About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Tuesday 7 May 2013

కలక్టర్స్ వైఫ్



సివిల్ సర్వీస్ రిసల్ట్స్ వచ్చాయి కదా ,సివిల్ సర్వీస్ కి చదివే వాళ్ళందరూ కలక్టర్ అనే ఉద్యోగానికి ఆకర్షితమై ఈ వైపుకోస్తారు . నిజానికి ఒక సివిల్ సర్వెంట్ కలక్టర్ గా కేవలం నాలుగైదేళ్ళు మాత్రమె వుంటుంది/ఉంటాడు  .

కిరణ్ ,మాల్దా జిల్లాకు  కలక్టర్ అయ్యాడు . సీనియారిటీని కాదని కిరణ్ కి వాళ్ళ బాచ్ లో అందరికంటే ముందుగా కలక్టర్ పోస్ట్ ఇచ్చారు . ఆ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. కిరణ్ ఎక్కడ పని చేస్తే అక్కడ ప్రజలు ఆయన ''టాకూర్ మతో''[దేవుడి లాంటి వ్యక్తి ]అంటారు . కలక్టర్ ప్రమోషన్ వస్తుందనగానే కిరణ్ పనిచేసి వచ్చిన అన్ని జిల్లాల వాళ్ళు సర్ మీరు మా జిల్లాకి రావాలి అని ఫోన్లు చేసారు. ముఖ్య మంత్రి కి వినతులు కూడా ఇచ్చారు. ఫలితమే కిరణ్ ని సీనియారిటీని అతిక్రమించి ఇక్కడికి పంపించడం . ఈ వూరికి ప్రమోషన్ వచ్చిందని తెలియగానే అప్పుడు కిరణ్ పని చేస్తున్న ఆ వూరి  ప్రజలు మూడు వందల మంది దాకా వచ్చి ఈ సార్ లేక పోతే  మాకు పనులు కావు .[అక్కడ భూసేకరణ  జరుగుతూ ఉండింది .కిరణ్ ప్రజల పక్షాన గట్టిగా నిలబడ్డాడు . ఇతర అధికారులు నచ్చజెప్పాడు .రూల్స్ ని అతిక్రమించి అనేక వుపాయాలతో వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రయత్నించాడు . అందుకని  ప్రజలు రాముడుంటాడు ,రావణుడూ ఉంటాడు.   మనకోసం రాముడొచ్చాడు అని కవిత్వం చెప్పుకున్నారు ]ట్రాన్స్ఫర్ చేస్తే చేసారు కానీ ఈ చార్జ్ కూడా ఆయనకే ఇవ్వండి అని ఆఫీసుని నిర్భంధించి చాల సేపు ధర్నా చేసారు [కిరణ్ వచ్చేసిన రెండు నెలలకి చూసి చూసి ఇప్పుడు మళ్ళీ అక్కడ ప్రజలు దర్నాలకి దిగారట] . అప్పుడు ఆ ఊరి m l a నేను ఎన్నో ఏళ్ళ నుండి ఈ జిల్లాలో ఉంటున్నాను ,నాకు తెలిసీ ఈ జిల్లా చరిత్రలో ఒక అధికారిని ఉంచాలని ధర్నా చేయడం ఇదే ప్రధమం అని ఫోన్ చేసి అన్నారు  .

మాల్దా లో 58 % ముస్లిములు వుంటారు . అల్లర్లూ ,లాండ్ మాఫియా యెక్కువ. అది ఒకటైతే అంతకు ముందు ఇక్కడ వుండిన I A S అధికారి అరాచకాలు చెప్పనలవి కానివట . ఆవిడని ట్రాన్స్ఫర్ చేసినపుడు ప్రజలు ఔట్లు కాల్చి పండగ చేసుకున్నారట . ఒక సర్వెంట్ మెయిడ్ ని బాత్ రూం లో పెట్టి బంధించిందట . ఆవిడ పేరు బ్రౌస్ చేస్తే బోలెడు పితూరీలు ఓపన్ అవుతున్నాయని నా తమ్ముడు చెప్పాడు . ఆవిడని   ట్రాన్స్ఫర్ చేసి   '' బాలో చేలే కె పాటి యే దీచ్చి .బాలొ కాజ్ కొరున్ '' [మంచి అబ్బాయిని పంపుతున్నా   మంచి  గా  పని  చేయండి ]  అని  చెప్పిందట ముఖ్యమంత్రి మినిస్టర్ తో.  అయన ఆవిషయాన్ని మాకు చెప్పారు .

