About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday, 14 December 2012

నీ సమానమెవరు !!!


పల్లవి 
రామ నీ సమానమెవరు రఘు వంశోద్దారక [సమానమెవరు ,నీ సమానమెవరు ]
అను పల్లవి 
భామ మరువంపు మొలక భక్తియను పంజరపు చిలుక 
చరణం 
పలుక పలుకులకు తేనెలొలుకు మాటలాడు సోదరుగల 
హరి త్యాగరాజ కుల విభూషణ మృదు భాషణ 
http://ww.raaga.com/player4/?id=228201&mode=100&rand=0.5543772468809038

మొన్నో రోజు కాళీ పట్నం రామా రావు గారు ఆ వాసనలున్నాయని చెప్పి ,''అమ్మా నీకు సంగీతం ,చిత్ర లేఖనం వంటి వాటిలో ప్రవేశం  ఉందా అమ్మా ''అన్నారు.''లేదండీ ...''అన్నాను .కానీ ,ఆ పరిచయం కోసం ఎంత తల కిందులవుతానో ఆయనకి  యెట్లా చెప్పగలనూ ....???

కథ ఒకటి సరిదిద్దులు చూస్తూ ఈ పాట  వింటున్నానా .మృదు భాషణ అనే మాట దగ్గర ఎందుకో హ్రూదయం చిక్కడి పోయి నా కథ మీద నాకు వెగటు కలిగింది .భక్తి లేని పనులు చేస్తే ఎంత ,చేయకుంటే ఎంత అని.చేసే పని పట్ల భక్తి వుంటే, చేసిన పని కాలానికి నిలబడుతుంది .త్యాగ రాజ కృతుల్లాగా .

Wednesday, 12 December 2012

‘ఐయామ్‌ మలాలా’

‘ఐయామ్‌ మలాలా’పసుపులేటి గీత[ భూమిక నుండి ]
‘రేపు మగపిల్లల బళ్ళన్నీ తెరవబోతున్నారు. కానీ తాలిబన్లు ఆడపిల్లల చదువును మాత్రం నిషేధించారు. బీరువాలో నా యూనిఫారమ్‌, పుస్తకాల సంచీ, జామెట్రీ బాక్స్‌ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది…’
- మలాలా యూసఫ్‌ జే
ఐక్యరాజ్య సమితి 10, నవంబర్‌, 2012ని ‘మలాలా డే’గా నిర్ణయించింది. ఏ వివకక్షూ తావు లేకుండా ప్రపంచంలోని పిల్లలందరికీ చదువుకునే అవకాశాన్ని కల్పించాలన్న సదాశయానికి ఈ రోజును ఒక సుముహూర్తంగా నిర్ణయించారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ‘విద్యా’ రాయబారి అయిన గోర్డన్‌ బ్రౌన్‌ ‘ఐయామ్‌ మలాలా’ అనే పేరిట ఒక పిటిషన్‌ను ప్రారంభించారు. పాకిస్తాన్‌లోని పిల్లలందరికీ విద్యావకాశాల్ని కల్పించాలన్నదే ఈ పిటిషన్‌ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలమంది సంతకాలు చేసిన ఈ పిటిషన్‌ను గోర్డన్‌, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీకి అందజేస్తారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ 10, నవంబర్‌, 2012ని ‘మలాలా డే’గా ప్రకటించారు. పాకిస్తాన్‌లోని స్వాత్‌లోయ తాలిబన్‌ దురాగతాలతో ఇప్పటికప్పుడు మానవ వికాసానికి, మానవత్వపు ఔన్నత్యానికి దూరమై, అంధకారంలో మగ్గుతున్న ఒక చీకటి లోయ. ఆ చీకటిలో కన్ను తెరిచిన వెలుతురు కిరణమే మలాలా యూసఫ్‌ జే. ఈ ఏడాది అక్టోబర్‌ 9 న తాలిబన్‌ క్రౌర్యానికి ఎదురొడ్డి, మృత్యువును జయించిన పదమూడేళ్ళ చదువుల తల్లి మలాలా. తాలిబన్లు జరిపిన హత్యాయత్నంలో మలాలా తలగుండా తూటా దూసుకెళ్లింది. ఇప్పుడామె ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న క్వీన్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. స్వాత్‌లోయలో మౌలానా ఫజుల్లా నాయకత్వంలో తాలిబన్‌ మూకలు నిత్యం విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఆడపిల్లల చదువు, స్త్రీలు వీధుల్లో ఒంటరిగా సంచరించడం, టెలివిజన్‌, నృత్యగానాదులన్నింటి మీదా నిషేధం విధించాయి ఈ మూకలు. ప్రతిరోజూ వీధుల్లో పాకిస్తాన్‌ పోలీసుల తలల్ని తెగనరికి ప్రజల్ని భయోత్పాతానికి గురిచేస్తున్నాయి. ఆడపిల్లలకు చదువు చెప్పే అనేక పాఠశాలల్ని ధ్వంసం చేసేశారు. వందలాది బడులు ఈ భయంతో వాటంతటవే మూతబడ్డాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు స్వాత్‌ నుంచి ప్రాణాలరచేత పట్టుకుని పారిపోయారు.
మలాలా తండ్రి ఒక విద్యా ఉద్యమకారుడు. సొంతంగా ఆయన ఒక పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలకు చదువెంత ముఖ్యమో తెలిసిన వ్యక్తి. అందుకే మలాలాను కూడా ఒక ఉద్యమానికి సాధనంగా మార్చాడు. ఇంటర్‌నెట్‌పై నిషేధం ఉన్న తమ ప్రాంతంలో తాలిబన్‌ దాష్టీకాల గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు మలాలా తొలిసారిగా ఒక ఉర్దూ బ్లాగ్‌ను ప్రారంభించింది. దీనికి బిబిసి పూర్తి సహకారాన్ని అందించింది. మలాలా బ్లాగ్‌ 3, జనవరి, 2009న ప్రారంభమైంది. స్వాత్‌లో బాలికల విద్య కోసం ఒక ఉద్యమం కన్ను తెరిచింది. మలాలా ఆ ఉద్యమానికి మార్గదర్శి అయింది. ఆమె జీవితగాథను ప్రతిబింబిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. తాలిబన్‌ బెదిరింపుల్ని లెక్కచేయకుండా ఆమె అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వూలివ్వడం ప్రారంభించింది. స్వాత్‌ జిల్లా బాలల సమాఖ్యకు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైంది. దక్షిణాఫ్రికా సామాజిక హక్కుల ఉద్యమకారుడు డెస్మండ్‌ టుటు అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఆమె పేరును ప్రతిపాదించారు. పాకిస్తాన్‌ తొలి జాతీయ యువ శాంతి బహుమతిని మలాలా అందుకుంది.
‘నిన్న నేను ఒక భయంకరమైన కలగన్నాను. దుస్స్వప్నాలు నాకు పరిపాటి అయ్యాయి. వాటినిండా హెలికాఫ్టర్లు, తాలిబన్ల కిరాతకాలు నిండి ఉంటాయి. అమ్మ నాకోసం అల్పాహారాన్ని తయారుచేసింది. నాకు బడికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. స్వాత్‌లో ఆడపిల్లల చదువు మీద నిషేధం విధించారు తాలిబన్లు. మా క్లాస్‌లో 27 మంది పిల్లలగ్గాను ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే మిగిలాం. ఇక్కడి పరిస్థితులకు భయపడి నా స్నేహితురాళ్ళు ముగ్గురు పెషావర్‌, రావల్పిండికి వెళ్ళిపోయారు…’ మలాలా తొలిరోజున తన బ్లాగ్‌లో రాసుకున్న విషయమిది.
‘నాకు ఆ దృశ్యం (తాలిబన్లు తనమీద దాడి చేయబోయే దృశ్యం) స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినా, వాళ్ళు చేస్తున్న తప్పేమిటో వాళ్ళకు తెలియజెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. విద్య అన్నది మా ప్రాథమిక హక్కు…’, తన మీద తాలిబన్లు ఏనాటికైనా దాడికి తెగబడతారని ముందే ఊహించి మలాలా అన్న మాట ఇది. ఆమె ఆ మాటను అక్షరాలా నిలుపుకున్నది కూడా. ఇవాళ స్వాత్‌లోయలో ప్రతి అమ్మాయి మరో మలాలాగా మారిపోయింది. ‘స్వాత్‌లోని ప్రతి అమ్మాయి ఒక మలాలానే. మా చదువును మేము చదువుకుంటాం. మేం గెలిచి తీరుతాం. వాళ్ళు (తాలిబన్లు) మమ్మల్ని ఓడించలేరు’, ఇది మలాలా స్నేహితురాలి మాట.
అందుకే ఇప్పుడు ప్రపంచంలోని పిల్లలందరూ సామాజిక, లింగ, ఆర్థిక వివక్షలతో నిమిత్తం లేకుండా చదువుకోసం ఉద్యమం దిశగా అడుగేస్తున్నారు. ‘మలాలా డే’ అందుకు తెరతీసింది. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రతి పసిపిల్లా ‘ఐయామ్‌ మలాలా’ అంటోంది.

Sunday, 9 December 2012

మనకు మనవాడు లేడు !!!

ఎప్పుడూ మనం ఒక్క లాగానే ఉంటామా ?ఉండము కదా ?జీవితం ఒక్క లాగే ఎప్పుడూ వుండదు .ఎవరికీ వుండదు .అట్లా వుంటే బోర్ కొట్టి చచ్చి పోతాం.అందుకేనేమో జీవితం దాని చిత్తం వచ్చినట్లు అది వుండి మనని క్రీడా మైదానం గా మలుచుకుంటుంది.


రాబోయే నా  కొత్త కథ పేరు ''మనకు మనవాడు లేడు ''ఇద్దరమ్మాయిలూ ,ఒక అబ్బాయి కథ .  ........'' ప్రేమించిన వాడితో  లేచొచ్చిన తరువాత ,ఈ పదేళ్ళలో పుట్టింటితో ఏ రొజూ సంపర్కం పెట్టుకోలేదు కవిత  .ఇప్పుడు అనాధగా ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్ళగలదు? అభిమానం అడ్డొచ్చింది.అందుకని పిల్లల్ని స్కూల్ కి పంపి సేమియా పొట్లాలు పాకింగ్ చేసే పనికి వెళ్ళేది.ఏ రోజు పని చేస్తే ఆ  రోజుకి వంద రూపాయలు.పట్టణంలో బ్రతకడానికి అవి ఏ మూలకి? పుట్టింటి నుండి వచ్చేప్పుడు మెడలో వున్న చిన్న గొలుసు,పెళ్ళాడిన వాడు  విడిచి పోయిన చిన్ని మంగళ సూత్రం బిళ్ళ కడుపు నింపేందుకు కాళ్ళొచ్చి నడిచిపోయాయి''.

