About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 28 May 2012

ఆకుపచ్చటి జ్ఞాపకాల ఇంద్ర ధనుస్సు ...!

సరి కొత్త కాపురం  
హాల్లో చాప 
చాప నిండుగా పుస్తకాలూ 
గాలి కెగిరే కాయితాలూ 
కావాలని కూరుకుపోయే మనసూ ,బుద్దీ 
మగ కాఫీ 
అప్పుడప్పుడూ గైడ్ వేసే నాలుగు అక్షింతలూ 
అందమైన యూనివర్సిటీ 
తెలుగు డిపార్ట్మెంట్ ఫస్టూ ,హ్యుమానిటీస్ సెకండూ 
వెరసి ఆకుపచ్చటి జ్ఞాపకాల ఇంద్ర ధనుస్సు నా ఈ పుస్తకం

[నా పీ హెచ్ డీ పరిశోధన 
''తెలుగు ముస్లిం రచయితలు -సమాజం-సంస్కృతి''
 .దానికి మంచి కాలం ఎప్పుడొస్తుందో మరి  :))]


పి .ఎస్ : హైదరాబాద్ లో చదువుకున్నన్ని రోజులూ మా నాన నేనెప్పుడు ఇంటికి వెళ్లాలనుకున్నా రాత్రంతా నెల్లూరు నుండి ప్రయాణం చేసి హైదరాబాద్ కి వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని రాత్రంతా ప్రయాణం చేసి నెల్లూరికి తీసికేల్లెవాడు. అమ్మాయినని కాదు .అబ్బాయిలకంటే అపురూపమని.
ఎం ఫిల్ డీటీపీ నెల్లూరులో చేయించాం
మా నాన  అంతా పూర్తయ్యాక నన్ను షాప్ కి తీసికెళ్ళాడు.అయినా తిరిగొచ్చేసరికి రాత్రి పన్నెండయింది .మరుసటి రోజు కొత్త ఏడాది .నేనూ మా నాన ఆ చీకట్లో వాహనాలు లేని రోడ్ల పై కబుర్లు చెప్పుకుంటూ నడవడం ఓ జ్ఞాపకం .
 
ఎం.ఫిల్ మీ గైడెన్స్ లోనే చెయ్యాలనుంది అంటే నను మన్నించి కాలేజ్ కమిటీ ని ఒప్పించారు కే కే ఆర్ సర్.వారు నాకంటే
నాలుగాకులు  ఎక్కువ మొహమాటస్తులు .మొత్తం పరిశోధనలో నేను గైడ్ ని కలిసిన రోజులు చేతి  వేళ్ళకి కూడా సరిపోనన్ని రోజులు.అయినా ఈ పరిశోధన వారి
మార్కు పరిశోధన.అదో జ్ఞాపకం.

కొత్త కాపురపు తొలి రోజులు .అప్పుడే మా మావ గారు రిటైరై  కొడుకు కి ఒక స్కూటర్ కొని పెట్టారు .
ఆ కొడుకు ఆ స్కూటర్ పై నన్ను రత్న మాల,వేణు గోపాల్,సీఫెల్ సభలూ ,లైబ్రరీలూ ఒకటేమిటి తెగ తిప్పాడు ఈ పరిశోధన కోసమని .విసుగనేదే వుండదు బంగారానికి అప్పటికీ ఇప్పటికీ ...అదో జ్ఞాపకం .

అప్పటి వరకు నాకు స్కూటర్ ఎక్కడం అనుభవమే లేదు .మొదటి సారి బోల్డు సిగ్గు పడుకుంటూ
ఆ నీలం రంగు స్కూటర్ ని ,నీలం రంగు చుడీదార్లో వున్న నేను యెట్లా కూర్చోవాలో తను చెప్తే సిగ్గు పడుకుంటూ 
కూర్చున్నాను .ఆ తరువాత అది నాకు బోలెడు లోకాలని చూపించింది .అదంటే నాకు అలవిమాలిన ప్రేమ.అందుకని దాన్ని బద్రంగా దాచుకున్నాను మా ఇంట్లో .అదో జ్ఞాపకం .

