About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Wednesday, 28 December 2011

ఈ కథ ఎందుకట్లా జ్ఞాపకముండిపోయింది...

చాలా కాలం క్రితం ఒక కథ చదివాను .స్వీడిష్ రచయిత్రి పేరు selma ottilia lovisa lagerlof .రచయిత్రి నోబెల్ ప్రైజ్ విన్నర్. కథ పేరు 'ది మ్యుజీషియన్'.అతనో వయలిన్ వాద్య కారుడు .రచయిత్రి అతని గురించి చెప్తూ ఇప్పుడైతే అతను వినయవంతుడు కానీ ఒకప్పుడు కాదు .అతను ఒకే ఒక్క రాత్రి లో అలా వినయం గా మారిపోయాడు అంటూ ,ఎలా మారిపోయాడో కథ మొదలెడుతుంది.

ఒక సారి ఓ పార్టీ లో అందరూ అచ్చేరువొందేట్టు అతను వయలిన్ ప్లే చేస్తాడు.ఇంటికొస్తూ, దార్లో తన ప్రతిభ గురించీ,తనని ప్రోత్సహించక పోగా బాధ పెట్టిన తల్లి దండ్రుల గురించి తల పోస్తాడు .చిన్నగా ఒక అడివిలోకి ప్రవేసిస్తాడు.నడిచే దారి వెంబడి ఒక నది ప్రవహిస్తూ వుంటుంది .ఈ నది సంగీతం బానే వుంది అనుకుంటాడు.బానే పాడుతున్నావ్ అని సంభాషిస్తాడు.ఇంకొంత దూరం వెళ్లి ,పర్లేదు నువ్విప్పుడు కొంత ఇంప్రూవ్ అయినట్టు తోస్తుంది అని , అవున్లే ఈ ఊర్లోనే బెస్ట్ వయలినిస్ట్ నిన్ను వింటున్నాడని స్పృహ కలిగినట్టు వుంది నీకు అంటాడు .అట్లా నదితో సొంత డబ్బా కొట్టుకుంటూ వస్తాడు .

ఒక దగ్గరకి వచ్చేసరికి పాడుబడ్డ మిల్లోటి కనిపిస్తుంది .చూస్తుండగానే అందులోనుండి ఓ పిల్ల వస్తుంది. వచ్చీ రాటం తోనే నువ్వు వాయించు నేను డాన్స్ చేస్తా అంటుంది .అతను వాయించడం మొదలు పెడతాడు.వినీ వినగానే ఆ పిల్ల ఇదేం సంగీతం ,ఏం బాలేదు అని తీసి పడేస్తుంది .అతను మళ్ళీ మళ్ళీ వాయిస్తాడు .ఆ పిల్లకి నచ్చదు.చివరికి అతనంటాడు నువ్వు ఇంకెవరన్నా మంచి వాళ్ళని చూడాల్సిందే నా వల్ల కాదు అని .

అంతలోకి హటాత్ గా అతని చేయి తనంతట తానే ప్లే చేయటం మొదలెడుతుంది.ఆ అమ్మాయి అప్పుడు ఇదీ సంగీతమంటే అంటుంది ,అని అలిసే వరకూ డాన్స్ చేసి వెళి పోతుంది .కానీ ఎంత ప్రయత్నించినా అతని చేయి ఆగదు.చివరికి అతనికి అర్థమయిపోతుంది ఇక మరణమే అని .

మరణించిన తండ్రీ ,అతని ముసలి తల్లి జ్ఞాపకం వస్తారు.మొదటి సారి తల్లి గురించీ ,వృద్దాప్యంలో ఆమెని ఒంటరిని చేసిన తన కటినత్వం గురించీ యోచిస్తాడు.బ్రతికితే తల్లితో వుండాలి అనుకుంటాడు.తెల్లారుతుంది .చుట్టూ మనుషులే కనిపించరు.దుక్కమొస్తుంటుంది.

ఇంతలో దూరంగా తల్లి కనిపిస్తుంది .ముడతలు పడి, దీనం గా ...అమ్మేనా ,అంత ముసలిగా అయిపోయిందేమిటీ అనుకుంటాడు.