Friday, 30 November 2012

రోస్ అండ్ ఎడ్వర్డ్ అను ప్రేమ కవిత


ఎందుకు  నేర్చుకుంటేనేం కానీ
బాలేదు 
రెండు పుటల తరువాతి 
కథను చదవడం.
సరే దాచుకుందాం 
ఎవరి నుండో కాదు 
మన నుండి మనల్నే 
సరే ...పదిలం  మరి 
నిన్ను నాలో కోల్పాయావని 
అపహాస్యమవకుండా 
నేను బాలేను 
కానీ తెలుసు 
యు ఆర్ ఓకే ఎల్ల వేళల వోలె 
ఎందుకంటావా ?
నీ చరిత్ర పరీక్షలో 
నాకు ఒంద  మార్కులు 
ఆవిడ ఈవిడా ఏవిడా  
వల వలా 
విల విలా 
ఇదేం  బాలేదు 
సృష్టి ఇట్లా !
 అందరూ స్థన్యులో
కాదంటే  ఎడారులో అవ్వాలి  
ఇట్లా  లింగ ప్రేమ ఎంత కాలమని 
ప్రేమించుకుందాం 
కానీ ఇట్లా కాదు 
కాకుంటే ఎట్లానో నాకూ... తెలీదు 
సింహాన్ని నువ్వు ప్రేమించలేవ్ 
ఎన్నటికి గ్రామసింహాలు కాలేని 
పుట్టు సింహాల పరిచయం నీకు భయం 
సరే ఇక ముగిద్దాం 
దీపాల  వేళయింది 
ఇది నువ్వు చూడలేని కాంతి 

Wednesday, 28 November 2012

కొత్త పాట ఒకటి !

కొత్త  పాట   కాదు .పాత పాటే .నాకేమో కొత్తగా పరిచయమైంది.భానుమతి సౌందర్యాన్ని చూసి మతి పోయి, దేవుడు ఎంత మాత్రమూ లేడనిపించింది.వుంటే అందగత్తెలకి ,అందునా భానుమతి ,ఎమ్మెస్ సుబ్బలక్ష్మి లాటి వారికి కూడా మరణాన్ని రాసేస్తాడా యెక్కడై నా అని...

Monday, 26 November 2012

బహుశా ...

సౌందర్యం ,స్వభావంలో వుంటుంది
రూపంలో కాదు 

మృదుత్వం ,ప్రవర్తనలో  లో వుంటుంది 
మాటలో కాదు 

ఇంకా...

Friday, 23 November 2012

వెన్నెట్లో తడిసిన పాట

ఈ రోజు ఒక కథ చదివాను . సైద్దాంతిక పదజాలం,పదాలను గుప్పించడం,ఆడంబరత,అనవసర మేధో ప్రదర్శన లేకుండా కథ గురించి చెప్పమంటారా ...ఆ కథ చదవగానే నేనేం చేసానంటే వెంటనే  ''మీరజాల గలడా నా యానతి ''పాట  విన్నాను .కథ అందుకు ప్రేరేపించింది .అంతకన్నా ఒక కథ అందించగల   ఉత్తమ ఫలితం ఏం వుంటుందీ  ? ఆ కథ పేరు'' వెన్నెట్లో తడిసిన  పాట ''.రచయిత  డాక్టర్ .గోపరాజు నారాయణ రావు . .http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=37222&Categoryid=10&subcatid=33

కథ చదవండి ...పాటా వినండి .

ఏమైనా ఈ అందమైన అమ్మాయి ఒకానొక మగవాడి పట్ల ''మీరజాలగలడా  నా ఆనతి ''అంటూ అంత ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించేయడం ,అందు వెనుకనున్న అమాయకత్వం నాకు ముచ్చట గొలిపాయి.

ఎంత బాగుందో జమున !!!ఎంత ముచ్చటగా అభినయించిందో !!!!!!!

Wednesday, 7 November 2012

.....కొంచెమట్లా కనిపిస్తే అరిగిపోతావా ???

నీ కోసమని 
పువ్వూ ,పురుగూ 
కాగితమూ,ఆకాశమూ 
అంతటా అన్వేషిస్తాను 

నువ్వున్నావనుకొని 
పాటనీ,పక్షినీ 
అక్షరాన్నీ,మంచితనాన్నీ 
ప్రేమిస్తాను 

నువ్వు కావాలని 
నిదురనీ,అహంకారాన్నీ 
నవ్వుల్నీ ,ఆడంబరాలనీ 
పోగొట్టుకున్నాను 

నువ్వు లేవో,కలవో తేల్చుకోలేక 
తీరాన్నీ,శేషాన్నీ 
పూర్ణిమనూ,నమ్మకాన్నీ 
నూరు సార్లు తప్పుకొట్టి 
మున్నూట సార్లు హత్తుకుంటాను 
కనుక ..................


Monday, 5 November 2012

''పుష్పవర్ణ మాసం''



ఒక ఏడాది నా కథా ప్రయాణాన్ని పుస్తక రూపం లోకి తెచ్చాను .కల్పన బాధను యెట్లా చెప్పాలో అర్థం కాలేదు.తను నవ్వుతూ నవ్వుతూ చాలా అణచివేతను  చెప్పేది .దాన్ని కవిత్వం యెట్లా చేయగలను ?అందుకని కల్పన కథ రాసాను.పాపాయి వాళ్ళ నాన్నకథ  చదివి ఇది ఇప్పుడు చాలా అవసరమైన కథ అన్నాడు.ఎందుకంటె తన ప్రమేయం ఏమీ లేకున్నా నేను కూడా చాలా మంది ఈ కాలపు అమ్మాయిల్లాగే చదువుకుని ఆ చదువుని ఇంటికి పరిమితం చేసుకున్నానని అందుకు చాలా వేదనను అనుభవించానని తనకు దగ్గరగా తెలుసు కనుక .

రాసిన కథలని రెండో సారి చదవడం నాకు చాలా అసహ్యం  .అయినా అట్లా నేను కొన్ని ఎక్కువ సార్లు చదువుకున్న కథ ''పుష్పవర్ణ మాసం''.అది నా బుద్దిని సంతోష పెడుతుంది.మొన్న ఊరికి వెళ్ళినపుడు నా తమ్ముడు మాటల సందర్భంలోMárquez One Hundred Years of Solitude (1967) గురించి చెబుతూ నువ్వా బుక్ చదవలేదని నాకు తెలుసు. చదివి వుంటే నీ నాయకుడిని అక్కడి నుండే తెచ్చావని అనుకుంటారు అందరూ అన్నాడు.నేను నా నాయకుడిని మా ఇంటి పనస చెట్టు పై నుంచి [మామిడి చెట్టు కాదు నిజానికి .మా పనస చెట్టు చాలా గుబురుగా వుండి దయ్యం వుండే ఉండొచ్చని భయం పెడుతుంది.నా నాయకుడు అక్కడి వాడు]తెచ్చాను .

కానీ అంత మంది చదివారు కదా,, ఒక్కరూ ...చివరికి ఆ కథ ఫెయిల్యూర్ అన్న ఖదీర్ బాబు కూడా  ఆ మాట చెప్పలేదే అని ఆశ్చర్యం వేసింది.ఏమైనా మన వాళ్ళు మహా గట్టి వాళ్ళు .చివరికి ఆ పోలికను నా కుటుంబం లో వ్యక్తే చెప్పడం అంటే ...నూరేళ్ళ ఒంటరి తనంలోని ఆ సీతాకోక చిలుకల అబ్బాయి ని,క్రితం జన్మలో నేనూ ,నా తమ్ముడూ పడీ పడీ  చదివి ,ప్రేమించి ,దుక్కపెట్టుకుని వుంటాం.అందుకే ఈ జన్మలోనూ అతను మమ్మల్ని  వదల లేదు కావచ్చును .ఇవాళే  డౌన్ లోడ్ చేసాను.నా తమ్ముడన్నాడూ '..చదవడం ఇప్పుడు పెటు కోకు .అది నాలుగొందల పేజీల పుస్తకం .నీకు కే కే ఆర్  సర్ రాసారు కదా ఒక్క వాక్యం  మిస్సయినా భావం తప్పుతుందని అచ్చు అట్లాటిదే ,నాలుగొందల  పేజీలనీ అక్షరం అక్షరం చదవాల్సిందే ..చదవడానికి మనసోక్కటీ సరిపోదూ ...నీకు ఆరోగ్యం బాలేదు కదా ప్రస్తుతం అని .అయినా చదవాలని తపన పుట్టిపోతుంది .

మొన్న పాపాయి కామిక్స్ కావాలంటే ఏర్పోర్ట్ లో బుక్ షాప్ కి వెళ్ళానా ఒక బుక్ బ్యాక్ కవర్ పై  ఈ నాలుగు మాటలూ కనిపించాయి.''a one line suicide note left by a total stranger ,a small-time writer avinash suvarna ,reveals to young journalist laya thomas ...అంటూ ఉండిందా ఆ వన్ లైన్ సూసైడ్ నోట్ అనే మాట కోసమని బుక్ ని పటుకోచ్చేసా .ఈ వన్ లైన్ సుఇసైడ్ నోట్ కథ గుర్తొస్తుందా  తెలుగులో...నాకు పేరు గుర్తు రావటం లేదు చప్పున .నిన్న ఆ రచయితతో మాట్లాడాను కానీ ఈ విషయాన్ని  చెప్పడం మరిచా.ఈ పుస్తకం పేరు ''a tale of things timeless''[మలయాళం ]రచయిత rizio yohannan raj .చదవాలి .కానీ చదవాలంటే కొంచమేదో భయంగా వుంది .ఇంకేం రాయాలి ...నిజానికి చాలా రాయాలి .అక్టోబర్ డైరీ ...కానీ  ఇప్పుడు కాదు .ఇప్పుడు చిత్ర సుందరిని చదవాలి.

