About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Tuesday, 31 January 2012

టెన్ థింగ్స్ ఐ హేట్ అబౌట్ యు...



ఈ మూవీ అంటేనాకు బాగా ఇష్టం .టీన్ రొమాంటిక్ కామెడి మూవీ కనుక పెద్ద తరహాలో ఇష్టపడకుండా వుండాల్సింది నిజానికి .కానీ, బాగా ఇష్టం వేసేసింది .ఎందుకబ్బా అట్లా అనుకుంటే ఇది Shakespeare ''The Taming of the Shrew''కి ఆధునిక రూపం అని తెలియ వచ్చింది .అప్పుడిక ,అది కదా సంగతి అని సంతోష పడి పోయి నిరభ్యంతరంగా నాలుగైదు సార్లు చూసి తరించడం జరిగింది.

ఇందులోని"Can't Take My Eyes Off You" అనే పాటకు కు ''అయాం వెరీ సారీ అంటున్నా ఒందో సారి''అని తెలుగు రూపాన్ని ఇచ్చాడు మన త్రివిక్రమ్ .డిట్టో... డిట్టోగా .

అట్లాగే Cheap Trick రాక్ బ్యాండ్ వారి బిగ్గెస్ట్ హిట్ '' "I Want You to Want Me"కూడా ఈ మూవీలో వినొచ్చు .

ఈ మూవీ హీరో హీత్ లేడ్జర్ .మంచి నటుడు.నవ్వు చాలా బాగుంటుంది .మొదటి సారి హీత్ ను ''The Patriot''మూవీ లో చూసాను .దురదృష్టం ఆ పిల్లాడు 29 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు.

ఈ పోయెం పేరే సినిమాది కూడా .నాకెంత ద్వేషమో నువ్వంటే అంటూ ఎంత ఇష్టమో పదం పదం లోనూ చెప్తుంది నాయిక . చూడండి.
10 Things I Hate About You Poem lyrics

I hate the way you talk to me,

and the way you cut your hair.

I hate the way you drive my car,

I hate it when you stare.

I hate your big dumb combat boots

and the way you read my mind.

I hate you so much it makes me sick,

it even makes me rhyme.

I hate the way you’re always right,

I hate it when you lie.

I hate it when you make me laugh,

even worse when you make me cry.

I hate it when you’re not around,

and the fact that you didn’t call.

But mostly I hate the way I don’t hate you,

not even close…

not even a little bit…

not even at all.

జంగిడి పశువుల సున్..దరి !


కొండ కొమ్మున
ఊరందరి పశువులతో
ఊత కర్రకి తల తగిలించి నిలిచి
సున్ దరి అంది
'సంవత్సరం కావలికి
ముప్పై శేర్లంటే
ఏమొస్తుంది చెప్పూ 'అని

పొగాకు పళ్ళ సున్ దరి
గయ్యాళి నోటి సున్ దరి
నవ్వుల నల్ల పువ్వు సున్ దరి
నవ్వుతూ నవ్వుతూ అంది
తాగుబోతు మొగుడ్ని
సోమరిగొడ్డు మొగుడ్ని
తన్ని తరిమేశానని

'బంధూ 'అంటూ
ఏడాదికోసారి పూసే
పలాష్ పూలలా
ఎపుడో సారి కనిపించే
నా సంతాలీ సున్ దరి అంది
బయటికెలితే ఒకటే పని
ఇంట్లోనైతే 'గదాకాజ్ 'అని
అయినా నోటికి ,చేతికి
మధ్యనున్న 'జగా 'మరీ పెద్దదని

కార్తీక పున్నమి నాడు
'సోరాయ్ 'పాటల బండిలో
స్వర్గమంతా తిప్పి
కొని తెచ్చిన ఎర్రంచు తెల్ల చీర
కట్టబెట్టి సున్ దరి అంది
'నీకైనా నాకైనా
కష్టమే కడుపుకు దారి 'అని

చెట్టు చేమల్ని
ఇంటి కప్పుల్ని
పట్టి చెరిచే 'కాలో బైశాక్ '
కుంబ వృష్టి వెలిసిన ఉదయం
సగం కూలిన
తన మట్టి ఇంటి తలాకిట
నిలబడి ,నిర్లిప్తంగా
సున్ దరి అంది
పుట్టినప్పటి నుండి
ఇంక్విలాబ్ కి జిందాబాద్
చెప్తూనే ఉన్నా
తాను దూరగలిగిన స్వర్గమిదేనని

లాల్ ఘర్ రోడ్లపై
కూల్చిన చెట్ల కూకటి వేర్లపై
గొడ్డలి పట్టిన చేతిని ఆనించి నిలిచి
ఏదో పురాతన యుద్ద చిత్తరువుని
జ్ఞప్తికి తెస్తూ ,ఎర్రబడ్డ కళ్ళతో
సున్ దరి అంది
పూట పూటా యుద్దమంటే
యెట్లా చెప్పూ అని