ఏదైనా రాసిన తరువాత దాని మొహం చూడాలంటే ఎందుకో చిరాకు నాకు .అందుకే ఇది మార్పులూ  చేర్పులూ చేయని అప్పటి పరిశోదనే . పబ్లిషర్  అచ్చు తప్పులు  చూడమంటే నా వల్ల  కాదంటే కాదనేసాను. వారే  ఆ పని చూశారు.అదొక  మంచి స్నేహపు జ్ఞాపకం .

ఈ ఇంద్ర ధనస్సుకి రంగులనిచ్చిన జ్ఞాపకాలివి  ! అందుకే ఈ పలవరింత !

Thursday, 17 May 2012

మాఫియా అంటే ?

 ప్రజా సాహితి  ఏప్రిల్ సంచికలో ''సంభాషణం ''శీర్షికన మాఫియా అంటే ఏమిటో ,పుట్టుక ఏమిటో పూర్వోత్తరం  ఏమిటో వివరించారు.విషయం పట్ల మంచి అవగాహన వస్తుంది .తప్పనిసరిగా చదవండి .


Monday, 14 May 2012

''ఎందుకు పారేస్తాను నాన్న ?''

 




నేను ఆరో క్లాసో,ఏడోక్లాసులోనో వుండగా మా అమ్మ ఓపెన్ యునివర్సిటీ బీయే చదువుతూ వుండేది.హిస్టరీ,తెలుగు,పోలిటిక్స్తో .మిగిలిన వాటి సంగతి గుర్తు లేదు కానీ మా అమ్మ తెలుగు పుస్తకాలలోని కథలన్నీ 
నేను ఒక్కోటి బోలెడు సార్లు చదివాను .కరుణ కుమార టార్చి లైటు,ఇలాంటి తవ్వాయి వస్తే ,పెళ్ళానికి ప్రేమ లేఖ వంటివీ...చాగంటి  సోమయాజులు  గారి ''''ఎందుకు పారేస్తాను నాన్న ?'' కథ ,అట్లా  చదివినవే .
అన్ని కథల సంగతి ఏమో కానీ ,అప్పుడు నాది కూడా ''ఎందుకు పారేస్తాను నాన్న ?''కథలోని కృష్ణుడికి దాదాపు అటూ ఇటూ వయసు  కావడంతో ఆ కథ బాగా మనసుకి హత్తేసుకుని గుర్తుండి  పోయింది.

మా అమ్మ అప్పటి పుస్తకాలను ఆ కథలోకోసమే జాగ్రత్తగా దాచుకున్నాను .పెద్ద పెరిగి,తెలుగు ఏం ఏ కి వచ్చిన తరువాత వాటిని వాడుకున్నాను కూడా 
మంచి అపురూపమైన పుస్తకాలు అవి  .

''ఎందుకుపారేస్తానునాన్న?''1945 లో భారతిలో అచ్చయిన కథ.దాంట్లోని వస్తువు రీత్యా స్థల కాలాదులకు అతీతంగా 
నిలిచిన కథ .

...బాగా చదివే అబ్బాయి కృష్ణుడు ఫోర్త్ ఫాం కి వస్తాడు.నానకేమో వాడ్ని 
చదివించేందుకు డబ్బులుండవ్. బడి మానిపించేస్తాడు.ఒక సారేమో నాన చుట్ట తెమ్మనికృష్ణుడికి డబ్బులిచ్చిపంపుతాడు.బడి ముందు నుండి వెళ్ళాలంటే వాడికి బోల్డు అవమానం వేస్తుంది.

అనుకున్నట్టే క్లాస్ మేట్స్ కనిపిస్తారు.ఏం రా కృష్ణుడూ ''నువ్వు బల్లోకి రావటం లేదు'' అంటాడు నరసింహం.వాడితో  తో ''సోమవారం నుండి వస్తా'' అని చెబుతాడు.అంతలో శకుంతల వస్తుంది 
ఈ సారి ఇంగ్లీష్ లో ఫస్ట్ మార్క్ అది కొట్టేస్తుంది, కృష్ణుడికి కాకుండా .ఇంతలో బెల్ కొడతారు .వాళ్ళిద్దరూ బడిలోకి వెళిపోతారు .

