ్మీ'' అని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మని వాటేసుకుని సుస్మిత చెప్పిన విషయం అమ్మ కి అప్పచెప్పేసింది.ఆరు వేలు అనగానే నూర్ కి పై ప్రాణం పైనే పోయింది. అమ్మో ఆరు వేలే, మూడు వేలతో అత్తమామలతో సహా ఇంటిల్లిపాదికీ బట్టలు కొంటుంది నూర్ ప్రతి రంజాన్ కి , ఒక్క గౌను ఆరువేలే ... అమ్మో అలా ఎలా కొనగలము అని ఆలోచనలో పడింది. తమీమ అమ్మ మొహం వాడిపోవడం చూసి నీరసపడి "అమ్మీ నాకు గౌను కొనిపెట్టవా అయితే" అని దీనంగా అన్నది. ఆ పిల్ల గొంతులో దీనత్వం విని నూర్ కి చాలా బాధేసింది . ఒక్కగానొక్క బిడ్డ దానికి ఆ మాత్రం కొనలేదా తను,ఎలాగైనా కొనాల్సిందే అని మనసులో మొండిగా అనుకుని ,బిడ్డ తల ప్రేమగా నిమిరి ''తప్పకుండా కొందాంరా బున్నీ'' అని కూతుర్ని ముద్దులాడింది.అప్పుడు మొదలుపెట్టింది నూర్ డబ్బు దాయడం.మస్తాన్ వలి ఉరుసులో కొన్న పెద్ద చేపబొమ్మ హుండీ నిండుగా పది, యాభై, వొంద ... వట్టి నోట్లే, చిల్లర కాదు,అంతా దాస్తూ వచ్చింది. టైలరింగ్ పని శక్తికి మించీ చెయ్యడం, ఆ పని లేకపోతే బీడీలు చుట్టడం మొదలు పెట్టింది. మొగుడ్ని కూడా ఇంట్లో నిలవనీకుండా పనులకు పంపింది. ఇప్పుడు ఆ డబ్బంతా పెరిగి పెరిగి ఆరు వేలా రెండు వందలా ముప్పై అయ్యింది. ఎందుకైనా మంచిదని చెప్పి ఆ క్రితం రోజు రాత్రి హుండీ పగలగొట్టి తల్లీ కూతుళ్ళు పదిసార్లు డబ్బు లెక్క చూసుకున్నారు. ఆ డబ్బంతా, వాళ్ళ దూరపు పెద్దమ్మ మక్కా నుండి తెచ్చిచ్చిన ఎర్ర చేతి గుడ్డలో మూటకట్టింది నూర్. నూర్ కి, తమీమా కి మనసంతా అలివి కాని సంతోషంతో నిండిపోయింది. ఈరోజే నూర్ టౌన్ కి వెళ్ళాల్సిన రోజు . అందుకే పొద్దన్నే లేసి పనులంతా చేసుకున్నది .ఇంటికి తాళం పెట్టి పన్నెండు గంటల బస్సులో టౌన్ కి బయల్దేరారు నూరున్నీసా ,తమీమా . బస్సులో కూర్చున్న తరువాత గుర్తొచ్చింది ఆమెకు,తనకు ఆ బట్టల షాప్ పేరు తెలుసు కాని అది ఎక్కడుంటుందో ఆ చిరునామా తెలీదని. బస్టాండులో దిగి ,తమీమా చేయి జాగ్రతగా పట్టుకుని ఆ చివరగా నిలబడి ఉన్న నిమ్మకాయ షోడా బండతని దగ్గరికి వెళ్లి '' అన్నా !ఇక్కడ డ్రీమ్స్ అని చిన్నపిలకాయల... అదే ,ఆడపిల్లల గుడ్డలమ్మే అంగడి ఎక్కడో చెప్తావా" అన్నది. నిమ్మకాయ షోడా అతను చాలా ఆలోచించాడు కానీ, అతనికేం అంతుపట్టలా. అందుకని "అట్ట పొయ్యి ఏదైనా గుడ్డలంగటిలో అడుగు బూబమ్మా చెప్పేస్తారు. మనకేడ తెలస్తది గుడ్డలంగడి కత, నిమ్మకాయలు ఏడ దొరుకుతాయో చెప్పమంటే సరే కానీ....." అన్నాడు నోరు సాగదీసి నవ్వతా.