అమ్మా.. అని ఏడుస్తూ పిలుస్తాడు. అమ్మ అయిష్టంగా ఆగి అంటుందీ... .నేను విన్నాను ఇవాళ మన ఊర్లో నువ్వే గొప్ప వాద్యకారుడివట కదా , ఇక నా లాటి ముసలి వాళ్ళని నువెందుకు కేర్ చేస్తావులే అని .అతను ఏడుస్తూ అమ్మ నన్ను వదిలి వెళ్ళకు .నేను గొప్ప ముజీశియన్ని కానే కాదు .నా గర్వం వల్ల ఇప్పుడు నేను చని పో బోతున్నాను .నన్ను క్షమిస్తావా అమ్మా అంటాడు .

అమ్మ కొడుకు స్థితి చూస్తుంది .పెల్లుబికే ప్రేమతో అంటుంది ,ఎందుకు క్షమించనూ ?తప్పక క్షమిస్తాను అని .మళ్ళీ అతను నమ్మేట్టుగా గట్టిగా 'దేవుడి సత్యంగా నిన్ను క్షమిస్తున్నాను ''అంటుంది .

అమ్మ అలా అనగానే వయలిన్ కింద పడిపోతుంది.

కథని నేను బాగా పరిచయం చెయ్యలేదు .చదవి తీరాలి .సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా వుంది హృదయానికి అతుక్కు పోతాయి.చదువుతుంటే సినిమా చూసినట్టు వుంటుంది.గుర్తొచ్చిన ప్రతి సారీ దృశ్య రూపంలోనే గుర్తొస్తుంది.ఎన్నేళ్ళయినా మార్పే రాదు.

కథ గుర్తొచ్చినప్పుడల్లా ...ఈ కథ ఎందుకట్లా జ్ఞాపకముండిపోయింది...ఈ కథలో ఏదో వుంది మేజిక్ అనుకుంటాను .మళ్ళీ అంత ఘనం ఏముందా ఈ కథలో అని యోచిస్తాను.ఏదో వుందని అన్వేషిస్తాను.

అబ్బ అసలకి ఎంత అద్భుతం ఈ కథ .

Tuesday, 27 December 2011

మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటుందంటే ...!

ప్రపంచం తల కిందులైనట్టు అనిపిస్తుంది.
ఇంకాసేపట్లో చనిపోబోతున్నాం అనిపిస్తుంది .
విముక్తి లేదా అనిపిస్తుంది .
తగ్గాక...చచ్చి బతికినట్టు అనిపిస్తుంది.
ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది.








Monday, 26 December 2011

ఒక అమ్మ !


అమ్మలందరూ ఒకటే అయినా
కొందరమ్మలు కొంచెం వేరు
మా
అమ్మ లాగా :

మా అమ్మ శత రూప

మేము కన్నీళ్ళ మైతే
శోషించే సూర్యుడు
మా
అమ్మ

మేం పిరికి ఎలుకలమైతే
దాచి పెట్టేసే కలుగు
మా అమ్మ

పెద్దై
మేం ప్రేమలో పడితే
మా అమ్మ
సినిమా అమ్మ

గుంపులు
గుంపులుగా అందరూ
అమెరికా దిక్కు ఎగురుతుంటే
కలో గెంజో కలిసే తాగుదామని
వడిసెల దెబ్బలని ఊహించి వారించిన
దార్శనిక మా అమ్మ

అనుభవమే ఆనందమని
అందమైన అనుభూతుల ఆస్తినిచ్చిన
వారసత్వం
మా అమ్మ

చిన్నప్పట్లానే ఇప్పటికీ
ఎవరైనా
దిగులు పడ్తుంటే 
మా ఇంటికెల్దాం రా...
మా
అమ్ముందని
చెప్పాలనిపిస్తుంది

మా అమ్మ ధైర్యాన్ని
కొంత
వారిలోకి ప్రవహింప చేయాలనిపిస్తుంది 

[మార్చ్ 7 2010 ఆదివారం ఆంద్ర జ్యోతి ]

Thursday, 22 December 2011

మా పాపాయి తెలివి.