కృష్ణుడికి దుక్కం వస్తుంది ఒక సారి మాస్టారుబడి మానేసిన ఒకబ్బాయి పేరు కొట్టేస్తూ ''డిస్కంటిన్యూడ్''అని రాసేసి ఆ పదానికి అర్థం చెపుతాడు.అది గుర్తొస్తుంది వాడికి ''నేను ఇంటికే వెళ్ళను  '' అనుకుని బడి ఎదుటే కూర్చుండి  పోతాడు. 

వాడిని వెదుక్కుంటూ నాన వస్తాడు.నానపిలిచినా వాడు ఇంటికి రానంటే రానంటాడు .చివరకు  కు నాన వాడిని బడిలో వెయ్యడాని తల  తాకట్టయినా పెట్టాలనుకుంటాడు .అయితే  క్రుష్ణుడు,పుస్తకాలు అప్పటికప్పుడే కొనమంటాడు.ఒక్కటయినా కొనమంటాడు.నాన  ఆలోచించి''ఇందాకా చుట్టలకిచ్చిన డబ్బులున్నాయా,పారేసావా?''అని అడుగుతాడు కృష్ణుడు ఆ ఏడుపులో''ప..ప్ప...ప్పారీలేదు.జేబులో వున్నాయి...ఎందుకు పారేస్తాను నాన్నా ?'' అంటాడు 
కథ అంతే .కథగా చెప్పడానికి ఏమీ వుండదు. ఒక సన్నివేసం అంతే !కానీ ఆ కథ నన్ను ఎంత ఏడిపించిందో ..

ఎవరైనా బడి మానేసినా,అటువంటి సంఘటనలు తటస్థ పడినా ఆ కథే గుర్తొస్తుంది ఇప్పటికీ.ఏదైనా చెయ్యాలని గుబులేసి పోతుంది.నాగార్జున సాగర్ ఏపీ ఆర్ జే సి లో చదివే వాడు 
నా తమ్ముడు 
అక్కడ పిల్లల లో కొంత మంది  ఎంత బాగా చదివే వాళ్ళో.కానీమధ్యలోనే ఆపేసే వాళ్ళు .అప్పుడు కూడా అట్లాగే ఈకథ జ్ఞాపకానికి వచ్చేది.

పాపాయి వాళ్ళ నానఈ మధ్య యుద్ద ప్రాతిపదికన కథలు చదువుతున్నాడు.అందులో భాగంగా''విశాలాంధ్ర తెలుగు కథ''చదువుతున్నాడు.ఇవ్వాళ పొద్దున్న ఆ పుస్తకాన్ని ఊరికే అట్లా తిప్పుతుంటే ఈ కథ దొరికింది.అసంకల్పితంగా చదవటం మొదలెట్టాను  ఇంత పెద్దయ్ పోయానా ఈ రోజు కూడా చివరి వాఖ్యం చదవగానే కళ్ళ నిండా నీళ్ళు పేరుకున్నాయి .అచ్చు కథలో కృష్ణుడికి లాగే ''దుక్కం పొర్లుకుంటూ వొచ్చింది'' 

...అదీ చాసో అంటే.

Saturday, 12 May 2012

రెండు అభిప్రాయాలు -ఆనందము


నాకు, డాక్టర్ కేశవ రెడ్డి గారు ఒక మెసేజ్ పంపించారు.చిన్నప్పుడు మా ఇంట్లో, కేశవ రెడ్డి గారి ''స్మశానం దున్నేరు ''
పుస్తకం వుండేది.మా నాన్న కూడా ఆయన లాగే చిత్తూరు వాడు ..అట్లా రాయల సీమ భాషలోని 
ఆ పుస్తకాన్నినేను చాలా సార్లు చదివాను.తరువాతవారి 
ప్రతి పుస్తకాన్ని వచ్చింది వచ్చినట్లు చదివాను.నాకు చాలా  ఇష్టమైన రచయితల్లో వారు ఒకరు.వారి నుండి 
నిన్న మద్యాహ్నం మెసేజ్ వచ్చింది. ఇవాళ వారితో మాట్లాడాను.రాస్తూ పొమ్మన్నారు.వారి మెసేజ్ ఇది .
dear saamaanya ,the story 
mahitha is good.language
is clean ,narration is 
smooth,plot is plausable .
...dr.keshav reddy.
ఎంత బాగుంది కదా వారి మెసేజ్.నేను జీవితాలను బాగా అర్థం చేసుకుని కథను బాగా రాస్తేనే కదా వారు నాకట్లా చెప్పి వుంటారు.అంటే అర్థం నాకు జీవితం తెలుసనే కదా? 
మేధావులు ఊరికే చెప్తారా ఏమిటి మాటలు .మేధావులు చెప్తే అది  తిరుగులేని నిజం.  కదా ?
 