వైశాఖ పూర్ణిమ నాటి
వేటాడే పండుగ
'దిశం'కోశం దాచి పెట్టిన
విల్లంబును చూపిస్తూ
సున్ దరి అంది
ఇప్పుడు మేమే యాటలమైనామని

సారి పలాష్ లు
పూసాయి ,రాలాయి
సున్ దరే కనిపించ లేదు
సున్ దరంటే
అమాయకపు ఆకు పచ్చటి వనాలలో
ప్రవహించే వేడి నెత్తుటి పాయ
సున్ దరంటే
సాలవనాల పేలిన
సూర్య నక్షత్రం
సున్ దరిని మీరేమైనా చూశారా ...?
20/12/2010 ,వివిధ ,ఆంద్ర జ్యోతి .

Saturday, 28 January 2012

పది నేనులు, ఒకే నువ్వు..!


ఆరు రుతువుల నుండి
ఒక్కటే వర్ణాన్ని పొందాలనుకుంటావ్
అరవై ఒకటో వర్ణాన్నై
నీకెదురొస్తాను

పెంపుడు కుక్కని
నిమురుతూ
అలవాటుని ప్రేమిస్తుంటావ్
జవనాశ్వాన్నై
సతత హరితారణ్యాలలో
స్మిత సింధువునై
పరుగులెత్తుతుంటాను

కిటికీ ఆకాశం లోని
ప్రతి రోజుటి చద్ది నక్షత్రాన్నే
చూస్తుంటావ్
కనీ కనిపించక
పరిశోధకులను వేదించే
కొత్త నక్షత్రాన్నై
సొగసు సోయగాలు
పోతుంటాను

నగరానివై
సంక్లిష్టతని శ్వాసిస్తుంటావ్
పల్లెనై
చిలుకల గూళ్ళ తాటి తోపునై
ఎవరూ కలచని కొలనునై
కళ్లు విప్పార్చుకుని
నిను చూస్తుంటాను

తెలిసిన వెలిసిన పువ్వుల్లో
నను వెదుకుతావ్
నువ్వెప్పుడూ చూడని
పొగరు పువ్వునై
తిక్క తేనెలు కురిపిస్తుంటాను

ఎక్కి వచ్చేసిన
నిచ్చెనలు చూసుకుని
గొప్పలు పోతుంటావ్
నా పరమ పద సోపానంలో
నువ్వు పడిపోయిన
పాము నోటిని చూసి
పగలబడి నవ్వుతుంటాను

పట్టి పెట్టే

గట్టి ఆనకట్టల గురించి

లెక్కలేస్తుంటావ్
పెడసరపు నదినై
నిను ఎడమ కాలితో తన్ని
నీ మీదుగా దుమికి పోతాను

......ఇక్కడ నిలబడి
పా......పమని జాలిపడి
వాచ్యం చేస్తున్నా,
ఇది
ప్రవల్హిక
శత సహస్ర ముఖాలవయ్ రా
అర్థం చేసుకుందువు గానీ..!
[ఆగష్టు 23,2011,ఆదివారం వార్త.]

Friday, 20 January 2012

ఒక రోజు కొన్ని దృశ్యాలు !


సంత్రుప్తినో ,అసంత్రుప్తినో
మ్రోగిస్తూ
గుడిలో గంట

ఆకలి పావురాల కోసం
అమ్మలా ,దారంతా రాలుతున్న
ధాన్యం బస్తా

తామర తూడు చుట్టూ
బాతు పిల్లను తిప్పుతున్న
చేప పిల్ల

ఆకాశం కేసి చేతులు చాచి
చినుకు ముద్దు కోసం
చిన్న పిల్లలా మహా వృక్షం

పజిల్ రోడ్లలో
ఆలోచనల పుట్టల్ని మోసుకెళుతూ
కాళ్ళు ,చమురు గుర్రాలు

న్యాయం కోసం
నిరాహార దీక్షలై నిరీక్షిస్తూ
వేళ్ళబడ్డ శిబిరాలు

రండ గొండ శబ్దాల
రోడ్డు పక్కనే
సుఖ నిద్రలో శునక యోగి

చెమటై పూసి ,వాడి పోయి
ఇంటి బాట పట్టిన
కూలి ట్రక్కులు

ద్వారా బంధానికి
తలుపు చెక్కై అతికి
ఆఫీసమ్మ కోసం ఎదురు చూస్తూ
స్కూలు పాపాయి

రాత్రింటి కోసం
గుడ్డి లాంతర్ని సిద్దం చేస్తూ
సంధ్యాకాశం

రోజు గుండెను
తడుముకుంటూ
క్షణాల ప్రవాహం
పాతగా ,కొత్తగా
కొత్త పాతగా .