మా పాపాయి భలే మంచిది లెండి ...అచ్చం వాళ్ళ నాన్న లాగే...!

ఏమయిందంటే, మొన్న వాళ్ళ స్కూల్ వార్షికోత్సవం జరిగింది .డాన్సులూ అవీ మస్తు ప్రాక్టీస్ చేసారు.అప్పుడు క్లాస్ మేట్స్ ,అయ్యవారమ్మలూ అడిగార్ట ''ఇంకా చెవులు కుట్టించుకోలేదేం'' అని.మళ్ళీ వాళ్ళే ,సరేలే ప్రెస్ లోలాకులన్నా తెచ్చుకో అని సలహా ఇచ్చారట .

పాపాయి ఇంటికొచ్చేసి, 'అమ్మా చెవులు కుట్టీవా' అని అడిగింది .అప్పుడిక నేను కుర్చీఎక్కేసి, గొంతు సవరించుకుని '' నీ ఇష్టాన్ని కాదనడం నా ఉద్దేశం కాదు బిడ్డా .కానీ చెవులకు చిల్లులు కొట్టుకుని మరీ మనం అందంగా ఎందుకు కనిపించాలీ ?మనం,ఆడవాళ్ళం.. స్వేచ్చగా వుండాలి .హాయిగా వుండాలి.ఇప్పుడు మగాళ్ళనే చూద్దాం ,వాళ్ళెందుకు చెవులుకు చిల్లులు కొట్టిన్చుకోలేదూ?ఎందుకంటె,కుట్టేప్పుడు నెప్పి పుడుతుందని జ్ఞానం గా ఆలోచించారు కాబట్టి, కుట్టించుకోలేదు .మనం కూడా అలాగే జ్ఞానం గా వుండాలి .స్వేచ్చగా ,హాయిగా వుండాలి.కమ్మలు అవీ పెట్టేసుకుని అందంగా కాదు వుండాల్సింది....అయినా నేను చెప్పేది నువ్వు ఆచరించి తీరాలని రూలేం లేదు.కావాలంటే నువ్వు చెవులు కుట్టిన్చుకోవచ్చు ''అని వుపన్యసించాను.

నా బిడ్డ కుర్చీ కింద నిలబడి వుపన్యాసమంతా విని, అచ్చం వాళ్ళ నాన్న లాగే, జ్ఞానం గా ''అమ్మా నీ సిద్ధాంతం నాకు నచ్చింది .నేను నువ్వు చెప్పినట్టే ఉంటా ,చెవులకు చిల్లులు కొట్టిన్చుకోను,కానీ నాకు ఇష్టమేసినప్పుడు ప్రెస్సు కమ్మలు పెట్టుకుంటానేం ...!అన్నది .

నాకు మస్తు కన్ఫ్యూషన్ వచ్చింది .నా బిడ్డ నా మాట విన్నట్టా ?విననట్టా ?

పాపాయి వాళ్ళ నాన కూడా అచ్చం ఇంతే . నేను తనని వింటున్నానో ,తను నన్ను వింటున్నాడో అర్థమే కాదు.


Monday, 19 December 2011

'అర్థ మోహనరాగం'


అనార్కిస్ట్ కవిలా
అతను
మహా దౌర్జన్యంగా
మానసోపరితలంపై
ఓ విత్తనాన్ని విసిరాడు

అనుమతి లేకనే
కాలాన్ని కత్తిరిస్తున్న
గడియారం ముళ్ళు
విత్తనాన్ని కాస్తా
గుచ్చి వెళ్ళింది

సందేహ స్వరాల మెట్లు
దాటుకుని
చిరు మొలక ముందు
మోకరిల్లి
గాఢ మోహన రాగాన్ని
మోగించే లోగా
అతను
కుదురు లేని
వలస పక్షిలా
వాలిన వయోలిన్ తీగలు
తెంచుకుని
యెగిరి పోయాడు

అఖండమై విస్తరించిన
ఆ విత్తనపు
వట వ్రుక్షంపై తిరుగుతూ
మెదడు నరాల నేతని
విప్పుకుంటూ ,నేను
ఆ అడుగుజాడలకై
అన్వేషిస్తుంటాను .