 నా స్నేహితురాలు కాల్ చేసింది ఈ రోజు .తన బాధ ఏంటో చెప్తుంది .నేను వింటున్నా.మద్యలో తనో కంప్లైంట్ చేసింది . నేను నా సమస్యని చెప్తుంటే నువ్వు అవతలి వాళ్ళ పక్క వకాల్తా పుచ్చుకుని వస్తావ్ 
సామాన్య ఎప్పుడూ అని.అసలు నీకు జీవితమే తెలియదు.ఇంకెప్పటికీ తెలీదు నీ చుట్టూ మీ అమ్మ, 
నాయన,తమ్ముడ్లూ,పెదమ్మలు,కిరణ్,చివరికి నీ కూతురు కూడా నిన్నే ముద్దు చేస్తుంటే నీకు 
జీవితం,ప్రపంచం ఎక్కడ తెలుస్తుందీ.మళ్ళీ ఏమో రాసేస్తావ్ కథలు,కవితలూ అని ఘోరంగా తిట్టేసింది..

మన స్నేహితులు మన గురించి అబద్దాలు ఎందుకు చెప్తారు? చెప్పరు.  అన్నీ నిజాలే చెప్తారు!

Thursday, 10 May 2012

మన్నం [సింధు] మాధురి - కాళావు


http://www.scribd.com/nnunna/d/85713150-Kallavu-Mannam-Sindhu-Madhuri-Story-The-Sunday-Indian


ఇవాళ పొద్దునే నాలుగు కథలు చదివాను.''కాళావు,బల్లకట్టు కవలమ్మ, డూగమ్మ ,తయ్య ''...ఈ కథలన్నీ రాసింది మాధురి .మాధురి  నాకెట్లా పరిచయమంటే నా 'మహిత'  కథ  వచ్చాక జూకంటి జగన్నాథం గారు నా కథ బాగుందని చెబుతూ మాధురి''కాళావు''కథ గురించి చెప్పారు.సండే ఇండియన్ లో వచ్చిన   ఈ కథ ఎలా  ఓపెన్ చెయ్యాలో  తెలీక నేను  చదవ లేక పోయాను .తరువాత మాధురీ''చంద్రకళ''కథ''పాలపిట్ట''లో ప్రచురితమయింది.కత్తి మహేష్ కుమార్ గారు ఫేస్ బుక్ లో పెడితే  చదివాను.మంచి కథ .మహేష్ గారు చెప్పినట్టే చలం ,కాసీ భట్ల వేణుగోపాల్ గార్ల కథలు గుర్తొచ్చాయి.

నేను కథలు రాయటం మొదలెట్టా క  నాకో మంచి సంస్కారం పరిచయమైంది.అది నేను అసలు ఊహించనిది.నా కథ ''కల్పన''రాగానే ,సాహితీ ప్రముఖులలో ముప్పాతిక మంది నాకు ఫోన్  చేసి బాగా రాశావమ్మా...అన్నారు.ఒకరికొకరు చెప్పుకుని నా కథలని చదివారు .కొత్త నీటిని తమలో ప్రేమగా కలుపుకున్నారు.వారి ఉదారత,ప్రోత్సాహమూ నన్ను చాలా సంతోష  పెట్టింది ..నన్ను వెయ్యి జన్మలకి  గాను ఋణ  పరచుకున్నారు .  నచ్చితే అట్లా హాయిగా ,ఉదారంగా,ఆప్యాయంగా  ,నిష్కల్మషంగా పలకరించాలని నాకు నేర్పారు .

