About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Sunday, 31 March 2013

తొలి ''ప్రాతినిధ్య ''ఆవిష్కరణ


మీనాక్షి నా మొదటి కుమార్తె .సామాన్యకిరణ్ ఫౌన్డేషణ్ నా రెండవ కుమార్తె . ప్రాతినిధ్య నా మూడో అమ్మాయి . 
అస్తిత్వ ప్రశ్నలకూ ,ఆవేదనలకూ వేదిక కాదలచి ఒకానొక రాజకీయ ఆవశ్యకతతో ఆవిర్భవించింది ''ప్రాతినిధ్య ''. ఆవిష్కరణకు  నేను ఎంచుకున్న రోజు సావిత్రీ బాయి వర్ధంతి అయిన మార్చ్ 10.  అనివార్య కారణాలతో ఆ రోజు నుండి వాయిదా పడుతూ మార్చ్ 28 న ఆవిష్కరించాల్సి వచ్చింది . 

ప్రాతినిధ్య ఆవిష్కరణ ఘనంగా జరిగింది . కళ్యాణ రావు గారు ,పాణి గారు, జిలుకర శ్రీనివాస్ ,వక్తలుగా వచ్చారు మరో వక్త ఖాదర్ మొహియుద్దీన్ గారు అనారోగ్య కారణాల వల్ల రాలేక పోయారు . 

ఇంత పెద్ద పని కదా చేయగలనా లేదా అని చాలా భయం వేసింది .చేసేసాం .తొలి ప్రతిని సెంటిమెంటల్ గా వాసిరెడ్డి నవీన్ గారికి అంద  జేసాం .కథ లాగే ''ప్రాతినిధ్య ''కూడా నా జీవిత పర్యంతం సాగాలని. నడపగలనని నా పై నాకు నమ్మకముంది . 

సభకు పెద్దలు ,ప్రముఖులు ,పిల్లలూ వొంద  మంది దాకా వచ్చారు . వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు . 

కళ్యాణ రావు గారు కథల గురించి చెప్పారు. 

పాణి గారి మధ్య, జిలుకర శ్రీనివాస్ ఉపన్యాసాల మధ్య సైద్దాంతిక  ఘర్షణ మరోసారి బట్టబయలయింది . 

మిస్ g s k.మీనాక్షి సావిత్రీ బాయి ఫూలే గురించీ ,సామాన్యకిరణ్  ఫౌండేషన్ గురించీ మాట్లాడింది 

తొలి ప్రాతినిధ్య 


సంపాదకులు సామాన్య,కుప్పిలి పద్మ 






చిరునవ్వుల మధ్య ''ప్రాతినిధ్య ''సాయంత్రం 


                                        ''ప్రాతినిధ్య ''ఆవిష్కరణ 


తొలి ప్రాతినిధ్యను  అందుకున్న వాసిరెడ్డి నవీన్ గారు 




శ్రోతలలో కత్తి మహేష్,జుగాష్ విలి,స్నేహ తదితరులు 


అస్తిత్వాల పై పాణి గారు 


ఈ ఆధునిక కాలం లో ''కినిగే'' అవసరం గురించి అనిల్ అట్లూరి గారు 


అంబేద్కర్ చెప్పిన ప్రాతినిధ్యం గురించి జిలుకర శ్రీనివాస్ గారు 


తన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథ వెనుక కథ గురించి రచయిత పసునూరి రవీందర్ 

పర్స్పెక్టివ్ r k  గారి నుండి ''ప్రాతినిధ్య ''కాపీ అందుకుంటూ పెద్దింటి అశోక్ కుమార్ గారు . 

''గోళ్లు ''కథ వెనుక కథ గురించి చెబుతూ వేంపల్లి షరీఫ్ గారు 


నా వోట్ అఫ్ థాంక్స్ 













ఆ మూలగా కూర్చుని వుంది మా సామాన్యకిరణ్ ఫౌండేషన్ ట్రెషరర్ ఇడిగినేని గురప్ప నాయుడు గారు ,సెక్రటరీ  
గండవరపు మధుసూదనమ్మ. 

                            






Saturday, 30 March 2013

కథలూ ,కాకరకాయలూ


ప్రాతినిధ్య ఆవిష్కరణ  జరిగిపోయింది  .నిజానికి నవ్వొస్తుంది .సామాన్యా  ఏం కావాలనుకున్నావు చివరికి ఎక్కడ ల్యాండ్ అయ్యావు బిడ్డా అని.గండవరపు కమలమ్మ ...నువ్వెక్కడున్నావే ... ''బుద్ది భూములేలమంటే రాత గాడిదలు కాయమంటుందని '' చెప్పేదానివి కదా ఎప్పుడూ....  చూశావా నా జీవితం ఎలా నా చేతుల్లో లేకుండా పోతుందో .ది గ్రేట్ సామాన్య చివరికి కథలూ ,కాకరకాయలూ అని అల్ప అంశాల వెంబడి తిరుగుతుంది .  మళ్ళీ వీట్లలో రాజకీయాలూ ,చాడీలు అబ్బబ్బ ...దేనికీ పనికి రాని పనులు .

దురదృష్టమంటే 
కావలనుకున్నవి 
అందకపోవడం 
వద్దనుకున్నవి వాటేసుకుని 
కరచాలనం చేయడం 


                                                             

Wednesday, 20 March 2013

సౌందర్యమా ...