 నేను  కథలు రాస్తే అందరూ ఆయనే రాస్తున్నాడు అని కిరణ్ పేరు చెప్పుకున్నారు   నా వెనకాల .ఎందుకంటే నేను రాసేప్పుడు వాళ్ళు  చూడరు కాబట్టి . తమాషా ఏమిటంటే కిరణ్ పనుల్లో కొన్ని ఆలోచనలు నావి వుంటాయి . మొన్నో  పని జరిగింది బంగ్లాలో . అది నా ఆలోచన . అందరికీ ఆ విషయం తెలుసు . కానీ ,ఆ పుణ్యమంతా సార్  మీకు వస్తుందీ అన్నారు .  కిరణ్ అది విని నొచ్చుకున్నాడు .నాన కంటే ముందు పాపాయి ,అదేంటి అది అమ్మ ఆలోచన కదా అని ఖండించి వేసింది . ఇంట్లో వుండే నా పుస్తకాలు చూసి సార్  బాగా చదువుతారు లాగుంది అంటారు . ఆయన భార్య చదవచ్చు అనే ఊహ వాళ్లకి రాదు . వచ్చినా సార్ కి కీర్తినీయడం వాళ్లకి బాగుంటుంది . అంతకు ముందు ఒక కొండ పైన వుండే వాళ్ళం మేము .వట్టి రాళ్ళు నేల నిండా . చాలా కష్ట పడి ఆ కొండను పది మంది విస్తుపడి చూసేంత ఉద్యానవనం చేశా నేను .వచ్చి చూసే ప్రతి ఒక్కరూ సార్ కి గార్డెనింగ్ అంటే ప్రాణం లాగుంది అనే వారు .ఎందుకంటె ఈ పనులు  వాళ్ళు చూడరు కాబట్టి . ఆడవాళ్ళు తెలివిగానో ,చురుకుగానో వుండటం ఈ సాధారణ ప్రపంచం ఊహించలేదు కాబట్టి .

పెద్ద వ్యక్తుల పక్కనుంటే మన చిన్ని ప్రతిభలు కూడా వాళ్ళలో లయమై మరుగున పడి  పోతాయి . కిరణ్ మర్రి వృక్షం . నేను అతని నీడలో వున్న స్త్రీని .నాకేం  ప్రతిభలు వున్నా వ్యర్థమె ఇక .

అయినా కానీ కిరణ్ ని ఎవరైనా మెచ్చుకున్నారంటే నాకు చాలా ఇష్టం . మొన్న మాల్దా కి వచ్చిన ఎలక్షన్ కమిషనర్ ''ఏంటి ఎక్కడికెళ్ళిన అందరూ మీ పేరే చెబుతున్నారు ఏం చేస్తారెంటి మీరు '' అని అడిగాట్ట . అటువంటివి వింటే నాకు గర్వం కలుగుతుంది . కిరణ్ పై చాలా ప్రేమ పెరుగుతుంది.  భక్తి కూడా . ఎవరెవరో ఆడవాళ్ళు రాస్తుంటే వాళ్ళందర్నీ  వాళ్ళ భర్తలు రాస్తున్నారు అనడం లేదు  కదా ? రాయగలిగే శక్తి ఉన్నవాడని కిరణ్ ని అందరూ భావించడం నాకు గర్వాన్నిస్తుంది  . కిరణ్ బాగా పని చేస్తున్నాడూ అంటే నేనతనికి మంచిగా సహకరిస్తున్నాను అని నాకు నేను చెప్పుకుంటాను . నాకు పొలమూ పుట్ర ,నగ నట్రా కోరికలు లేక పోబట్టి కదా అతనంత మంచిగా, నిజాయితీగా ప్రజల కోసం పనిచేయగలుగుతున్నాడు అనుకుంటాను . అతని సమయాన్ని డిమాండ్ చేసి సినిమాలకీ షికార్లకీ రమ్మనకపోబట్టే కదా ఎక్కువ సమయం పనిచేయగలుగుతున్నాడు అనుకుంటాను .