నూర్,తమీమా జాగ్రత్త గా రోడ్డు దాటి ఒక ఫర్లాంగ్ నడిచి మొదట కనిపించిన బట్టల షాప్ లోకి వెళ్ళారు . నూర్ వాళ్ళని అడ్రసు అడిగింది. వాళ్ళు చాలా వివరంగా అడ్రస్ చెప్పి ఏ నెంబరు బస్సు ఎక్కాలో అది ఎప్పుడొస్తుందో, ఆ బస్సు కోసం ఎక్కడ నిలుచుకోవాలో కూడా చెప్పేశారు. అరగంట నిలబడి, మరో అరగంట ప్రయాణించి బంగారు రంగు మెటల్ అక్షరాలతో రాసి ఉన్న "డ్రీమ్స్" కి చేరుకున్నారు అమ్మా కూతుర్లిద్దరూ .అది మూడంతుస్థుల్లో ఉన్న బట్టల షాప్ , మామూలు బట్టల దుఖాణం కాదు ,డిజైనర్ స్టోర్. దాన్ని చూడగానే నూర్ కి గొంతెండిపోయినట్టు అనిపించింది. లోపలికి వెళదామా వద్దా అని ఆలోచిస్తూ ,నెమ్మదిగా భుజాన వేళాడుతున్న చేసంచి తీసి ఎర్ర కర్చీఫ్ లో కట్టి ఉన్న డబ్బుని తడుముకుంది. కూతుర్ని దగ్గరగా తీసుకుని బురఖాని మరింత సర్దుకున్నది. ఎందుకు భయ పడాలి తను ఆ గౌను ఆరువేల రూపాయలు, నా దగ్గిర ఇంకా ఎక్కువే ఉంది అనుకుని తనకి తనే నచ్చజెప్పుకున్నది .నూర్ ఆ సందిగ్దావస్తలో ఉండగానే నీలి రంగు డ్రెస్ లో వున్నా గెట్ కీపర్ నిర్లిప్తంగా తలుపు తెరిచాడు . తలుపు తెరవగానే లోపల ఊపిరాడలేదన్నట్లు ఏసీ గాలి బయటకి పరుగులు పెట్టింది . నూర్ షాప్ లోకి నాలుగు అడుగులు వేయగానే తెల్లగా ,బక్క పల్చగా , ఎర్రటి పూల చీర ,హైనెక్ రవిక వేసుకున్న ఒక అమ్మాయి "ఏం కావాలి" అన్నది , నూర్ గొంతు పెగల్చుకుని,తమీమాని ముందుకు నెట్టి "పాపకి గౌను కొనాలి" అని మెల్లగా వినీ వినపడనట్టు బదులిచ్చింది .అది విని ఆ అమ్మాయి "మూడో అంతస్తులో కుడి పక్క. మెట్లైతే అటు ,లిప్టైతే ఇక్కడ "అని వల్లించింది. ఇంతలో బాగా తెల్లగా,స్టైల్ గా , జుట్టు విరబోసుకున్న ఒకావిడ లోపలికొచ్చింది. కౌంటర్ లో ఉన్న మేనేజర్ లేచి ఆవిడకి నమస్కరించి ఇంగ్లీషులో ఏదో చెప్తుండగా నూర్ మెట్ల వైపుకి వచ్చేసింది.తమీమాని తీసుకుని అన్ని మెట్లూ ఎక్కి మూడో అంతస్తుకి చేరుకుని నూర్ గౌన్ల కౌంటర్ కి వెళ్ళే సరికి ఆ తెల్లటావిడ లిఫ్ట్ లో వచ్చేసి అప్పటికే అక్కడ కూర్చుని ఉంది. షాప్ లో ఉన్న వాళ్ళు మరేం పనిలేనట్లు ఆవిడకి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. నూర్ ఆవిడ పక్కకెళ్ళి నిలుచుని ,కాసేపు ఆవిడ్ని,ఆవిడ వేసుకున్న రవిక మోడల్ ని పరీక్షగా చూసి ఎవరో పెద్దింటావిడ అనుకున్నది. కౌంటర్ పిల్లవాడు ఆవిడ ముందు రకరకాల గౌన్లు ఒక దాని పై మరొకటి పరుస్తూ వస్తున్నాడు ,అన్నీ మంచి మంచి గౌన్లు .నూర్ బేగ్ లోంచి ఎర్ర కర్చీఫ్ మూట తీసి చేతిలో పట్టుకుని, కాసేపు ఆ గౌన్ల వంక చూస్తూ నిలబడింది, తరువాత మళ్ళీ బాగ్ లో దాన్ని జాగ్రత్తగా సర్ధి కౌంటర్ లో పిల్లవాడితో "బాబూ ...." అంటూ తనకే రకం గౌను కావాలో వర్ణించి చెప్పబోయింది ఆ కుర్రాడు "కాసేపు ఆగమ్మ...." అని ఒక ముక్కతో ఆపేసి మేడం కి చూపించడం మొదలు పెట్టాడు.