Saturday, 13 October 2012

కదా ....?????

నువ్వంతా తెలుసునని  నేననుకుంటాను 
నేనంతా తెలుసునని నువ్వనుకుంటావు 
ఇరు స్వప్న తీరాల వెంబడి మనం 
ఒకరికొకరం ఎప్పటికీ అపరిచితులమే




Thursday, 11 October 2012

రవీంద్ర కథావళి



ఎప్పుడో అనేక ఏళ్ళ క్రితం చదివాను రవీంద్రుడి కథలు ఆంగ్లంలో .కాబూలి వాల  ఎక్కడో పాఠం గా వుండటం ,అప్పటి ఆ పాటానికి బొమ్మ మనసులో ఇప్పుడు కూడా వుంది ఈవాల్టి లాగా నూతనంగా .హెచ్ సి యు లైబ్రరీలో గోరా చదివినపుడు కన్నూ మిన్నూ తెలియని అతని అభిజాత్యం ,ఆ పైన ముగింపు ...గౌర వర్ణపు గోరా రూపం మది చిత్రించుకున్న మరో జ్ఞాపకం .

మొన్నప్పుడు డిల్లీ  నుంచి రవీంద్ర కథావళి ని తెచ్చుకున్నానా .మేఘ సంద్రాన్ని దాటుకుంటూ ఊరికే ఒక్క కథ అనుకున్నానా ...అరె బోల్డు పనులున్నాయన్నా  రవీంద్రుడు వదలందే!

బెంగాల్ కి వచ్చాక రవీంద్రుని పట్ల బెంగాలుల పిచ్చి భక్తి ,శరతుని అసలకసలె పట్టించుకోకపోవడం చాలా బాధించేది .శరతు  పేదవాడనే కదా ,రవీంద్రుడు జమీన్దార్ అనే కదా ఆ వివక్ష అని కినుకుగా వుండేది .ఆ కినుకు శరత్ చంద్రుని   జీవిత చరిత్ర చదివాక   రవీంద్రుని పై   మరీ పెరిగింది .ఏవిటో ఒకలాటి ధిక్కారమూ ,అయిష్టమూ ...

ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు  ఈ కథలు చదివాక మనసు ఒక్క సారి  సరళమై పోయింది  .అసలకి ఇతనేంటి? స్త్రీలనీ పురుషులనీ , పిల్లలనీ ,వృద్దులనీ ,పేదలనీ, ధనికులనీ బేధ భావం లేకుండా యెట్లా అన్ని హృదయాలలోకి రాచ బాట వేసుకుని పయనించ గలుగుతున్నాడు ?ఎక్కడిది  ఇతనికీశక్తీ  అని...ఒకటే ఆశ్చర్యం .బహుసా అందుకనే  వీళ్ళందరూ గొప్ప రచయితలయ్యారేమో  .గొప్ప రచయితలంటే సర్వాంతర్యామి అయిన భగవంతుడని ఏమో !లేకుంటే ఇదంతా యెట్లా సాధ్యం ?

 ''మాష్టారు గారు '' కథలో హరలాల్ ,''రాస మణి  కొడుకు'' కథలో కాళీ పద్  పొద్దుటి నుండీ ఎంత బాధ పెడుతున్నారో.మరో మార్గమేమీ లేకుండా వాళ్ళిద్దరూ పేదరికానికి బలికావడం ఎంత బాధిస్తుందో .ప్చ్ పెద్దవాల్లమయ్యాక భోరుమని ఏడ్చే స్వాతంత్ర్యాన్ని మనమే పోగొట్టుకుని దిగులునంత గుండెకి చేర్చేసుకుంటాం .అప్పుడు కదా గుండె భరువెక్కడమనే   మాటకి  యదాతదంగా  అర్థం బోధ పడేది.

''పోస్ట్ మాస్టర్'' కథలో రతన్ ,''సమాప్తి ''లో తనకు తెలియకనే బాల్యం నుండి యవ్వనం లోకి సాగిన  చిన్ని మ్రున్మయి ,ఎప్పుడు ఎందుకు  అట్లా జరిగిందో తెలియక దుక్కాన్ని గుప్తంగా గుండెల్లో దాచ ప్రయత్నించి ఓడిన చారులత ...అసలు చారు లేదా ,,స్త్రీ బాధ అంత విశదంగా ,చూసినట్లు మరీ రవీంద్రునికి యెట్లా తెలిసిందని ఆశ్చర్యం .

''భార్య రాసిన లేఖ''లో రవీంద్రుడు భార్యగా ఒక స్త్రీ ఐ  ,చీరకి నిప్పంటించుకుని  చనిపోయిన తన అనాధ బాంధవి  గురించి ''ఊళ్ళో వాళ్ళందరూ రేగారు.'ఆడవాళ్ళు చీరెలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపొయింది 'అన్నారు .
ఇదంతా నాటకం అన్నారు మీరు .కావచ్చు .కానీ ఈ నాటక క్రీడ -కేవలం బెంగాలీ స్త్రీల చీరెల మీదుగానే జరుగుతున్దెం ?బెంగాలీ వీర పురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకనీ  ?అది కూడా ఆలోచించి చూడటం యుక్తం ...!అని 1913 లోనే  స్త్రీల తరపున  నిర్ద్వందపు వకాల్తా పుచ్చుకున్నాడు కదా  అందుకని ఇప్పుడిహ  మూర్ఖ భక్తునికి భగవంతుని యందు ఎంత భక్తి వుంటుందో రవీంద్రునికి  అంతటి భక్తురాలనై పోయాను. అచ్చు బెంగాలుల లాగా !

ఎంతెంతో రాయాలని వుంది కానీ ఏమిటో కథా చర్చ కంటే యుక్తా యుక్త జ్ఞానాన్ని కోల్పోయి మరీ ... కన్నీటితో రవీంద్రుని పాదాలని అభిషేకించాలి వంటి డైలాగ్ లు  నిస్సిగ్గుగా ,అదుపు తప్పి వస్తున్నాయ్ . అందుకని ఇక్కడకి ముగించడం యుక్తమని ముగిస్తున్నా .

తప్పక చదవాల్సిన పుస్తకం ''రవీంద్ర కథావళి'' .ఈ గొప్ప అనువాదం మద్దిపట్ల సూరి గారిది .

Friday, 28 September 2012

ఆవాహన !!!





మనల్ని మనం ఏకాంతంలో ఎక్కడ అన్వేషించుకుంటామో,
అప్రమేయంగా మనల్ని ఏవి ఆవహించగలవో,,
మనలో లయమై విడివడి కనిపించనివేవో  ,విడివడలేనివేవో అక్కడక్కడే మనం !!!

Sunday, 23 September 2012

''దమయంతి కూతురు ''


http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012%2Fsep%2F9%2Fsunday%2Fstory&more=2012%2Fsep%2F9%2Fsunday%2Fsundaymain
అనవరత ప్రయాణాలు కలిగించిన అలసట,అనారోగ్యము బ్లాగ్ పట్ల విముఖం చేసినా ఒక మంచి కథ ...తప్పని సరిగా షేర్ చెయ్యాల్సిందే అనిపించిన కథ నన్నిట్లా బ్లాగ్ దగ్గరకి తెచ్చింది.ఆ మంచి కథ పేరు ''దమయంతి కూతురు''. రచయిత్రి శ్రీ పీ.సత్యవతి గారు.

ఒక ఆదివారం ఉదయం మా ఊర్లో  వుండగా   పాపాయి వాళ్ళ నాన్న నుండి బోల్డు   వేకప్ కాల్ లు వచ్చాయి  ,,,ఇవాల్టి ఆదివారం ఆంధ్రజ్యోతి లో మంచి కథ వచ్చింది చదువు అని . ఎవరు రాసారు అనే లోపే పీ.సత్యవతి గారు అని చెప్పేసాడు .నేను బోల్డు సంతోషపడి చదవడానికి కూర్చున్నాను  .కథ అట్లా పూర్తి చేసానో లేదో మళ్ళీ ఫోన్ .లిఫ్ట్ చేయగానే మరో మాటేం లేకుండా పాపాయి ''అమ్మా ...ఊర్ద్వ లోకం అంటే  ఏంటమ్మా'' అంది.నాకిక అర్థమైపోయింది నాన పాపాయికి కథ చదివి వినిపించాడు అని .అదొక్క ప్రశ్నేనా ..ఇంకా బోల్డు ,''సౌందర్యా వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని ఏమందీ??'',అనురాధా టీచర్  చెప్పిన మెర్మన్ కథ ఏంటీ?''ఇట్లా ...!!నేను ''పోనీ సత్యవతి గారినే అడగక పోయినావా బిడ్డా ''అన్నాను. పాపాయికి  బోల్డు సిగ్గు  .అందుకని ''ఆహా ,కాదమ్మా! అమ్మా! మొత్తం కథంతా నువ్వు మళ్ళీ చెప్పమ్మా ''అన్నది .

ఇంకో వైపు పాపాయి వాళ్ళ నాన ''ఈ కథకి ఆర్ద్రతే ప్రాణం కదా ''?అని విమర్శనా పరిభాషలో ప్రశ్నించాడు.నాకు నవ్వొచ్చి సోఫాలో ఉన్న పుస్తకాల్లోనే అడుగున వల్లంపాటి''కథా శిల్పం '' పుస్తకం ఉంది తీసుకుని చదువుకో ఏం ప్రాణమో తెలుస్తుంది అన్నాను.సత్యవతి  గారి కథలంటే నాకు,మా అమ్మకీ  ఎప్పుడూ  ఇష్టమే .ఇవాళ  నాన్నా  కూతుర్ల హృదయాలను బోల్డు ఆకట్టుకున్న  ఈ కథ నా హృదయానికి మరీ  దగ్గరగా వచ్చింది. 

సత్యవతి గారి ప్రతి కథా ఉన్నత స్థాయి కథే .ప్రతి కథా సమాజం లోని ఒక సంక్లిష్టతను సరళం చేసి చెప్పడానికి వుద్దేసించిందే.అట్లాగని వారి కథలెప్పుడూ మానవ భావోద్వేగాలకి అతీతమై, ఉపన్యాసాలు ఇయ్యవు .హృదయగతంగా,అతి సరళంగానూ వుండి  ,మన మనసులకు చాలా  సన్నిహితంగా వస్తాయి .అంత మాత్రం చేత చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పగలగడం లో విఫలం చెందవు.ఇవంతా నాకు ఇంతకు మునుపే తెలిసిన విషయాలే అయినా అవాళ  నేను మళ్ళీ కొత్తగా  సత్యవతి గారి కథ ముందు పెట్టుకుని కథ యెట్లా రాయాలో నా ఎనిమిదేళ్ళ కూతుర్ని మనసులో నిలిపి  తెలుసుకున్నాను .అంత గొప్పగా రాయగలగడం యెట్లా అని దిగులు పడ్డాను .