మాధురి  కథ చదవగానే నేను అనుభవించిన ఈ కొత్త సంస్కారం నాకు జ్ఞాపకం  వచ్చింది .అందుకే తనకి కాల్ ,మెయిల్ చేశా .కథ ఎంత నచ్చిందో ,ఎందుకు నచ్చిందో చెప్పా .తను చాలా ఆప్యాయంగా సామాన్య  నీ నిష్కల్మషమైన, భేషజాలు లేని ఉత్తరంలోని నాలుగు వాక్యాలూ నిన్ను అత్యంత ఆప్తురాలిని చేసేశాయి అని నాకో మంచి ఉత్తరం రాసారు.అట్లా తన గురించి కొంత తెలిసికో గలిగాను.

చంద్ర కళ చదవగానే ఈ కథ రాసిన వ్యక్తికి విస్తృతమైన ప్రపంచానుభవం వుందని నాకు అనిపించింది.నా అంచనా నిజమే అని ఆమె పరిచయం తెలిపింది.

వాటిలోని వస్తు భిన్నత్వం వలన మాధురి  కథలు చాలా విశిష్టంగా వున్నాయ్ అని నేను  ఒక స్టేట్మెంట్ ఇవ్వగలను.ఎందుకంటె మాధురి  జీవితం  చాలా విశిష్టమైన అనుభవాల సుసంపన్న జీవితం .ఇవి మామూలు తరహా అనుభవాలు కాదు .కమ్యూనిస్ట్ లు , డాక్టర్లూ ,కర్ణాటకలో స్థిర పడ్డ తెలుగు వారూ అయిన తలిదండ్రుల ఉదార పెంపకం ప్రభావం మాధురి పై చాలా ఉంది.తన  బాల్యం అందరి లాటిది కాదు .శ్రుంక లాలు  లేని బాల్యం .కనీసం చదువు గొలుసుల్లో  కూడా ఆమె చిక్కుకోక పోవడం చేత డిగ్రీ వరకూ ఇంట్లోనే చదివారట .ఆమె కథల్లో నాయకులై కనిపించే  గోర్రేలోల్లు  ,జోగినులూ,లంబాడీలు, బల్లకట్టు కవలవ్వలూ ఆమెకు అతి దగ్గరి వారు,ఆత్మీయులు .మాధురికి వీరితో వున్న దగ్గరితనం ,వీరిపై వున్న ప్రేమ  తెలుగు సాహిత్యానికి కొత్త కళను ఇస్తుందని తెలుగు  సాహిత్య విద్యార్తినిగా నా అంచనా .అందుకనే ఇష్టంగా... నా లాగే దూర తీరాల్లోనూ,పని భారాల్లోనూ ఉండి ,ఇన్ని రోజులూ ఆమె రచనలతో పరిచయం లేని వాళ్ళు చదువుతారని  ఆమె కథ 'కాళావు ' ఇక్కడ ఇస్తున్నాను .
సమీప భవిష్యత్ లో ఆవిడ కథల పుస్తకం వేస్తే శైలీ శిల్పాలను కూడా పరిశీలిస్తూ 
మంచి వ్యాసం రాయాలని కోరిక  .

ప్రచురితమైన ఆమె మిగిలిన కథలను మాదురి  గారినుండి పొందవచ్చు 

Wednesday, 9 May 2012

స్త్రీ గా బ్రతకడం ఎంత వేదనో ...



నిజానికి ఇవాళ జల్దాపారా పున్నమి అరణ్యాన్ని బ్లాగ్ లోచిత్రిం చాల్సిన పని.కానీ నిభ నా ఆనందాన్నంతా
తన దుఖం లో లయం చేసుకుంది .

అడవి నుండి వచ్చి,అలిసి పడుకుని లేచానా,పాపాయి ఓ వార్త మోసుకొచ్చింది''అమ్మ!నిభ కూతురు బావిలో దూకేసిం దంట ''అని .నీరసం ముంచుకొచ్చింది .ఇప్పుడెంత దుక్ఖాన్ని నా స్టోర్ రూం లో చేర్చాలో అని .