మరో పది నిముషాలు గడిచాయి ,ఆ తరువాత మరో పదిహేను నిముషాలు కూడా గడిచాయి. ఇంతలో మేడం కి ,చుట్టు పక్కల వున్న మరో ముగ్గురికీ గాజు గ్లాసుల్లో నీళ్ళు,చల్లటి కూల్ డ్రింకులూ వచ్చాయి. అవి చూడగానే నిలుచుని వున్న తమీమ అమ్మని చిన్నగా గోకి బొటన వేలిని పైకెత్తి పెదవుల దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళు అని సైగ చేసింది . అది చూసి నూర్ చూపుడు వేలిని పెదాలపై వుంచి ఉష్ అని సైగ చేసింది కూతురికి . నిజానికి ఎండన బడి రావటం చేత నూర్ కి కూడా దాహమేస్తుంది కూతురి కంటే ముందే మంచినీళ్ళు అడుగుదామనుకుంది కూడా కానీ ఏదో బెరుకుతోనో ,అభిమానం చేతనో అడగలేకపోయింది .నూర్ ని ఎవరూ పలకరించిన పాపాన పోలేదు, అక్కడ చూపిస్తున్న గౌనులు చూస్తూ ఓపికగా నిలుచున్నది, కానీ ఎంతసేపలా, మళ్ళీ ఊరికెళ్ళాలి,ఇంటికెళ్ళి వంట చెయ్యాలి . లాస్ట్ బస్ ఆరుకే . అది దాటితే మరి బస్సు లేదు, . తొందరగా ముగించాలి, ఇంకా భర్తకి, అత్తామామలకి రంజాన్ బట్టలు కొనాలి. నూర్ ఈసారి ధైర్యం చేసి "బాబూ నాకు చూపించవా ఎంతసేపు నిలబడేది" అన్నది. గౌను చూపెడుతున్న అబ్బాయి అందుకేమీ మాట్లాడలేదు కానీ, పక్కన కౌంటర్లో వున్న పిల్లవాడు "ఉండు బూబమ్మ ముందు మేడం పని కానీ ,అలా తొందరపడితే ఎలా,నిలబడలేకపోతే కూర్చో నిన్ను నిలబడమన్నది ఎవరూ '' అన్నాడు."కానీ కూర్చోవాలంటే అక్కడెక్కడా కుర్చీలు ఖాళీ లేవు . నిండా జనం . ఎవరెవరో వస్తున్నారు . అందరూ ఖరీదైన బట్టల్లో అందంగా వున్నారు. వాళ్ళందరి మధ్య నూర్ కి తనకి తనే కుంచించి పోయినట్లు , ఊపిరాడనట్లు అనిపించింది . అయినా తమీమా ముద్దు ముఖాన్ని చూసి అట్లాగే నిలబడింది . ఇంతలో షాప్ కుర్రాడు చిన్న స్టూల్ తెచ్చిచాడు . నూర్ తమీమాని దానిపై కూర్చో పెట్టింది . మరి కాసేపు గడిచింది . మేడం కి చూపిస్తున్న వాట్లలో గులాబీరంగు గౌను కనిపిస్తే దాన్ని తీసుకుని చూడబోయింది నూర్ . కౌంటర్లో వున్నతను దాన్ని నూర్ నుండి లాక్కుని'' కాసేపాగు బూబమ్మ'' అన్నాడు కసిరినట్టు. అది చూసి తమీమా తలెత్తి అమ్మ ముఖం వంక చూసింది . ఏమీ అర్థం కాకున్నా ఎందుకో ఆ చిన్ని అమ్మాయికి మనసులో బాధ కలిగింది . ఇంతలో మేడం మొదలుపెట్టింది "ఇదిగో అబ్బాయ్ అందరూ మాకు 40% డిస్కౌంట్ ఇస్తారు. మీరు మాత్రం ఎప్పుడూ 30 పర్సంటే అంటే కుదరదు . ఈసారి 40% ఇవ్వకపోతే ఇకరాను'' అని . సేల్సతను నవ్వుతూ ''మేడం మా దగ్గరున్న వెరైటీలు మీకు ఎవరైనా ఇస్తారా చెప్పండి. వాళ్ళకీ మాకూ అదే తేడా'' అన్నాడు. నూర్ ఆశ్చర్యపోయింది 40% డిస్కౌంట్ అంటే ఆరువేల గౌను ఆవిడకి దాదాపు మూడున్నర వేలకి వస్తుంది. నూర్ ఆవిడ్ని తెరిపార చూసింది , మళ్ళీ ఇటు తిరిగి ఇంకో గౌను చేతిలోకి తీసుకోబోయింది. సేల్స్ అతను నూర్ చేతిలో గౌను మళ్ళీ లాక్కుని "నీక్కదమ్మా చెప్పేది, కాస్తాగలేవూ " అన్నాడు చిరాగ్గా కసిరినట్టు .