[ఆదివారం వార్త ...16 మే 2010 ]


Thursday, 19 January 2012

ఇన్ ద ఆబ్ స్ట్రాక్ట్ బట్ నాట్ ఇన్ ద కాంక్రీట్...


జన సంద్రంలో
చూపుల ఊయల వేసి
ముద్దాడిన లాస్యంలో
లయమైన నిర్లిప్త కాంక్ష

పరిమళ గమనంలా ఒక అందం
సుడి గాలిలా అనుక్షణం
విడిపించుకోలేని
విరసపు కాంక్ష

వాయులీనమై
దిగులు పూల గుండెను తడిమే
సమ్మోహన రాగం
చలించలేని చలితకాంక్ష

రంగై పరచుకుని
రూపమై తలెత్తిన
ఒక అలౌకికం
కలవ లేని కలలకాంక్ష

నీలాంబరంలా తను
నీలి సంద్రంలా నేను
కావిలించగలేని
దిగ్దిగంతాల కాంక్ష

ఎన్నెన్నో కాంక్షలు
అమూర్తంగా
మూర్తిమంతమైన
ఏక పత్నీ /పతీవ్రతంలో
లయమవుతూ ...

(టైటిల్ :'లారెన్స్ వుమెన్ ఇన్ లవ్ 'నుండి )
వివధ ,ఆంధ్రజ్యోతి ,2006 అలా కావచ్చు

Monday, 16 January 2012

అనిత పాడిన పాట…!

అనిత పాడిన పాట…!

నిత్యం రద్దీగా వుండే మెయిన్ రోడ్ పక్కన నిలుచుని వుందో పాత కాలం బంగ్లో .హుందాగా శాంతంగా అచ్చు మరో పది తరాలకు కూడా దిగులు లేని పెద్దింటి ఆడపడుచులా వుంది.బంగ్లో ఆవరణలో పరుచుకుని వున్నపనస,అనారు,జామి,మామిడి చెట్ల పై వాలి రక రకాల పక్షులు కిల కిలమని ఎడతెగని కబుర్లు. చెప్పుకుంటున్నాయ్ .ఆకాశంలో సూర్యుడు ఆవిళించి,పళ్ళు తోమి ,కాఫీ తాగి సంద్యాద్రి వైపు పావు వంతు ప్రయాణం కూడా చేసేసాడు.

3333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333388888888


మేడం మా ఇంటిల్లపాడికీ మీరిచ్చే రెండేలే గతి మేడం!చానా మాట్లు ''ఒసేయ్ అనిత... పాసిపోయినయ్ తినబాకా... మూలన పడతావ్'' అంటా వుంటావ్ మేడం నువ్వు ! తిండి కోసం మా నాయనెంత కష్ట పడినాడో మాకు దెల్సు ...పైనున్న బగమంతుడికి తెల్సు మేడం ! ఎదవ పొట్ట కోసం నేనెంత కష్ట పడతా వుండానో నాకు దెలుసు మేడం!అందుకే తినేయి జూస్తే... పాసినయి,పారేసినయ్ అన్నా ..., వదలబుద్ధి కాదు మేడం! కళ్ళకద్దుకోవాలనిపిస్తది మేడం.....
- saamaanya

[వార్త ,జనవరి 15,2012]

Saturday, 14 January 2012

జా..స్ట్ లైక్ దట్ !





Friday, 13 January 2012

చిలుకనెప్పుడైనా పెంచుకున్నారా....


అనంత హరితాకాశం నుండి

పట్టి తెచ్చాక

చిలుక

ఎలవర పోతుంది

పడగలెత్తి నిలుచున్న
పంజరం
నిజమో, మాయో
అర్థం కాక
చిలుక
స్తంభించి పోతుంది

పచ్చ పట్టు రెక్కల్ని
పట్టి
కత్తిరించాక కూడా
తుఫాను చెట్టులా
అటై,ఇటై
ఎగరడమనే
తన
పురాతనేచ్చను
పరీక్షించుకుంటుంది

కాలం
బొట్టు బొట్టు
కన్నీళ్లుగా కరిగి
కలలనేత గుండె
తడిసి
వెలిసి పోయాక
చిలుక
కలలోలా
నీకు దగ్గరవుతుంది

పూల కాయల చెట్లు
పురావర్ణ చిత్రాలయ్యాక
హృదయ హరితాన్ని
కోల్పోయి ,
చిలుక
నల్లమందు బానిసలా
నీ గూటి పలుకులు
పలుకుతుంది
[వార్త లో....]