''దమయంతి కూతురు'' కథ నా వరకు నాకు బుచ్చి బాబు గారి '' దయానిధి '' కి కొనసాగింపు .దయానిధికి తల్లి పట్ల జాలో ,సానుభూతో ,విపరీత  ప్రేమ వల్ల ఎటూ తేల్చుకోలేని తనమో ...ఏదో ఒక అవ్యక్త భావం వుంటుంది .అపరిష్కృత భావం అది .అందుకనే అతను ,తల్లి పేరు చెప్పి తనను హేళన పరుస్తున్న సమాజం నుండి విడివడి దూరమవుతుంటాడు కానీ ,,ముడిని చిక్కు తీసి ఇదీ అని అమ్మ  పట్ల అతని భావాన్ని ఇదమిద్దంగా  ప్రకటించడు .ఆ సంఘర్షణ అలవి మాలినదిగా వుండి వేదన కలిగిస్తుంది పాటకుడికి.

.ఈ కథలోని దమయంతి కూడా ఉత్తుత్తి మనిషి కాదు ''ఊర్ద్వ లోకపు మనిషి''.అందుకే భూలోకపు మనుషుల్ని వదిలేస్తుంది  .మరి ఏ లోకమూ తెలియని పసి పిల్లల గతి ఏమిటీ ??''తల్లి మచ్చ'' ను చూపించి వెంట పడి వేధించి అబ్సెషన్ కు లోను చేసి అక్కడే అదే వలయంలో పిల్లల్ని పడి కొట్టుకునేట్లు చేసే సమాజం సంగతి ఏమిటి?ఎంత పెద్ద ప్రశ్నలు  కదా ?యెట్లా అర్థం చేసుకుని ఆ తల్లిని క్షమించాలి ?అందుకు సమాధానమే ఈ కథ .దమయంతి కొడుకు "తన జీవితాన్ని మలుచుకునే హక్కు ఆవిడకుంది కదా అమ్మడూ. మనకోసం ఆమెకి అలవిమాలిన త్యాగాలు అంటగట్టకూడదు కదా. ఆమె ఎందుకు ఏ పరిస్థితుల్లో మనని వదిలి వెళ్లిందీ మనకెప్పటికీ తెలియదు, ఆమె చెబితే తప్ప. ఇంక వదిలేయ్. ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో ..'' 
"మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?''
"బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?''
 అంటూ చెల్లికి ఇచ్చిన  సమాధానం ఓదార్పు కోసం ఇచ్చుకున్నది కాదు .తల్లి మచ్చ వేసి పదే పదే వేధించే సమజానికి నేర్పుతున్న పాటం అది .

మానవ సంబంధాలన్నీ వుదాత్తంగానూ ,ఉన్నతంగానూ వుండాలనేది మానవుడి సంయుక్త కాంక్ష .కానీ, ఏ వుత్పాతమూ లేకుండా ప్రకృతి సరళ రేఖలో సాగి పోవడం ఎప్పుడైనా విన్నామా ??లేదు కదా!!!మానవ భావోద్వేగ ప్రకృతి కూడా అట్లాటిదే .అందులోనూ ఎత్తుపల్లాలు వుంటాయి .ఆ ఎత్తు పల్లాలు మన చుట్టు పక్కలో ,మన జీవితాలలోనో ,మన జీవితాలకు అతి సన్నిహితంగానో ఎదురు పడినపుడు వాటిని యెట్లా స్వీకరించాలో, యెట్లా అర్థం చేసుకోవాలో నేర్పడమే కాదు ,అర్థం చేసుకోగల హృదయౌన్నత్యాన్ని కూడా ఇస్తుంది ఈ కథ .
http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012%2Fsep%2F9%2Fsunday%2Fstory&more=2012%2Fsep%2F9%2Fsunday%2Fsundaymain

Monday, 3 September 2012

విష్ణు కూతురు

ఇది రాగలీన పాట



అప్పుడొక రోజు మా ఊళ్ళో చిలక జోస్యం పిల్లవాడు వెళ్తూ ఉండినాడు .చిలకని చూద్దామని నేనూ ,పాపాయి  బోల్డు ముచ్చట పడేసి ,జోస్యం  చెప్దూవ్ గానీ  రమ్మని పిలిచాం .ఆ అబ్బాయి భాగా చిన్న వాడు పద్నాల్గు,పదిహేను ఏళ్ళ వాడు .మొదట నాకు చెప్తూ మాటల్లో మాటగా ''గంటకు తొమ్మిది గుణాలు కదక్కా నీకు ''అన్నాడు ...ఇంకా అట్లాటివే మనసు మల్లెపూవు కదంటక్కా అని ...ప్లీసింగ్ మాటలు బోల్డు చెప్పాడు .అవన్నీ గుర్తు లేవు కానీ గంటకు ఇన్ని కిలోమీటర్ల స్పీడు అన్నట్లు గంటకు తొమ్మిది గుణాల మాట మాత్రం భలే గుర్తుండి పోయింది .

తరవాత వంతు పాపాయిది .అబ్బాయి బహు శాంతంగా ''నీ బిడ్డకి గంటకి ముప్పై ఆరు గుణాలక్కా ''అని వాక్రుచ్చాడు.ఆ పిల్లాడెంత  అండర్ టోన్ లో చెప్పినా తొమ్మిది గుణాల నా కథ నాకు తెలుసు గనుక బగ్గ భయపడ్డాను  ఎట్ట రా  దేవుడా అని .మొన్న ఆర్ ఏం .ఉమా మహేస్వర్ రావ్ ,విష్ణుప్రియ  ల  కూతుర్ని  చూసాక భయం కొంచెం చల్లబడింది .ఎందుకంటె రాగలీనకి గంటకు నూటా పదహారు గుణాలు .అమ్మవారికి నూటా పదహారు కళ లన్నట్లు .అన్ప్రేడిక్టబుల్ .తరువాతి క్షణం లో ఆ బిడ్డ బుర్రలోని ఆలోచనని మనం  కనిపెట్టలేం ....రాగలీన కాదు రంగుల లీన అనమాట .తామరాకు పైని నీటి బొట్టు .

అమ్మాయిల చిత్తాలు మేఘమాలికలు ఒక్కటని కాళిదాసు అన్నాడు కానీ ,అందరమ్మాయిలూ ఒక్కటి కాదు కొందరు కొంచెం వేరు ,కొందరు చాలా వేరు .ఆ చాలా వేరు వాళ్ళతో వారికి చుట్టు పక్కల వుండే వారి జీవితం భాగుంటుంది కత్తి మీద సాములా .రోజూ ఒక వింతలా .

రాగ లీన మంచి రచయితో అట్లాటిదే మరోటో అవుతుందని నా ఊహ . చూడాలి పిల్లలు పెరిగి పెద్దగై ఏమవుతారో రాగాతీతం గా చూస్తూ వుండటం  ఒక ఆసక్తికర అనుభవం!!!

Tuesday, 28 August 2012

భలే ప్రేమ పాట

నాకు రెండు కొత్త పాటలు వినే  అవకాశ మిచ్చిన సత్యవతి గారికి ఒక బెంగాలి పాటను పరిచయం చేస్తున్నాను .మొన్న ఆదివారం ''భవయ్య'' పాట పాడ మంటే  మా నిభ పాడింది ఈ పాట -ఆంధ్ర  నుండి వచ్చిన నా స్నేహితుల కోసం.భలే...చాలా నచ్చింది .మేడం కి నిభ గొంతుతోనే వినిపిద్దామనుకుని ప్రయత్నిస్తుంటే టెక్నికల్ నాలెడ్జ్ లో సున్నా గ్రేడు మనిషిని కనుక నా ఫోన్ ఘోరంగా పాడై  నన్ను అత్యంత ఆనందం లోకి నెట్టింది .పాట వినండి .చూస్తూ వినడం కన్నా ఉత్తిగా వింటే ఇంకా బాగుంది కానీ ...నాకు అట్లా షేర్ చేయడం రాలేదు .

Bondhu Tindin
artist: http://en.wikipedia.org/wiki/Runa_Laila
album/Movie: Unknown
bondhu tindin tor baarit gelam
బంధు [అంటే ఫ్రెండ్ అని 'డు 'లేదా 'రాలు 'ఎవరైనా కావచ్చు] వరసగా మూడు రోజులు మీ ఇంటికి వచ్చాను
dekhaa pailamna
నీ దర్శనం కాలేదు
gaang paar hoite choy anaa.
గంగా నది ఆ ఒడ్డుకి వెళ్ళటానికి ఆరణాలు
firaa aaite choy anaa
తిరిగి రావటానికి ఆరణాలు
aite jaite baro anaa ushul hoilonaa ||
వచ్చీ పోవడానికి పన్నెండణా లు వసూలయ్ పోయాయి

budh baar e shubho jatra
బుధవారం ఈ శుభ  యాత్ర మొదలెట్టాను
bishudhbaare manaa
గురువారం మంచిది కాదని ఆపాను
shukurbaare prem piriti
శుక్రవారం కూడా ఈ ప్రేమ యాత్ర
hoyna sholo anaa
విజయవంతం కాలేదు [గ్రామీణ బెంగాలులు ఒక పని సంపూర్ణం గ [24=సోలో అణా ]  విజయవంత అయిందనో  కాలేదనో చెప్పటానికి ''సోలో అణా ''అనే మాటను వాడుతారట ]
shonibaare giyao tor dekha pailamna ||
శని వారం వెళ్లి కూడా నిన్ను పట్టుకోలేక పోయాను

tor kache jaibar belaae
నీ దగ్గరికి వస్తున్న సమయంలో
thot rangaai paane
నది పోటు  మీదుంది
ekla paiya ghaater maajhi
ఒక పాదం ఘాట్ మీద ఉండగానే
ulta boitha taane
పడవ ఒడ్డు  వైపుకు ఉల్టా వస్తుంది
kapor bhijja jawar bhoye
బట్టలు తడిచిపోతాయనే భయం చేత
shatar dilamnaa ||
ఈత కొట్టి వద్దామనే ఆలోచనను విరమించుకున్నాను

jhor brishti mathae loiyaa
కుండపోత వర్షంలో తడిచి పోతూ
gelaam raater belaa
రాత్రి పూట వచ్చాను
giya dekhi kather dorjaae.
వచ్చి చూస్తే చెక్క తలుపుకి
lohar ekkhan talaa
ఒక పెద్ద ఇనుప తాళం వేళ్ళాడుతుంది
chaabi loiya nithur kalaa
తాళం తీసుకుని బంధు
tuito ailinaa ||
 నువ్వు రానే లేదు

Thursday, 23 August 2012

ఆడవాళ్ళ ఏడుపు కథ!!!