నూర్ కి దిగులేసిపోయింది,వచ్చినప్పటి నుండీ చూస్తుంది ,ఎవరూ తననొక మనిషి లాగా గుర్తించటం లేదు .చులకనగా చూస్తున్నారు .విసుక్కున్టున్నారు అనుకుంది . అలా అనుకోగానే ఆమెకి దుఃఖమొచ్చేసింది . నా దగ్గర సరిపడా డబ్బు ఉందికదా అనుకుంది. మేడం చివరికి కొన్న గౌనుని చూసి, ఆవిడకి నాకూ ఏంటి తేడా ఆ డబ్బు నేనీలేనా ,నేనేమైనా వీళ్ళ దగ్గరికి ముష్టెత్తుకోవడానికి వచ్చానా అనుకుంది ,ఎందుకో నూర్ కి ఒక్కసారిగా చెడ్డ అవమానమనిపించింది. అంతే కళ్ళలోంచి, ముక్కులోంచి పట్టనలవి కాని దుఃఖం తన్నుకొచ్చేసింది, మరేం మాట్లాడకుండా, బురఖా సర్దుకుంటూ, భుజాన వున్న చేతి సంచిని తడుముకుంటూ తమీమాని తీసుకుని నేరుగా దిగి కిందికొచ్చేసింది. ఏమమ్మా ఏంటి వెళిపోతున్నావు అని ఎవరైనా అడుగుతారేమో అని చూసింది కానీ,ఎవరూ అడగనేలేదు, అసలు నూర్ ని ఒక మనిషిలాగే వాళ్ళు మతించలేదు.
నూర్ ,తమీమా ఎర్రటెండలో నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బస్సు కోసం నిలబడ్డారు. తమీమా కి అమ్మని మాట్లాడించాలంటే భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకుని అమ్మని చిన్నగా తట్టి "అమ్మీ ఏమయింది, మనమెందుకు అక్కడ నుండి వచ్చేశాం?" అన్నది. నూర్ కూతుర్ని దగ్గరికి తీసుకున్నదే కానీ తిరిగి సమాధానమేమీ చెప్పలేదు. తమీమా మళ్ళీ "అమ్మీ మన దగ్గర కూడా డబ్బులున్నాయి కదా , అయినా వాళ్ళు మనకెందుకు చూపించలేదు? " అని అడిగింది. ఈసారి నూర్, నోరు పెకలించి "ఏమోరా బున్నీ మనకెలా తెలుస్తుంది. చాలాసేపు నిలబడ్డాం కదరా, నువ్వే చూసావు కదా" అన్నది క్షమార్పణ వేడుకుంటున్న గొంతుతో . తమీమా తలూపింది. నిజానికి ఇందాకటి నుండి అదే విషయం నూర్ మనసులో కూడా తిరుగుతోంది. ఈ ప్రపంచంలో అన్నింటినీ సరి పడా డబ్బు వున్నా కొనలేమేమో , డబ్బుంటే మాత్రం సరిపోదు.డాబు గా దర్పం గా వుండాలి, ఆ ఫలానా వస్తువుని కొనాలన్నా, అనుభవించాలన్నా బహుశా తరతరాల స్థోమత ఉండాలేమో. గొప్పతనం ఉండాలేమో. అక్కడికి వచ్చినావిడ పుట్టు ధనవంతురాలై ఉంటుంది, ఆవిడ ఒకటికి పది గౌన్లు కొనగలదు, పదిమందికి షాప్ గురించి చెప్పగలదు. తనేం చేయగలదు ?జీవితంలో ఒక్కసారి బోడి ఆరువేల రూపాయలు పెట్టి ఒక్కటంటే ఒక్క గౌను కొనగలదు. అంతే కదా ? అదే నిజం. తను బాధపడటమెందుకు అనవసరంగా అనుకుంది నూర్. అయినా ఎందుకో ఆమెకి మనసంతా బాధగా తోచింది.