నిభ  వచ్చింది.ఏడవటం మొదలెట్టింది .మొన్న మీ దగ్గరకొచ్చిందే నా కూతురు ,ఆ పిల్ల బావిలో దూకిందీ  అని.అందులో చల్లటి వార్త పిల్ల బ్రతకడం.స్త్రీల దుక్కాలన్నీ  షరా మామూలువే .పిల్లాడు తాగుబోతు ..వాడు పెడితే తినాల్సిన పిల్ల కదా ,ఆర్ధిక ఆధారం అలా తాగుడు పాలైతే ఎలా ?అందుకే పిల్ల వాడిని బెదిరించింది .ఇక మీదట తాగావంటే చస్తాను అని .వాడు చావు అన్నాడు .పిల్ల బావి ఎక్కింది  , దూకేస్తాను అన్నది  ...అన్నా పిల్లాడి ధైర్యం చెదిరి పోలేదు .దూకెయ్ చూద్దామన్నాడు .దూకేసింది .తల్లి వురుకులై ,పరుగులై, ఫైరింజనై ,పిల్లని బయటకి తెచ్చుకుంది .

మొన్న నా 'మహిత' కథ వచ్చినప్పుడు గూగుల్ ప్లస్సుల్లో ఎవరో చర్చలు చేసారు.బాల గోపాల్ ఒక వ్యాసం రాసారు .సాఫ్ట్ వేర్ రంగం గురించి ,పేరు గుర్తు రావటం లేదు ...ఆ వ్యాసం  గుర్తొచ్చింది .ఎందుకంటె ఆ చర్చల్లో ఇప్పు డేక్కడా ఇలా లేదు ఎప్పటిదో పాతికేళ్ళ క్రితం కథ ఇదీ  అని నుడివారు సాఫ్ట్వేర్ వారు  .తెలిసిందే అయినా ప్రపంచం వాల్లకి  అంత పచ్చగా కనిపించడం  మళ్ళీ ఆశ్చర్యం కలిగించింది [జెనరలైజ్  చేయడం లేదు ]

.ఆ చర్చలు చదువుతున్నప్పుడే నిభ కూతురు వచ్చింది ఇంటికి .పద్దెనిమిదేళ్ళ  పసిపిల్ల .ఏడాదిన్నర బాబు .ముద్దుగా ఎంత అందంగా వుందో,అందుకే ఒక ఫోటో తీసి పెట్టుకున్నా.ఇవాళ ఆ ఫోటో చూస్తుంటే.
నిశ్చయంగా చావాలనే కదా అట్లా చేసేసిందీ పిల్ల ,కొంత తేడా వచ్చినా చచ్చిపోవడమే కదా అని దిగులేసి పోయింది.

నిభ మంచి గాయని .భవయ్య,బౌల్ జానపదాలని అద్భుతంగా పాడుతుంది .ఎప్పుడు పాడమన్నా గొప్ప దుక్కాన్ని పాడుతుంది.నిభ జీవితం రాస్తే ,శరత్ చంద్రుడు రాసినంత దుక్కపు కథ రాయాల్సి వస్తుంది. ఈ సారి  ఎప్పుడైనా రాస్తాను 

.ఇవాళ ఇంటికి వెళ్తుంటే ,పాడమంటే నాలుగు పాటలు పాడింది  .పాడుతూ పాడుతూ భోరున ఏడ్చింది.నిభా తోపాటూ అనిత,షీలా ఏడ్చారు .వెరసి మొత్తం నాలుగు యేడుపులయ్యాయి.

ఆ పాట ఏం చెప్తుందో నిజానికి నాకు అర్థం కాలేదు .అందులో దుక్కం మాత్రం అర్థమయింది . పాట  యు ట్యూబ్ లో దొరికింది .ఇస్తున్నా .దుక్కమున్న వాళ్ళ దుక్కాన్ని ఎక్కువ చేసే లక్షణం ఆ పాటకి ఉందేమో మరి.

నాలుగు పాటల్లోనూ ,నాకు  ''నారీ హోవార్ కీజే బేతా ,ఏ ప్రిత్వి భూజేనా తాహా ''  స్త్రీగా బ్రతకడం లో ఎంత వేదన వుందో ఈ ప్రపంచం  అర్థం చేసుకోవడం లేదు  ''లైన్ ఒక్కటీ అర్థమయింది .  

అవును కదా స్త్రీ గా బ్రతకడం లో చాలా వేదనే వుంది .ఆ స్త్రీ ,ఏ స్త్రీ అయినా సరే ! ఆ దుక్కం శరీరానిదైనా సరే ,మనసుదైనా సరే !!