ఓ హెన్రీ ఎప్పుడూ ఓ అద్బుతమే ,ఎప్పుడూ ఒక ఆశ్చర్యమే ,అనితర సాధ్యమే.

ఇవాళ ''A Harlem Tragedy'' చదువుతూ ,చదువుతూ చివరాఖరికి వచ్చి ఓ హెన్రీ అన్ని కథల్లాగే ఆశ్చర్యపడి ,తేరుకుని ,నవ్వి ,నవ్వి ...ఇక నవ్వలేక ఆశ్చర్యపడి షేర్ చేస్తున్నా .  http://www.literaturecollection.com/a/o_henry/222/

కొన్ని వాక్యాలు చాలా నచ్చాయి .ఇట్లా ..."But what does he beat you for?" inquired Mrs. Fink, with wide-open
eyes.

"Silly!" said Mrs. Cassidy, indulgently. "Why, because he's full.
It's generally on Saturday nights."

"But what cause do you give him?" persisted the seeker after
knowledge.

"Why, didn't I marry him? Jack comes in tanked up; and I'm here,
ain't I? Who else has he got a right to beat? I'd just like to catch
him once beating anybody else! Sometimes it's because supper ain't
ready; and sometimes it's because it is. Jack ain't particular about
causes. He just lushes till he remembers he's married, and then
he makes for home and does me up.
............................................
Mrs. Fink went up to her flat and had a little cry. It was a
meaningless cry, the kind of cry that only a woman knows about, a
cry from no particular cause, altogether an absurd cry; the most
transient and the most hopeless cry in the repertory of grief.

కానీ కథలో ఎంత విషాదమో .అది అంతా పక్కన పెడితే ఈ రచయిత ఆడవాళ్ళ ఈ ఏడుపు స్వభావాన్ని యెట్లా పట్టుకున్నాడా అని ఒకటే ఆశ్చర్యం!!!!!! 

Wednesday, 22 August 2012

Billy Joel - ది రివర్ ఆఫ్ డ్రీమ్స్

In the middle of the night
I go walking in my sleep
From the mountains of faith
To the river so deep
I must be lookin' for something
Something sacred i lost
But the river is wide
And it's too hard to cross
even though I know the river is wide
I walk down every evening and stand on the shore
I try to cross to the opposite side
So I can finally find what I've been looking for
In the middle of the night
I go walking in my sleep
Through the valley of fear
To a river so deep
I've been searching for something
Taken out of my soul
Something I'd never lose
Something somebody stole
I don't know why I go walking at night
But now I'm tired and I don't want to walk anymore
I hope it doesn't take the rest of my life
Until I find what it is I've been looking for
(Three beat Pause)
In the middle of the night
I go walking in my sleep
Through the jungle of doubt
To the river so deep
I know I'm searching for something
Something so undefined
That it can only be seen
By the eyes of the blind
In the middle of the night (break)

I’m not sure about a life after this
God knows I've never been a spiritual man
Baptized by the fire, I wade into the river
That is runnin' through the promised land (Long Five beat Pause)

In the middle of the night
I go walking in my sleep
Through the desert of truth
To the river so deep
We all end in the ocean
We all start in the streams
We're all carried along
By the river of dreams
In the middle of the night

Monday, 20 August 2012

ఎస్.ఆనంద్

 దుర్గాబాయ్ వ్యాం  ,సుభాష్ వ్యాం అద్భుతమైన బొమ్మలతో వచ్చిన ,నాకు చాలా నచ్చిన ''భీమాయణం ''గురించి తీరిక చేసుకుని మళ్ళీ రాస్తాను .అంత వరకూ ఎస్.ఆనంద్ http://creativeconomy.britishcouncil.org/people/s-anand/రాసిన ఈ ఆర్టికల్ .A Case For Bhim Rajya | S. Anand చదవండి.సూటిగా వుంది ,స్పష్టంగా వుంది .ముక్కు ఎక్కడ అంటే చేతిని తలవెనుక నుండి తీసుకు వచ్చే తరహాలో లేదు

Monday, 6 August 2012

"ఖాజా కవిత్వం - నిజాయితీయే తత్వం "

పీజీ మొదటి ఏడాది  ప్రదమార్థం లో నేను ఖాజా గారి ''ఫత్వా ''చదివాను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ స్వాతి రూం లో .అప్పటికి నేను స్త్రీవాదం లో పీక లోతున మునకలు వేస్తున్నాను .అంచేత ఆయన అన్నికవితల కంటే  ''A MALE FEMINIST'S MONOLOGUE'' నాకు అత్యంత గా నచ్చేసింది .పీ హెచ్ డీ తెలుగు ముస్లిం రచయితల రచనలపై చేసినపుడు వారి కవిత్వం లోని  నిజాయితీ నన్ను చాలా ఆకర్షించింది ...గుర్తుండి పోయింది .ఖాజా గారిది చాలా చాలా పవర్ఫుల్ పోయెట్రీ .నా మరో స్నేహితురాలు మొన్న మాట్లాడుతూ - నా ''ఫత్వా'' పుస్తకం పోయింది మళ్ళీ కొనుక్కున్నాను .అట్లా నేను రెండో సారి కొనుక్కున్న కొన్నే కొన్ని పుస్తకాల్లో ''ఫత్వా ''ఒకటి అంది .ఖాజా పోయెట్రీ మనల్ని వెన్నాడుతుంది .మరిచిపోనీదు .అది గారెంటీ. తీరికగా బ్లాగింగ్ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు .సమయం దొరికినపుడు నాకు బాగా నచ్చిన వారి కవితలు రెండు బ్లాగ్ లో పెడతాను . అంతవరకు ఈ వ్యాసం చదివి , వీలయితే ''ఫత్వా ''చదివేసేయ్యండి .

ఇది ''పాల పిట్టలో ''ఈ మాసం ప్రచురితమైన నా వ్యాసం .




Saturday, 30 June 2012

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా !


ఇప్పటి సినీ గీత రచయితల్లో నాకు సిరివెన్నెల గారూ ,చంద్ర బోస్ గారు మాత్రమె తెలుసు .దానికి కారణాల చర్చ పక్కన పెట్టేస్తే ,ఎన్నో సార్లు ''మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ''పాట విని వున్నా ఆ గీత రచయిత ''కందికొండ''అని నాకు  తెలియనే తెలియదు ...నిన్న ఈ ఆర్టికల్ చదివే వరకు. నా కథ 'కొత్త గూడెం పోరాగాడికో లవ్ లెటర్ 'వచ్చినపుడు కందికొండ గారు కాల్ చేసి మంచి కథ రాసానని  చెప్పారు .ఆ తరువాత 'మహిత' వచ్చాక నా పేరు గుర్తుంచుకుని మరీ రెండు భాగాలు చదివి అభినందించారు .నిన్న మళ్ళీ కాల్ చేసి ''నమస్తే తెలంగాణ ''లో వారి గురించి వచ్చిన ఆర్టికల్ గురించి తెలియ పరచారు .

ఒక అపరచిత జీవన చిత్రం వెనుక మనం విషాదాన్నో ,గెలవడానికి చేసిన పోరాటాన్నో అన్ని సార్లూ ఊహించలేం కదా ...ఆ బ్రతుకు చిత్రాన్ని  తరచి చూడగలిగే స్థితిలో వుంటే తప్పించి .కందికొండ గారి జీవిత చిత్రం  చదివాక గెలుపు వెనుక వున్న కష్టం మీద నాకో అవగాహన వచ్చింది . మనిషి సాయుధాన్ని  స్వప్నించే దారి ఎందుకో మనసులో మెరిసింది .''ఆలోచనలన్నీ క్రూరం గా మారుతున్న సమయంలో లైబ్రరీ పరిచయమైంది ''అనడం నాకీ ఆర్టికల్ లో అత్యంతగా నచ్చిన మాట .http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=39154&boxid=248371728 
 



Wednesday, 27 June 2012

కొంచెమట్లా చెప్పుకోవాలనిపించింది !!!

dear samanya
 pushpa varna masam is really a master piece;a complex story,but so much ease you have displayed;metaphors and imageries are original and decorated with live emotions;folk and floral elements,a bit of magic realism add beauty and texture to the story;how could you conceive such a story;
bhumika is good,delicate,(difficult to craft) sweet little story;
your evolution as fiction writer is amazing;
keep it up!
warm wishes,chandra sekhar

టీవీ 9 బుక్ పాయింట్ లో  డా .వి .చంద్ర శేఖర్  రావు గారు, వారి ''ద్రోహ వృక్షం'' గురించి ....




Saturday, 23 June 2012

ప్రయోగం !!!




 పూర్ణ చుక్క పెట్టి వదిలా 
ముగింపుకై అన్వేషణ 
సఫలమే 
***
 వినా ...
సూర్యాకాసమే    .
కొంత  శోధించాలి 
***
అన్వేషణేమీ  లేదు 
నిర్లిప్తతా కాదు 
కేవలత
***
ఒకలాగే వుండదు 
ఎప్పటికీ  
ఒక్క  కథే  
 ***
ఘర్షణ 
అవునన్నా కాదన్నా 
చోదనం
***
ఇప్పుడిక 
నదిలో పడవలా .
అవును తప్పక  పోవడమే 
***
కలచి వెళ్ళింది పున్నమి 
కప్పలు 
బెక బెకలాడుతున్నాయ్ 
***
వేళ్ళని బురదలో వేసి 
కలువ 
సుచిని స్వప్నిస్తుంది 
***
 తోచక వేసా పుస్తకం నిండా 
ఆల్ జీబ్రా 
నెట్టినా కదలకుంది 
***


ఎప్పుడూ ముందుకే 
అవును 
చరిత్ర 

Wednesday, 13 June 2012

పుష్పవర్ణ మాసం !!!