ఇంటి కోసం ఆర్కిటెక్ట్ పంపిన ప్లాను నచ్చలేదు .సౌందర్య రాహిత్యం . నాకేం కావాలో వాళ్ళకి చెప్పినా, నా మెదడు అల్లికలు వాల్లకుండవు కదా .

 కిరణ్ రావడం కుదరదూ అన్నాడు . హృదయమెరిగిన స్నేహితుడు కిరణ్ లేని సభ  సౌందర్య రహితమే .చీ విసుగ్గా వుంది .ఈ టీ కప్పులా వుండాలి జీవితం . డిసైనర్ ఎవరో .తప్పక స్త్రీ ఐ వుంటుంది .



 స్త్రీలకి స్త్రీల బాధలు అర్థమవుతాయనడం తప్పేనేమో .కొందరు స్త్రీలలో పురుషులు వుంటారు .కొందరు పురుషులలో స్త్రీలు వుంటారు . .. కాకుంటే రవీంద్రుడికి చారు బాధ అంత దగ్గరగా ఎలా తెలిసింది .


ఈ కొత్త ఇల్లు బాగుంది . అచ్చు శరత్ ''శ్రీకాంత్ ''లా.  శ్రీకాంత్ ఎలా వుంటుంది ?ఏవిటో నిశ్శబ్దం నవల నిండుగా .కొన్ని సార్లు నిర్వ్యాపకంగా చెట్టు కింద కూర్చున్న బైరాగిలా ,కొన్ని సార్లు రాజ్య లక్ష్మి అలజడి మనసులా ,కొన్నే పేజీలుండి   జీవితమంతా జ్ఞాపకానికొచ్చే ఇంద్ర నాదుడిలా...  ఈ ఇల్లు బాగుంది .

కానీ అంత చేపల చెరువుని పార్కుకు ఇచ్చేయడం నచ్చ లేదు .ఇవాల పొద్దున్న ఆ చెరువు గట్టుని చూసినపుడు నా సమాధి అక్కడుంటే ఎంత బాగుండూ అనిపించింది . ఒక సారి కూచ్ బీహార్ లో పచ్చటి పంట పొలాన్ని చూసినపుడి ఆ పొలం క్రింద శాశ్వతంగా నిద్ర పోగలిగితే ఎంత బాగుండూ అనిపించినట్టు ,సిలిగురి నుండీ సిక్కిం కి వెళ్ళే దారి సౌందర్యాన్ని ఎలా అట్టి పెట్టుకొవాలో తెలియక మనసులో నుండి తోసుకుని తోసుకుని భోరుమని వచ్చిన ఏడుపులా  .. .ప్చ్ ! సౌందర్య వంతమైన సమాధి కోసం ఇప్పటి నుండీ ప్రయత్నించాలి .

Friday, 15 March 2013

ఇవాళ దొరికిన జ్ఞాపకం


నీ జ్ఞాపకాలు 
గల గల మని 
నాలో 
ప్రవహించినపుడు 
నది అడుగుని గులక రాయిలా 
మౌనమవుతాను 

Friday, 1 March 2013

రాళ్ళు కరిగే వేళ




ఇది అకాడెమీ పురస్కారాన్ని పొందిన కన్నడ కథల సంకలనం [మొదట ముద్రణ  2010]. ఇవాళ పొద్దున్న మొదలు పెట్టాను అడపాదడపా విరామాలతో ఇప్పుడే పూర్తి చెశాను. నా రోజుని ఇందులో పోగొట్టుకున్నందుకు మనసు చాలా సంతృప్తి పొందింది . శైలిలో ఎంత భిన్నత్వమూ ,ఆకర్షణా వుందంటే ,,ఇలా రాస్తే,రాయగలిగితే ఎంత బాగుండూ అని చెడ్డ కోరిక ఒకటి నాకు బలంగా కలిగింది . చెడ్డ అని ఎందుకన్నానంటే ఈ ఆకర్షణ అనేక రోజులు నాకు మరుపుకు రాదు కాబట్టి .ప్రతి కథా ఎంత చదివిన్చిందో .   ఇంటికొచ్చిన మనుషులు,ఇంట్లో వాళ్ళతో  మాట్లాడటానికి  పుస్తకానికి విరామం ఇవ్వాల్సి వచ్చినపుడు  ఎదుట కూర్చున్నవాళ్ళపై చాలా కోపం తెచ్చుకున్నాను  మనసులో ఇవాళ .


ఈ రచయిత పేరు చెప్పలేదు కదా శ్రీ .పి.లంకెశ్ గారు . శ్రీ .అని నాకు మనస్పూర్తిగా ఆయన మేధస్సు నచ్చడం చేత అంటున్నాను.

టాల్స్టాయ్ గురించి ఈ రచయిత అన్న మాటలు బహుశా జీవితమంతా గుర్తుంచు కుంటానేమో, అదేమిటంటే ''రాయటం ఎంత కష్టమో లేదా రాయటం తప్పనిసరైనపుడు అదెంత సులభమో అంతే సుఖదాయకం కూడా ''...లంకేష్ గారు కూడా ఈ కోవలోని రచయితే అని అతని కథలు మనకు చెబుతాయి .