నా చెట్టు
కొన్ని సార్లు
తేనె పూలు పూస్తుంది
అపుడపుడు
రాత్రి పక్షుల అరుపులకి
ఉలికి పడుతుంది
కురిసే మంచు
కాసే ఎండ
నా ముందు నుండే
నడిచి పొతాయ్.

చూసి చూసి
దారిన పోయే ఒకడు
ఇదంతా వ్యర్థమని
కలలనైనా అల్లాల్సిందేనని
మూర్తిమత్వం గురించి
వుపన్యసిస్తాడు

నేను ,ఇక ఇదే
చివరి కొమ్మనుకుంటూ
ఆ చెట్టులోని
మరో కొత్త కొమ్మ పైకి
నా అనవరత ప్రయాణాన్ని
ప్రారంభిస్తాను
[వార్త 2011]

Saturday, 17 December 2011

వినటం మినహా...


పెళ్ళైన
పదేళ్ళ తరువాత
స్నేహితురాలు కలిసింది

అప్పుడేమో
నక్షత్రాల నవ్వుతో
మెరిసిపోతూ
మల్లెపూవులా ఉండేదా
ఇప్పుడేమో
ముసురు పట్టిన
ఆకాశంలా ఉంది .

అవాళ
నా ఇంటికొచ్చి
బురఖా తీసి
కాలే పెనం పై పడ్డ
నీటి చుక్కలా
మధ్యాహ్నపు ఎండ పై
చిట పట లాడింది

చల్లటి నీటి ధార
పచ్చటి గొంతు పాయని
దాటుకుని వెళ్ళాక
వన్నెల చమ్కీ గులాబులు
అల్లుకుని ఉన్న
ఒంటిని విరుచుకుని
కాసేపు
సంతోషాల గతంలో
యీదులాడింది

గంటల గడియారం
టంగు మనగానే
ఇంట్లో వొదిలొచ్చిన
మూడు చిట్టి బంతుల గురించి
వర్తమానమైంది

ఏడాదికోసారి వచ్చే
రంజాన్ లా
ఏడాదికొక్క సారైనా రాని
ఆ పూల వేరు గురించి
దిగులైంది

సుదూర సౌదీ ఎడారిలో
తెల్లారి పోతున్న
నిండు యౌవన రాత్రులను
నడుస్తున్న
ఇరుకు జీవన జాలాన్ని
సుదీర్ఘంగా తల పోసింది

చివరిగా వెళుతూ వెళుతూ ,అంది
చూశావా
పర్సులో డబ్బులున్నయ్
దబరలో బిరియానీ ఉంది
మనసుకే శాంతి లేదని


[స్నేహితురాలు అన్సారీ కోసం ]
ఆగస్ట్ 15 ,2010 ఆదివారం ఆంద్ర జ్యోతి


Friday, 16 December 2011

మగ ఆధునికోత్తర వాదం

కోళ్ళ గూళ్ళ కాపురాలను
కాలదన్నేస్థైర్య స్వప్నాలతో
అతనూ నేను .

ధర్మార్థ కామ ముసలి మంత్రాలను వదలి
ప్రేమోన్మత్త పునాదులపై
ఆధునిక కాపురం

***

కాలానికే కాదు
విజాతి ద్రువమే ఐనా
ఆడ శరీరాకర్షణకూ
శిశిరముంటుంది కాబోలు

ఎంతైనా వసంతుడు
మగాడే కదా !
నూతన నీలోత్పలాలను
అతనిలో మళ్ళీ పూయించాడు

వ్యర్థంలా నను ఒడ్డుకు నెట్టేసి
మరో కొత్త ప్రేమ కోసం
నిర్మల తటాకమయ్యాడు

హటాన్మరణంలా
నా ప్రేమోద్వేగాలపై నడచి పోతూ
పోస్ట్ మోడర్నిస్టునని చెబుతుంటే
కాదని ఆపడానికి
ఇవాళ
నా మెడలో
మంగళ సూత్రమైనా లేదు .

[2006 అక్టోబర్ 1 , ఆదివారం ఆంధ్ర జ్యోతి]