''నవ్య '' వీక్లీలో నా  కథ  పుష్ప వర్ణ మాసం వచ్చింది .పాటకుల విద్వత్తుపై పై నాకు అపారమైన గౌరవం వుంటుంది.అందుకే ఈ కథ గురించి నాలుగు వాక్యాలు రాయాలనిపించినా రాయడం లేదు. ''మేజిక్ రియలిజం '' ''సింబాలిజం '' ''ఎలోగరి   ''...వంటి ప్రయోగాత్మక రచనలంటే నాకు చాలా ఇష్టం .అట్లా ఈ కథ నేను చేసిన ప్రయోగం .చాలా కాలం క్రితం  ''చెవులు''అని నే.బు.ట్ర  వాళ్ళు వేసిన ఒక నవల చదివాను.అదో అద్బుతం .అట్లాన్టివే  మరి కొన్ని.తెలుగులో వీ .చంద్ర శేఖర్ రావు గారూ,మునిపల్లె రాజు గారూ ,పతంజలి గారూ ఈ తరహా ప్రయోగాలు చేసారు .పతంజలి గారినయితే ,,అబ్బ...! చదివితే మరిచిపోగలమా మరుజన్మకైనా ..ఎంత అద్బుతమైన కథలూ అవి!! .అట్లా రాయగలిగితే ,,ఒక్క కథ రాస్తే చాలదా ...రాసేసి, చాల్లే ఇక అని చచ్చి పోవచ్చు.

Monday, 11 June 2012

సత్యవతి గారు,ఓల్గా గారు ...!

ఇవాళ ''వివిధ''లో సత్యవతి గారితో  ఇంటర్వ్యు ...''అతి పీడితులు స్త్రీలే గనుక '', Andhra Jyothy Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra Jyoti, Andhra Jyothi, Telugu Culture and Tradition, IT News, Telugu Matrimonials, Classifieds, etc

 ''సూర్యా ''లో ఓల్గా గారి మృణ్మయ నాదం పై నేను రాసిన ఈ  వ్యాసమూ వచ్చాయి Surya Telugu Daily Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra , Telugu Culture and Tradition, etc   .రెంటినీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఈ రచయిత్రులు ఇరువురూ స్త్రీల వేదనలను అక్షరీకరించారు గనుక .నాకు ఓల్గా గారితో పరిచయం లేదు.సత్యవతి గారి ఆత్మీయత తో ఈ మధ్యనే ఫోన్ పరిచయం .వారి సమగ్ర సాహిత్యం పైన పేపర్ ఒకటి రాయాలని ప్రయత్నం .

భూమికలో నా కథ వచ్చింది కదా   దానికేవరో  కామెంట్ పెట్టారు .ఆ కామెంట్ చాలా దురుసుగా వుంది.అట్లాగే  విహంగాలో కామెంట్ కూడా ...చూసి చాలా దిగులేసింది.నేనిక రాయనంటే రాయనని పాపాయి వాళ్ళ నాన్న కి ప్రకటించా కూడా .తను కాదు... ఇదంతా   స్త్రీల ని రాయనీకుండా చేయడానికి   వేశే   ఎత్తుగడ నువ్వు రాయాలి ,మానకూడదు ,భయపడ కూడదు అని చెప్పాడు .అయినా నాకు ఏమనిపించిందంటే అసలు ఎందుకు  రాయాలి అని .నాకేమీ కీర్తి కాంక్షో గొప్పతనాల యావలో లేవు కదా .నా సామాజిక బాద్యతని మరో    మార్గంలో నేరవేర్చవచ్చులే అనిపించింది  . ఎందుకని ఎవరైనా దురుసుగా అంటే  ఊరుకోవాలి  .మామూలుగా అయతే ఎవరేమైనా పేలితే మొహం పగలగోట్టేస్తాం కదా ఇప్పుడేమో ఇది కథా చర్చ కదాని  ఊరుకోవాలి . కల్పనా గారి తన్హాయి ని  వనజ గారు సమీక్షించి నపుడు  వచ్చిన కామెంట్స్ చూసి కూడా అట్లాగే అనిపించింది .ఆ చర్చకి అసహ్యించుకుని ఆ లింక్ షేర్ చేసిన అవినేని భాస్కర్ గారు ఆ  గూగుల్ ప్లస్ నే డిలీట్ చేసేసుకున్నారు .ఈ నెల  పాలపిట్టలో డాక్టరేట్ చేసిన ఒకావిడ మాధురి  కథ ''చంద్ర కళ ''గురించి రాస్తూ ''చలం ఈ   విధం గా  అక్రమ సంబంధాలను ఆకర్షణీయంగా   చిత్రించిన మాట నిజం ...2012 లో ఇలా అక్రమ సంబంధాలను మహత్తర విషయంగా చిత్రించడానికి రచయిత్రికి గల కారనేమిమితో తెలియలేదు ''అని రాసింది .ఒక స్త్రీవాద రచయిత్రి ఆ మాట  చదివి   స్త్రీలు కూడా ఈ పదజాలాన్ని వాడుతున్నారే అని బాధపడ్డారు.నా క్కూడా  ఆ  స్పందన అసత్య విమర్శ  అనిపించింది.ఏం  మనుషులో కొత్త రచయితలు వచ్చినప్పుడు  తప్పొప్పులు సున్నితంగా చెప్పి ప్రోత్సహించాలి కానీ చంపేస్తారా అని దిగులేసింది ...మనం మంచి వాల్లమైతే చెడును సంస్కరించాలి .చీకొట్టి దూరంగా జరిగితే లోపల మనలో చెడు వుందని ఒక అర్థం ... వీళ్ళు  స్త్రీలు ఎందుకవుతారు .స్త్రీల ముసుగులోని  రాజకీయ నాయకులు . వారి కుందేటికి మూడే కాళ్ళు  అనిపించింది  ...ఇట్లా ఇంత మదన పడ్డానా నా  ఇంత మదనకూ .తమని తాము స్థిరీకరించుకుంటున్న స్త్రీల పట్ల పురుషాధిక్య భావాలు ఇంకా పెంచి పోషించుకుంటున్న కుటుంబ సభ్యుల్లో ఒక అసహనం, ఇగో బయలుదేరాయి. వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నాలు మొదలౌతాయి. పని ప్రదేశాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుంది. స్త్రీల తెలివి, సామర్ధ్యం గుర్తించకుండా మరుగున పడేసే ప్రయత్నాలుంటాయి. ఇవన్నీ కాకపోతే తురుపుముక్క ఉండనే ఉంది. ఆమె శీలం మంచిది కాదని ఒక్కమాటంటే సరిపోతుంది. వీటన్నింటిని తట్టుకుని నిలబడాలంటే చాలా శక్తి కావాలి. ఆ శక్తి శ్రామిక మహిళల్లో కనిపించినంతగా మధ్యతరగతి మహిళల్లో కనిపించదు. శ్రామిక మహిళల శ్రమ శక్తి, శారీరక బలం పట్ల వాళ్లకు ఉన్న నమ్మకం గౌరవం, మధ్యతరగతి స్త్రీలకు ఇంకా రాలేదు.  అన్న సత్యవతి గారి  ఈ మాటలు విషయాలు  తెలిసినవే అయినా తేటతెల్లం చేసి  ..ఊరటనీ ధైర్యాన్ని ఇచ్చాయి ..అవును రాయాలి ఎందుకు రాయకూడదు అని ధైర్యం వచ్చిది .

ఇవాల్టి వారి ఇంటర్వ్యు లో నాకు వారిచ్చిన ఈ సమాధానం కూడా భలే నచ్చింది . మిమ్మల్ని మీరు స్త్రీవాద రచయిత్రిగానా - ప్రధాన స్రవంతి రచయితగానా - ఎట్లా గుర్తిస్తారు?

- ఒక మంచి స్త్రీవాద కథ లేదా దళిత వాద కథ, లేదా ముస్లింవాద కథ మంచి కథే అవుతుంది గానీ మంచి స్త్రీవాద కథ, మంచి దళిత వాద కథ, మంచి ముస్లింవాద కథ అవుతుందా? మంచి కథలన్నీ ప్రధాన స్రవంతిలోకి రావలసినవే అని నా అభిప్రాయం. ప్రధాన స్రవంతిని ఎట్లా నిర్వచిస్తాం.. ఏ విధంగా రాస్తే ప్రధాన స్రవంతి అవుతుంది? స్త్రీలను గురించి, దళితులను గురించి, ముస్లింలను గురించి రాసిన రచయితలు ప్రధాన స్రవంతి కాక మార్జిన్‌లో ఉండేవారు అని నిర్వచిస్తే నన్ను నేను స్త్రీ వాద రచయితగానే గుర్తించుకోదలిచాను. నిజమే కదా మరి ప్రధాన స్రవంతి  రచయితలంటే ఎవరు ?మొన్న మాట్లాడినప్పుడు సత్యవతి గారు నవ్వుతూ ''ప్రభువులు మెచ్చిన వారు ప్రధాన స్రవంతి వారు ''అన్నారు .  అది నూటికి   మున్నూరు శాతం నిజం .

సత్యవతి గారు మరిన్ని స్పూర్తిదాయకమైన కథలు రాయాలి .ఎందుకు రాయాలని నేను పడ్డ దిగులుకి ఇది నేనే ఇచ్చుకున్న సమాధానం .ఎందుకు రాయాలంటే పదిమందికి స్పూర్తినివ్వడానికి రాయాలి .మిగిలిన వారికంటే  రచయితలకి సమాజం మరింత స్పష్టం గా అర్థమవుతుంది కనుక రాయాలి .

వోల్గా గారి రచనలు నాకు మొదట పరిచయమైన స్త్రీవాద రచనలు . ''స్త్రీ వాద రాజకీయ చెైతన్యాన్ని సాహిత్యం రూపంలో అందించడానికి కథారచనను ఒక మార్గంగా ఎంచుకున్నాను''అని ప్రకటించినందుకూ , ఆ దిశగా వీలయినంత  మేరా ప్రయాణమూ జరిపినందుకు వోల్గా గారంటే నాకు చాలా ఇష్టం .
 
