ఫౌండేషన్ పనులకని సత్తు పల్లి లో ఇల్లు తీసుకున్న వెంటనే వంటకి ,సహాయానికి మనుషులు కావాలని చెప్పానా ,ఇంటి ఓనరు రాంబాబు ఫాతిమాని ,ఆవిడ చెల్లెలు కూతురు జిలానీని తీసుకు వచ్చాడు .
ఫాతిమా యాభై యేళ్ళా విడ మాట్లాడుతూ ఎంత జీతం కావాలో చెప్పింది . కుదరదు నేను అంత ఇవ్వను ,ఇంతే ఇస్తాను అని చెప్పా. మీ ఇష్టమమ్మా అని , నిన్ను నా కూతురిలా, చెల్లెల్లా చూసుకుంటాను అన్నది ఎందుకో ... ,నేను నవ్వాను నవ్వి అయితే నువ్వు ఇందాక చెప్పిన జీతం ఇస్తాను . నిన్ను అమ్మీ అని పిలుస్తాను అని చెప్పాను . అమ్మీ ... ఈ పదం బాగుంది . ఫాతిమా మంచి అమ్మే కాకపోతే నాకు ఒక్కో సారి చల్లటి అన్నం పెడుతుంది . అలిగి గిన్నె అక్కడే పెట్టేస్తే వచ్చి బ్రతిమలాడి ఆ చల్లటి అన్నమే తినేట్లు చేస్తుంది . ఒక రోజు మొబైల్ తెచ్చింది నా ఫోటో తీసుకు రమ్మన్నది కూతురు అని .
జిలాని అమ్మీ చెల్లి కూతురు . వాళ్ళ అమ్మకి ఒకటే కూతురు ,నాన్న చనిపోయాడు . అమ్మ కి వేరే పెళ్లి అయింది . జిలానీ పెదమ్మ దగ్గరే వుండి పోయింది . తెల్లటి సన్నటి పిల్ల . అమ్మీ కూతుర్లు పీజీ లు చదివారు . జిలానీ టెన్త్ ఫెయిలయింది . ఎందుకట్లా అంటే జిలానీకి చిన్నపుడే ఒక కన్ను పోయింది . అందుకని చదవలేక పోయింది అని చెప్పింది అమ్మీ . జిలానీ కి నాకూ సాపత్యం వుంది ఏంటంటే నేను పొద్దునే కాంటాక్ట్ లెన్స్ పెటు కుంటాను . జిలానీ గవ్వ కన్ను తీసి కడిగి పెట్టుకుంటుంది . ఇద్దరం ఆ ప్రాసెస్లో కన్ను ఎంత నొప్పి పుడుతుందో ఒకరికొకరం అడిగి తెలుసుకుని సానుభూతి చూపుకుంటాం . జిలానీ రాత్రులు నాతోనే పడుకుంటుంది . అంటే ఇక నాతోనే వుండి పోయిందన మాట . అప్పుడు జిలానీ తిన్నదా లేదా అని నేను , సరిగా తిన్నానా లేదా అని నా గురించి జిలానీ అడిగి తెలుసుకుని కబుర్లు చెప్పుకుంటాం
మొన్నో రోజు జిలానీ వాళ్ళ అమ్మ వచ్చిందట నేనేమో కేంప్ కి వెళ్లాను . వచ్చాక సంధ్యవేళ నా కాఫీ ఎలా ఉండాలో చెప్పడానికి వంట ఇంట్లోకి వెళ్ళానా కప్ బోర్డ్లో వున్న బేగ్ లో నుండి పలకరించింది మల్లె పూ మాల . మనసు నిండుగా ఆ పరిమళాన్ని ఆస్వాదించి ఎక్కడివి పూలు అంటే జిలాని చెప్పింది వాళ్ళమ్మ వచ్చిందని . చెప్పి ,పూలు తీసిచ్చి పెటుకోమని బ్రతిమలాడింది ,నేను ''వద్దురా నాన్న ,నువ్వు చిన్న పిల్లవి పూలు పెట్టుకుంటే అందం నేనేమో ముసలమ్మని కదా అందుకని వద్దు'' అన్నాను . అని కాఫీ పటు కుని హాల్ లోకి వచ్చేసాను . జిలానీ ఈ సారి సగం పూమాలని పటుకొచ్చి ఇద్దరం చేరి సగం పెట్టు కుందాం తీసుకోండి మేడం అన్నది అంతేనా ప్లేటు నిండా గులాబి పూలు పెట్టుకోచ్చింది [తినే గులాబులు ] తినండి అంటూ . ఒక్కటి తీసుకున్నానా .. . గులాబి పువ్వు గాడమైన మల్లె ల వాసన వేస్తుంది .
ఒక రోజు ఎక్కడిదో ఒక గులాబి పువ్వు ఇచ్చింది జిలానీ . బలవంతానా జిలానీ కోసమని పెటుకున్నానా ,ఆ మధ్యాహ్నపు నిదురలో ఎపుడో పక్క మీద పడిపోయిందేమో ,దాన్ని తీసి మళ్ళీ నీళ్ళలో వేసి దానికి ఆయువు పోసి మరుసటి రోజు పొద్దునే బయటకి వెళ్తున్నపుడు పటుకోచ్చింది ,పెట్టుకోమంటూ ,పువ్వుతో పాటు ఒక మాట'' రేపు ఊరికేలుతున్నారు కదా అక్కడ నేనుండను కదా పువ్వు ఇవ్వడానికి ,అందుకని ఇవాళ పెట్టుకోండి '' అని
ఇంటికి వచ్చాను కదా ,కానీ జిలానీ ని చాలా మిస్ అవుతున్నా .
అందరూ చిన్నప్ప్పటి నుండి నన్ను అదృష్ట వంతురాలినని అంటారు . నిజమేనేమో నా సత్తుపల్లి అదృష్టమంతా నన్ను ఇంత ప్రేమిస్తున్న జిలానీ లో ,అమ్మీ లో ,తోడ పుట్టకున్నా తోడుగా వుండే కిరణ్ స్నేహితులు మాధురి, నరేష్ లో , డ్రైవర్ ప్రభాకర్ రెడ్డి , పీ ఏ కిషోర్ లో , నాకు ఇంతకు మునుపు ఎప్పుడూ పరిచయం లేకున్నా నాకోసమని భగవంతుడు పంపిన దేవతల్లా వచ్చి , నాకు మంచి ఇల్లు చూసి పెట్టి అడగకనే అడుగడుగునా సహాయం చేసే మంచి మనుషులు డాక్టర్ ప్రదీప్ , పూర్ణ చంద్ర రావు గారిలో ఉందేమో .
అవును నేను అదృష్టవంతురాలినే . ప్రేమించే మనుషులున్న వారు అదృష్ట వంతులు కాకేమి ?