అవును ప్రతి మగాడి విజయం వెనుకా స్త్రీ ఉంటుందనే మాట అక్షర సత్యం . కనుక కిరణ్ విజయాలు ,ఆనందాలు నావి కూడా .  నిజానికి భర్త ఉద్యోగాన్ని ప్రస్తావించడం నాకు అయిష్టమైన విషయం . ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడు అని ప్రశ్నిస్తే  నేను వాళ్ళని అనాగరికులుగా జమకట్టేస్తాను . .కానీ ఇది వేరే .ప్రజల పక్షాన నిలబడే ఒక మంచి వ్యక్తి కి నేను భార్యని అని చెప్పుకోవడం నాకు గొప్పగా వుంటుంది . అందుకనే కలక్టర్ గా కిరణ్ అనుభవాలని అతని సహచరిగా అక్షరబద్ధం చేయాలనుకున్నాను .

''కలక్టర్స్ వైఫ్''  అనే లేబుల్ కింద ఇప్పటి నుండీ అవన్నీ రాస్తాను


13 comments:

Afsar said...

"పెద్ద వ్యక్తుల పక్కనుంటే మన చిన్ని ప్రతిభలు కూడా వాళ్ళలో లయమై మరుగున పడి పోతాయి . కిరణ్ మర్రి వృక్షం . నేను అతని నీడలో వున్న స్త్రీని .నాకేం ప్రతిభలు వున్నా వ్యర్థమె ఇక ."

- యే బిల్కుల్ అన్యాయ్ హై! చాలా చాలా అన్యాయం! కిరణ్ ఆ జిల్లాలకే తెలుసు. సామాన్య జిల్లాల ఎల్లలు దాటిన రచన. రాయండి...రాయండి...అంతా బ్లాగులో పోసిన...!

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా సంతోషం సామాన్య గారు. కిరణ్ గార్కి అభినందనలు తెలియజేయండి . ఇక ఇంతకన్నా నేను ఏమి చెప్పాలో ఈ సంతోష సమయంలో మెదడుకి అందడం లేదు . :)

సామాన్య said...

సర్ thank you !నా బ్లాగ్ ని పటుకున్నారు కదా:)

సామాన్య said...

వనజ గారు మీరెంత మంచి వారండీ .యెంత ఆత్మీయంగా స్పందిస్తారో !థాంక్ యు !

Dr.Pen said...

Hearty Congratulations!

మాగంటి వంశీ మోహన్ said...

My first time here. Recommended by Dr Ismail Penukonda.Congratulations to both of you.

జ్యోతి said...

కలెక్టర్ గారికి, కలెక్టర్ గారి భార్యకు,మా అందరి అభిమాన రచయిత్రిగారికి, ఆ రచయిత్రి భర్తకు.. మనఃపూర్వక అభినందనలు..

Kathi Mahesh Kumar said...

''కలక్టర్స్ వైఫ్''ఆలోచన బాగుంది. ఒక IAS అధికారి బయోగ్రఫీ ఈ దేశానికి చాలా అవసరం.
ఇప్పటివరకూ వాళ్ళు చేసిన గొప్పల సంగతిరాసినవాళ్ళేగానీ అవిచేస్తుండగా ఎదురైన సమస్యలు, ప్రజలతరఫున పోరాడాలంటే వచ్చే కష్టాల గురించి ఎవరూ రాయలేదు. మీరు రాయండి. అదీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో...ఒక ఇన్సైడర్ ఐట్సైడర్ అప్రోచ్ తో. చాలా బాగుంటుంది. దానితో పాటూ "సామాన్య" కథల్ని కూడా రాయండి. మీ ఆయన మీకు గొప్ప, ఆయన ఉన్న జిల్లాకు గొప్ప కానీ మీరు తెలుగు సాహిత్యానికి గొప్పదనం తీసుకురావాలి. అప్పుడే చెల్లుకు చెల్లు.

సామాన్య said...

ఇస్మాయిల్ గారు ,థాంక్ యు ,మీరు ,మీ కుటుంబ సభ్యులూ క్షేమమే కదా ..

సామాన్య said...

వంశీ మోహన్ గారు ,మీకు ,ఇస్మాయిల్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు . థాంక్స్ ఎ లాట్ !

సామాన్య said...

జ్యోతి గారు మీ కవిత్వం ఎంత బాగుందో ,మీ ఆత్మీయ స్పందనకు థాంక్ యు !

సామాన్య said...

మహేష్ గారు ,చెల్లుకు చెల్లు చేయాలి పట్టుదలగా ... కదా !మీ కామెంట్ చూసి కిరణ్ కూడా అదే అన్నారు. ప్రయత్నిస్తాను . మీ స్త్రీ పక్షపాత దృక్పదానికి థాంక్ యు .

భాను said...

బాగుందండీ..మొదటి సారి మీ బ్లాగు చూశా....మీ కథల్లాగే బాగుంది ...భాను