ఇక్కడ  ,టీవీ 9 బుక్ పాయింట్ లో వారిరువురూ ఇచ్చిన ఇంటర్వ్యు ల లింక్ లు ఇచ్చాను తప్పక  చూడండి,,,చదవండి.



 
.




పీఎస్ :అయితే నాకు కామెంట్ పెట్టిన భూషనాన్ని ఆ స్త్రీవాద రచయిత్రి ఏమన్నారంటే ''వారు భూషణం కారు బీరువా:) ''[పిరికి ] ...అని ఆపకుండా ఐదు నిమిషాలు నవ్వారు.

Sunday, 10 June 2012

Friday, 8 June 2012

ఆ పుస్తకం పేరు చెబుతారా…!




ఈ నెల భూమికలో వచ్చిన కథ ఇది .ఈ కథ నాతో రాయించింది  నా స్నేహితురాలు వినయ.తనెప్పుడూ ఈ కథలోని వీణ టీచరు వాళ్ళ అమ్మ గురించి చెప్పి చాలా దిగులు పడుతుండేది .ఆవిడ తనకిచ్చిన ,తను పోగొట్టుకున్న పుస్తకాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేది.నేను కథలు రాయడం మొదలు పెట్టాక ''సామాన్య నేనా నవల లోని  లోని కథ చెప్తాను నువ్వు రీ రైట్ చేస్తావా ''అని అడిగేది .రీ రైట్ అనే మాటకి నాకు నవ్వొచ్చేది.''అదేమన్నా రామాయణమా వినయా... మొల్ల రామాయణం ,నా రామాయణం ,నీ రామాయణం అని రాసుకునేందుకు'' అని నవ్వేదాన్ని .కానీ క్రమంగా ఆ కథ నా మనసునీ తోలచడం మొదలెట్టింది.అట్లా మా సంభాషణల నుండి మలిచిన  కథ ఇది.

''భూమిక''http://www.bhumika.org/ని నేను మొదటి సారి 1995 లో  అనుకుంటా చదివాను .మా డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్ శోభా దేవి గారు నాతో చదివించారు.ఫెమినిసాన్ని తెలుసుకుంటున్న తొలి తొలి రోజులవి.భూమికని పడీ పడీ చదివేదాన్ని .[అప్పట్లో భూమిక వాళ్ళు మూలికా వైద్యం పై వేసిన ఆకుపచ్చ రంగు అట్ట  చిన్ని బుక్కు,భూమికకు సంబంధించీ  నా అపురూపమైన కలెక్షన్ లలో ఒకటి :}] . చెప్పాలంటే స్త్రీగా భూమిక నా స్వంత పత్రిక .

భూమిక నుండి నేను నేర్చుకున్నది చాలా వుంది.ఇవాళ స్త్రీగా నేను ఖచ్చితమైన అభిప్రాయాలను కలిగి ,క్లారిటీ తో ఆలోచించగలగడం వెనుక ,నిలబడటం వెనుక వున్నది ఆవాళ  స్త్రీ వాదాన్ని నాకు పరిచయం చేసిన శోభా దేవి గారూ,ఆవిడ పరిచయం చేసిన భూమిక ,స్త్రీవాద సాహిత్యమూ ...
    
సాహిత్య పత్రికలెన్నో పుడుతుంటాయి ,మధ్యే మార్గంలో ఆగిపోతుంటాయి .కర్ణుని చావుకి వంద కారణాలు .కానీ భూమిక ఇవాళ ఇరవై  వసంతాలని పూర్తి చేసుకుని మరింత పరిపుష్టంగా,పరిపూర్ణంగా ఎదిగి స్త్రీల పక్షాన ఆత్మీయంగా,దృడంగా నిలబడింది.భూమిక ద్విదశాబ్ది ప్రయాణం.దీని వెనుక ఎందరెందరో వున్నా ఆ అందరి ముందూ నిలబడింది మాత్రం నిర్ద్వందంగా కే.సత్యవతి గారే  .నిర్మలమైన వారి ఉత్సాహం వారి బ్లాగ్ చదువుతున్న ప్రతి సందర్భం లోనూ నా వెన్ను తట్టి గొప్ప ధైర్యాన్నీ , భవిష్యత్ మీద  ఆశనీ హామీ ఇస్తూ వుంటుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారికి,వారి టీం కి  నా గౌరవ, ప్రేమపూర్వక ,అభినందనలు ,ధన్యవాదాలు.

Wednesday, 6 June 2012

''మహిత -ఉమా మహేశ్వర్ రావు గారు''


మహిత కథ పుస్తకంగా వచ్చింది .
ఈ కథని ఇట్లా పుస్తకం గా తీసుకురావాలని నేనసలు ఆలోచించలేదు .[''దొంగల సంత''కథని పుస్తకం గా తేవాలని ప్రయత్నాలు  జరుగుతూ వున్నాయ్.] మహిత మొదటి భాగం వచ్చినపుడు నాకో ఆర్త్రమైన మెసేజ్ వచ్చింది .పేరు లేదు .ఆ మెసేజ్ చూసాక కాల్ బాక్ చెయ్యాలనిపించింది .అట్లా నేను మొదటి సారి ఆర్ ఎం ఉమా మహేశ్వర్ రావు గారితో మాట్లాడాను.

పాటకులుగా మనకి మనవే అయిన అభిరుచులుంటాయి,ఆసక్తులుంటాయి.మన ఆసక్తికి అతి దగ్గరగా వచ్చిన ,మనం అమితంగా ఇష్టపడిన రచయిత ఒకానొక  రోజు మనతో మాట్లాడితే యెట్లా వుంటుంది ?మాట్లాడటమే  కాక  మనని మెచ్చుకుంటే యెట్లా వుంటుంది?ఆ రోజు ఎంత సుందరమైనదవుతుందీ ?దానినే  dreams comes true కలలే ఫలించడం అంటారు కదా !ఉమా మహేశ్వర్ రావు గారితో మాట్లాడటం నాకు అట్లాంటిదే .

మొదటి సారి ఆరెం ఉమా మహేశ్వర్ రావు గారి కథ చదివినపుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో .ఎక్కడ కూర్చుని చదివాను ,చదివినది ఏ వేళలో? అంతా నాకు హృదయంలో ఇమేజ్ లా బద్రపరచబడి వుంది . చాలా నచ్చినవీ  ముక్యమనుకున్నవే కదా మన హృదయంపై అలా ముద్ర వేసి నిలిచిపోతాయి .అంత ఇష్టం నాకు వారి కథలంటే .

వారు నాతో మాట్లాడటం అంటే మొదలు అదే చాలా పెద్ద విషయం  నాకు .అది కాకుండా నా కథని ఇష్టపడటం రెండో పెద్ద విషయం.ఇష్టపడ్డారు పో... స్వంతంగా వారి ఖర్చుతో మహితని పుస్తకంగా తీసుకురావడం నా జీవితంలో అతి పెద్ద విషయం .

డబ్బే ప్రామాణికం అనుకుంటే ...మహితని కావాలనుకుంటే స్వంతంగా  నేను  కూడా వేసుకోగలను నా డబ్బే పెట్టి .పబ్లిషర్స్ నీ పర్స్యు చేయగలను .కానీ నాకివాళ కలిగిన ఈ సంతోషపు ఫీలింగ్ ఎన్ని డబ్బులు కర్చు పెట్టినా నేను సంపాదించి ఉండలేను. ..కదా !!

''అంటరాని వసంతం -విమర్శనాత్మక పరిశీలన ''టెక్నికల్ గా నా మొదటి పుస్తకం .కానీ మొదటిగా పాటకులు లోకి వెళ్ళిన  పుస్తకం ''మహిత''.నాకు తిరుపతి అంటే చాలా,చాలా......ఇష్టం .ఆ తిరుపతిలో ''వల్లంపాటి సాహితీ మిత్రులు ప్రచురణ''గా నా పుస్తకం మొదటిగా మనుషులలోకి వెళ్ళింది .ప్రజల్లోకి తన బుజ్జి బంగారు చేతులతో పంపింది ''రాగలీన'' ...ఉమా మహేశ్వర్ రావు గారి అమ్మాయి .

రాగాలీనకూ ,ఒక గొప్ప మంచితనాన్ని ఏ ఆడంబరమూ లేకుండా అతి సరళంగా నాకు పరిచయం చేసిన ఉమా మహేశ్వర్ రావు గారికి  నేను మాటలలో పొందు పరచలేనంత  ఋణం  పడ్డాను .ఉమా మహేశ్వర్ రావు గారికి నా శతాధిక కృతజ్ఞతలు.


పీ ఎస్ : అజ్ఞానం చేత నేను మరచి పోయిన కృతజ్ఞతని  అన్వర్ గారు గుర్తు చేసారు . ఉమా మహేశ్వర్ రావు గారు పుస్తకం అనుకున్నంత మాత్రానే అందమైన బొమ్మలతో సహా వెయ్యడం వెనుక ఆర్టిస్ట్ కిరణ్ కుమారి గారి సహాయం సహృదయత ఎంతైనా వుంది.వారి బొమ్మల వల్ల  ఈ పుస్తకానికి అసలైన  ఆ కర్షణ వచ్చింది .అడిగినంతనే బొమ్మలు ఇచ్చినందుకు వారు నాకు తెలియకున్నా వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచు కుంటున్నాను .థాంక్  యు కిరణ్ గారూ ,థాంక్ యు వెరీ మచ్ 



Monday, 28 May 2012

ఆకుపచ్చటి జ్ఞాపకాల ఇంద్ర ధనుస్సు ...!