కాసేపటికి బస్సొచ్చింది. ఇద్దరూ బస్సెక్కి తామెప్పుడూ బట్టలు కొనే సండే మార్కెట్ వద్దకి వెళ్ళారు. బస్సు దిగగానే రోడ్డు వారగా నిలబడి ఉన్న షోడా బండి దగ్గరకు వెళ్లి తమీమాకో కలర్ షోడా ,తనకో మామూలు షోడా కొట్టిపిచ్చింది నూర్. ఇద్దరూ తాగి తాము వాడుకగా వెళ్ళే దుఖాణానికి వెళ్ళారు. దుఖాణం అబ్బాయి పరిచయంగా నవ్వి "బాగుండా బూబమ్మా" అన్నాడు . నూర్ తలూపి "అబ్బయ్యా అన్నిటికంటే మంచి గౌను చూపిచ్చు. రోజా రంగులో ఉండాల,రాళ్ళుగీళ్లు , లేసులు గీసులు వుండాల " అన్నది. ఆ అబ్బాయి బోలెడు గౌన్లు చూపించాడు . వాటిలో ఒకటి రోజారంగులో ఉంది,దానికి లేసులున్నాయి, పూలున్నాయి, రంగు రంగుల రాళ్ళూ ఉన్నాయి.
నూర్ దానిని తమీమాకి చూపించి "బాగుంది కదరా బున్నీ" అన్నది. తమీమా నవ్వి తలూపింది . నూర్ తమీమాని నిలబెట్టి గౌనును తమీమా ఒంటిపైన పెట్టి కొలత చూస్తూ ''ఎదిగే బిడ్డ మూడు నాలుగేళ్ళు సరిపోవాల కదా ''అన్నది చుట్టుపక్కల వున్న వాళ్ళని ఉద్దేశిస్తూ చనువుగా . అలా పెట్టినపుడు ఆ గౌను రంగు తమీమా ఒంటి రంగులో కలిసి కొత్త కాంతులీనుతోంది. అది చూసి నూర్ ఇందాకటి బాధనంతా మరిచిపోయి తమీమా ముఖం చుట్టూ చేయి తిప్పి మెటికలు విరిచింది. అది చూసి షాప్ అబ్బాయి నవ్వాడు,నవ్వి ,తమీమా పాలుగారే బుగ్గ ని ముద్దుగా సాగదీసాడు .
గౌను కొన్న తరువాత చాల సంతృప్తిగా అమ్మ కూతుళ్ళు అక్కడనుండి ఇంకో అంగడికి వెళ్లి మిగిలిన బట్టలు కొని ,ఇద్దరూ చెరొక మూర కదంబం పూలు ,పది రూపాయలకి పనస తొనలు కొనుక్కుని సందేలకంతా ఇంటికొచ్చేసారు .
తమీమ ఆ గౌనుని వేసుకుని రంజాన్ ని గొప్పగా జరుపుకున్నది. సెలవయ్యాక వచ్చిన మొదటి "కలర్ డ్రెస్" రోజు స్కూల్ కి కూడా వేసుకెళ్ళింది. ఆ రోజు సాయంత్రం స్కూల్ బస్ దిగి "అమ్మీ అమ్మీ ఫ్రాక్ చాలా బాగుందన్నారు మా ఫ్రెండ్స్ . సుస్మిత అయితే నైస్ ఫ్రాక్ అన్నది అమ్మీ " అంటూ అరుచుకుంటూ వచ్చింది తమీమ. అప్పుడే కుట్టిన రవికకు కాజాలేస్తున్న నూర్ తమీమాని వళ్ళోకి తీసుకుని కూతురి పాల బుగ్గలపైన ముద్దు పెట్టుకుని " నువ్వు బాగా చదువుకోవాలి బున్నీ, పెద్ద పెరిగాక గడ గడా ఇంగ్లీష్ మాట్లాడాలి !పెద్ద ఉద్యోగం చెయ్యాలి సరేనా! అప్పుడే అమ్మకి సంతోషం " అన్నది. అమ్మ మాటలకి తమీమ తలూపి ఇంట్లోకెళ్ళింది, తమీమానే చూస్తున్న నూర్ కి ఆవాళ '' డ్రీమ్స్'' గుర్తొచ్చి ఎందుకో గానీ గుబులు గుబులుగా అనిపించింది .
సామాన్య