సరి కొత్త కాపురం  
హాల్లో చాప 
చాప నిండుగా పుస్తకాలూ 
గాలి కెగిరే కాయితాలూ 
కావాలని కూరుకుపోయే మనసూ ,బుద్దీ 
మగ కాఫీ 
అప్పుడప్పుడూ గైడ్ వేసే నాలుగు అక్షింతలూ 
అందమైన యూనివర్సిటీ 
తెలుగు డిపార్ట్మెంట్ ఫస్టూ ,హ్యుమానిటీస్ సెకండూ 
వెరసి ఆకుపచ్చటి జ్ఞాపకాల ఇంద్ర ధనుస్సు నా ఈ పుస్తకం

[నా పీ హెచ్ డీ పరిశోధన 
''తెలుగు ముస్లిం రచయితలు -సమాజం-సంస్కృతి''
 .దానికి మంచి కాలం ఎప్పుడొస్తుందో మరి  :))]


పి .ఎస్ : హైదరాబాద్ లో చదువుకున్నన్ని రోజులూ మా నాన నేనెప్పుడు ఇంటికి వెళ్లాలనుకున్నా రాత్రంతా నెల్లూరు నుండి ప్రయాణం చేసి హైదరాబాద్ కి వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని రాత్రంతా ప్రయాణం చేసి నెల్లూరికి తీసికేల్లెవాడు. అమ్మాయినని కాదు .అబ్బాయిలకంటే అపురూపమని.
ఎం ఫిల్ డీటీపీ నెల్లూరులో చేయించాం
మా నాన  అంతా పూర్తయ్యాక నన్ను షాప్ కి తీసికెళ్ళాడు.అయినా తిరిగొచ్చేసరికి రాత్రి పన్నెండయింది .మరుసటి రోజు కొత్త ఏడాది .నేనూ మా నాన ఆ చీకట్లో వాహనాలు లేని రోడ్ల పై కబుర్లు చెప్పుకుంటూ నడవడం ఓ జ్ఞాపకం .
 
ఎం.ఫిల్ మీ గైడెన్స్ లోనే చెయ్యాలనుంది అంటే నను మన్నించి కాలేజ్ కమిటీ ని ఒప్పించారు కే కే ఆర్ సర్.వారు నాకంటే
నాలుగాకులు  ఎక్కువ మొహమాటస్తులు .మొత్తం పరిశోధనలో నేను గైడ్ ని కలిసిన రోజులు చేతి  వేళ్ళకి కూడా సరిపోనన్ని రోజులు.అయినా ఈ పరిశోధన వారి
మార్కు పరిశోధన.అదో జ్ఞాపకం.

కొత్త కాపురపు తొలి రోజులు .అప్పుడే మా మావ గారు రిటైరై  కొడుకు కి ఒక స్కూటర్ కొని పెట్టారు .
ఆ కొడుకు ఆ స్కూటర్ పై నన్ను రత్న మాల,వేణు గోపాల్,సీఫెల్ సభలూ ,లైబ్రరీలూ ఒకటేమిటి తెగ తిప్పాడు ఈ పరిశోధన కోసమని .విసుగనేదే వుండదు బంగారానికి అప్పటికీ ఇప్పటికీ ...అదో జ్ఞాపకం .

అప్పటి వరకు నాకు స్కూటర్ ఎక్కడం అనుభవమే లేదు .మొదటి సారి బోల్డు సిగ్గు పడుకుంటూ
ఆ నీలం రంగు స్కూటర్ ని ,నీలం రంగు చుడీదార్లో వున్న నేను యెట్లా కూర్చోవాలో తను చెప్తే సిగ్గు పడుకుంటూ 
కూర్చున్నాను .ఆ తరువాత అది నాకు బోలెడు లోకాలని చూపించింది .అదంటే నాకు అలవిమాలిన ప్రేమ.అందుకని దాన్ని బద్రంగా దాచుకున్నాను మా ఇంట్లో .అదో జ్ఞాపకం .

ఏదైనా రాసిన తరువాత దాని మొహం చూడాలంటే ఎందుకో చిరాకు నాకు .అందుకే ఇది మార్పులూ  చేర్పులూ చేయని అప్పటి పరిశోదనే . పబ్లిషర్  అచ్చు తప్పులు  చూడమంటే నా వల్ల  కాదంటే కాదనేసాను. వారే  ఆ పని చూశారు.అదొక  మంచి స్నేహపు జ్ఞాపకం .

ఈ ఇంద్ర ధనస్సుకి రంగులనిచ్చిన జ్ఞాపకాలివి  ! అందుకే ఈ పలవరింత !

Thursday, 17 May 2012

మాఫియా అంటే ?

 ప్రజా సాహితి  ఏప్రిల్ సంచికలో ''సంభాషణం ''శీర్షికన మాఫియా అంటే ఏమిటో ,పుట్టుక ఏమిటో పూర్వోత్తరం  ఏమిటో వివరించారు.విషయం పట్ల మంచి అవగాహన వస్తుంది .తప్పనిసరిగా చదవండి .


Monday, 14 May 2012

''ఎందుకు పారేస్తాను నాన్న ?''

 




నేను ఆరో క్లాసో,ఏడోక్లాసులోనో వుండగా మా అమ్మ ఓపెన్ యునివర్సిటీ బీయే చదువుతూ వుండేది.హిస్టరీ,తెలుగు,పోలిటిక్స్తో .మిగిలిన వాటి సంగతి గుర్తు లేదు కానీ మా అమ్మ తెలుగు పుస్తకాలలోని కథలన్నీ 
నేను ఒక్కోటి బోలెడు సార్లు చదివాను .కరుణ కుమార టార్చి లైటు,ఇలాంటి తవ్వాయి వస్తే ,పెళ్ళానికి ప్రేమ లేఖ వంటివీ...చాగంటి  సోమయాజులు  గారి ''''ఎందుకు పారేస్తాను నాన్న ?'' కథ ,అట్లా  చదివినవే .
అన్ని కథల సంగతి ఏమో కానీ ,అప్పుడు నాది కూడా ''ఎందుకు పారేస్తాను నాన్న ?''కథలోని కృష్ణుడికి దాదాపు అటూ ఇటూ వయసు  కావడంతో ఆ కథ బాగా మనసుకి హత్తేసుకుని గుర్తుండి  పోయింది.

మా అమ్మ అప్పటి పుస్తకాలను ఆ కథలోకోసమే జాగ్రత్తగా దాచుకున్నాను .పెద్ద పెరిగి,తెలుగు ఏం ఏ కి వచ్చిన తరువాత వాటిని వాడుకున్నాను కూడా 
మంచి అపురూపమైన పుస్తకాలు అవి  .

''ఎందుకుపారేస్తానునాన్న?''1945 లో భారతిలో అచ్చయిన కథ.దాంట్లోని వస్తువు రీత్యా స్థల కాలాదులకు అతీతంగా 
నిలిచిన కథ .

...బాగా చదివే అబ్బాయి కృష్ణుడు ఫోర్త్ ఫాం కి వస్తాడు.నానకేమో వాడ్ని 
చదివించేందుకు డబ్బులుండవ్. బడి మానిపించేస్తాడు.ఒక సారేమో నాన చుట్ట తెమ్మనికృష్ణుడికి డబ్బులిచ్చిపంపుతాడు.బడి ముందు నుండి వెళ్ళాలంటే వాడికి బోల్డు అవమానం వేస్తుంది.

అనుకున్నట్టే క్లాస్ మేట్స్ కనిపిస్తారు.ఏం రా కృష్ణుడూ ''నువ్వు బల్లోకి రావటం లేదు'' అంటాడు నరసింహం.వాడితో  తో ''సోమవారం నుండి వస్తా'' అని చెబుతాడు.అంతలో శకుంతల వస్తుంది 
ఈ సారి ఇంగ్లీష్ లో ఫస్ట్ మార్క్ అది కొట్టేస్తుంది, కృష్ణుడికి కాకుండా .ఇంతలో బెల్ కొడతారు .వాళ్ళిద్దరూ బడిలోకి వెళిపోతారు .

కృష్ణుడికి దుక్కం వస్తుంది ఒక సారి మాస్టారుబడి మానేసిన ఒకబ్బాయి పేరు కొట్టేస్తూ ''డిస్కంటిన్యూడ్''అని రాసేసి ఆ పదానికి అర్థం చెపుతాడు.అది గుర్తొస్తుంది వాడికి ''నేను ఇంటికే వెళ్ళను  '' అనుకుని బడి ఎదుటే కూర్చుండి  పోతాడు. 

వాడిని వెదుక్కుంటూ నాన వస్తాడు.నానపిలిచినా వాడు ఇంటికి రానంటే రానంటాడు .చివరకు  కు నాన వాడిని బడిలో వెయ్యడాని తల  తాకట్టయినా పెట్టాలనుకుంటాడు .అయితే  క్రుష్ణుడు,పుస్తకాలు అప్పటికప్పుడే కొనమంటాడు.ఒక్కటయినా కొనమంటాడు.నాన  ఆలోచించి''ఇందాకా చుట్టలకిచ్చిన డబ్బులున్నాయా,పారేసావా?''అని అడుగుతాడు కృష్ణుడు ఆ ఏడుపులో''ప..ప్ప...ప్పారీలేదు.జేబులో వున్నాయి...ఎందుకు పారేస్తాను నాన్నా ?'' అంటాడు 
కథ అంతే .కథగా చెప్పడానికి ఏమీ వుండదు. ఒక సన్నివేసం అంతే !కానీ ఆ కథ నన్ను ఎంత ఏడిపించిందో ..

ఎవరైనా బడి మానేసినా,అటువంటి సంఘటనలు తటస్థ పడినా ఆ కథే గుర్తొస్తుంది ఇప్పటికీ.ఏదైనా చెయ్యాలని గుబులేసి పోతుంది.నాగార్జున సాగర్ ఏపీ ఆర్ జే సి లో చదివే వాడు 
నా తమ్ముడు 
అక్కడ పిల్లల లో కొంత మంది  ఎంత బాగా చదివే వాళ్ళో.కానీమధ్యలోనే ఆపేసే వాళ్ళు .అప్పుడు కూడా అట్లాగే ఈకథ జ్ఞాపకానికి వచ్చేది.

పాపాయి వాళ్ళ నానఈ మధ్య యుద్ద ప్రాతిపదికన కథలు చదువుతున్నాడు.అందులో భాగంగా''విశాలాంధ్ర తెలుగు కథ''చదువుతున్నాడు.ఇవ్వాళ పొద్దున్న ఆ పుస్తకాన్ని ఊరికే అట్లా తిప్పుతుంటే ఈ కథ దొరికింది.అసంకల్పితంగా చదవటం మొదలెట్టాను  ఇంత పెద్దయ్ పోయానా ఈ రోజు కూడా చివరి వాఖ్యం చదవగానే కళ్ళ నిండా నీళ్ళు పేరుకున్నాయి .అచ్చు కథలో కృష్ణుడికి లాగే ''దుక్కం పొర్లుకుంటూ వొచ్చింది'' 

...అదీ చాసో అంటే.